క్వార్టర్స్‌లో మేరీకోమ్


Thu,October 10, 2019 12:50 AM

-జమున, లవ్లీనా కూడా
-మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్

Mary-Kom
ఉలన్ ఉదె (రష్యా): ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ (51 కేజీలు) అలవోక విజయంతో క్వార్టర్స్‌లో అడుగుపెడితే.. జమునా బోరో (54 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో జమున 5-0తో ఐదోసీడ్ ఔదాద్ ఫౌత్ (అల్జేరియా)పై.. మూడో సీడ్ లవ్లీనా 5-0తో బెల్ అహబీబ్ (మొరాకో)పై విజయాలు సాధించారు. అంతకుముందు మంగళవారం జరిగిన పోరులో మూడోసీడ్ మేరీకోమ్ 5-0తో జుటామస్ జిట్‌పాంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి 51 కేజీల విభాగంలో పోటీపడుతున్న మేరీకోమ్ ఎలాంటి తడబాటుకు గురికాలేదు. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థిని మట్టికరిపించి ముందడుగు వేసింది. మరో భారత బాక్సర్ సవీటి బూరా (75 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ లౌరెన్ ప్రైస్ (వేల్స్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరుగనున్న క్వార్టర్ ఫైనల్స్‌లో ఉర్సులా గొట్లోబ్ (జర్మనీ)తో జమున.. కరోలినా కొజెస్కా (పోలాండ్)తో లవ్లీనా తలపడనున్నారు. చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్ నుంచి ఐదుగురు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. మేరీకోమ్, జమున, లవ్లీనాతో పాటు మంజురాణి (48 కేజీలు), కవిత చాహల్ (ప్లస్ 81 కేజీలు) పతకానికి పంచ్ దూరంలో ఉన్నారు. మరొక్క విజయం సాధిస్తే వీరు సెమీస్‌లో అడుగుపెట్టి కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకుంటారు.

246

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles