HomeSports News

వదలని వాన

Published: Fri,June 14, 2019 03:05 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

-భారీ వర్షంతో భారత్, కివీస్ మ్యాచ్ రద్దు
-ఇరు జట్లకు చెరో పాయింట్
విశ్వ సమరాన్ని వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. వర్షం దెబ్బకు ఒక్క బంతి పడకుండానే భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ రైద్దెంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లను తుడిచిపెట్టిన వరుణుడు.. సవాళ్లను అధిగమించేందుకు సిద్ధమైన టీమ్‌ఇండియాను వదల్లేదు. టాస్ వేసేందుకు కూడా సాధ్యపడకుండా ముంచెత్తడంతో చేసేదేమిలేక ఇరుజట్లకు చెరో పాయింట్ పంచి పెట్టారు. గత ప్రపంచకప్‌లకు భిన్నంగా ఈసారి ఆటకంటే వాతావరణమే ప్రభావం చూపిస్తుండడం గమనార్హం.
ind-vs-nz
నాటింగ్‌హమ్: ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ను వరణుడు వదిలేలాలేడు. ఇప్పటికే వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోగా. తాజాగా టీమిండియా మ్యాచ్ కూడా ఈ జాబితాలో చేరింది. గురువారం ఇక్కడి ట్రెంట్‌బ్రిడ్జ్ పిచ్‌పై న్యూజిలాండ్, భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రైద్దెంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన మ్యాచ్ చివరకు వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో పూర్తిగా రైద్దెంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ 7 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా.. మూడు మ్యాచ్‌ల్లో 5 పాయింట్లతో భారత్ మూడో స్థానానికి చేరింది.

వరుణదేవా కరుణించవా..

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియాకు వరుణ దేవుడు బ్రేక్ వేశాడు. దాయాది పాకిస్థాన్‌తో మ్యాచ్ కు ముందు ఆల్‌రౌండర్లతో నిండి ఉన్న న్యూజిలాండ్‌ను పడగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుందామంటే అది సాధ్యపడకుండా అడ్డుపడ్డాడు. గాయంతో దూ రమైన ఓపెనర్ శిఖర్ ధవన్ స్థానంలో రాహుల్ ఎలా ఆడుతాడో.. నాలుగో స్థానంలో ఎవరిని బరిలోకి దించుతారో.. షమీకి ఈ మ్యాచ్‌లోనైనా చాన్స్ వస్తుందో.. ఇలాంటి సవాలక్ష ఊహలపై నీళ్లు చల్లా డు. మధ్యమధ్యలో కాస్త తెరిపినిస్తూ ఆశలు రేకెత్తించినా.. కవర్స్ తొలగిద్దామనే లోపే మళ్లీ ముంచెత్తుతూ దోబూచూలాడుతుండటంతో ఇక చేసేదేమిలేక నిర్వాహకులు ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. నాలుగేండ్లకోసారి వచ్చే విశ్వసమరం కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూసే వీరాభిమానులకు ఇలాంటి ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.

ఆసక్తి సన్నగిల్లుతున్నది..

ఇది వరకు మెగాటోర్నీ ఆరంభమైతుందంటే చాలు.. ఎక్కడి లేని సందడి ఉండేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా.. వాతావరణం కీలకంగా మారుతున్నది. దీంతో టోర్నీపై ఆసక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఈవెంట్స్‌పై శ్రద్ధ చూపేవారంతా ఇప్పుడు ఒకే అంశం గురించి చర్చించుకుంటున్నారు. కోట్లాది మందిని తమవైపు ఆకర్షిస్తున్న ఆ అంశం మరేదో కాదు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్పేఅని ఓవైపు అమెరికా సెక్రెటరీ మైక్ పాంపియో.. క్రికెట్ ఫీవర్ ఏ రేంజ్‌లో ఉందో అంతర్జాతీయ వేదికలపై చాటిచెప్తుంటే.. మరోవైపు వాతావరణం మాత్రం మ్యాచ్‌లకు ప్రతిబంధకంగా మారింది. ఇదే వేదికపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. నా అంచనా ప్రకారం.. భారత్, ఇంగ్లండ్ వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడతాయి. నా వరకైతే టీమ్‌ఇండియా మూడోసారి కప్పు గెలువాలని బలంగా కోరుకుంటున్నా. అదే జరిగితే చాలా ఆనందిస్తా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా ప్రమాదకరమేఅని అన్నారు. ఇంత భారీ బజ్ ఏర్పడ్డ మెగాటోర్నీ ఇలా వర్షాల కారణంగా కళ తప్పడం కలవరపెడుతున్న అంశం.

ind-vs-nz2

మా పరిస్థితేంటి..

ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని వేలాది మంది ఇంగ్లండ్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాహతుకు మించి ఖర్చుపెట్టి మ్యాచ్‌లు చూడాలని భావించి వస్తే.. వరుణుడు వారి ఆశలపై నీళ్లు గుమ్మరించాడు. తాజాగా భారత్ మ్యాచ్ రైద్దెన అనంతరం ఓ అభిమాని మాట్లాడుతూ.. నేను భారత్ మ్యాచ్ చూసేందుకు సింగపూర్ నుంచి వచ్చా. 800 పౌండ్లు (సుమారు రూ. 70 వేలు) వెచ్చించి టిక్‌ట్ కొనుగోలు చేశా. అదంతా వృథా అయినట్లే. పాకిస్థాన్‌తో మ్యాచ్ టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. బ్లాక్ మార్కెట్‌లో ఆ మ్యాచ్ టికెట్ దాదాపు రూ. 2 లక్షలు పలుకుతున్నది. నా దగ్గర అంత డబ్బులేదు.

ఇప్పుడు నేనేం చేయను?అని తనగోడు వెల్లబోసుకున్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రైద్దెతే టికెట్ డబ్బులు వాపస్ వస్తాయి. కానీ మ్యాచ్ చూడడానికి వచ్చిన వారిలో అధిక శాతం మంది టికెట్లు థర్డ్‌పార్టీ వద్ద నుంచి కొనుగోలు చేసినవారే కావడంతో వారికి దీంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీనికితోడు ఇంగ్లండ్‌లో హోటళ్ల చార్జీలు, ప్రయాణ ఖర్చులు అదనపు భారాన్ని మిగులుస్తున్నాయి. ప్రసార హక్కులు పొందిన సంస్థలకు ఇన్సూరెన్స్ రూపంలో భద్రత ఉంటుంది కానీ అభిమానులకు ఆ అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సోషల్ మీడియాలో జోకులు.

ఇక సామాజిక మాధ్యమాల్లోనైతే.. ప్రపంచకప్‌పై కుప్పలు తెప్పలుగా జోకులు పేలుతున్నాయి. వరల్డ్ కప్ బదులు రెయిన్ కప్ అనే పేరు పెడితే బాగుండేదని ఒకరంటే.. మ్యాచ్‌లన్ని రద్దు చేసి టోర్నీని కట్‌చేసి అందరికి సమానంగా పంచాలని మరొకరు సెటైర్లు వేస్తున్నారు. న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 7 పాయింట్లతో ఉంటే.. వర్షం 4 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో అగ్రస్థానానికి చేరిందని ఛలోక్తులు విసురుతున్నారు. వీటిని జోకులు అనేకన్నా వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దాలు అనడమే సబబేమో. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ప్రపంచకప్ ప్రారంభమై రెండు వారాలు కాకముందే 4 మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి.

virat-kohli
ఇది చాలా సున్నితమైన నిర్ణయం. ఔట్‌ఫీల్డ్ అనుకూలంగా లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం. చిత్తడి మైదానంలో ఫీల్డర్లకు గాయాలయ్యే అవకాశాలెక్కువ. దానికన్నా ఆట రద్దు కావడమే మంచింది. తదుపరి మ్యాచ్ గురించి ఇప్పుడే ఏం మాట్లాడదల్చుకోలేదు. బరిలో దిగాక గేమ్‌ప్లాన్‌ను అమలు చేయడమే మా లక్ష్యం. శిఖర్ గాయం త్వరగా నయం కావాలని కోరుకుంటున్నా. టోర్నీ మలి సగంలో అతడు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. అతడు జట్టుతో చేరాలని మేము కోరుకుంటున్నాం.
- విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్.

kane-williamson
గత నాలుగు రోజులుగా ఇక్కడ సూర్యుడే కనిపించలేదు. అందుకే ఈ నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్యపర్చలేదు. దీంతో టోర్నీ మధ్యలో మాకు సుదీర్ఘ విరామం దొరికింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు రీఫ్రెష్ అయ్యేందుకు ఈ సమయాన్ని వినియోగించుకుంటాం.
- కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్

table

runs

wickets

1058

Recent News