ఇషా సింగ్ డబుల్ గోల్డ్


Fri,November 8, 2019 02:33 AM

shooting
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్
దోహా: తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మరోమారు తళుక్కుమంది. తాను గురి పెడితే పతకం పక్కా అన్న రీతిలో చెలరేగింది. ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇషా రెండు స్వర్ణాలతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంటులో ఇషా 242.2 పాయింట్లతో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. 579 పాయింట్లతో క్వాలిఫికేషన్ పోరులో అగ్రస్థానంలో నిలిచిన ఈ 14 ఏండ్ల యువ షూటర్..ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగింది. కచ్చితమైన షాట్లతో రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ అగ్రస్థానాన నిలిచింది. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన ప్రియా రాఘవ్ (217.6)కు కాంస్య పతకం దక్కగా జియాంగ్ హ్యోకు రజతం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్‌ఈవెంట్‌లో ప్రియ, యువిక తోమర్‌తో కలిసి ఇషా పసిడి కొల్లగొట్టింది. మొత్తం 1721 పాయింట్లతో ఆసియా, ప్రపంచ జూనియర్ విభాగాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

మరోవైపు పురుషుల జూనియర్ ట్రాప్ విభాగంలో వివాన్ స్వర్ణ పతకంతో ఆకట్టుకోగా, బౌనీశ్ రజతం ఖాతాలో వేసుకున్నాడు. టీమ్ ఈవెంటులో వివాన్, బౌనీశ్, మానవాదిత్య సింగ్ రాథోడ్ త్రయం పసిడి దక్కించుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంటులో చింకీ యాదవ్ రెండో ఒలింపిక్ కోటా అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. అర్హత రౌండ్‌లో ఐదో స్థానంలో నిలువడం ద్వారా చింకీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ విభాగంలో భారత్ నుంచి రాహీ సర్నోబత్ టోక్యోకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. మహిళల జూనియర్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో భక్తీ భాస్కర్ భారత్‌కు ఐదో స్వర్ణాన్ని అందించింది. భక్తీ, ఆయూషీ పొద్దర్, నిశ్చల్ త్రయం రజతం దక్కించుకోగా, పురుషుల 50 మీటర్ల రైఫిల్ నీరజ్ కుమార్, హర్ష్‌రాజ్‌సింగ్, నితీశ్ కుమార్ త్రయం స్వర్ణం సాధించింది.

179

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles