సంపద సృష్టించిన ధీరుడి శాశ్వత విరామం


Sun,September 15, 2019 01:09 AM

ambani
‘నాకు విశ్రాంతి అనేది లేదు. తుది శ్వాస విడిచే వరకూ పనిచేస్తూనే ఉంటా. నేను విశ్రాంతి తీసుకునేది ఒక్కచోటే.. చనిపోయాక శ్మశానంలో’ ఈ మాటలన్నది ఎవరో కాదు. ధీరూభాయ్‌ అంబానీ. ఒంటిచేత్తో వేల కోట్ల సంపదను సృష్టించి.. వేలాదిమందికి ఉపాధినిచ్చిన ధీరూభాయ్‌ తన కడవరకూ పనిచేస్తూనే ఉన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. 13 రోజులు మృత్యువుతో పోరాడారు. చివరికి శ్మశానంలో విశ్రాంతి తీసుకునేందుకు కదిలారు. కుగ్రామాలకు సైతం స్టాక్‌ మార్కెట్‌ కల్చర్‌ను రుచి చూపించిన రిలయన్స్‌ అధిపతి ధీరూభాయ్‌ అంబానీ. శాశ్వత విరామంతో కార్పొరెట్‌ ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించిన ఆయన చివరి రోజుల్లో ఏం జరిగిందంటే...

పడమటింటి రవికుమార్‌, సెల్‌: 99483 93391

తేదీ : 2002 జూన్‌ 24
స్థలం : ముంబాయిలోని కోలబాలో ఉన్న సీ విండ్స్‌ (ధీరూభాయ్‌ నివాసం)
సమయం : ఉదయం తొమ్మిది.


‘సునో జీ, టిఫిన్‌ చేసి ఆ ట్యాబ్లెట్‌ వేసుకోండి.. ఇప్పటికే ఆలస్యమయ్యింది.’ అంటూ వంటగదిలోంచి కోకిలబెన్‌ అరుస్తున్నది. హాల్లో టీవీ ఆన్‌ చేసి ఉన్నది. షేర్‌మార్కెట్‌ వార్తలు చూస్తున్నారు ధీరూభాయ్‌. మళ్లీ గట్టిగా అరిచింది కోకిలబెన్‌. సమాధానం రాకపోవడంతో వంటగదిలోంచి బయటకు వచ్చింది. ఒక చేతిలో ఇడ్లీలు ఉన్న ప్లేట్‌, మరో చేతిలో నీళ్ల గ్లాసు ఉన్నాయి. హాల్లోకి రాగానే ఆమె చేతుల్లోని ప్లేట్‌, గ్లాస్‌ దబేల్‌మని భూమిని తాకాయి. ‘సునో జీ’.. అంటూ ఆమె ఆయన వైపు బిరబిరా నడిచింది. కాళ్లు చేతులు పడిపోయినట్లు ధీరూభాయ్‌ సోఫాలో ఒరిగి ఉన్నాడు. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ‘మేనేజర్‌' అని గట్టిగా పిలిచింది. పక్కనే ఉన్న ధీరూభాయి పీఏ రాగానే ‘అనిల్‌కు, ముఖేష్‌కు ఫోన్‌ చెయ్‌.. నాకు భయంగా ఉంది’ అని ఏడవసాగింది. ఆ వెంటనే ధీరూభాయిని ఆంబులెన్స్‌లో ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దారంతా కోకిలబెన్‌ భర్త అరచేతులు, అరికాళ్లు రాస్తూ ఉన్నది. భర్తకు ఏమీ కావొద్దని లోలోపలే దేవుళ్లందరికీ మొక్కసాగింది. 9:40 నిమిషాలకు బ్రీచ్‌ క్యాండీ దవాఖాన వద్ద ఆంబులెన్స్‌ ఆగింది. అప్పటికే వచ్చి ఎదురుచూస్తున్న అనిల్‌, ముఖేష్‌ త్వరగా.. త్వరగా అంటూ దవాఖాన సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. సిబ్బంది ధీరూభాయ్‌ని స్ట్రెచర్‌పై పడుకోబెట్టారు.

ఆస్పత్రిలోని ఐసీయూలోకి తీసుకెళ్లారు. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఐసీయూ డోర్‌ మిర్రర్‌ అవతల ధీరూభాయ్‌ ఇద్దరు కూతుళ్లు నీనా కొఠారి, దీప్తి సల్గావుంకర్‌ నిలబడి ఉన్నారు. చెంపలను తాకిన కన్నీటిని తుడుచుకుంటూ లోపలివైపు చూస్తున్నారు. సమయం పదకొండయ్యింది. ఐసీయూలోంచి డాక్టర్లు బయటకొచ్చారు. ‘హీ సఫర్డ్‌ ఏ బ్రెయిన్‌ స్ట్రోక్‌' అని ఓ డాక్టర్‌ అనిల్‌కు చెప్పారు. కోకిలబెన్‌ డాక్టర్‌ చేతులు పట్టుకుని ‘ఎలా డాక్టర్‌.. పూర్తిగా కోలుకుంటారు కదా.. మీరెలాగైనా ఆయనను మామూలు మనిషిని చేయాలి’ అంటూ ప్రాధేయపడింది. ‘ఓకే ఓకే వుయ్‌ విల్‌ డూ అవర్‌ పార్ట్‌'. అంటూ డాక్టర్లు వెళ్లిపోయారు. అలా ఐసీయూ గది ఎదుటే రోజంతా కుటుంబీకులు వేచి చూశారు. చీకటిపడింది. తెల్లారింది. ఇలా 13 రోజులు సూర్యుడు వచ్చివెళ్లాడు. కానీ ధీరూభాయ్‌ ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. 13వ రోజు వచ్చిన సూర్యుడు వారింట్లో చీకటిని నింపాడు.

తేదీ : 6 జూలై 2002 శనివారం
సమయం : రాత్రి 11:15 నిమిషాలు
స్థలం : బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌


‘సునో జీ మమ్మల్ని విడిచివెళ్లావా’ అంటూ కోకిలాబెన్‌ ఏడుస్తున్నది. నాన్నను తలుచుకుంటూ విషాదవదనంతో అనిల్‌, ముఖేష్‌ ఉన్నారు. ‘పప్పా హుట్‌ జావో’ అంటూ నీనా, దీప్తి తండ్రి భౌతికకాయం మీద పడి గుండెలవిసేలా రోదిస్తున్నారు. అదే అర్ధరాత్రి ధీరూభాయ్‌ మృతదేహాన్ని ముంబైలోని ఆయన నివాసం సీవిండ్స్‌కు తీసుకొచ్చారు. ఇంటి వరండాలో తెల్లటి పాన్పుపై ధీరూభాయ్‌ మృతదేహాన్ని ఉంచారు. ఆదివాం ఉదయం 6 గంటలు. అప్పటికే ధీరూభాయ్‌ మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, వ్యాపార వర్గాలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. షేర్‌హోల్డర్లు, ఇన్వెస్టర్లు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏడ్వసాగారు. 9 గంటలకల్లా ధీరూభాయ్‌ ఇంటి ఆవరణ, పరిసరాలన్నీ అభిమానులతో నిండిపోయాయి. ప్రధాని వాజ్‌పేయి తరఫున కేంద్రమంత్రి విజయ్‌ గోయెల్‌, ప్రతిపక్ష నేత సోనియాగాంధీ తరఫున ఆర్‌.కె. ధావన్‌లు ధీరూభాయ్‌ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. వీవీఐపీలు, నేతలు, పారిశ్రామిక వర్గాలు పెద్ద ఎత్తున రావడంతో ఇంటివద్ద పోలీసులు మోహరించారు. స్వల్ప తోపులాట జరగడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతిమయాత్రలో జనహోరు

మధ్యాహ్నం ఒంటిగంటకు అంబానీ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. కడసారి చూపునకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. దీంతో ముంబాయి నగరమంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వేలాదిమంది రిలయన్స్‌ ఉద్యోగులు, వాటాదారులు, అభిమానులు, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ‘ధీరూభాయ్‌ అమర్హ్రే’ అంటూ నినాదాలు చేశారు. సాయం త్రం 5 గంటలకు చందన్‌వాడీ శ్మశాన వాటికకు భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. శ్మశానవాటిక చిన్నగా ఉండడంతో చాలామంది వీవీఐపీలు సైతం బయటే ఉండిపోయారు. వేలాది జనం మధ్య వారికి భద్రత కల్పించడం పోలీసులకు కష్టమైంది.

సంప్రదాయబద్దంగా అంత్యకియలు

అంత్యక్రియలకు 450 కిలోల గంధపు చెక్కలు, 45 కిలోల నెయ్యిని ఉపయోగించారు. కుటుంబంలోని స్త్రీలు మినహా బంధువులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆర్యసమాజ్‌కు చెందిన ఇద్దరు పురోహితులు వేదమంత్రాలు పఠించారు. చివరిచూపు కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి నిరాశే మిగిలింది. వారినెవ్వరినీ పోలీసులు అనుమతించకపోవడంతో కొందరు శ్మశానం ప్రహరీ ఎక్కేందుకు ప్రయత్నించారు. సాయంత్రం 6:30 నిమిషాలకు గుజరాతీ బనియా సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు పూర్తి చేశారు. చివరి తంతు అనంతరం అనిల్‌, ముఖేష్‌ శ్మశానం బయటకు వచ్చి అక్కడున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ambani1
యథావిథిగా ఆఫీసు పనులు: ధీరూభాయ్‌ అంబానీకి వీడ్కోలు ఇచ్చిన మరుసటి రోజు నుంచే రిలయన్సు గ్రూపు ప్రధాన కార్యాలయం, ఆఫీసులు, ఫ్యాక్టరీల్లో ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులకు హాజరయ్యారు. ధీరూభాయ్‌ చిత్రపటాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ముఖేష్‌, అనిల్‌ కూడా యథావిధిగా తమ రోజూవారీ పనులు చేసుకున్నారు. ఎల్లప్పుడూ పనే దైవంగా భావిస్తూ, సంస్థలో క్రమశిక్షణను నెలకొల్పిన ధీరూభాయికి పనిచేస్తూ ఘన నివాళి అర్పించినట్లు వారు వెల్లడించారు.

వారసులెవరనే చర్చ

ధీరూభాయ్‌ అంబానీ మరణం అనంతరం 75 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసులు ఎవరనే చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. ఎక్కడ చూసినా, ఏ నలుగురిని కదిలించినా ఈ అంశమే చర్చకు వచ్చేది. ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో అంబానీ స్థానంలో ఎవరు గ్రూప్‌ చైర్మన్‌ అవుతారనే ముచ్చట్లు బాగా వినిపించేవి. ధీరూభాయ్‌ అంబానీ రెండో కుమారుడు అనిల్‌ అంబానీ పేరు ఎక్కువగా వినిపించింది. అయినప్పటికీ తెరవెనుక వ్యూహాలు ఎక్కువగా చక్కదిద్దేది 45 సంవత్సరాల పెద్ద కుమారుడు ముఖేష్‌ అంబానీయేనని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. తండ్రి మరణించే సమయం నాటికి ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అనిల్‌ అంబానీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ధీరూభాయ్‌ బతికున్నప్పుడు ఎవరైనా బిజినెస్‌ వ్యవహారాలు మాట్లాడితే ముఖేష్‌తో మాట్లాడారా? అని అడిగేవారట.

గతంలోనే అనారోగ్యం

1986లో ఆయనకు పక్షవాతం వచ్చింది. చికిత్స అనంతరం కొన్ని రోజులు శరీరంలోని కుడిభాగం సరిగ్గా పని చేయలేదు. అయినా ఆయన రోజువారీ వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనేవారు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలన్నీ చూసుకునేవారు. ఉద్యోగులతో రోజూ ముచ్చటించేవారు. ఈ నేపథ్యంలో 1996లో ఆయనకు మరోసారి పక్షవాతం వచ్చింది. 11రోజులు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన తిరిగి నడవడం అసాధ్యమని డాక్టర్లు సైతం తేల్చి చెప్పారు. కానీ, అంబానీ మాత్రం ధైర్యం కోల్పోకుండా సొంతగా ఇంట్లోనే జిమ్‌ ఏర్పాటు చేసుకుని వ్యాయామం చేశారు. తన మెదడు ఇచ్చే ఆదేశాలకు స్పందించేలా శరీరానికి తర్ఫీదు ఇచ్చారు. కొన్ని నెలల్లోనే తిరిగి విధులకు హాజరయ్యారు. కానీ, 2002లో మాత్రం మృత్యువుతో పోరాడి ఓటమి పాలయ్యారు.

ఎవరు ఏమన్నారంటే..

రాష్ట్రపతి:‘ఉన్నతమైన ఎంటర్‌ప్రెన్యూర్‌ లక్షణాలు, అలుపెరుగని కృషి పారిశ్రామిక రంగంలో అంబానీని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశాయి.’ అని అప్పటి రాష్ట్రపతి కే.ఆర్‌ నారాయణన్‌ అన్నారు.
సీఐఐ ప్రెసిడెంట్‌: ‘లక్షలమంది సాధారణ ఇన్వెస్టర్ల సాయం తో ఉన్నతస్థాయికి ఎదిగారు. సాధించిన విజయాన్ని షేర్‌ హోల్డర్లతో పంచుకునేందుకు ఏనాడూ వెనుకాడలేదు.’ అని అప్పటి సీ ఐఐ ప్రెసిడెంట్‌ అశోక్‌ సూతా పేర్కొన్నారు.
ambani2
ధీరూభాయి అసలు పేరు దీరాజ్జల్‌ హిరాచాంద్‌ అంబానీ. ఆయన 28 డిసెంబర్‌ 1932న జన్మించారు. ముంబైలోని అతడి అన్నదమ్ములతో కలిసి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. యవ్వనంలో రూ.300 జీతంతో జీవితాన్ని ప్రారంభించారు. ఆతర్వాత షెల్‌ ఆయిల్‌ ఉత్పత్తులకు పంపిణీదారులయ్యారు. కొద్ది రోజులకే ఎడెన్‌రేవు వద్ద ఉన్న కంపెనీ ఫిల్లింగ్‌ స్టేషన్‌కు నిర్వాహకుడిగా ధీరూభాయి హోదా పెరిగింది. 1962లో ఆయన రిలయన్స్‌ కంపెనీని ప్రారంభించారు. అప్పట్లో ఆ సంస్థ పాలిస్టర్‌ను దిగుమతి చేసుకునేది. మసాలా దినుసులను ఎగుమతి చేసేది. నేత పరిశ్రమలో డిమాండ్‌ ఊహించి 1977లో అహ్మదాబాద్‌లోని నరోడాలో నేత మిల్లు ప్రారంభించారు. కొంత కాలం తర్వాత ‘విమల్‌' అనే బ్రాండ్‌ను ప్రారంభించారు. అది ఆయన పెద్దన్నయ్య కుమారుడిపేరు. ఇండియాలో ఈక్విటీ సంప్రదాయాన్ని ప్రారంభించారు ధీరూభాయి. అలా షేర్లు కొనడం అమ్మడంలోనూ కీలక పాత్ర పోషించారు.

7155
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles