దురాలోచన


Sun,September 8, 2019 01:25 AM

Crime-story
శరభయ్య వడ్డీ వ్యాపారి. అతని తండ్రి కూడా అదే పని చేసేవాడు. తండ్రి వ్యాపారంలో బాగా సంపాదించి పెద్ద మేడ కట్టాడు. ఆ మేడ ముందు ఒక తోట కొన్నాడు. ఇంటి నుండి తోటలోకి దారి ఉంది. ఆ తోటలో ఒక రావిచెట్టు ఉంది. ఆ రావి చెట్టు చుట్టూ పెద్ద అరుగు ఉంది. శరభయ్య వ్యాపార వ్యవహారాలన్నీ అక్కడే నిర్వహించేవాడు. అక్కడికి జనమంతా వచ్చేవాళ్ళు. వడ్డీ డబ్బులు తెచ్చిచ్చేవాళ్ళు. వస్తువులు తాకట్టుబెట్టేవాళ్లు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేక ఏమైనా సామానులు తెచ్చి ఇచ్చేవాళ్లు ఉండేవాళ్ళు.శరభయ్య ఉదయాన్నే స్నాన సంధ్యాదులు ముగించుకుని ఉపాహారం సేవించి రాతకోతల పుస్తకాలన్నీ తోటలోని అరుగు దగ్గరికే తీసుకొచ్చేవాడు. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఆదాయ వ్యయాలు చూసుకొని మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి కాసేపు కునుకుతీసి మళ్ళీ నాలుగు గంటలకు తోటలోకి వచ్చేవాడు. యథావిధిగా పనులు చేసేవాడు. ఈ క్రమంలో అతను ఇంట్లో ఉండడం కన్నా తోటలో ఉండడానికే ఇష్టపడేవాడు. పచ్చని చెట్లు, పిట్టల కిలకిలా రావాలు సువిశాల ఆకాశం, చల్లని గాలి అతనికి ఉల్లాసం కలిగించేవి.అట్లా అని అతను ప్రకృతి ప్రియుడేమీ కాదు. డబ్బు దగ్గర కచ్చితంగా కరాఖండీగా ఉండేవాడు. ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసేవాడు. నిర్దయగానూ ఉండేవాడు.

సోమయ్య అనే రైతు డబ్బులు అవసరమై ఏదైనా కుదువ పెడుదామనుకున్నాడు. కానీ, అతని దగ్గర ఏమీ లేదు. అతనికి ఉన్నది ఒకే ఒక ఎద్దు. తప్పనిసరై ఆ ఎద్దును శరభయ్య దగ్గర పెట్టి తను డబ్బు తిరిగి ఇచ్చిన తరువాత దాన్ని తీసుకుపోతానని అన్నాడు. వడ్డీ కూడా క్రమం తప్పక చెల్లిస్తానన్నాడు. అట్లా వచ్చిన ఎద్దును శరభయ్య అరుగుకు ఎదురుగా కట్టేశాడు. ఆ ఎద్దు తెల్లనిది. ముచ్చటయింది. మూడు నెలలుగా అది అక్కడే ఉంది. దాని కళ్ళు, ఒళ్ళు అంతా నిత్యం పరిశీలనగా శరభయ్య చూసేవాడు.ప్రత్యేకించి దాని కొమ్ముల్ని ఆశ్చర్యంగా చూసేవాడు. ఆ కొమ్ములు ద్వారంగా ఉండేవి. ఆ రెండూ వొంపు తిరిగి ఒకదాన్ని ఒకటి తాకుతూ ఒక అందమైన ద్వార తోరణంలా ఆకర్షణీయంగా ఉండేవి. ఎప్పుడూ ఆ కొమ్ములు కొసదేరి కలిసిన చోటును చూసి ఆ కొమ్ముల గుండా తన తలను పెడితే ఆ సందులో అతని తల చక్కగా ఒదిగిపోతుందనుకునేవాడు. తన తల అక్కడ దూర్చాలా వద్దా అని నిత్యం సంశయిస్తూ గడిపేవాడు. అట్లాగే మూడు నెలలు గడిచిపోయాయి.

సోమయ్య వడ్డీ కూడా ఇవ్వలేదు. ఇక అసలు ఏమిస్తాడు ఎద్దు తనదే అని శరభయ్యకు భరోసా కలిగింది. అయితే ఒకరోజు ‘వడ్డీ అసలు సాయంత్రానికి తెచ్చిస్తాను. నా ఎద్దును నాకివ్వమని’ సోమయ్య కబురు పంపాడు.
అప్పుడు శరభయ్యకు నిత్యం తన ముందు ఉండే ఎద్దు మాయమవుతుందని దిగులు పట్టుకుంది. చివరిసారిగా ఇన్నాళ్ళూ ఊహల్లో ఉన్న ఆలోచనల్ని ఆచరణలో పెట్టాలని నిర్ణయానికి వచ్చాడు. ఎద్దు వీపు మీద ఎక్కి కొమ్ముల మధ్య తలదూర్చాడు. తల దూర్చాడు కానీ వెనక్కి తీసుకుందామంటే వీలు పడలేదు. గుంజుకున్నాడు. ఎద్దు బెదిరి తాడు తెంపుకొని పరిగెత్తింది. తలకొమ్ముల మధ్య చిక్కుకొని శరభయ్య గిలగిలలాడాడు.
చాలా దూరం వెళ్ళాక జనం చుట్టుముట్టి ఎద్దును పట్టుకొని అతికష్టం మీద శరభయ్య తలను కొమ్ముల మధ్య నుండి బయటికి లాగారు.
ఒళ్ళంతా హూనమై గాయాలతో మంచమెక్కి మూడు నెలలు గడిపాడు. కోలుకున్నాక ఇరుగుపొరుగు ‘నువ్వు దాని కొమ్ముల్లో తలదూర్చడానికి ముందు ఒకసారి ఆలోచించాల్సింది’ అన్నారు.
శరభయ్య ‘ఒక్కసారి ఏమిటి? కనీసం మూడు నెలలపాటు ఎద్దును చూస్తూ వందసార్లు ఆలోచించాను’ అన్నాడు.జనాలకు అర్థం కాక వింతగా చూశారు!
-సౌభాగ్య
-ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177
వాట్సప్‌ నంబర్‌లో తెలియజేయండి.

235
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles