పంత్ పరేషాన్!


Sat,November 9, 2019 12:32 AM

రెప్పపాటులో వికెట్లను గిరాటేయడం.. క్షణకాలంలో బెయిల్స్ పడగొట్టడం.. ఎంత దూరం నుంచైనా స్టంప్స్‌ను గురిచూసి కొట్టడం.. డీఆర్‌ఎస్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడం.. బ్యాట్స్‌మన్ అడుగుల కదలికలను బట్టి ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ మార్చడం.. అవసరమైతే బౌలర్లకు సలహాలివ్వడం.. గత పదిహేనేండ్లుగా భారత అభిమానులు చూస్తూ వస్తున్న భారత వికెట్ కీపర్ ఘనతలివి. ఘనతలు అనడం కంటే మహేంద్రసింగ్ ధోనీ నిత్యకృత్యాలనడం సబబు. మరి అలాంటి ఓ దిగ్గజ ఆటగాడి స్థానంలో.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ కుర్రాడిని ఊహించుకోవడం ఎవరికైనా కష్టమే. ధోనీలా కాకున్నా కనీసం తడబాటు లేకుండా తనపని తాను చేసుకుపోయినా.. రిషబ్ పంత్‌పై పెద్దగా విమర్శలు వచ్చి ఉండేవికావు. కానీ, బ్యాటింగ్ వైఫల్యంతో పాటు వికెట్ల వెనుక ధోనీని అనుకరించాలనే అత్యుత్సాహం అతడి స్థానానికే ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నది. అడగాల్సిన సమయంలో రివ్యూ అడగకపోవడం.. అవసరం లేకున్నా డీఆర్‌ఎస్ వృథా చేయడం.. తొందరపాటుతో ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వడంలాంటి తప్పిదాలు పదేపదే చేస్తున్న పంత్.. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే అతడికి శాంసన్ నుంచి ఖో తప్పకపోవచ్చు!
rishab
రిషబ్ పంత్.. ఐపీఎల్లో మెరుపులు మెరిపించి టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్న యువ బ్యాట్స్‌మన్. పదో సీజన్‌లో చక్కటి ప్రదర్శన చేసిన పంత్‌కు జాతీయ జట్టు తరఫున తొందరగానే అవకాశం వచ్చింది. ఇంగ్లండ్‌తో సిరీస్ (2017) సందర్భంగా పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు ఎంపికైన పంత్.. మహేంద్ర సింగ్ ధోనీ విరామం తీసుకోవడంతో టీ20ల్లో అరంగ్రేటం చేశాడు. ఆ మరుసటి ఏడాది ఐపీఎల్లో వీరలెవల్లో విజృంభించడంతో పంత్ పేరు మారుమోగిపోయింది. అదే సమయంలో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడటం కూడా అతడికి కలిసొచ్చింది. ఈ దెబ్బతో టెస్టు ఫార్మాట్‌లో చోటు దక్కించుకున్న రిషబ్ అనతికాలంలోనే.. మూడు ఫార్మాట్‌లలో జట్టులో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు. ఎంతగా అంటే.. 2019 ప్రపంచకప్‌నకు నిఖార్సైన బ్యాట్స్‌మన్ కోటాలో చోటుదక్కించుకునేంతగా. ముందు ప్రకటించిన 15 మంది జట్టులో అతడి పేరు లేకున్నా.. రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన పంత్.. ఆ తర్వాత ధవన్ గాయపడటంతో మరో సీనియర్ ఆటగాడు అంబటి రాయుడును దాటి ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. అయితే మెగాటోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అతడు.. ఆ తర్వాత వరుసగా విఫలమవుతూ కొత్త సందేహాలు రేకెత్తిస్తున్నాడు.

బ్యాట్స్‌మన్‌గా విఫలం

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మిడిలార్డర్ సమస్యతో సతమతమవుతున్న టీమ్ ఇండియా నాలుగో స్థానంలో పంత్‌కు లెక్కకు మిక్కిలి అవకాశాలు ఇచ్చిందనే చెప్పాలి. అయినా వాటిని ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ పెద్దగా వినియోగించుకోలేకపోయాడు. కీలకమైన దశలో క్రీజులో అడుగుపెట్టినా.. ఆచితూచి ఆడటం మరిచి అడ్డదిడ్డమైన షాట్లతో వికెట్ సమర్పించుకోవడం అతడికి పరిపాటిగా మారిపోయింది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాదిరిగా.. ఒంటిచేత్తో షాట్లు ఆడేందుకు యత్నించి పదే పదే విఫలమవుతున్నా.. వాటి నుంచి పాఠాలు నేర్చుకోలేకపోతున్న పంత్.. ప్రపంచకప్ తర్వాత వికెట్ కీపర్‌గానూ ఆకట్టుకోలేకపోతున్నాడు. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత ధోనీ.. క్రికెట్‌కు విరామం ఇచ్చి కుటుంబంతో గడుపుతున్నాడు. ఈ తరుణంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా ప్రమోషన్ పొందిన రిషబ్ అక్కడ మరింతగా నిరాశపరుస్తున్నాడు.

కీపర్‌గానూ ఫెయిల్

ధోనీతో పోల్చడం కాదు కానీ, పంత్ కీపింగ్ ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లు లేవనేది ముమ్మాటికీ వాస్తవం. తాజా బంగ్లాదేశ్ సిరీస్ అతడి కీపింగ్ డొల్లతనాన్ని మరోసారి బయటపెట్టింది. ఢిల్లీలో జరిగిన తొలి మ్యాచ్‌లో అవసరమైన సమయంలో డీఆర్‌ఎస్‌ను వినియోగించుకోవడానికి ఆసక్తి చూపని పంత్.. ఆ తర్వాత బంతి బ్యాట్‌కు తాకకున్నా రివ్యూ కోరమని రోహిత్‌పై ఒత్తిడి తేవడం అతడి అనుభవరాహిత్యానికి నిదర్శనం. డీఆర్‌ఎస్ విషయంలో పంత్‌పై ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని కెప్టెన్ రోహిత్ సర్దిచెప్తున్నా.. రెండో మ్యాచ్‌లో అతడి కీపింగ్ చూసిన వారెవరైనా ముక్కున వేలేసుకోక మానరు. చాహల్ బౌలింగ్‌లో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ భారీ షాట్ ఆడేందుకు క్రీజు వదిలి బయటకు వచ్చాడు. ఆ సమయంలో వికెట్లకు అతి సమీపంలో నిల్చున్న పంత్ బంతిని స్టంప్స్ కంటే ముందే అందుకొని పప్పులో కాలేశాడు. వాస్తవానికి ఆ సమయంలో నిదానంగా బంతిని అందుకున్నా.. బ్యాట్స్‌మన్ తిరిగి క్రీజులోకి చేరలేకపోయేవాడనేది సత్యం. ఐపీఎల్, దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో పదుల కొద్ది మ్యాచ్‌లాడిన పంత్‌కు అంతర్జాతీయ నిబంధన గురించి అవగాహన లేదనుకోవడం పొరబాటే. అది కేవలం అతడి అత్యుత్సాహం వల్లే జరిగిందనేది మ్యాచ్ చూసిన ప్రతిఒక్కరికీ అర్థమవుతున్నది. కాసేపటికి రోహిత్ వేసిన త్రోను అందుకోలేకపోయిన రిషబ్ అదనపు పరుగుల రూపంలో ప్రత్యర్థికి మరింత బలం చేకూర్చాడు.

ఆనాటి మెరుపులేవీ?

గేమ్ చేంజర్‌అని ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌తో మన్ననలు పొందిన పంత్.. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఆ దూకుడు కనబర్చలేకపోతున్నాడు. దీనికి ఒత్తిడే ప్రధాన కారణమని చెప్పలేం. ఎందుకంటే దాదాపు ఇదే స్థాయి ఒత్తిడి ఉండే ఐపీఎల్లో అతడు ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లతో అలరించాడు. లీగ్‌లో భారత ప్లేయర్ సాధించిన అత్యధిక స్కోరు (128 నాటౌట్) కూడా రిషబ్ పేరిటే ఉంది. మరి బ్యాటింగ్, కీపింగ్‌లో విఫలమై జట్టుకు తెల్ల ఎనుగులా తయారవతున్న పంత్.. ఇదే రీతిన కొనసాగితే జట్టు నుంచి ఉద్వాసన తప్పకపోవచ్చు. ఆసీస్ దిగ్గజం గిల్‌క్రిస్ట్ చెప్పినట్లు ధోనీని అనుకరించడం మాని తనదైన ఆటతీరుతో దూసుకెళ్తేనే రిషబ్ మరింత కాలం మనగలుగుతాడు.
SANJUSAMSON

ఇక కష్టమే..

గాయం నుంచి కోలుకున్న వృద్ధిమాన్ సాహా తిరిగి జట్టులోకి రావడంతో టెస్టుల్లో పంత్ ప్లేస్ గల్లంతైంది. ఇప్పటికే బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోతున్న అతడు కీపింగ్‌లోనూ ఉసూరుమనిపిస్తుండటంతో పొట్టి ఫార్మాట్‌లోనూ ప్రత్యామ్నాయాల వైపు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే అప్పుడెప్పుడో నాలుగేండ్ల క్రితం టీమ్‌ఇండియా తరఫున ఆడిన సంజూ శాంసన్‌కు తాజాగా మళ్లీ పిలుపొచ్చింది. సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా యువ వికెట్ కీపర్లను పరీక్షిస్తామని పరోక్షంగా పంత్ స్థానానికి ఎసరుందని చెప్పకనే చెప్పాడు. మరి ఇలాంటి దశలో చిన్నపిల్లలాటలా కాకుండా పంత్ పరిణతి చూపాల్సిన అవసరం ఉంది. లేకుంటే జట్టులో స్థానం కల్లే.
ganguly
అతడు (పంత్) చక్కటి ప్లేయర్. అతడికి కాస్త సమయమివ్వండి. అంతా సర్దుకుంటుంది. పరిణతి చెందే కొద్ది ఇంకా మెరుగవుతాడు.
-సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
sangakkara
పంత్ ఒత్తిడికి గురికాకుండా పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం ముఖ్యం. ముందు తనలోని లోపాలను గుర్తించాలి. ఆ తర్వాత వాటిపై దృష్టి సారించాలి. అనవసర కంగారు వద్దు. అతడితో ఎవరైనా మాట్లాడటం మంచిది. వికెట్ల వెనుక చురుగ్గా ఉండటం ముఖ్యం. అప్పుడే రివ్యూల విషయంలో కచ్చితత్వం పెరుగుతుంది.
- సంగక్కర, శ్రీలంక మాజీ కెప్టెన్

1139

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles