సమరానికి సై


Mon,August 19, 2019 04:09 AM

-నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
-నేరుగా రెండో రౌండ్‌కు సింధు, సైనా..
-పురుషుల సింగిల్స్ బరిలో శ్రీకాంత్, ప్రణీత్
ఈ సీజన్‌లో టైటిళ్ల కరువులో ఉన్న భారత షట్లర్లు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌నకు సిద్ధమయ్యారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో నేడు ఈ మహాపోరుకు తెరలేవనుంది. స్వర్ణ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని ఎంతో కాలంగా సన్నాహకాల్లో తలమునకలై ఉన్న భారత ప్లేయర్లు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నారు. ముఖ్యంగా పీవీ సింధు, సైనా నెహ్వాల్ స్వర్ణ పతకంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో తెలుగు షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ టైటిల్ చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవాలంటే ఈ టోర్నీ మన షట్లర్లకు చాలా కీలకం.
PV-Sindhu
బాసెల్ (స్విట్జర్లాండ్): బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు సర్వం సిద్ధమైంది. ఎప్పటి నుంచో అం దని ద్రాక్షలా ఊరిస్తున్న ఈ టోర్నీ స్వర్ణ పతకాన్ని సాధించేందుకు భారత షట్లర్లు పట్టుదలగా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన టోర్నీల్లో అంచనాల ను అందుకోలేకపోయిన మనవాళ్లు చాంపియన్‌షిప్‌ను చేజిక్కించుకొని టైటిల్ దాహం తీర్చుకోవాలని భావిస్తున్నా రు. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ పీవీ సింధు, స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. చాంపియన్‌షిప్ కోసం ఎప్పటి నుంచో శ్రమిస్తున్నారు. మరోవైపు పరుషుల సింగిల్స్‌లో తెలు గు షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ సహా హెచ్‌ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఈ టోర్నీలో అదరగొట్టి గత వైభవాన్ని గుర్తుచేయాలని శ్రీకాంత్ ఆశిస్తున్నాడు.

saina

సైనాకూ బై

ఈ ఏడాది మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించిన ఏకైక భారత షట్లర్ సైనా నెహ్వాల్. జనవరిలో జరిగిన ఇండోనేషియా మాస్టర్స్‌లో సైనా విజేతగా నిలిచింది. ఇటీవల గాయాల కారణంగా ఇండోనేషియా, జపాన్ ఓపెన్ టోర్నీలకు ఆమె దూరమైంది. థాయ్‌లాండ్ ఓపెన్‌తో పునరాగమనం చేసినా.. క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. చాంపియన్‌షిప్ కోసం ఎప్పటి నుంచో సిద్ధమవుతున్న సైనాకు తొలి రౌండ్‌లో బై లభించగా.. నేరుగా రెండో రౌండ్‌లో బరిలోకి దిగనుంది. అయితే, సైనాకు క్వార్టర్స్‌లో చెన్ యూ ఫీ (చైనా) రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. చెన్ ఈ ఏడాది నాలుగు టైటిళ్లు సాధించి జోరుమీదుంది.

Sai_Praneeth

పురుషుల డబుల్స్‌లో మూడు జోడీలు

ఇటీవలే థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయి రాజ్-చిరాగ్ శెట్టి గాయాల కారణంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు దూరమైంది. మను అత్రి-సుమీత్ రెడ్డి, ఎంఆర్ అర్జున్-శ్లోక్ రామంచంద్రన్, అరుణ్ జార్జ్-శ్యామ్ శుక్లా జోడీలు బరిలో ఉన్నాయి. మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప- ఎన్.సిక్కిరెడ్డి, జక్కంపూడి మేఘన-పూర్విష, పూజ-సంజనా పోటీలో ఉన్నారు.

srikanth

పూర్వవైభవం కోసం

ఓ వైపు గాయాలు.. మరో వైపు వైఫల్యాలతో నిరాశలో ఉన్న స్టార్ షట్లర్, ఏడో సీడ్ శ్రీకాంత్.. చాంపియన్‌షిప్‌లో సత్తాచాటి గత వైభవాన్ని చాటిచెప్పాలని చూస్తున్నాడు. రెండేళ్ల క్రితం నాలుగు సూపర్ టైటిల్ సిరీస్‌లను గెలిచి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన అతడు.. 22 నెలలుగా ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. తొలి రౌండ్‌లో నాట్ గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్ తలపడనున్నాడు. మరో తెలుగు షట్లర్ సాయి ప్రణీత్ ఈ ఏడాది మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. స్విస్ ఓపెన్ ఫైన ల్ సహా జపాన్ ఓపెన్ సెమీస్ వరకు వెళ్లాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌నకు ముందు అర్జున అవార్డుకు ఎంపికైన ప్రణీత్.. తొలి రౌండ్‌లో జేసన్ ఆంటోనీ (కెనడా)ని ఢీకొట్టనున్నాడు. ప్రణయ్ తొలి రౌండ్‌లో ఈటు హీనో(ఫిన్లాండ్)తో తలపడనున్నాడు.

ఈసారైనా స్వర్ణం

ఒలింపిక్ రజత పతక విజేత సింధుకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మంచి రికార్డు ఉంది. గత రెండు టోర్నీల్లో ఫైనల్ వరకు వెళ్లిన సింధు... తుదిమెట్టుపై తడబడి రజత పతకాలు సాధించింది. 2017 ఫైనల్లో ఒకుహరా(జపాన్)తో 110 నిమిషాల పాటు సాగిన పోరులో అద్భుతంగా పోరాడినా సింధుకు నిరాశ తప్పలేదు. అ లాగే 2018 తుదిపోరులో కరోలినా మారి న్ (స్పెయిన్) చేతిలో ఓడిన సింధు స్వర్ణాన్ని చేజార్చుకుంది. 2013, 2014 టోర్నీల్లోనూ కాంస్య పతకాలు సాధించింది. ఈసారి ఎలాగైనా పసిడి పతకం పట్టాలని సింధు తీవ్రంగా శ్రమిస్తున్నది. ఫిట్‌నెస్, డిఫెన్స్‌పై ప్రత్యేక శ్రద్ధపెట్టింది.

అయితే, గతేడాది వరల్డ్‌టూర్ టైటిల్ తర్వాత ఈ సీజన్‌లో సింధు ఒక్కటైటిల్ కూడా సాధించలేకపోయింది. ఇండోనేషియా ఓపెన్ ఫైనలే ఆమెకు ఈ సీజన్‌తో అత్యుత్తమ ప్రదర్శన. ఈ నేపథ్యంలో ఇక్కడ స్వర్ణం సాధించి వచ్చే ఏడాది ఒలింపిక్స్ కోసం ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమవ్వాలని భావిస్తున్నది. తొలి రౌండ్‌లో సింధుకు బై లభించగా.. రెండో రౌండ్‌లో పై యుపో(చైనీస్ తైపీ) లేదా లిండా జెట్చిరి(బల్గేరియా)తో తలపడనుంది. డ్రాలో భాగంగా సింధు, సైనా ఒకే పార్శంలో ఉండటంతో.. అంచనాలకు తగ్గట్లు రాణిస్తే సెమీఫైనల్లో వీరిద్దరే తలపడే అవకాశాలు ఉన్నాయి.

730

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles