మెరుపులు మరకలు


Tue,May 14, 2019 01:23 AM

రెండు నెలలుగా పరుగుల జడివానలో తడిపేసిన భారీ తుఫాను వెలిసింది.51 రోజులు.. 60 మ్యాచ్‌లు.. 19,416 పరుగులు.. 682 వికెట్లు.. 785 సిక్సర్లు.. 5 సెంచరీలు.. 105 అర్ధ సెంచరీలు.. 2 హ్యాట్రిక్‌లు.. 2 చివరి బంతి విజయాలు.. మరో 2 సూపర్ ఓవర్‌లు ఇలా రసవత్తరంగా సాగిన ఐపీఎల్-12వ సీజన్ కొన్ని మధురమైన.. కొన్ని మర్చిపోవాల్సిన జ్ఞాపకాలతో ముగిసింది. ఈ ఏడాదే వన్డే వరల్డ్‌కప్ జరుగనున్ననేపథ్యంలో అనవసరపు గాయాలు తప్ప ఈ లీగ్ వల్ల ఒరిగేదేమి లేదని కొందరంటే.. చక్కగా విశ్రాంతి తీసుకోక అవసరమా ఈ రచ్చ అని మరి కొంతమంది పెదవి విరిచారు. పొట్టి ఫార్మాట్‌కు బదులు కొన్ని వన్డే సిరీస్‌లే బెటర్ అనే వాదనలూ వినిపించాయి. వీటన్నింటి మధ్య మొదలైన 12వ సీజన్ ఉర్రూతలూగిస్తూ ముంబైని విజేతగా నిలిపింది. ఈ ఏడాది విదేశీ ఆటగాళ్ల ప్రదర్శనలు పక్కన పెడితే.. మనవాళ్ల మెరుపులను ఒకసారి మననం చేసుకుంటూ.. అవి వన్డే వరల్డ్‌కప్ ముందు ఎంతవరకు ఉపయోగపడతాయే చూద్దాం.

నమస్తే తెలంగాణ క్రీడా విభాగం:ధనాధన్ మెరుపుల నుంచి ఇక బయటకు వద్దాం. 20 ఓవర్ల మత్తు వీడి వన్డే ఫార్మాట్‌లోకి ట్యూన్ కావాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటి వరకూ కోహ్లీ వికెట్ తీయాలని బుమ్రా.. షమీని చితక్కొట్టాలని రోహిత్‌శర్మ వేసిన ప్రణాళికలకు ఇక పుల్‌స్టాప్ పెట్టి అంతా కలిసి బ్లూ జెర్సీలో కనువిందు చేసేందుకు మరో మూడు వారాల సమయమే మిగిలింది. మొన్నటిదాకా ఫ్రాంచైజీల తరఫున సర్వశక్తులూ ఒడ్డిన మనవాళ్లు మరి జాతీయ జట్టు తరఫున ఏ మేరకు సత్తాచాటుతారు. ఈ లీగ్ వల్ల ఒనగూరిన అదనపు ప్రయోజనాలేంటి ఓ సారి పరిశీలిస్తే..

మెరుపులు

రాహుల్ రాక్స్.. హార్దిక్ బ్యాక్

ఈ ఏడాది ఆరంభంలో టీవీ షో వివాదంతో వార్తల్లోకెక్కి.. అర్ధాంతరంగా జట్టుకు దూరమై ఆ తర్వాత సస్పెన్షన్ ఎదుర్కొని తిరిగి జట్టులోకి వచ్చిన లోకేశ్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు ఈ సీజన్ గొప్పగా సాగిందనే చెప్పాలి. పంజాబ్ ఓపెనర్‌గా బరిలో దిగిన రాహుల్ 14 మ్యాచ్‌ల్లో 53.90 సగటుతో 593 పరుగులు చేయడంతో పాటు ైస్టెలిష్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కించుకున్నాడు. అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడంటేనే అతడు ఏ విధంగా చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. మైదానం వెలుపల పాండ్యా ప్రవర్తన ఎలా ఉన్నా.. ఒక్కసారి గ్రౌండ్‌లో దిగితే జట్టు కోసం ప్రాణాలు పెట్టే రకం అతడు. ఈ సీజన్‌లో ముంబై విజేతగా నిలువడంలో ముఖ్యపాత్ర పాండ్యాదే అనడం అతిశయోక్తి కాదు. ఆశల్లేని మ్యాచ్‌ల్లోనూ అతడి పవర్ హిట్టింగ్ వల్ల ముంబై విజయాలు సాధించింది. చివరి ఓవర్‌లలో బ్యాటింగ్‌కు వస్తూనే బౌలర్లకు పీడకలలు మిగిల్చిన పాండ్యా ఇంకా ముందు వస్తే.. ఏదైనా సాధ్యమే అనిపించాడు. 16 మ్యాచ్‌ల్లో 402 పరుగులతో పాటు 14 వికెట్లు పడగొట్టి నిఖార్సైన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. సీజన్ మొత్తం ఆకట్టుకున్న పాండ్యా వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుకు అడుగు దూరంలో నిలిచాడు.

రోహిత్, ధవన్ నిలకడ

టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్‌కు ఈ సీజన్ మేలు చేసిందనే చెప్పాలి. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ 15 మ్యాచ్‌ల్లో 405 పరుగులు సాధించడంతో పాటు జట్టును ముందుండి నడిపించి టైటిల్ కట్టబెడితే.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు శిఖర్ ధవన్ పెద్దన్నగా మారి విజయాల బాట పట్టించాడు. సీజన్‌కు ముందు సన్‌రైజర్స్‌ను వీడి ఢిల్లీకి చేరిన ధవన్ సొంత రాష్ట్రం తరఫున అదరగొట్టాడు. యువకులతో కూడిన జట్టుకు 16 మ్యాచ్‌ల్లో 521 పరుగులతో హెడ్‌లైట్‌లా ముందుండి దారి చూయించాడు.

నిరాశ పర్చిన కుల్దీప్, విజయ్ శంకర్

టీమ్‌ఇండియా ప్రధాన బౌలర్‌గా చలామణి అయిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఈ సీజన్ చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. అతడి బౌలింగ్ ప్రభావవంతంగా లేకపోవడంతో కోల్‌కతా తుదిజట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్ గడ్డపై చహల్‌తో కలిసి చెలరేగుతాడనుకుంటే.. 9 మ్యాచ్‌ల్లో 71.50 సగటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో మొయిన్ అలీ ఊచకోతను ఆపలేకపోయిన కుల్దీప్ కన్నీళ్లు కార్చడం అతడి బేలతనాన్ని బయటపెట్టింది. వైఫల్యాలను పక్కనపెట్టి ఇప్పటికైనా సానుకూల దృక్పథంతో తన బలాలపై దృష్టి పెట్టి బలంగా తిరిగి వస్తేనే.. లేకుంటే వరల్డ్‌కప్‌లో అతడి స్థానాన్ని జడేజా ఆక్రమిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడను కాదని వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన త్రీ డైమెన్షన్ ప్లేయర్‌విజయ్ శంకర్ కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. హైదరాబాద్ తరఫున 15 మ్యాచ్‌ల్లో 20.33 సగటుతో 244 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లోనైతే మరీ దారుణంగా ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ అతడిని అసలు బౌలర్‌గానే పరిగణించకపోవడం గమనార్హం.

మహేంద్ర మాయాజాలం

ఐపీఎల్‌లో ఆడిన 10 సీజన్‌లలోనూ చెన్నై సూపర్‌కింగ్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన మహేంద్రసింగ్ ధోనీ ఈసారి మరింతగా రెచ్చిపోయాడు. ఒకటా రెండా చెన్నై గెలిచిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ అతడి మెరుపులు ఉన్నాయి. ఫైనల్లో మహీ త్వరగా పెవిలియన్ చేరడమే చెన్నైకి ట్రోఫీని దూరం చేసిందనే వాదననూ కొట్టిపారేయలేం. మహీ 12 ఇన్నింగ్స్‌ల్లో 83.20 సగటుతో 416 పరుగులు చేశాడు. అందులో 22 ఫోర్లు, 23 సిక్సర్లు ఉన్నాయి. టాప్-20లో రస్సెల్ తర్వాత తక్కువ ఫోర్లు, ఎక్కువ సిక్స్‌లు కొట్టిన మరో ఆటగాడు మహీ మాత్రమే. ధోనీలోని మ్యాచ్ ఫినిషర్ ఇంకా ఫినిష్ కాలేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

సారథి అదే రీతి..

బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 33.14 సగటుతో 464 పరుగులు చేశాడు. ఇది తన స్థాయికి తగ్గ ప్రదర్శన అని చెప్పలేం కానీ జట్టంతా సమిష్టిగా విఫలమవుతున్నప్పుడు అతనొక్కడు మాత్రం ఏం చేస్తాడు. ఫ్రాంచైజీల తరఫున కోహ్లీ ఆట ఎలా ఉన్నా ఒక్కసారి టీమ్‌ఇండియా తరఫున బరిలో దిగితే అతడిని ఆపడం కష్టమే అన్నది నిర్వావాదాంశం.

బౌలింగ్‌లో తిరుగులేనట్టే

యార్కర్ కింగ్ బుమ్రాకు ఇది మరో చక్కటి సీజన్ అనే చెపొచ్చు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో పకడ్బందీ బౌలింగ్‌తో విజృంభించిన బుమ్రా 16 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీస్తే.. పంజాబ్ తరఫున షమీ అంచనాలకు మించి రాణించాడు. పరుగులు ఎక్కువ ఇచ్చుకుంటాడనే అపవాదును తుడిచిపెడుతూ.. 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో సత్తాచాటాడు. సీజన్‌లో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడిన వీరిద్దరూ ఫిట్‌నెస్‌లోనూ భేష్ అనిపించుకున్నారు. చాహల్ 14 మ్యాచ్‌ల్లో 18 వికెట్లతో ఫర్వాలేదనిపిస్తే.. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ మాత్రం 15 మ్యాచ్‌ల్లో 13 వికెట్లే పడగొట్టాడు. రవీంద్ర జడేజా 16 మ్యాచ్‌ల్లో 106 పరుగులు, 15 వికెట్లతో ఫర్వాలేదనిపించాడు. రిజర్వ్ బౌలర్లు ఖలీల్ అహ్మద్ 9 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో ఆకట్టుకుంటే.. నవదీప్ సైనీ.. 11 వికెట్లతో ఆదరగొట్టాడు. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరిన సైనీ భవిష్యత్తు స్టార్ అనిపించుకున్నాడు.
IPL2019


మరకలు

ధోనీ ఉగ్రరూపం

మిన్ను విరిగి మీదపడ్డా ముఖ కవలికల్లో, శరీర హావభావాల్లో ఎలాంటి తేడా కనపడనివ్వని మాజీ కెప్టెన్ ధోనీ ఈ సీజన్‌లో తనలోని మరోకోణాన్ని బయటపెట్టాడు. రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా స్టోక్స్ వేసిన బంతిని తొలుత బీమర్‌గా ప్రకటించిన అంపైర్ ఆ తర్వాత అది లీగల్ డెలివరీ అనడంతో బౌండ్రీ వద్ద నుంచి ఇదంతా గమనిస్తున్న ధోనీ ఫీల్డ్‌లోకి వచ్చి అంపైర్లతో వాదించి జరిమానాతో పాటు విమర్శలను మూటగట్టుకున్నాడు.
IPL20191

అశ్విన్ మన్కడింగ్

లీగ్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా వార్తల్లోకెక్కాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. రాజస్థాన్‌కు 185 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఛేదనలో రాయల్స్108/1తో పటిష్ఠంగా ఉన్న సమయంలో అశ్విన్ మన్కడింగ్ ద్వారా బట్లర్‌ను పెవిలియన్ పంపాడు. దీంతో తడబడ్డ రాజస్థాన్ ఓటమి పాలైంది. క్రికెట్ నిబంధనలు అది ఔటే అని అంటుంటే.. కొందరు మాజీలు మాత్రం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అశ్విన్‌ను దుయ్యబట్టారు.
IPL20192

రోహిత్ అసహనం

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సహనం కల్పోయిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్లను బ్యాట్‌తో కొట్టి పెవిలియన్ చేరాడు. భారీ లక్ష్యఛేదనలో గర్నీ వేసిన బంతికి రోహిత్ ఎల్బీ అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీనిపై రోహిత్ రివ్యూ కోరగా.. బంతి లెగ్‌స్టంప్ బయట నుంచి తాకుతూ వెళ్తున్నట్లు కనిపించింది.దీంతో ఆగ్రహానికి గురైన ముంబై కెప్టెన్ నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న అంపైర్‌తో దురుసుగా మాట్లాడుతూ.. వికెట్లను బ్యాట్‌తో కొట్టి పెవిలియన్ చేరాడు.
IPL20193

కుల్దీప్ కన్నీటి పర్యంతం

ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీ కోల్‌కతా బౌలర్ కుల్దీప్‌ను కన్నీళ్లు పెట్టించాడు. ఒకే ఓవర్‌లో మొయిన్ అలీ 27 పరుగులు పిండుకోవడంతో బాధ తట్టుకోలేకపోయిన కుల్దీప్ గ్రౌండ్‌లోనే ఏడ్చేశాడు. సహచరుడు నితీశ్ రాణా అతడిని సముదాయించి పక్కకు తీసుకెళ్లాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబై బౌల ర్ లసిత్ మలింగ చివరి బంతికి నోబాల్ వేసినా.. అంపైర్లు దాన్ని గమనించకపోవడంపై విరాట్ కోహ్లీ బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఇది గల్లీ క్రికెట్ కాదు, ఐపీఎల్. కాస్త కండ్లు తెరిచి అంపైరింగ్ చేస్తే బాగుంటుందని చురకలంటించాడు. ఇంతేనా.. మ్యాచ్ సందర్భంగా కోహ్లీ వాదించాడనే బాధలో అంతర్జాతీయ అంపైర్ డ్రెస్సింగ్ రూమ్ తలుపును తన్నడం. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్లిన బంతికి వైడ్ ఇవ్వలేదని పొలార్డ్ మరుసటి బంతికి క్రీజ్ వదిలి నిలుబడటం ఇలా ఇంకా చాలా ఉన్నాయి.
IPL20194

849

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles