అనారోగ్యంతో సహజీవనం చేసిన గయ్యాళి అత్త సూర్యకాంతం


Sun,September 29, 2019 02:05 AM

తన నటనద్వారా వెండితెరపై నవ్వుల పూలు పూయించిన విదుషీమణి. ఓరచూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసురుతూ, కుడిచెయ్యిని నడుంమీద నిలబెట్టి విసిరే సంభాషణాచాతుర్యాల్లో వెక్కిరింపులు, కల్లబొల్లి కబుర్లు చోటుచేసుకున్నా, ప్రతీమాట, ప్రతీసన్నివేశం సజీవశిల్పం. గయ్యాళి అత్తకు ప్రతిరూపం, గడసరి భార్యకు మరోరూపం.కొన్ని దశాబ్దాలు కోడళ్ళ, సవితి కూతుళ్ళ, తోడికోడళ్ళ, మొగుళ్ళ ప్రాణాలని తోడేసి, ఉతికి ఆరేసిన సహజ నటకళా శిరోమణి.తన ఎడమచేయి వాటంతో ఒక ఊపు ఊపి గరిటె కాల్చి వాతలు పెట్టడమే కాదు, ఆయా పాత్రలు వేసిన నటీనటులెందరో ఆమెతో దెబ్బలు, శాపనార్థాలు తిన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ, తెరవెనుక మనసున్న అమ్మకు నిజరూపం తెలుగువారి అభిమాన గయ్యాళి అత్త పెద్దిభొట్ల సూర్యకాంతం.

-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

1989.. బంధువులు వస్తున్నారు జాగ్రత్త సినిమా షూటింగ్ స్పాట్.సూర్యకాంతం కారు దిగి వచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమె ఎంతో నీరసంగా కనిపిస్తున్నది. ప్రయాణం వల్ల అలిసిపోయిందేమో అనుకున్నారు. భాయ్ గ్లాసులో నీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చాడు. తరువాత దర్శకుడు అమ్మా అంటూ పిలిచాడు. కుర్చీలో కూర్చున్న ఆమె వెంటనే లేచి వెళ్లింది. తన సన్నివేశం రావడం వల్లే పిలిచాడని తెలిసే ఆమె వెంటనే వెళ్లింది. ఆమె చెప్పాల్సిన డైలాగుల కాపీని ఆమె చేతికిచ్చారు. అప్పటి వరకు నీరసంగా కనిపించిన సూర్యకాంతంలో ఏదో తెలియని మార్పు. తన నీరసాన్ని ఏమాత్రం పైకి కనిపించనీయకుండా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. అదంతా చూస్తున్న ఆమె నటనాశైలిని చూసి ప్రొడక్షన్ టీమంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటివరకు నీరసంగా ఉన్న ఆమె తన గయ్యాళి పాత్రకు జీవం పోసిన తీరు ఆమెలోని సహజనటిని మరోసారి ఆవిష్కరించుకోగలిగింది.నిజానికి ఆమె చాలాకాలంగా మధుమేహంతో బాధపడుతున్నది. కానీ మన సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి కానీ కష్టాల గురించి వారికి చెప్పకూడదన్న సూత్రం పాటించింది సూర్యకాంతం. అందువల్లే మధుమేహానికి గురైంది అన్న విషయం చాలామందికి తెలియనీయలేదు. అంతేకాదు, తనకు వ్యాధి ఉందని తెలిస్తే అవకాశాలు వస్తాయో రావో అన్న ఆలోచన కూడా ఆమెను ఈ విషయాన్ని బయటకు చెప్పుకోనివ్వలేదని అంటారు.
Suryakantham

అయితే ఆ వ్యాధిపట్ల ఆమె నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఆ ప్రభావం ఆమె మూత్రపిండాలపై పడింది. దీంతో మూత్రపిండాలు చెడిపోయి డయాలసిస్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఉదయం డయాలసిస్ చేయించుకుని మరీ షూటింగులకు హాజరయ్యేది. కట్టు ఏంటని ఎవరన్నా అడిగితే వంట చేస్తున్నప్పుడు నూనె పడిందనో, గాయం తగిలిందనో చెప్పేది కానీ, మధుమెహం గురించి మాత్రం చెప్పేది కాదు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.సూర్యకాంతానికి మొదట జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డ్యాన్సర్‌గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయనటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్థోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది.

ఆ పరిస్థితిలో సహాయనటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత వెనక్కి సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్‌ను పెట్టుకొని తీసేశారని తెలియడంతో, ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు.ఆవిడ గొప్ప సంఘ సేవకురాలు. ఆంధ్ర నాటక రంగంలోని చాలామంది బీద కళాకారులకు దానధర్మాలు చేసింది. గ్రంథాలయాలకు, వికలాంగుల విద్యాశాలలకు భూరిగా విరాళాలు ఇచ్చింది.
Suryakantham1

ఎన్నో సంస్థలకు నిధులు సమకూర్చటం కోసం చాలా ప్రదర్శనలు ఇచ్చింది. రామకృష్ణ మిషన్ ద్వారా ఆవిడ సహాయం చేసేది. పిసినారి నిర్మాతల నుండి డబ్బు మొత్తం ఒకే సారి వసూలు చేయటం ఆమె ప్రత్యేకత . కొంతమంది మంచి వారి వద్దనుండి పారితోషికం తీసుకోకుండా కూడా నటించేది. అయితే, నిర్మాత, దర్శకులకు చాలా విధేయంగా వుండేది. హావభావాల కన్నా, మాటలతోనే గయ్యాళితనం చూపెట్టేది. 1950లో నారద నారది అనే సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమైన ఈ మహానటి ఎన్నో విభిన్న మైన పాత్రలలో నటించింది. వాటిలో కొన్ని హాస్యపాత్రలు కూడా వున్నాయి. గయ్యాళితనంలో అమాయకత్వం చూపెట్టటం ఈవిడకే చెల్లు. ఈమెకు 1950లో శ్రీ పెద్దిభొట్ల చలపతిరావుతో వివాహమైంది. ఆయన హైకోర్టు జడ్జీగా పనిచేసారు. సంతానం లేకపొతే తన అక్క కొడుకును దత్తత తీసుకుంది.

సినిమా రంగంలో ఈమెకు ఆప్తుడు ముళ్ళపూడి వెంకటరమణ. రకరకాల కళ్ళజోళ్ళు పెట్టుకోవటం ఈవిడకు హాబీ. దాన్ని గురించి ముళ్ళపూడి వారు చమత్కారంగా ఇలా అనేవారట ఆమెతో. సూర్యకాంతం, అయస్కాంతం లాంటి కళ్ళను కల్లజోళ్ళతో ఎందుకు మూస్తారని? ముళ్ళపూడివారికి మొదట్లో సినిమాలు తీసే సమయంలో ఆర్థిక సహాయం కూడా చేశారట. ఆవిడ చనిపోయిన వెంటనే, విషయం చెప్పకుండా ఆవిడ లాయర్ రమణకు పోన్ చేసి రమ్మన్నారట. ఆయన వెంటనే ఆవిడకు నేను ఏమీ బాకీ లేనే! నేనెందుకు? అన్నారట. అందుకు కాదు వేరే పని వుంది, రండి అని లాయర్ అంటే, రమణ హుటాహుటిన వెళ్లారట. లాయర్ ఒక డాక్యుమెంట్ చూపించారట. అందులో విషయం చూసి, రమణ కళ్ళు చెమ్మగిల్లాయట. ఆమె ఆస్తిలో కొంతభాగం ఒక ట్రస్ట్‌గా ఏర్పాటు చేసి, రమణ, ఆమె కొడుకును ట్రస్టీలుగా చేసిందట. ఆమెను గురించి బాగా తెలిసివున్న వారు కనుకనే ఆమె వ్యక్తిత్వానికి సరితూగే పాత్రలు వారి సినిమాలలోనే ఆవిడకు లభించాయని చెబుతారు.
Suryakantham2

జంధ్యాల ఇలా అనేవారు చిన్నతనంలో ఎవరైనా నన్ను మీ అమ్మగారి పేరేమిటి? అని అడిగితే, చెప్పటానికి చాలా బిడియ పడేవాడిని. కారణం, మా అమ్మ పేరు సూర్యకాంతం కావటం వల్ల. ఆవిడ సినిమాలలో బాగా పేరు తెచ్చుకున్న తర్వాత సూర్యకాంతం, అనే పేరు తమ పిల్లలకు పెట్టటానికి చాలామంది భయపడేవారు. సూర్యకాంతం అంటే గయ్యాళిగంప అని తెలుగు నిఘంటువులో రాసుకోవచ్చు. అంత సహజంగా నటించిన నటీమణి. సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణలు చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది. చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహజనటి అంటే బాగుంటుందేమో. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. నిజానికి వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు. మనసున్న మంచి మనిషి. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపులకోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. ఆమె కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కు వచ్చినప్పుడల్లా - తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు.

షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్! అవుట్‌సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ఓ! అని అంతకన్నా గట్టిగా అరిచింది. ఏమిటమ్మా? అని అడిగితే, సైలెన్స్ అవుట్ సైడ్ - అని గదా అన్నారు! అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి అపరాధం - క్షమించండి! అని వేడుకుంది. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!- అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం పూచికపుల్ల కూడా విదిలించేది కాదు. మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, నటిస్తాను అని ధైర్యంగా చెప్పేది.

అది 1950.. సంసారం చిత్రం విడుదల

ఆ సినిమాలో గొప్ప నటులెందరో ఉన్నప్పటికీ జనాల్నీ ఆకర్షించింది మాత్రం ఒకే ఒక పాత్ర. అది రేలంగికి తల్లిగా నటించిన మహిళ పాత్ర. ఎడం చేతివాటంతో తన గయ్యాళి తనాన్ని అద్భుతంగా ప్రదర్శించిన ఆమె సూర్యకాంతం. నిజానికి అప్పటికీ ఆమె వయస్సు కేవలం 26 ఏండ్లు. కానీ రేలంగికి తల్లిగా 60 ఏండ్ల పాత్రం పోషించి విమర్శకుల కూడా ఔరా అనిపించుకుంది. అది మొదలు ఆమె వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలా అర్ధ శతాబ్దం పాటు తెలుగు, తమిళ, హిందీ భాషలలో సుమారు 750 సినిమాలకు పైగా నటించింది. అన్నీ చిత్రాల్లోనూ అవే పాత్రల్ని మళ్లీ మళ్లీ పోషించినా ఎక్కడ కూడా ప్రేక్షకునికి విసుకు కలిగించని నటి సూర్యకాంతం.

తెలుగు సినిమా ప్రపంచానికి, ప్రేక్షకులకు దొరికిన అద్భుతమైన నటి శ్రీమతి సూర్యకాంతం. ఆమె సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సూర్యకాంతం పోషించిన పాత్రలకు భిన్నంగా ఆమె చిన్నతనం నుండి సాత్విక స్వభావం గలది. ఆమె గయ్యాళి నాలుక వెనుక ఒక దయార్ద్ర హృదయం వుంది. ఆమె ఎప్పుడూ ఆనందంగా వుండటమే కాకుండా తన చట్టూ వున్నవారినికూడా ఆనందంగా వుంచేది. ఇతరులకు సహాయం చేయటం, విశాలభావాలు -- ఇవన్నీ చూస్తే ఈవిడేనా మన గయ్యాళిఅత్త అని ఆశ్చర్య పోతాం. ఆమె స్వయంగా వండి వార్చిన వంటను స్టూడియోలకు తెచ్చి, సహ నటీనటులకు కొసరి కొసరి వడ్డించేది. ఆంధ్ర పులిహోర చేయటంలో ఈవిడ చేయి తిరిగిన వంటఇల్లాలు. ఆమెది ఎడం చేతి వాటం. అదే చేతితో అద్భుతంగా తన గయ్యాళి తనాన్ని కూడా ప్రదర్శించేది.

946
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles