పద్య రత్నాలు-18


Sun,September 8, 2019 01:04 AM

గొప్పవారి గంభీరత


gelachi
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికివాగు పాఱు మ్రోతతోడ పెద్ద పిన్న తనము పేరిమి యీలాగు విశ్వదాభిరామ వినురవేమ!
- వేమన శతకం
తాత్పర్యం:గొప్పవారి గంభీరతను తెలిపే నీతిపద్యమిది. గంగానది ప్రవాహంలో పెద్దగా హడావుడి వుండదు. కానీ, మురికికాల్వ మాత్రం చప్పుళ్ల మోతతో ప్రవహిస్తుంటుంది. ఇదే మాదిరిగా పెద్ద-చిన్నల మధ్య తారతమ్యాలు కూడా ఉంటాయి. పెద్దవారిలో అనుభవం వల్ల ఆర్భాటాలు పెద్దగా కనిపించవు. కానీ, పిన్న వయస్కుల్లో అదే లోపిస్తుంది.
-ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్‌ నంబర్‌లో తెలియజేయండి.

పతితపావనా, బ్రోవవయ్యా!


Pathitha-pavana
పుండరీకాక్ష! నా రెండు కన్నులనిండ నిన్ను జూచెడి భాగ్యమెన్నడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్య పాపకర్ముని కంటబడక పోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె వసుధలో బతితపావనుడ వీవంచు నేబుణ్యవంతుల నోట బొగడవింటి
నేమిటికి విస్తరించె నీకింత కీర్తి?
ద్రోహినైనను నాకీవు దొరకరాదె?
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- నరసింహ శతకం
తాత్పర్యం:
రెండు కండ్లనిండా నిన్ను చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ! నిండైన నా మనోవాంఛ తీరేలా సొగసైన నీ రూపాన్ని చూపించు. పాపకర్మలు చేసే వారికంట పడకూడదని తీర్మానించుకున్నావా? సృష్టిలో పతిత పావనుడవు నీవేనని పుణ్యాత్ములంతా నిన్నే పొగడుతారు కదా! నీకింత కీర్తి ఎలా వచ్చెనయ్యా! ఇకనైనా నను బ్రోవవయ్యా నారసింహా!!

పాలకుడు సమర్థుడైతేనే..!


Palakudu
భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర
జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై
యోపిన ద్రోణభీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగలవారు భాస్కరా!!
- భాస్కర శతకం
తాత్పర్యం:పాలకుడు సమర్థుడు కాకపోతే ప్రజలకు మేలు జరగదు. మహాభారతంలో కౌరవులవైపు అతిరథ మహారథులైన ద్రోణ, భీష్మ, కృపాచార్యుల వంటి వారెందరో ఉన్నారు. అయినా, ఏం లాభం? ప్రభువు దుర్యోధనుడి బుద్ధిలోనే ఉంది కదా అసలు లోపం. మంత్రులు, ప్రధానులు ఎంత ప్రజ్ఞాదురంధరులైతేనేం, పాలకుడు సమర్థుడైనప్పుడే కార్యాలు చెల్లుతాయి.

వారే దైవ బాంధవులు


daiva
నీపై కావ్యము జెప్పుచున్న యతడు న్నీ పద్యముల్‌ వ్రాసి యి
మ్మాపాఠం బొనరింతునన్న యతడున్‌, మంజు ప్రబంధంబు ని
ష్టాపూర్తిం బఠియించుచుకున్న యతడున్‌ సద్బాంధవుల్‌ గాక, ఛీ
ఛీ! పృష్ఠాగల బాంధవంబు నిజమా! శ్రీకాళహస్తీశ్వరా!
- కాళహస్తీశ్వర శతకం
తాత్పర్యం: భక్తి ప్రపత్తులున్న వారే దైవ బాంధవులు. పుట్టుకతో వచ్చే బంధుత్వాల కన్నా భగవంతునిపట్ల విశ్వాసం గల వారందరిలోని భావ బంధుత్వం ఎంతో గొప్పది. దేవునిపై కావ్యాలు చెబుతూ, పద్యాలు రాస్తూ, మహిమలను వల్లిస్తూ ఉండేవారు, పని కట్టుకొని ప్రబంధాలను మనోహరంగా నియమనిష్ఠలతో పఠించేవారు అసలైన పరమాత్మ బంధువులు.

141
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles