బెర్తులు దక్కేదెవరికో


Mon,April 15, 2019 02:42 AM

-రాయుడు, రాహుల్, కార్తీక్, పంత్‌పైనే దృష్టంతా
-విశ్వసమరానికి టీమ్‌ఇండియా ఎంపిక నేడే

రిషబ్ పంత్‌కు చాన్సిస్తారా.. దినేశ్ కార్తీక్‌పై నమ్మకముంచుతారా! రిజర్వ్ ఓపెనర్ రాహులేనా.. లేక కొత్త ముఖాన్ని తెరపైకి తెస్తారా! నాలుగులో రాయుడుకు చోటు దక్కేనా.. లేక విజయ్ శంకర్‌తో పొగబెడతారా! అదనపు పేసర్‌గా ఎవరివైపు మొగ్గు చూపుతారు! వన్డే వరల్డ్‌కప్ ఎంపికకు ముందు సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదిలే ప్రశ్నలు ఇవి. వీటన్నింటికీ నేటితో తెరపడనుంది. వచ్చే నెల చివర్లో ఆరంభమయ్యే మహా సంగ్రామానికి నేడు భారత జట్టును ప్రకటించనున్నారు.
rishab
న్యూఢిల్లీ: నాలుగేండ్లకోసారి వచ్చే క్రికెట్ మహా సంగ్రామానికి టీమ్‌ఇండియాను ఎంపిక చేసే సమయం రానే వచ్చింది. ఒకటీ అరా మినహా ఇప్పటికే దాదాపు అన్ని బెర్తులు ఖరారైన తరుణంలో ఆ ఒక్క స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారు. ఏ కూర్పునకు మొగ్గు చూపుతారు అనే దానిపై సోమవారం ముంబై వేదికగా చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. వచ్చే నెల 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచకప్ టీమ్ సెలెక్షన్‌కు ఐసీసీ విధించిన గడువు ఈనెల 23 కాగా.. అంతకు వారం ముందుగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించనుంది. ఓపెనర్లుగా రోహిత్ , ధవన్ ఓకే అయినా.. రిజర్వ్ ఓపెనర్‌గా ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరం. రాహుల్‌కు చాన్సిస్తారా లేక అతడిని నాలుగో నంబర్ కోసం ఎంపిక చేస్తారా చూడాలి. మూడో స్థానంలో కెప్టెన్ కోహ్లీ ఉంటే.. నాలుగో నంబర్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ప్రపంచకప్ నుంచి వేధిస్తూ వస్తున్న ఈ సమస్య ఇప్పటికీ తీరలేదు. పది మందికి పైగా ప్రయత్నించినా.. వారెవరూ ఆకట్టుకోలేకపోయారు.

గతేడాది నవంబర్ వరకు నాలుగో నంబర్ రేస్‌లో ముందున్న అంబటి రాయుడు.. కెప్టెన్, కోచ్ విశ్వాసాన్ని చూరగొని కొద్దిలో కొద్ది నయం అనిపించాడు. అయితే, ఆసీస్‌తో సిరీస్‌లో పేలవంగా ఆడి మళ్లీ కొత్త చిక్కులు తెచ్చిపెట్టాడు. మరి అతడిపైనే నమ్మకముంచుతారా లేక.. ఇటీవల బ్యాట్‌తో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడిన విజయ్ శంకర్‌కు ఆ అవకాశమిస్తారా చెప్పలేం. ఆ తర్వాతి స్థానాల్లో జాదవ్, ధోనీ పక్కా. రిజర్వ్ కీపర్‌గా పాతకాపు కార్తీక్ వైపు మొగ్గుచూపుతారా, యంగ్ తరంగ్ పంత్‌కు ఓటేస్తారో చూడాలి. ఐపీఎల్ ప్రదర్శన వరల్డ్‌కప్ ఎంపికకు ప్రమాణికం కాదు అని పదే పదే చెప్తున్నా.. తాజా సీజన్‌లో పంత్ ఇప్పటి వరకు 245 పరుగులు చేస్తే.. కార్తీక్ 111 రన్స్‌తో కాస్త వెనుకబడ్డట్లే కనిపిస్తున్నాడు.
Ambati-Rayudu
కీపింగ్ నైపుణ్యాన్ని పక్కనపెడితే.. ఒకటి నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడైనా ఆడగలగడంతో పాటు లెఫ్ట్ హ్యాండర్ కావడం పంత్‌కు అదనపు బలం. ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున కీపింగ్ చేస్తున్న లోకేశ్ రాహుల్‌ను కీపర్‌గా పరిగణించి జట్టులో చేర్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే నాలుగో స్థానం కోసం అంబటి రాయుడుకు తలుపులు తెరుచుకుంటాయి. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా చోటు దక్కించుకోవడం ఖాయమే. మణికట్టు ద్వయం చాహల్, కుల్దీప్ యాదవ్ ఓకే. పేస్ విభాగంలో యార్కర్ కింగ్ బుమ్రా, భువనేశ్వర్‌తో పాటు మహమ్మద్ షమీ స్థానాలు ఖరారనట్లే. మెగా టోర్నీ ఇంగ్లండ్ గడ్డపై జరుగుతుండటంతో అదనపు పేసర్‌గా ఎవరికి అవకాశమిస్తారో చూడాలి. లెఫ్టార్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్‌కు లెక్కకు మిక్కిలి అవకాశాలు ఇచ్చినా.. అతడు వాటిని వినియోగించుకోలేకపోయాడు. ఉమేశ్‌లో నిలకడ లేదు. ఇషాంత్‌ను పరిగణించకపోవచ్చు. వీరందరినీ పక్కన పెట్టి ఐపీఎల్‌లో అదరగొడుతున్న దీపక్ చాహర్, నవదీప్ సైనీకి పిలుపువచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

జట్టు అంచనా
కోహ్లీ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధవన్, ధోనీ (వికెట్ కీపర్), జాదవ్, హార్దిక్ పాండ్యా, శంకర్, కుల్దీప్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్, షమీ, జడేజా (15వ ఆటగాడు, ఐచ్ఛికం), కార్తీక్/పంత్ (అదనపు వికెట్ కీపర్), రాహుల్/రాయుడు (స్పెషలిస్ట్ ఓపెనర్/నాలుగో స్థానం), ఉమేశ్/ఖలీల్/ఇషాంత్/సైనీ (అదనపు పేసర్).

354

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles