సోమశిలను చుట్టేద్దాం


Sun,September 15, 2019 01:06 AM

పర్యాటకరంగంలో సోమశిల ఎకోటూరిజం కొత్త పుంతలు తొక్కుతున్నది. లాంచీలో కృష్ణమ్మ ఒంపుసొంపుల నడుమ పయనిస్తూ నది అందాలను తిలకించే అపూర్వ దృశ్యం ఈ పర్యటనలో సాక్షాత్కరిస్తుంది. హైదరాబాద్ నుంచి 155 కిలోమీటర్ల దూరంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రవేశించే కృష్ణానది ముఖద్వారంగా సోమశిల గ్రామం ఉంది. ఎంతో ఎత్తయిన కొండపై ఈ గ్రామం ఉంది. ఇక్కడి నుంచి చూస్తే నిండైన నీటితో, ఎత్తయినకొండలతో, పచ్చికబయళ్లతో కృష్ణానది కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కర్నూలులో ఉన్న శ్రీశైలం ఆలయానికి 60కిలోమీటర్లు పడవలో ప్రయాణం అత్యద్భుతంగా సాగుతుంది. ఎత్తయిన కొండల మీదుగా శ్రీశైలం వెళ్లడానికి రెండున్నరనుంచి మూడు గంటలు పడుతుంది. ఈ 60 కిలోమీటర్ల ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రయాణంలో ఎన్నో దేవాలయాలనూ దర్శించుకోవచ్చు.
somasila
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు సోమశిల. నల్లమల అందాలు, కృష్ణానది హొయలతో కూడుకున్న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిల పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. కృష్ణానది గలగలలు, నది మధ్యలో ద్వీపాలు, లాంచీలో ప్రయాణం. చారిత్రక, ఆధ్యాత్మిక , పర్యాటక రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది సోమశిల. లాంచీలో ప్రయాణిస్తూ కృష్ణానది అందాలను చూడటం గొప్ప అనుభూతి. పర్యాటకులకు సూర్యోదయం సూర్యాస్తమయం లాంటి సమయాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం లభిస్తుంది. సప్తనదుల సంగమం, పంచేశ్వరాలు ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు. పాత, కొత్త రాతియుగం నాటి కట్టడాలతోపాటు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పిలువబడే లలితా సోమేశ్వరాలయం సోమశిలలో కొలువు దీరింది. పాపికొండల అందాలను తలపిస్తున్న సోమశిల గొప్ప టూరిజం స్పాట్‌గా పర్యాటకులను ఆకట్టుకుంటున్నది.

లాంచీ ప్రయాణం

సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో ప్రయాణించడానికి తెలంగాణ పర్యాటకశాఖ లాంచీని ప్రారంభించింది. ఈ పర్యాటనలో అరుదైన ప్రాంతాలు, అద్భుత దృశ్యాలతోపాటు విశ్రాంతి కోసం సోమశిలలో పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన కాటేజీలు ఎంతగానో ఆకర్షిస్తాయి. మధ్యలో అమరగిరి సమీపంలో జొన్నల రాశి, బోడుగట్టు, అమరగిరి ద్వీపాలు, చీమల తిప్ప, ఆంకాళమ్మకోట, చుక్కల గుండెం, అక్కమహాదేవి గుహలు, పాతాళగంగ వంటి ఎన్నో చూడదగ్గ ప్రాంతాలు ఈ ప్రయాణంలో మనల్ని పలకరిస్తాయి.

somasila4

సప్తనదుల సంగమం

సోమశిల సమీపంలో శ్రీలలితాంబిక సోమేశ్వర, వేంకటేశ్వర ఆలయాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌లో కృష్ణా పుష్కరాల సందర్భంలో ఏర్పాటు చేసిన ఘాట్లు ఇప్పుడు భక్తులకు స్నానపు ఘాట్లుగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక్కడి సోమశిల ఘాట్‌లో భక్తులు నిత్యం స్నానాలు చేస్తుంటారు. ఇక్కడే పురాతన చరిత్రగల సోమేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి రోజూ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సోమశిలకు దగ్గరలోనే కృష్ట, తుంగ, భద్ర, వేణి, భీమరతి, మలాప హరిణి, భవవాశిని అనే ఏడు నదులు కలిసి ప్రవహించేవని స్థానికులు నమ్ముతారు. ఈ ఏడు నదులు కలిసి ప్రవహించే ప్రదేశాన్ని సప్తనదుల సంగమంగా పిలుస్తారు. వేసవికాలంలో నీటి ప్రవాహం లేని సమయంలో ఇక్కడి భీమలింగం, వేయిలింగాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం జలాశయం నిర్మాణానికి ముందు ఆలయాలు కృష్ణానది సమీపంలో ఉండేవి. ఇవి 11వ శతాబ్దానికి చెందినవిగా చెబుతారు. ప్రాజెక్టు నిర్మిస్తే దేవాలయాలు ముంపునకు గురవుతాయని గుర్తించిన అధికారులు.. వీటిని సోమశిలలో పునర్నిర్మించారు. పాత ఆలయాలను తొలగించే సమయంలో రాళ్లకు క్రమసంఖ్యలు వేసి.. అదే నమూనాలో వీటిని నిర్మించారని చెబుతారు. సోమేశ్వర ఆలయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలు చూడవచ్చు.

ఆంకాళమ్మ కోట

లాంచీ నది తీరం వెంబడి ఉన్న అమరగిరి ప్రాంతంలో రాజుల కాలంలో నిర్మించిన మల్లయ్య సెల శివుని గుడి ఉంటుంది. దానికి దగ్గర్లో కోతి గుండు, అక్కడి నుండి కొద్దిదూరం ప్రయాణిస్తే చీమలతిప్ప అనే చిన్న ద్వీపం ఉంటుంది. పక్కనే కొండపై మత్య్సకారులు, మరోవైపు చెంచుల గుడిసెలు కన్పిస్తాయి.చీమలతిప్ప పక్కనే ఉన్న సమీప గట్టుపై పురాతన చరిత్ర గల ఆదిశక్తిగా వెలిసిన అంకాళమ్మ కోటను చూడవచ్చు.పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం, శివుని గడ్డ, దత్తపాదుకలు, పంచగోటి ఐల్యాండ్, నీరుగంగ దృశ్యమాలిక, రవ్వలగుంట లాంటి ప్రాంతాలను దర్శించవచ్చు.

ఉమామహేశ్వర ఆలయం...

ఉమామహేశ్వర క్షేత్రం మాహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు దగ్గరలో నల్లమల కొండల్లో వెలిసింది. క్రీస్తు శకం 1,232 లో కాకతీయులు నిర్మించిన ఈ ఆలయం నేటికీ విరాజిల్లుతున్నది. పర్వత సిగలో ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో నిండి ఉంటుంది. శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రం నల్లమలలోనే ఉంది. ఈ కొండపై ఐదు నీటి ధారలు ఒకేచోట ప్రవహించడం ఒక వింత. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతిచోట శివలింగాలు దర్శనమిస్తాయి. ఆలయం పక్కనే ఉండే మర్రిచెట్టు శివునికి గొడుగు పట్టినట్టు ఉంటుంది. ఈ ఆలయానికి 600 మెట్లు ఉంటాయి. దాంతో పాటు ఇరుకైన రోడ్డు మార్గంలో గుండె జల్లుమనే లోయలను దాటుకొని ప్రయాణించాలి.

somasila2

రామతీర్థం, చుక్కల గుండం

కొల్లాపూర్ నుంచి పెంట్లవెల్లికి 7 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి మంచాలకట్ట ఆరు కిలోమీటర్ల దూరంలో రామతీర్థం ఉంటుంది. అయితే ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నడుస్తాయి. నది ఒడ్డున అతి పురాతనమైన రామ తీర్థాలయం దర్శనమిస్తుంది. ఆ పక్కనే అందమైన నీటి కొలను వుంది. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఆలయానికి అర కిలోమీటర్ దూరంలో కష్ణానది ఒడ్డున పుష్కరఘాట్ నిర్మించారు. లాంచీలో నది దాటిన తర్వాత చుక్కల గుండం ఉంటుంది. నదికి రెండు వైపులా కొండలపై చెట్లు కమ్మేసి ఆకాశం కన్పించదు. చీకటిగా ఉంటూ ఆకాశం అక్కడక్కడ చుక్కల్లా కన్పిస్తుంది.అందుకే ఆ ప్రాంతాన్ని చుక్కలగుండం అని పిలుస్తారు.

కొల్లాపూర్‌లో దర్శనీయ ప్రాంతాలు

కొల్లాపూర్‌లోని సురభి రాజుల బంగ్లా, పెద్దతోట బంగ్లా, పురాతన మాధవస్వామి దేవాలయం, ఎల్లూరు గ్రామంలోని మహాత్మాగాంధీ ఎత్తిపోతల ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, జటప్రోలులోని మదన గోపాలస్వామి ఆలయం, మూక గుడులు, వెయ్యి ఏండ్ల నాటి జటప్రోల్ సురభి సంస్థాన రాజుల కోట శిథిలాలు, ప్రవేశద్వారం, సింగోటం గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం, శ్రీవారి సముద్రం, రత్నగిరి కొండపై వెలిసిన లక్ష్మీదేవమ్మ ఆలయం సందర్శించదగ్గ ప్రదేశాలు. పర్యాటకుల కోసం జటప్రోలులో హరిత హోటల్ ఏర్పాటుచేశారు. చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సోమశిల పర్యాటకులకు అందాలను చూడ టం గొప్ప అనుభూతి. పర్యాటకులకు సూర్యోదయం సూర్యాస్తమయం లాంటి సమయాల్లో ప్రకృతి అందాలను ఆస్వాధించే అరుదైన అవకాశం లభిస్తుంది. సోమశిల ప్రాంతాన్ని సందర్శించడానికి హైదరాబాద్, కర్నూలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు

ఇలా వెళ్లండి

హైదరాబాద్ నుంచి సోమశిల సుమారు 175 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ముందుగా కొల్లాపూరుకు వెళ్లాలి. అక్కడి నుంచి బస్సులు, ఆటోల్లో సోమశిల చేరుకోవచ్చు. లేదా కర్నూలు నుంచి వనపర్తి మీదుగా సోమశిలకు వెళ్లవచ్చు. మహబూబ్‌నగర్ నుంచి కొల్లాపూర్ మీదుగా సోమశిల చేరుకోవచ్చు. పర్యాటకశాఖ నిర్వహిస్తున్న హోటల్లో బస, భోజన వసతి లభిస్తుంది.

somasila3

అక్కమహాదేవి గుహలు

శ్రీశైలం నుంచి 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న అక్క మహాదేవి గుహలు ప్రత్యేక ఆకర్షణ. లాంచీలో వెళితే ఇక్కడ కొంత సేపు ఆపుతారు. ఈ గుహల్లో శివుడు ధ్యానం చేసినట్టు ప్రతీతి. నల్లమల అడవుల్లో సహజ సిద్ధంగా వెలసిన అక్కమహాదేవి గుహలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ప్రకృతి సౌందర్యం, క్షేత్రపురాణం ఈ గుహలకు ఖ్యాతిని తెచ్చిపెడుతున్నాయి. 12 వ శతాబ్దంలో కర్నాటకకు చెందిన అక్కమహాదేవి శ్రీశైలం వచ్చి పరమశివుని కోసం కఠోర తపస్సు చేసిందట. భక్తురాలి తపస్సుకు మెచ్చిన మల్లన్న అక్కమహాదేవి తపస్సు చేసిన చోటే స్వయంభూలింగంగా వెలిసినాడని పురాణాలు చెబుతున్నాయి. కేవలం ఒక మనిషి మాత్రమే పట్టే విధంగా ఈ సొరంగం ఉంది. ప్రతి ఏటా శ్రీశైలం బ్రహ్మోత్సోవాల సమయంలో ఎకో టూరిజం వాళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శ్రీశైలం నుంచి పాతాళ గంగ వరకు రోప్ వే తో పాటు గుహల వద్దకు ప్రత్యేకంగా బోట్లను కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుండి బయల్దేరి శ్రీశైలం చేరుకుంటే పర్యాటకులకు రాత్రి బస ఏర్పాటుచేస్తారు. ఉదయాన్నే పర్యాటకులు మల్లికార్జున, భ్రమ రాంభదేవిల దర్శనం కల్పిస్తారు.

-మధుకర్ వైద్యుల

995
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles