ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్ టెండూల్కర్‌


Sat,July 20, 2019 01:26 AM

ranbir-sachin
మాస్టర్‌కు అరుదైన గౌరవం
లండన్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్‌కు అరుదైన గౌర వం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో మాస్టర్ బ్లాస్టర్‌కు స్థానం లభించింది. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ క్యాథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ కూడా ఇందులో చోటు దక్కించుకున్నారు. లెజండ్ అనే పదం సచిన్‌కు తక్కువే. తాజాగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆయనకు స్థానం కల్పించాంఅని ఐసీసీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీనిపై సచిన్ స్పందిస్తూ.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఆటకు విశేష సేవలందించిన వారి సరసన చేరడం ఆనందంగా ఉందిఅని పేర్కొన్నాడు.

సునీల్ గవాస్కర్, బీషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ తర్వాత హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఆరో భారత క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు. 46 ఏండ్ల టెండూల్కర్ 2013 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో 15,921, వన్డేల్లో 18,426 పరుగులు చేసిన సచిన్ ఇప్పటికీ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీల అరుదైన రికార్డు సచిన్ పేరిటే ఉంది. ఇక డొనాల్డ్ కెరీర్ మొత్తంలో 602 వికెట్లు (330 టెస్టుల్లో, 272 వన్డేల్లో) పడగొట్టగా.. ఫిట్జ్‌ప్యాట్రిక్ మహిళల క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (240) తీసిన రెండో బౌలర్‌గా గుర్తింపు సాధించడంతో పాటు కోచ్‌గా ఆసీస్ జట్టుకు మూడుసార్లు ప్రపంచకప్ అందించింది.

ఆలస్యం ఎందుకంటే..!

హాల్ ఆఫ్ ఫేమ్‌లో అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ తర్వాత క్రికెట్ దేవుడికి చాన్స్ దక్కడంపై అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఈ జాప్యానికి అసలు కారణం ఐసీసీ నిబంధనలే. ఈ జాబితాలో చోటు దక్కించుకోవాలంటే ఆటకు వీడ్కోలు పలికి కనీసం ఐదేండ్లు పూర్తి కావాలనే నిబంధన ఉండటంతో కుంబ్లే (2008లో రిటైర్డ్ అయ్యాడు), ద్రవిడ్ (2012లో రిటైర్డ్ అయ్యాడు) తర్వాత ఆలస్యంగా సచిన్‌కు ఈ గౌరవం దక్కింది.

343

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles