టైటాన్స్ రెండో టై


Tue,August 13, 2019 02:16 AM

-బెంగాల్‌తో మ్యాచ్ సమం

అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో భాగంగా గత మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై గెలిచి తొలి విజయాన్ని నమోదు చేసుకున్న తెలుగు టైటాన్స్.. సోమవారం మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బెంగాల్ వారియర్స్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ను టైటాన్స్ టైగా ముగించింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు 29-29 పాయింట్లతో నిలువడంతో మ్యాచ్ డ్రాఅయింది. తెలుగు జట్టు తరఫున సూరజ్ దేశాయ్ 7 పాయింట్లు సాధించగా.. స్టార్ ప్లేయర్ సిద్ధార్థ్ దేశాయ్ (4 పాయింట్లు) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 12 సార్లు ప్రత్యర్థి కోర్టులోకి రైడింగ్‌కు వెళ్లిన సిద్ధార్థ్ ఆరుసార్లు అందులోనే దొరికిపోవడం ఫలితంపై ప్రభావం చూపింది. బెంగాల్ తరఫున మొహమ్మద్ నబీబక్ష్ (8 పాయింట్లు), మణిందర్ సింగ్ (5 పాయింట్లు) రాణించారు. లీగ్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఒక విజయం, ఐదు పరాజయాలు, రెండు టైలతో 13 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 10వ స్థానంలో నిలిచింది.
PKL

ఆఖరివరకు హోరాహోరీ

తొలి రైడ్‌లోనే పాయింట్ తెచ్చిన సిద్ధార్థ్ టైటాన్స్ ఖాతా తెరిచాడు. రెండో నిమిషంలో బెంగాల్ రైడర్ నబీబక్ష్.. సిద్ధార్థ్‌ను ఔట్ చేసి స్కోరు సమం చేశాడు. ఈ దశలో టైటాన్స్ చక్కటి ట్యాక్లింగ్స్‌తో రెండు పాయింట్లు సాధించి 4-2తో ముందడుగు వేసింది. కాసేపటికే సిద్ధార్థ్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన వారియర్స్ 9-9తో స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వెళ్లింది. ఎట్టకేలకు తొలి అర్ధభాగం ముగిసే సమయానికి టైటాన్స్ 13-11తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో సగం ఆరంభంలోనే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టైటాన్స్ తొలిసారి 5 పాయింట్ల లీడ్ సాధించగలిగింది. 17-12, 19-15తో ముందంజలో కనిపించిన టైటాన్స్ కీలక దశలో వరుస పాయింట్లు కోల్పోయి 21-23తో వెనుకబడింది. ఈ దశలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణిలో ఆడటంతో పెద్దగా మెరుపుల్లేకుండా చివరకు మ్యాచ్ టైగా ముగిసింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధా 35-33తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. మంగళవారం లీగ్‌లో సెలవు రోజు కాగా.. బుధవారం జరుగనున్న మ్యాచ్‌ల్లో యూపీతో హర్యానా, గుజరాత్‌తో బెంగాల్ తలపడనున్నాయి.

572

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles