రోహిత్ మహాన్‌


Fri,November 8, 2019 03:18 AM

-తుఫాన్‌ను మించిన హిట్‌మ్యాన్ బీభత్సం
-టీమ్‌ఇండియా ఘన విజయం.. నాగ్‌పూర్‌లో మూడో టీ20

rohit
కెప్టెన్‌గా తొలిసారి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడ్డ కంగారో.. వందో అంతర్జాతీయ టీ20లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాలన్న కసో.. కానీ, రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌పై మహా తుఫాను కంటే భీకరంగా విరుచుకుపడ్డాడు. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో దుమ్మురేపిన హిట్‌మ్యాన్.. నాయకుడు ముందుండి నడిపిస్తే ఎలా ఉంటుందో బంగ్లా టైగర్స్‌కు అవగతమయ్యేలా చేశాడు. టాస్ గెలువడంతోనే సగం మ్యాచ్ చేతికొచ్చినట్లే అనుకున్న సగటు క్రికెట్ అభిమానిని.. రోహిత్ తన పవర్ హిట్టింగ్‌తో మరింత మైమరిపించాడు. ఫలితంగా పొట్టి ఫార్మాట్‌లో పొరుగు దేశం చేతిలో సిరీస్ ఓటమి నుంచి తప్పించుకున్న టీమ్‌ఇండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసి నాగ్‌పూర్‌లో ఫైనల్ ఫైట్‌కు సిద్ధమైంది.

రాజ్‌కోట్‌లో రఫ్ఫాట..

టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌కు రోహిత్ చుక్కానిలా నిలిచాడు. కష్టతరం కాని లక్ష్య ఛేదనలో రోహిత్, ధవన్ విజృంభించడంతో ఛేదనలో భారత్‌కు ఎలాంటి కష్టం కలుగలేదు. తొలి ఓవర్‌లో ధవన్ రెండు ఫోర్లతో బాదుడుకు గేట్లెత్తితే.. హిట్‌మ్యాన్ వరుస బౌండ్రీలతో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. వీరిద్దరి ధాటికి బంగ్లా ఏస్ పేసర్ ముస్తఫిజుర్ రెండు ఓవర్లలోనే 25 పరుగులు ఇచ్చుకున్నాడు. ముస్తఫిజుర్ ఓవర్‌లో 4,4,6 కొట్టిన రోహిత్ ఆ వెంటనే అమీన్‌కు రెండు ఫోర్లు రుచి చూపించాడు. షఫీయుల్‌కు 4,6తో స్వాగతం పలికాడు. అవతలి ఎండ్‌లో ధవన్ కూడా రెండు ఫోర్లతో దూకుడు పెంచాడు. ఈ క్రమంలో అఫిఫ్ ఓవర్‌లో సిక్సర్‌తో రోహిత్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మొసద్దిక్ ఓవర్‌లో హిట్‌మ్యాన్ మోతెక్కించాడు. హ్యాట్రిక్ సిక్సర్లతో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. 10వ ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా తరలించిన రోహిత్.. రెండో బాల్‌ను డీప్ స్క్వేర్ దిశగా 84 మీటర్ల దూ రం బాదాడు. ఇక మూడో బంతిని లాంగాన్ ప్రేక్షకుల్లో పడేశాడు. ఈ బాదుడుకు భారత్ 10 ఓవర్లలోనే సెంచరీ మార్క్ దాటిం ది. తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించాక ధవన్ ఔటయ్యాడు. కాసేపటికే రోహిత్ కూడా పెవిలియన్ చేరినా.. సాధించాల్సిన పరుగులు ఎక్కువ లేకపోవడంతో రాహుల్ (8 నాటౌట్)తో కలిసి అయ్యర్

మిగిలిన పని పూర్తి చేశాడు.

రాజ్‌కోట్: సిరీస్ పరాజయం నుంచి బయటపడాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (43 బంతుల్లో 85; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో భారత్ అలవోకగా గెలుపొందింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. భారీ స్కోర్లకు పెట్టింది పేరైన సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా ఛేజింగ్‌కు మొగ్గుచూపాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. నయీమ్ (36; 5 ఫోర్లు), సౌమ్యా సర్కార్ (30; 2 ఫోర్లు, 1 సిక్స్), మహ్ముదుల్లా (30; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చహల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌రోహిత్ శర్మ వీరవిహారానికి ధవన్ (31; 4 ఫోర్లు), అయ్యర్ (13 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు తోడవడంతో టీమ్‌ఇండియా 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 154 పరుగులు చేసింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 ఆదివారం నాగ్‌పూర్‌లో జరుగనుంది.

chahal

దెబ్బకొట్టిన చాహల్..

అంతకుముందు ఓపెనర్లు లిటన్ దాస్ (29), మహమ్మద్ నయీమ్ బంగ్లాకు శుభారంభం అందించారు. దీపక్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో లిటన్ ఫోర్ కొడితే.. ఖలీల్ ఓవర్‌లో నయీమ్ హ్యాట్రిక్ బౌండ్రీలతో విరుచుకుపడ్డాడు. దీంత్ పవర్‌ప్లే ముగిసేసరికి బంగ్లా వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. భారత్ ఫీల్డింగ్ తప్పిదాల వల్ల ఒకటికి రెండు సార్లు బతికిపోయిన లిటన్ దాస్ చివరకు పంత్ చేసిన రనౌట్‌కు పెవిలియన్ చేరాడు. కాసేపటికే నిలకడగా ఆడుతున్న నయీమ్ కూడా ఔటయ్యాడు. అయితే బంగ్లాకు అసలు దెబ్బ మాత్రం 13వ ఓవర్‌లో పడింది. గత మ్యాచ్ హీరో ముష్ఫికర్ రహీమ్ (4)తో పాటు ధాటిగా ఆడుతున్న సౌమ్యను ఔట్ చేసిన చాహల్ భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఢిల్లీలో ముష్ఫికర్ క్యాచ్ వదిలేసి జట్టు ఓటమికి పరోక్ష కారణమైన కృనాల్ ఈసారి ఆ తప్పు జరుగకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత అఫిఫ్ (6), మొసద్దిక్ (7 నాటౌట్), అమీనుల్ (5 నాటౌట్) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. కెప్టెన్ మహ్ముదుల్లా జట్టు స్కోరును 150 మార్క్ దాటించాడు.

panth

కొంపముంచిన తొందరపాటు..

పంత్.. ధోనీని అనుకరించడానికి ప్రయత్నించొద్దు ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం గిల్‌క్రిస్ట్.. రిషబ్‌కు ఇచ్చిన సలహా ఇది. ధోనీలా చేసేందుకు చూస్తే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని హెచ్చరించాడు. తొలి టీ20లో డీఆర్‌ఎస్ తీసుకోవడంలో తన డొల్లతనాన్ని బయటపెట్టిన పంత్.. రాజ్‌కోట్‌లో మరింత అయోమయంగా కనిపించాడు. తన తొందరపాటు వల్ల అభిమానులతో పాటు జట్టు సభ్యులను కలవర పెట్టాడు. చాహల్ బంతిని ఆడేందుకు క్రీజు దాటి ముందుకొచ్చిన లిటన్ దాస్‌ను పంత్ స్టంపౌట్ చేశాడు. అంపైర్ వేలెత్తడం.. లిటన్ పెవిలియన్ బాట పట్టడం.. చకచకా జరిగిపోయాయి. అయితే ఆ బంతిని చెక్ చేసేందుకు యత్నించిన థర్డ్‌అంపైర్.. ఆఖరికి నాటౌట్ అని ప్రకటించాడు.

అసలు విషయం ఏంటం టే.. వికెట్ల వెనుక ధోనీని అనుకరించడానికి యత్నించిన రిషబ్ బంతి స్టంప్స్‌ను దాటకముందే పట్టుకోవడంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో పాటు నోబాల్ ఇచ్చాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం వికెట్ కీపర్ గ్లౌజ్‌లోని ఏ భాగమైనా వికెట్‌కంటే ముందు ఉంటే.. అది నోబాల్ కిందే లెక్క. అలాంటప్పుడు స్టంపౌట్ చేసినా దాన్ని పరిగణనలోకి తీసుకోరు. దీంతో నిరాశ చెందడం భారత్ వంతైంది. అయితే మనవాళ్ల తడబాటు అక్కడితో ఆగలేదు. తదుపరి ఓవర్‌లో లిటన్ దాస్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ వదిలేశాడు. గాల్లోకి లేచిన బంతిని పట్టుకునేందుకు ముగ్గురు ఫీల్డర్లు పరుగెత్తడంతో అయోమయానికి గురైన హిట్‌మ్యాన్ బంతిపై నియంత్రణ కోల్పోవడంతో అది కాస్త నేలపాలైంది. అయితే గాయానికి లేపనం పూసినట్లు ఆ తర్వాత రోహిత్ బ్యాటింగ్‌లో విజృంభిస్తే.. తన కారణంగానే బతికిపోయిన లిటన్‌ను డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ చేసిన పంత్.. సర్కార్‌ను స్టంపౌట్ చేసి కాస్తలో కాస్త నయం అనిపించుకున్నాడు.

భారత్ తరఫున వంద అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లోకెక్కాడు.
స్కోరు బోర్డు
బంగ్లాదేశ్: లిటన్ (రనౌట్/పంత్) 29, నయీమ్ (సి) అయ్యర్ (బి) సుందర్ 36, సర్కార్ (స్టంప్డ్) పంత్ (బి) చాహల్ 30, ముష్ఫికర్ (సి) కృనాల్ (బి) చాహల్ 4, మహ్ముదుల్లా (సి) దూబే (బి) దీపక్ 30, అఫిఫ్ (సి) రోహిత్ (బి) ఖలీల్ 6, మొసద్దిక్ (నాటౌట్) 7, అమీనుల్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 153/6. వికెట్ల పతనం: 1-60, 2-83, 3-97, 4-103, 5-128, 6-142, బౌలింగ్: దీపక్ 4-0-25-1, ఖలీల్ 4-0-44-1, సుందర్ 4-0-25-1, చాహల్ 4-0-28-2, దూబే 2-0-12-0, కృనాల్ 2-0-17-0.

భారత్: రోహిత్ (సి) (సబ్) మిథున్ (బి) అమీనుల్ 85, ధవన్ (బి) అమీనుల్ 31, రాహుల్ (నాటౌట్) 8, అయ్యర్ (నాటౌట్) 24, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 15.4 ఓవర్లలో 154/2. వికెట్ల పతనం: 1-118, 2-125, బౌలింగ్: ముస్తఫిజుర్ 3.4-0-35-0, షఫీయుల్ 2-0-23-0, అమీన్ 4-0-32-0, అమీనుల్ 4-0-29-2, అఫిఫ్ 1-0-13-0, మొసద్దిక్ 1-0-21-0.

2895

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles