25 బంతుల్లో సెంచరీ


Sat,March 23, 2019 01:56 AM

Will-Jacks

- సర్రే క్రికెటర్ విల్ జాక్స్ వీరవిహారం

దుబాయ్: పరుగులు పోటెత్తాయి. మైదానం చిన్నబోయేలా, బౌలర్లు చేష్టలుడిగిపోయేలా ఏమాత్రం కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ సర్రే బ్యాట్స్‌మన్ విల్ జాక్స్(30 బంతుల్లో 105) సాగించిన వీరవిహారం మాటలకు అందకుండా సాగింది. ప్రి సీజన్‌లో భాగంగా గురువారం లాంకషైర్‌తో జరిగిన టీ10 మ్యాచ్‌లో సర్రే క్రికెటర్ విల్ జాక్స్ 25 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. లాంకషైర్ బౌలర్లను ఊచకోత కోస్తూ దొరికిన బంతినల్లా వీరబాదుడు బాదుతూ జాక్స్ కొట్టిన కొట్టుడుకు మైదానంలో పరుగుల వరద పారింది. తన ఇన్నింగ్స్‌లో 11 భారీ సిక్స్‌లకు తోడు ఎనిమిది ఫోర్లతో విల్ విధ్వసం సృష్టించాడు. స్టీఫెన్ పెర్రీ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది మెరుపు శతకం చేశాడు. ఈ క్రమంలో టీ10 ఫార్మాట్‌లో అలెక్స్ హేల్స్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు(87)ను అధిగమించాడు. 14 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న ఈ యువ సర్రే క్రికెటర్..వరుస సిక్స్‌లతో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సర్రే మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో గారెత్ బట్టీ (4/21) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 81 పరుగులు చేసి 95 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌కు అధికారిక గుర్తింపు లేకపోవడంతో జాక్స్ రికార్డు చోటు దక్కించుకోలేకపోయింది. లేకపోతే 2013 ఐపీఎల్‌లో క్రిస్‌గేల్ (30 బంతుల్లో సెంచరీ) రికార్డు బద్దలయ్యేది.

383

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles