20 దేశాలకు సేవలు!


Sun,September 15, 2019 01:00 AM

చేసే పనేదైనా ఆసక్తి ఉండాలి. రాణించాలనే తపన ఉండాలి. ఏ రంగమైనా కావచ్చు. కష్టపడితేనే కష్టం ఇష్టంగా మారుతుంది.. ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. కేరళకు చెందిన మహ్మద్ జవాద్ ఇదే చేశాడు. కష్టాల నుంచి పాఠాలు నేర్చుకొని.. ఉన్నతంగా ఎదిగి ఇప్పుడు వేలమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఆన్‌లైన్ సొల్యూషన్స్ కంపెనీ స్థాపించి 21 ఏండ్లకే కోటీశ్వరుడు అయ్యాడు.
BIG-SIZE-JAWAD

గూగుల్ పెట్టిన పేరు

జవాద్ తండ్రి దుబాయ్‌లోని బ్యాంక్‌లో ఉద్యోగం చేసేవాడు. ఓసారి కొడుక్కి అతను బహుమతిగా కంప్యూటర్ ఇచ్చాడు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పెట్టించడంతో జవాద్ తరుచూ ఏదో సెర్చ్ చేస్తుండేవాడు. అప్పుడు జవాద్ పదో తరగతి. చదువుకు సంబంధించిన ఏదైనా సమాచారం దొరుకుతుందేమో అని వెతికే క్రమంలో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనే ఫ్రెండ్స్ సూచన గుర్తుకొచ్చింది. అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు గూగుల్ tnmjawadగా పెట్టుకోవచ్చనే సజెషన్ ఇచ్చింది. అతనికది నచ్చడంతో మెయిల్ ఐడీ tnmjawadగానే పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో కూడా టీఎన్‌ఎమ్ జవాద్‌గానే పిలవడం మొదలైంది.

టీఎన్‌ఎమ్‌పేరుతో కంపెనీ

చదువుకునే సమయంలోనే వెబ్‌సైట్ల పనితీరుపై అవగాహన ఏర్పరచుకున్న జవాద్ వెబ్‌డిజైనింగ్.. ఆన్‌లైన్ సొల్యూషన్స్.. ఈ కామర్స్ గురించి అధ్యయనం చేశాడు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించేవాడు. పదో తరగతి పూర్తికాకముందే వెబ్‌సైట్లు రూపొందించడం మొదలుపెట్టాడు. మంచి ఆదరణ లభించడంతో మరో ఇద్దరు మిత్రులను కలుపుకొని టీఎన్‌ఎమ్ పేరుతో చిన్నపాటి కంపెనీ పెట్టాడు. కంపెనీ ద్వారా జవాద్ తొలి సంపాదన రూ.2,500. స్కూలేజ్‌లోనే పేరెంట్స్‌పై ఆధారపడకుండా వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉండటంతో ఇక అక్కడే ఆగిపోవద్దు అనుకున్నాడతను. కంపెనీని విస్తృతం చేశాడు.

భయపడ్డ తల్లిదండ్రులు

తల్లిదండ్రులకు భయమేసింది. చదువుకోమంటే ఏదేదో చేస్తున్నాడు.. కంప్యూటర్ ఇప్పించి తప్పు చేశామా అని బాధపడ్డారు. తాను చేసే పని గురించి.. వస్తున్న ఆదాయం గురించి.. భవిష్యత్ గురించి పేరెంట్స్‌కు అర్థమయ్యేట్లు వివరించాడు జవాద్. టీఎన్‌ఎమ్ ఆన్‌లైన్ సొల్యూషన్స్ వెబ్‌డిజైనింగ్ సంస్థను స్థాపించి కేవలం వెయ్యి రూపాయలకే వెబ్‌సైట్లను రూపొందించేవాడు. నెలకు రెండు.. మూడు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. దీంతో ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి జవాద్ తల్లి బంగారు గాజులు తాకట్టు పెట్టాల్సి వచ్చింది.
TNM-Online-Solutions

లోపం గ్రహించాడు

వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నా సమస్యలెందుకు వస్తున్నాయి? లోపం ఎక్కడుంది? అని ఆలోచనలో పడ్డాడు జవాద్. మార్కెట్‌కు తగినట్టుగా తాము మారకపోవడమే లోపం అని గ్రహించి ట్రెండ్‌కు అనుగుణంగా వెళ్లడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ైక్లెంట్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. చాలా సంస్థలు జవాద్ అందించే సేవలతో మంచి సంపాదనలో పడ్డాయి. నూతన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు ఏర్పాటు చేసిన యస్ కేరళ సమ్మిట్‌లో జవాద్‌కు పాల్గొనే అవకాశం వచ్చింది. అది బాగా కలిసొచ్చింది అతడికి. టీఎన్‌ఎమ్ కంపెనీ గురించి పెద్ద సంస్థలకు తెలిసేలా జవాద్ ప్రసంగించాడు. డిజైనింగ్ కోసం కంపెనీలు అతడి దగ్గరకు క్యూ కట్టాయి. లాభాలు ఆశించిన స్థాయిని మించిపోయాయి. ఇప్పుడు అతని సంపాదన సంవత్సరానికి రూ.2 కోట్లు. చిన్నవయసులోనే సౌకర్యవంతమైన ఇల్లు కట్టుకున్నాడు. ఖరీదైన బీఎండబ్ల్యూ కారు తీసుకున్నాడు.

21 ఏండ్ల కోటీశ్వరుడు

TNMJawad-copy
అన్నీ ఉన్నాయి కదా అని ఆగిపోలేదు జవాద్. వెబ్ ప్రపంచానికి కీలకమైన సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్(ఎస్‌ఈవో) రంగంలోకి తన సేవలను విస్తరించాడు జవాద్. అక్కడ కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు. యూఏఈ, బిస్టౌడ్ సంయుక్తంగా ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక డా. రామ్ బుక్సానీ అవార్డును జవాద్ అందుకున్నాడు. ప్రస్తుతం వెబ్ డిజైనింగ్, యాప్ డెవలప్మెంట్, ఈ-కామర్స్ రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు సేవలందిస్తున్నాడు. టీఎన్‌ఎమ్ అకాడమీని స్థాపించి ఆసక్తి ఉన్న వారికి వెబ్‌డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాడు. చేసే పనేదైనా ఆసక్తి ఉంటే.. రాణించాలనే తపన ఉంటే గొప్ప విజయాలు సాధించవచ్చని నిరూపించాడు ఈ 21 ఏండ్ల కోటీశ్వరుడు.

243
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles