రజతంతోనే సరి


Mon,September 23, 2019 01:37 AM

-గాయంతో తుదిపోరు నుంచి తప్పుకున్న దీపక్ పునియా
-రాహుల్‌కు కాంస్యం..
-మొత్తంగా భారత్‌కు ఐదు పతకాలు..
-ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్

భారత్ స్వర్ణ పతక ఆకాంక్షను నెరవేర్చాలనుకున్న యువ రెజ్లర్ దీపక్ పునియా ఆశలను గాయం నీరుగార్చింది. చాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన తొలిసారే హేమాహేమీలను మట్టికరిపించి తుదిపోరుకు చేరిన అతడు ఫైనల్లో బరిలోకి దిగలేకపోయాడు. ప్రపంచ టైటిల్ సాధించిన భారత రెండో కుస్తీవీరుడిగా నిలుద్దామన్న కలను నెరవేర్చుకోలేక.. రజతంతోనే సరిపెట్టుకున్నాడు. మరో రెజ్లర్ రాహుల్ అవారే అద్భుత పోరాటంతో కాంస్యాన్ని ఒడిసిపట్టాడు. మొత్తంగా మన రెజర్లు టోర్నీలో ఐదు పతకాలతో మెరిశారు. చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యత్తమ ప్రదర్శన కావడం విశేషం.
RAHUL-AWARE
నూర్ సుల్తాన్ (కజకిస్థాన్): గత నెలలో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించి.. సీనియర్ చాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన తొలిసారే ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన భారత యువ రెజ్లర్ దీపక్ పునియాను దురదృష్టం గాయం రూపంలో వెంటాడింది. సుశీల్ కుమార్ తర్వాత దేశానికి స్వర్ణం సాధించిన రెండో వీరుడిగా నిలువాలన్న దీపక్ ఆకాంక్షను గాయం అడ్డుకుంది. పసిడి పతకం కోసం ఆదివారం హసన్ యజ్దానీ (ఇరాన్)తో జరగాల్సిన ఫైనల్ నుంచి చీలమండల గాయం కారణంగా దీపక్ (86కేజీలు) తప్పుకున్నాడు. సెమీస్‌లోనే అతడు గాయపడ్డాడు. గాయం కారణంగా ఎడమ కాలిపై భారం మోపలేకున్నా. ఈ పరిస్థితుల్లో పోటీకి దిగడం చాలా కష్టం. యజ్దానీపై ఆడడం చాలా మంచి అవకాశమని తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి. దేశం కోసం స్వర్ణ పతకం గెలువాలని ఎంతో పరితపించా. దురదృష్టవశాత్తు ఈసారి సాధ్యం కాలేదు అని దీపక్ అన్నాడు. 2010లో సుశీల్ కుమార్(68కేజీలు) ప్రపంచ చాంపియన్‌గా అవతరించాక మరొకరు ఆ ఫీట్‌ను అందుకోలేకపోయారు. మొత్తంగా భారత రెజ్లర్లు ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు నెగ్గి టోర్నీ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసుకున్నారు. పురుషుల విభాగంలో దీపక్ పునియా (రజతం), రాహుల్ అవారే (కాంస్యం), బజరంగ్ పునియా (కాంస్యం), రవి దహియా (కాంస్యం).. మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్(కాంస్యం) పతకాలతో మెరిశారు. అంతకుముందు 2013లో అమిత్ దహియా (రజతం), బజరంగ్ పునియా (కాంస్యం), సందీప్ తులసీ యాదవ్ (కాంస్యం) పతకాలు సాధించారు.

రాహుల్‌కు కాంస్యం

నాన్ ఒలింపిక్ విభాగంలో రాహుల్ అవారే (61కేజీలు) అదరగొట్టే పోరాటంతో కాంస్య పతకాన్ని పట్టాడు. సెమీస్‌లోనే ఓడిన అతడు ఆదివారం జరిగిన కాంస్య పతక ప్లేఆఫ్ పోటీలో రాహుల్ 11-4తో టీలెర్ లీ (అమెరికా)ను మట్టికరిపించాడు. బౌట్ ప్రారంభంలో డబుల్ లెగ్ అటాక్‌తో అమెరికా రెజ్లర్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా అవారే దీటుగా ఎదుర్కొన్నాడు. వరుసగా రెండు పాయింట్లు సాధించడం సహా మొదటి రౌండ్‌లో 4-2 ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత కుడికాలిని పట్టేందుకు యత్నించిన గ్రాఫ్‌ను రాహుల్ నిలువరించాడు. చురుగ్గా కదులుతూ ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. ఆ తర్వాత దూకుడుగా ఉడుం పట్లు పడుతూ ఆధిక్యాన్ని 10-2కు పెంచుకొని విజయం ఖాయం చేసుకున్నాడు.

చిన్న ఉద్యోగం కోసం వచ్చి.. సంచలనాలు

కుటుంబాన్ని పోషించేందుకు ఏదో ఓ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో రెజ్లింగ్‌లో అడుగుపెట్టిన దీపక్ అనతికాలంలోనే అద్భుతాలు చేస్తున్నాడు. 2016 లో స్పోర్ట్స్ కోటాలో సైనికుడిగా పని చేసేందుకూ అతడు సిద్ధపడ్డాడు. అయితే ఆ సయయంలో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అతడికి దిశానిర్దేశం చేశాడు. రెజ్లింగ్‌పై పూర్తిస్థాయి దృష్టిపెడితే.. ఉద్యోగాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయని చెప్పాడు. ఆ మాటలను చెవికెక్కించుకున్న దీపక్.. కుస్తీపైనే దృష్టిసారించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. సుశీల్ హితబోధ చేసిన నెలలోనే ప్రపంచ క్యాడెట్ చాంపియన్‌గా అవతరించాడు. ఆ తర్వాత జూనియర్ ప్రపంచ చాంపియన్‌గానూ నిలిచాడు. మూడేండ్లలోనే సీనియర్ చాంపియన్‌షిప్‌లో దేశం తరఫున రెండో అత్యుత్తమ పతకాన్ని కైవసం చేసుకొని సత్తా చాటాడు.

305

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles