గబ్బర్‌కు గాయం


Wed,June 12, 2019 01:18 AM

Shikhar-Dhawan

- మూడు మ్యాచ్‌లకు
- శిఖర్ లేకుండానే బరిలోకి భారత్
- రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా రాహుల్


నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టైటిల్ ఫేవరెట్ భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌మీదున్న ఓపెనర్ గబ్బర్ శిఖర్ ధవన్ గాయం కారణంగా మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో గత మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన ధవన్ ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ వేసిన బంతి ధవన్ చేతిని బలంగా తాకింది. గాయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మంగళవారం జరిపిన వైద్య పరీక్షల్లో వేలి ఎముకలో చిన్న చీలిక ఏర్పడినట్లు తేలింది. ఈ కారణంగా న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లకు ధవన్ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో రోహిత్‌శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనుండగా, దినేశ్ కార్తీక్ లేదా విజయ్ శంకర్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ధవన్‌కు ప్రత్యామ్నాయంగా రిషబ్ పంత్, రాయుడిని తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

నాటింగ్‌హమ్: భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఐసీసీ టోర్నీల్లో విజృంభించి ఆడే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధవన్ గాయం కారణంగా రానున్న మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అద్వితీయ శతకంతో విజృంభించిన ఈ లెఫ్ట్‌హ్యాండర్.. అదే మ్యాచ్‌లో ప్యాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్‌ను అడ్డుకునే క్రమంలో గాయపడ్డాడు. ఎడమ చేతి బొటనవేలుకు బంతి బలంగా తాకడంతో ఫీల్డింగ్‌కు రాకుండా డ్రెస్సింగ్‌రూమ్‌కే పరిమితమయ్యాడు. తాజా వైద్యపరీక్షల్లో అతడి బొటనవేలి ఎముకలో సన్నటి చీలిక వచ్చినట్లు తేలింది. ప్రస్తుతానికైతే మూడు మ్యాచ్‌లకే దూరమవుతాడు అని అంటున్నా.. అతడికి కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వరల్డ్‌కప్‌లో ధవన్ ధనాధన్ ఇన్నింగ్స్‌లు చూసే అవకాశం లేనట్లే కనిపిస్తున్నది.
Shikhar-Dhawan1

ఆఫ్ఘన్‌తో పోరు వరకు రెడీ!

పది రోజుల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు వరకు అతడు కోలుకుంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. ఒకవేళ ఆ మ్యాచ్‌కు అందుబాటులోకి రాకున్నా మరో ఆరు రోజుల తర్వాత వెస్టిండీస్ మ్యాచ్ వరకైనా అతడు కోలుకుంటే చాలని భావిస్తున్నది. తొందరపడి ప్రత్యామ్నాయ ఆటగాడిని పిలిపిస్తే.. కోహ్లీసేన సెమీస్ చేరితే అప్పటికి గాయం తీవ్రత తగ్గిన ధవన్ అందుబాటులో లేకుండా పోతాడు. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోనుంది. వైద్యులు అధికారికంగా నెల రోజుల విశ్రాంతి అవసరం అని తేల్చితే తప్ప ధవన్‌కు ప్రత్యామ్నాయంపై బోర్డు దృష్టిపెట్టేలాలేదు. ప్రస్తుతానికి జట్టులో లోకేశ్ రాహుల్ రూపంలో స్పెషలిస్ట్ ఓపెనర్ ఉండటం టీమ్‌ఇండియాకు ఊరటనిచ్చే అంశం. న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మతో కలిసి రాహుల్ ఓపెనర్‌గా రావడం ఖాయమే. నాలుగో స్థానంలో దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్‌ల్లో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. వరల్డ్‌కప్ జట్టు ప్రకటించిన సమయంలో సెలెక్షన్ కమిటీ అంబటి రాయుడు, రిషభ్ పంత్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

814

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles