తాడుముక్క


Sun,September 22, 2019 12:37 AM

Crime-Story
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

హీరోయిన్‌ అవుదామని హాలీవుడ్‌కి వెళ్ళిన ఐరీన్‌కి ఎవరూ వేషాలు ఇవ్వలేదు. ఆమెది చిన్నపిల్ల మొహం అని నిరాకరించారు. చివరికి ఓ స్కూల్‌ విద్యార్థిని పాత్ర దొరికింది. స్కూల్‌ యూనిఫాంలో స్టుడియోనించి ఇంటికి వెళ్ళే ఆమెకి ఓ ఆలోచన కలిగింది. స్కూల్‌ యూనిఫాంలో తను ఎటూ చిన్నపిల్లగా కనిపిస్తుంది కాబట్టి తన వయసు వాళ్ళంటే ఇష్టపడే మంచి కుటుంబాలనించి వచ్చిన డబ్బున్న మగాళ్ళని ఆకర్షించి, వాళ్ళ డబ్బుని దోచుకుంటే? డబ్బుకి కటకటలాడే ఐరీన్‌ దాన్ని అమల్లో పెట్టాలని వెంటనే నిర్ణయించుకుంది.
ఆమె మర్నాడు లాస్‌ ఏంజెల్స్‌లోని అతి మంచి స్కూల్‌ యూనిఫాం ధరించి బేబీ ఫేస్‌తో స్కూల్‌ బయట వేచి చూడసాగింది. ఆమె తల్లితండ్రులు ఎందుకో రాలేదని, తనని ఇంటి దగ్గర దింపమని దయగల మగాళ్ళని కోరసాగింది. ఒకతను లిఫ్ట్‌ ఇచ్చాడు. కారు నిర్మానుష్య ప్రదేశంలోంచి వెళ్ళే ఇంటి చిరునామా చెప్పి, కారు అక్కడికి చేరుకోగానే తన దుస్తుల్లో దాచిన సుత్తితో అతని నెత్తిమీద బాది, అతని జేబులు వెదికి పర్స్‌ని, ఇతర విలువైన వస్తువులని దొంగిలించింది. ఇలా కొందరి జేబుల్లో కొన్ని ఉత్తరాలు కూడా కనపడేవి. వాటిలో కొన్ని బ్లాక్‌ మెయిల్‌కి అనుగుణంగా ఉండటం కూడా ఐరీన్‌కి లాభించింది. వాళ్ళు ఆ ఉత్తరాల మీద పోలీసులకి ఫిర్యాదు చేయలేరు. ఓ రోజు ఆమె ఓ స్కూల్‌ బయట వేచి ఉండగా ఓ కారొచ్చి ఆమె పక్కన ఆగింది. దాని డ్రైవర్‌ వయసు నలభై దాకా ఉండొచ్చు అనుకుంది.

“బస్‌ కోసమా?” అతను కారాపి అడిగాడు.
“అవును.”
“ఎక్కడికి?”
“బెల్‌ ఎయిర్‌కి.”
“నీ బస్‌ ఇప్పట్లో రాదు. ఓ ప్రమాదం జరిగి రోడ్‌ని మూసేసారు. నేను బెల్‌ ఎయిర్‌కే వెళ్తున్నాను. నేనుండేది అక్కడే. నా పేరు అలెక్స్‌. ఎక్కు.”
“థాంక్స్‌ మిస్టర్‌ అలెక్స్‌” చెప్పి అతని పక్క సీట్లో కూర్చుంది.
కారు ముందుకి కదిలింది.
“స్కూల్‌ ఎలా ఉంది?” అడిగాడు.
“విసుగ్గా ఉంది. నాకు ఎక్సయిట్‌మెంట్‌, ప్రమాదం లాంటివి ఇష్టం.”
“ఐతే, కారుని కొండల్లోకి పోనివ్వనా? అక్కడ ప్రకృతి, ఒంటరితనం ఎక్సయిట్‌మెంట్‌ని ఇస్తాయి.”
“అలాగే. థాంక్స్‌.” ఆనందంగా అంగీకరించింది.
అతను కారుని ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆపాడు.
“నీ పేరు?”
“ఐరీన్‌.”

“అందమెన అమ్మాయికి అందమైన పేరు. నీ జుట్టు చాలా బాగుంది.”
వెంటనే స్కూల్‌ బ్యాగ్‌ తెరచి సుత్తిని తీసి అతని తలమీద బాదింది. తర్వాత అతని జేబులు వెదికి పర్స్‌ని తీసుకుంది. ఓ తాడు ముక్క కూడా కనిపించింది. దాంతో అతనికి ఏం అవసరమో ఐరీన్‌కి అర్థం కాలేదు.
ఇంటికి వెళ్ళాక పర్స్‌ని తెరచి చూసింది. ఏభై డాలర్లు, చాలా దినపత్రికల కటింగ్స్‌ కనిపించాయి. అవి చదివి నిర్ఘాంత పోయింది. అవన్నీ గత ఏడాదిగా కొండల్లో ఐదుగురు ఆడపిల్లల్ని మెడచుట్టూ తాడు బిగించి చంపిన వార్తల కటింగ్స్‌. అతని డ్రైవింగ్‌ లైసెన్స్‌లో బెంజిమన్‌ అనే పేరుంది.
ఆ స్ట్రేంగ్లర్‌ అమెరికాలోని అతి ప్రమాదకరమైన వ్యక్తని గ్రహించింది. తను మర్నాటి దినపత్రికల్లో హతురాలిగా ఎక్కేదని తెలీగానే భయంతో వణికిపోయింది. తను మాత్రమే ఆ నేరస్తుడ్ని గుర్తు పట్టగలదని కూడా అనుకుంది.
పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి ఆ పర్స్‌ని ఇచ్చి స్ట్రేంగ్లర్‌ గురించి చెప్పాలని అనుకుంది. కానీ, తన నేరం గురించి కూడా చెప్పాల్సి రావచ్చు కాబట్టి ఆ ఆలోచనని విరమించుకుంది. తనని వాళ్ళు అరెస్ట్‌ చేయొచ్చు.
ఆమెకి మరో ఆలోచన వచ్చింది. తను అతన్ని గుర్తు పట్టగలదన్న ఆలోచన అతనికీ వచ్చి ఉండవచ్చు. కాబట్టి తనని వెతికి పట్టుకుని చంపాలని అనుకుంటాడు. తను ఎక్కడ ఉంటుందో అతనికి తెలుసు.
ఆమె పబ్లిక్‌ ఫోన్‌ బూత్‌నించి పోలీసులకి ఫోన్‌ చేసింది.
“హలో. సిటీ డెస్క్‌.” ఓ మగకంఠం వినిపించింది.
“నాకు స్ట్రేంగ్లర్‌ ఎవరో తెలుసు” చెప్పింది.

“మీ పేరు?”
“అది చెప్పను.”
“అతని పేరు?”
“బెంజిమన్‌ కాక్‌.”
“ఎడ్రస్‌?”
“3511. లింకన్‌ ఎవెన్యూ.”
“ఎలా ఉంటాడు?”
“నల్లజుట్టు. నల్లకళ్ళు. సుమారు నలభై ఏళ్ళుంటాయి. బ్రౌన్‌ రంగు సూట్లో చూసాను. డబ్భు డబ్భు ఐదు కిలోలదాకా ఉంటాడు. నల్లటి పెద్ద డాడ్జ్‌ కారుని డ్రైవ్‌ చేస్తాడు.”
“అతను నీకెలా తెలుసు?”
“అంతే. గుడ్‌ బై.” చెప్పి రిసీవర్‌ పెట్టేసింది.

రాత్రి రేడియో వార్తల్లో ఆమె విన్నది. ‘గుర్తు తెలీని ఓ మహిళ ఇచ్చిన సమాచారం ప్రకారం స్ట్రేంగ్లర్‌ వయసు నలభై..’ ఆమె ఇచ్చిన వివరాలన్నీ చెప్పాక చివర్లో చెప్పారు.
ఆ అడ్రస్‌నించి అతను కొన్ని నెలల క్రితమే మారిపోయాడు. ఆ తర్వాత ఏమయ్యాడన్నది పోలీసులు విచారిస్తున్నారు. క్రితం సాయంత్రం ఆ గుర్తు తెలియని మహిళని స్ట్రేంగ్లర్‌ తన కార్లో కొండల్లోకి తీసుకెళ్ళాడు.
అతని భయంతో ఇల్లు కదలని ఐరీన్‌ సంపాదనని పోగొట్టుకుంటున్నది. చివరికి అతన్ని కనిపెట్టి చంపాలని అనుకుంది. దానికో పథకం వేసింది. దినపత్రికల్లోని పర్సనల్‌ కాలంలో ఆమె ఇచ్చిన ప్రకటనని స్ట్రేంగ్లర్‌ చదివాడు.
‘ఉభయ లాభం కోసం వెంటనే నాకు పోస్ట్‌ బాక్స్‌ నంబర్‌ 0789కి నీ అడ్రస్‌ తెలియచేస్తూ ఉత్తరం రాయి. స్లగర్‌'
మర్నాడు ఐరీన్‌ అతను రాసిన ఉత్తరాన్ని చింపి చదివింది.
బాక్స్‌ నంబర్‌ 04798. వెంటనే ఐరీన్‌ ఆ బాక్స్‌కి ఉత్తరం రాసింది.
డియర్‌ మిస్టర్‌ స్ట్రేంగ్లర్‌,
మీ వస్తువు ఒకటి నా దగ్గర ఉంది. అది క్షేమంగా తిరిగి మీకు చేరాలనుకుంటే మనం ఓసారి కలవాలి. ఆసక్తి ఉంటే ఆ సంగతి తెలియచేయండి. -స్లగర్‌
దానికి జవాబు వచ్చింది.

డియర్‌ స్లగర్‌,
ఆసక్తి ఉంది. ఎక్కడ ఎప్పుడు కలవాలో తెలియచేయండి.
డియర్‌ అలెక్స్‌,
నాకు ఇవ్వడానికి ఐదు వేల డాలర్లు సిద్ధం చేయి. కలిసే ప్రదేశం, సమయం కోసం వేచి ఉండు. నేను వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోతాను. పర్స్‌లో మీరు మీ ఫొటోని ఉంచుకోకుండా ఉండాల్సింది. - స్లగర్‌
దాన్ని చదివిన అలెక్స్‌ పకపకా నవ్వి జవాబు రాసాడు. దాన్ని ఐరీన్‌ చదివింది.
‘ధర అంగీకారమే. ఎప్పుడు? ఎక్కడ?’
ఆమె మారు వేషంలో వారం క్రితం ఏనీ అనే మారుపేరుతో అద్దెకి తీసుకున్న, నగరంలోని మరో మూలున్న అపార్ట్‌మెంట్‌కి తాత్కాలికంగా మారింది. ఆ అడ్రస్‌తో ఉత్తరం రాసింది.
డియర్‌ మిస్టర్‌ అలెక్స్‌,
“రాత్రి పదికి 606 గిల్బర్ట్‌ ప్లేస్‌కి రా. లోపలకి వచ్చాక నా దగ్గరకి వచ్చే ప్రయత్నం చేయకు. లేదా నేను పెద్దగా అరుస్తాను. తలుపుమీద మూడుసార్లు తట్టి, తెరచుకుని లోపలకి వచ్చి గుమ్మం దగ్గరే నిలబడు, తప్ప లోపలకి రాకు. ఒకర్నొకరు మోసం చేయకుండా ఉండటానికి ఇది ముఖ్యం. డబ్బు తీసుకురావడం మర్చిపోకు. - స్లగర్‌
అది చదివిన అతను ‘మూర్ఖురాలా’ అనుకున్నాడు.
ఐరీన్‌ అతను లోపలకి వచ్చి నిలబడే చోట ఓ చిన్నబల్ల మీద టేబిల్‌ లేంప్‌ని ఉంచింది. అది బూబీ ట్రేప్‌. గదిలోని లైటు బల్బ్‌ తక్కువ కాంతిని ఇవ్వడంతో అతను పర్స్‌ లోనివి సరిగ్గా ఉన్నాయో, లేవో చూడటానికి ఆ లైట్‌ స్విచ్‌ వేసి తీరాలి. ఆ స్విచ్‌ నొక్కగానే దానికి అమర్చిన రివాల్వర్‌ పేలి గుండు అతని ఛాతీలో దిగి మరణిస్తాడు. అదృష్టం కలిసొస్తే గుండెలోనే దిగొచ్చు. పోలీసులు వచ్చేసరికి తను మాయమవుతుంది. శవం పక్కన అతని పర్స్‌ వాళ్ళకి కనిపిస్తుంది. అంతటి రాక్షసుడ్ని చంపిన తన కోసం వాళ్ళు బహుశా వెదకరు. వెదికినా తనని పట్టించే ఆధారాలేం దొరకవు. ఆ ఐదు వేల డాలర్లతో తిరిగి తన స్వగ్రామం వెళ్ళిపోవచ్చు. తన తల్లిదండ్రులు ఆనందిస్తారు.
* * *

అతను వచ్చే సమయం దగ్గరయ్యే కొద్దీ ఆమెలో భయం అధికం కాసాగింది. డిమ్‌ లైట్లో మంచానికి ఆవల గోడకి ఆనుకుని నిలబడింది. రాత్రి పదికి మెట్లెక్కే చప్పుడు వినిపించింది. వెంటనే ఊపిరి బిగబట్టింది. అడుగులు చాలా నెమ్మదిగా పడుతున్నాయి. అవి తలుపు బయట ఆగాయి. తలుపు నెమ్మదిగా తెరచుకుంది. లోపలకి అడుగు పెట్టిన ఆ వ్యక్తి చెప్పాడు.
“గుడీవినింగ్‌ మిస్‌ స్లగర్‌.”
“అక్కడ నించి ముందుకి రాకు. డబ్బు తెచ్చావా?” అడిగింది.
“తెచ్చాను.”
“గది మధ్యకి విసురు.”
అతనో కవర్ని విసిరాక అడిగాడు-
“పర్సేది?”
“నీ పక్కన ఉన్న టేబిల్‌ లేంప్‌ ఉన్న బల్లమీద ఉంది.”
“థాంక్స్‌ స్లగర్‌. బై.” దాన్ని అందుకుని చెప్పాడు.
“అందులో అన్నీ ఉన్నాయో, లేవో చూసుకోవా?” అతను వెనక్కి తిరగ్గానే అడిగింది.
“నిన్ను నమ్ముతాను.” చెప్పి బయటకి వెళ్ళి తలుపు మూసాడు.
వెంటనే ఆమెలో భయం కలిగింది. అతను ఇంకా జీవించే ఉన్నాడు. అది తనకి ప్రమాదం. అతను విసిరిన కవరు దగ్గరకి వెళ్ళి తెరచి చూస్తే, డాలర్‌ నోట్ల పరిమాణంలో కట్‌ చేసిన దినపత్రిక కాగితం ముక్కలు కనిపించాయి. తను మోసపోయిందని గ్రహించగానే గబగబ తలుపు దగ్గరకి పరిగెత్తు కెళ్ళి తెరచి చూసింది.
అకస్మాత్తుగా ఆమె మెడచుట్టూ తాడు చుట్టుకుని బిగుసుకుంది. అతను బలంగా దాన్ని లాగుతూ చెప్పాడు.
“నాకు తెలుసు నువ్వు మూర్ఖురాలివని. నీది ఆరో హత్య. కానీ, కొండల్లో కాదు.”
అతనామె మృతదేహాన్ని లోపలకి తీసుకెళ్ళి నేలమీద పడేసాడు. పర్స్‌ ఖాళీదా లేక అన్నీ ఉన్నాయా చూసుకోడానికి టేబిల్‌ లేంప్‌ బటన్‌ని నొక్కాడు. వెంటనే రివాల్వర్‌ ట్రిగర్‌ లాగబడి పేలింది. గుండు అతని గుండెలో దిగడంతో పెద్దగా అరుస్తూ నేలకూలాడు.(జెన్నీ క్రాస్‌ కథకి స్వేచ్ఛానువాదం)

నాకు ఇవ్వడానికి ఐదు వేల డాలర్లు సిద్ధం చేయి. కలిసే ప్రదేశం, సమయం కోసం వేచి ఉండు. నేను వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోతాను. పర్స్‌లో మీరు మీ ఫొటోని ఉంచుకోకుండా ఉండాల్సింది.
- స్లగర్‌ దాన్ని చదివిన అలెక్స్‌ పకపకా నవ్వి జవాబు రాసాడు. దాన్ని ఐరీన్‌ చదివింది.

732
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles