వాస్తు


Sun,September 8, 2019 01:01 AM

vasthu
వాస్తును పాటించడం వెనుకబాటుతనమా?
- మోహన్‌రెడ్డి, జనగాం
ఈ లోకంలో కన్నతల్లిని అమ్మా! అని పిలువడాన్ని కూడా వెనుకబాటు తనంగానో, అనాగరికంగానో చాలామంది అనుకుంటారు. తలకు రుమాలు కట్టుకొని సంచి పట్టుకొని పట్నంలోకి వస్తే అతడు సిటీ వాసులకు వెనుకబడ్డట్టుగానే ఉంటాడు. కానీ ఆ రైతు పండించిన అన్నమే రక్తం రూపంలో వాళ్ల కండ్లలో ప్రహహిస్తుంది అనేది గుర్తించరు. ఆపదలో అర్ధరాత్రి తలుపుకొడితే తీసే ధైర్యం ఈ నాగరికులకు లేకున్నా దిక్కుమాలిన వాదనలు మూలాలు తెలుసుకోకుండా కుప్పిగంతులు వేసేవాళ్లు అంతటా ఉంటారు. శాస్ర్తాలు వాళ్ల కోసం పుట్టలేదు. వాళ్లు పాటిస్తేనే అవి బతుకుతాయి అనే ఆవశ్యకత లేదు. నదుల నీరు వాడుకుంటే కాళేశ్వరం అయింది. వదులుకుంటే సముద్రపు ఉప్పునీరు అవుతుంది. శాస్త్ర ప్రవాహాలు ఈ దేశంలో అనాదిగా సాగుతూనే ఉన్నాయి. వాటిని వాడుకుని, వేడుక చేసుకున్న తరాలు ఎన్నో ఈ దేశ చరిత్రలో ఖ్యాతి గడించాయి.

సెల్‌ వాడడం రాని వాళ్లంతా వెనుకబడ్డ వాళ్లు, పంచెకట్టుకున్న వాళ్లంతా పనికిరాని వాళ్లు అనుకోవడం తప్పు. వ్యాసుడు, వాల్మీకి ప్యాంట్లు వేయలేదు. కొన్ని విద్యలు నేర్పేవాళ్లు, కొన్ని అద్భుత నిగూఢ శాస్ర్తాలు అధ్యయనం చేసినవాళ్లు ఇప్పటికే అక్కడక్కడా బతికే ఉన్నారు. వాళ్లు మానవ సమాజానికి మంచి చేయాలని చూస్తారు తప్ప వాళ్లకు వ్యక్తిగత స్వార్థం ఉండదు. పక్షికి గూడుకట్టే విధానం ఎవరు నేర్పారు? అది ఏ ఇంజినీరింగు చేసింది? నెమలి ఏ నాట్యశాలలో నాట్యం నేర్చుకుంది. చూసే కళ్లుంటే చాలదు? లోతైన అధ్యయనం ఉండాలి పడగొట్టేది వాస్తు అని అందరూ ఏకరువు పెడుతారు. అది కొందరి అజ్ఞానం వల్ల వ్యాప్తి అయింది. శాస్ర్తాలు అంటేనే వాటికి ప్రత్యేక అనుసరణ యోగ్యత ఉన్నట్టు. మునక వేస్తే కాని లోతులు తెలియవు శాస్ర్తాలలో..

వాగు దగ్గరలో ఇల్లు కట్టుకోవచ్చా?


- పి. శ్రవణ్‌కుమార్‌, బోయిన్‌పల్లి
నీటి ప్రవాహం మనసును మిక్కిలి ఆహ్లాదపరుస్తుంది. కారణం నీరు - మనసు ఎప్పుడు పరుగెత్తేవే కాబట్టి. జలపాతాల వద్ద, నదీ ప్రవాహాల వద్ద ఇల్లు కట్టుకోవచ్చు. అయితే అవి మన ఇంటికి ఉత్తరం లేదా తూర్పులో ఉండాలి. పరిధి తప్పక పాటించాలి. కంటిచూపు, ఇంటిచూపు, తూర్పునకు అభిముఖంగా ఉంటే ఆ గృహం సదా వర్ధిల్లుతుంది. జలపాతం కొండ అంచు ఆధారంగా కొనసాగుతుంది. దానికి దగ్గరలో కాకుండా దూరంగా గృహం కట్టాలి. నదులు, వాగులు, వంకలు, పెద్ద కాలువలు వాటి ప్రవాహ వేగానికి, ఉధృతికి దూరంగా పటిష్ఠంగా ప్రమాదరహితంగా కట్టుకోవాలి. ఇల్లు అందాల లోగిలితో పాటు ఆరోగ్య, ఐశ్వర్య జ్ఞాన గృహంగా నిలుపడం శాస్త్ర అద్భుతం అవుతుంది. గృహం భోగనిలయం కావద్దు, ఎప్పుడూ యోగ నిలయం కావాలి.

తూర్పులో పోర్టికో ఉంది. దానిని తొలగించాలంటున్నారు. నిజమా?


- పాపినేని శివరామ్‌, బొంగులూరు
తూర్పు పోర్టికో దోషం కాదు. తూర్పులోని పోర్టికో ఇంటిని అంటుకొని కేవలం కారు దిగే మందం వేయడం తప్పు. అందరూ ఎలివేషన్‌ కోసమో, నీడ కోసమో తక్కువ వెడల్పుతో వేస్తారు. పోర్టికో అని ఇప్పుడు అంటున్నాం కార్లులేని కాలం నుండే మన దేశంలో పల్లెటూర్లలో ఇంటి ముందు వరండాలు, వసారాలు అనే పేరుతో పందిర్లు వేసేవారు. అయితే వాటిని ఇల్లు ఎంత వెడల్పు ఉంటే అంత వెడుల్పు వేయాలి. కేవలం దర్వాజ ముందు వేసి వదిలేయవద్దు. మీరు మీ పోర్టికోను మీ ఇంటి వెడల్పు వరకు విస్తరింప చేయండి. తద్వారా ఇంటికి సమతుల్యత ఏర్పడుతుంది. తూర్పులో చిన్న పోర్టికో వేయడం వల్ల తూర్పు కప్పు అవుతుంది. కాబట్టి దోషం. దానినే తూర్పు బరువు అని కూడా అంటారు.

మా ఇంట్లో అందరికీ జబ్బులు వస్తున్నాయి. కారణం ఇల్లేనా? ఏ దోషాలు ఉంటాయి?


- ఆదిలక్ష్మి, చేర్యాల
ఇల్లు - రోగాలు అనేది శాస్త్రంలో మూల విషయం. ఇల్లు చీకటిమయంగా చేసుకోవడం ఇల్లురోగ నిలయంగా మారడానికి కారణం అవుతుంది. చుట్టు లెక్క ప్రకారం మంచి ఖాళీ వదలక ఇరుకు ఇల్లు కట్టడం కేవలం ఓ కప్పు నాలుగు గోడలు ఉన్నంత మాత్రాన అది గృహం అనిపించుకోదు. ఉండాలనిపించే ఇల్లు కట్టాలి. తలదాచుకునేది ఇల్లు కాదు. ప్రధానంగా నైరుతి కాలువ, తూర్పు కప్పు, ఉత్తరం హద్దుమీద ఇంటి నిర్మాణం చేయడం కిచెన్‌ డార్క్‌గా ఉండి వెంటిలేషన్‌ లేకపోవడం, నిరంతరం సహజ వాతావరణం లేకుండా ఏసీలల్లో గడపడం రోగాలకు కారణం అవుతుంది. పొద్దంతా లైటు వాడకుండా పేపర్‌ చదివే గాలి వెలుతురు ప్రతి గదిలో అవకాశం ఉందా మీ ఇంట్లో చూడండి. లేదంటే మార్చండి. లేదా ఇల్లు మారండి.
SUDHHALA
-సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

188
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles