భారత జట్లకు మిశ్రమ ఫలితాలు


Mon,August 19, 2019 03:52 AM

hockey
టోక్యో: ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌ల్లో నెగ్గి శుభారంభం చేసిన భారత పురుషుల, మహిళల జట్లు మలి మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. పురుషుల జట్టు 1-2తో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలవగా.. ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ను మన అమ్మాయిలు 2-2తో డ్రాచేసుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల పోరు ఆరంభంలోనే ఆధిక్యం సాధించిన భారత్ ఆ తర్వాత దాన్ని నిలుపుకోవడంలో విఫలమైంది. రెండో నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ 1-0తో ముందంజలో నిలిచింది.

అనంతరం న్యూజిలాండ్ తరఫున జాకబ్ స్మిత్ (47వ ని.లో), సామ్ లానె (60వ ని.లో) చెరో గోల్ చేయడంతో ఆ జట్టు గెలుపొందింది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం జపాన్‌తో భారత పురుషుల జట్టు తలపడనుంది. మహిళల పోరులో మ్యాచ్ డ్రాఅయినప్పటికీ భారత అమ్మాయిలు ఆటతీరు ఆకట్టుకుంది. వందన కటారియా (36వ ని.లో), గుర్జీత్ కౌర్ (59వ ని.లో) భారత్ తరఫున చెరో గోల్ చేశారు. ఆసీస్ నుంచి కైట్లిన్ నాబ్స్ (14వ ని.లో), గ్రేస్ స్టివర్ట్ (43వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. తొలి మ్యాచ్ లో జపాన్‌పై నెగ్గిన మన అమ్మాయిలు ఈ మ్యాచ్‌లో రెండు సార్లు వెనుకంజలో ఉండి కూడా తిరిగి పుంజుకొని స్కోర్లు సమం చేయడం విశేషం.

474

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles