విత్తనం


Sun,October 6, 2019 02:52 AM

Vithanam
పెద్దింటి అశోక్‌కుమార్‌
సెల్‌: 9441672428

నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ (రూ. 50,000/-)

బండలింగంపల్లిలో రెవెన్యూ సదస్సు ముగిసింది.
రెవెన్యూ సదస్సు అంటే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ వాళ్లే వస్తరు. కాని అక్కడికి పోలీసులు గూడా వచ్చారు. మండలంలో ఏ ఊరికి లేని సమస్యలు ఆ ఊరికే ఉన్నయి మరి. ఊరు చిన్నదే అయినా వాడకో లీడరు. లీడరుకో క్యాడరు.
అనుకున్నట్టుగనే రైతులంతా మనిషికో సమస్యతో కచీరు దగ్గర జమయ్యారు. పట్టాలని, పరం పోగులని, బినామీలని, ఆర్వోఆర్‌లని, భూమి తక్కువుందని, ఎక్కువుందని, పాస్‌ బుక్కులని సమస్యలన్నీ చెప్పుకున్నరు. ఎంత రచ్చ అయితదో అనుకున్నరు అధికారులు. కానీ అంతా సాఫీగానే జరిగింది. ఒకటి రెండు చిన్నచిన్న లొల్లులు తప్ప వివాదాలన్నీ పరిష్కారమైనయి.
సిబ్బంది తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నరు. ఎమ్మార్వో ఈడు చిన్నదే కాని మంచి మనిషి. భూమి లేని ఎందరో పేదలకు భూములు పంచిండు. ఏ ఊరుకు వెళ్లినా రైతులు చేతులెత్తి మొక్కుతరు. చిన్న వివాదం కూడా రావద్దని ఒకటికి రెండు సార్లు అడిగి సమస్యలన్నీ విని ఆరైకి ఆన్‌లైన్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ ఇచ్చి కారువద్దకు వచ్చిండు.
అప్పటికి పొద్దు గూకుతున్నది. ఎక్కడివాళ్లక్కడ వెళ్లిపోయారు. కారు కదులుతుండగా ఎక్కడినుంచో పరుగెత్తుకొచ్చిండు బొందయ. అటు ఇటుగా అరవై ఏళ్లుంటయి. వంగిన నడుము, చిరిగిన అంగీ, మాసిన దోతి, తెల్లటి గడ్డం.. మనిషి కొద్దిగ మోటుగనే ఉన్నడు. వస్త వస్తనే కారుకు అడ్డంతిరిగి ‘అయ్యా.. నా భూమి.. నా భూమి..’ అన్నడు.
కారును ఆపి గ్లాస్‌ను దించి బయటకు చూస్తూ విసుగ్గా ‘ఆ.. నీ భూమి.. ఏమయింది’ అడిగిండు ఎమ్మార్వో.
‘ఇప్పల్ల.. కాలువ కింద రెండెకరాలు కుష్కీ గుడ్డం. అది నాదే.. నలుపయేండ్లకిందనే రాసిచ్చిండు. పట్టాలేదని మొన్న గుంజుకున్నరు. ఎట్లన్న చేసి నా భూమి నాకు ఇప్పియ్యాలె సార్‌. ఇప్పుడది పంట భూమి.. బంగారం పండుతుంది’ అన్నడు బతిమాలుతున్నట్టు.

ఏమనుకున్నడో ఎమ్మార్వో. ఓపికగా వివరాలన్నీ అడిగిండు. బొందయ చెప్పిండు.
అన్నీ విన్న ఎమ్మార్వోకు నవ్వొచ్చింది.‘రిజిస్ట్రేషన్‌ కాలేదు.. సాగు చెయ్యలేదు.. సాక్ష్యాలు లేవు.. అసలు అనుభవదారువు కూడా కాదు.. కాని, నీ పేరుమీద రాయాలి.. ఇంతకూ ఎవలదయ్యా ఆ భూమి.. నీకెట్లచ్చింది’ అడిగిండు ఎమ్మార్వో.
‘మా ఊరే సారూ... భూపాల్‌ రావు దొరది.. నా పేరు మీద రాసిండు’ అన్నడు.
ఒక్కసారి ఉలిక్కి పడ్డడు ఎమ్మార్వో. అది కొంత లావన్‌ పట్ట. కొంత శికం భూమి. దాని జోలికే పోవద్దనుకుని ‘రిజిస్ట్రేషన్‌ లేకుంటె పట్టా ఇయ్యరాదు..’ అన్నడు.
‘అదేంది సారూ.. పేదోళ్లకు ఏకాయిదం లేకున్నా మీరు నిలవడి చేపిత్తున్నరట. నాకు దొర రాసిచ్చిన కాయిదం ఉంది..’ అంటూ ప్లాస్టిక్‌ కవరు మడతల్లో దాచిన ఒక పాత కాగితాన్ని తీసి ఇచ్చిండు. అది నాలుగు ముక్కలయింది. రాతంతా అల్లుక పోయింది. అతని తృప్తికోసం అన్నట్టు అటూ ఇటూ తిరిగేసి చూసి ఇస్తూ ‘ఇది ఉత్త కాయిదమే.. చేతిరాత నడువది..’ అన్నడు.
నీరసంగా చూసిండు బొందయ. ఎంతో ఆశతో వచ్చినట్టున్నడు. కళ్లల్లో నీళ్లు తిరిగినయి. ఎమ్మార్వో కూడా బాధగా చూసి పోని అన్నట్టు డ్రైవర్‌కు సైగ చేసిండు.
కారు ముందుకు కదిలింది. ఏదో గుర్తొచ్చినట్టు వెంట పరుగెత్తి ‘సార్‌ సార్‌.. మీరు సిరిసిల్లకే గదా.. నేను గీ ఎంకటపురం దాకత్త. ఇప్పుడు బస్సులేదు’ అన్నడు బొందయ. నిజానికి అతనికి అక్కడ పనేం లేదు. పక్కన కూర్చొని తన ఎతను చెప్పుకొని కాళ్లు మొక్కయినా పట్టా రాయించుకుందామని అడిగిండు.

కారు మళ్లీ ఆగింది. ‘అయ్యో.. నేను ఇట్ల తుర్కపల్లె మీదికెళ్లి పోత.. అటుపోను’ గ్లాసు దించి ఓపికగా చెప్పిండు ఎమ్మార్వో.
ఏం చెయ్యాలో అర్థం కాలేదు బొందయకు. ఏడుపొచ్చింది. ‘అరే తాశిలి బొందిగా.. ఆనాడు అట్ల జెయ్యకుంటే రెండెకురాల భూమి నీకే ఉండు గదరా. ఇప్పుడక్కడ బంగారం పండవట్టె. ఎటూ గాకుండైతివి. థూ.. నీ బతుకు జెడ’ ఊంచుతూ యాష్టగా తిట్టుకున్నడు.

ఏమనుకున్నడో ఎమ్మార్వో ఒక్కసారిగా కోపానికచ్చిండు. ‘ఏయ్‌.. ఏం మాట్లాడుతున్నవ్‌.. ఆ.. నీకు కాయిదం లేకపోతె నేనేం జేత్త. నన్నెందుకు తిడుతున్నవు. అసలు తలుకాయుందా నీకు.. యూజ్‌లెస్‌ ఫెలో..’ అన్నడు గదిరిస్తూ.
ఊలిక్కి పడ్డడు బొందయ.అతడెందుకు అంత కోపానికచ్చిండో తెలువలేదు. భయం భయంగా చూస్తూ ‘అయ్యో.. నిన్నెందుకు తిడుత సారూ.. నా గాశారాన్ని నేనే తిట్టుకుంటున్న. ఎవలెవలకో పట్టాలు గావట్టె.. లాగోడి పైసలు రావట్టె. నాకే భూమి లేదాయె.. పైస రాదాయె’ అన్నడు.

ఎమ్మార్వో అతడిని వింతగా చూసి ‘నీ పేరు బొందయనా..’ అడిగిండు ఆశ్చర్యంగా.
అవునన్నట్టు తలూపిండు బొందయ. అతన్ని మరోసారి పరిశీలనగా చూసి ‘ఎక్కమన్నట్టు’ డోర్‌ తెరిచిండు ఎమ్మార్వో. ముందుగా అనుమానపడ్డా ఎక్కి పక్కనే కూర్చున్నడు బొందయ. కారు ముందుకు కదిలింది.
దిగేలోపు ఎట్లన్న ఒప్పించాలనుకున్నడు. ఊరు దాటినంక మెల్లెగా కదిలిస్తూ ‘ఒకలకు మంచి చేస్తే మనకు గూడా మంచే జరుగుతదంటరు.. మరి నాకేంది సారూ మంచి చేస్తే చెడ్డగ జరిగింది..’ అన్నడు బొందయ కొంత బిడియంగా.
ఎమ్మార్వో అతడినే చూస్తుండు. ‘మంచి అనేది విత్తనం లాంటిది. మనం ఏసి మరిసిపోతం. కాని అది మొలువడం మరిచిపోదు. ఎప్పుడో ఎనుకనో ముందో మొలువనే మొలుత్తది.. ఇంతకూ నువ్వు ఏం మంచి పని చేసినవు..’ అడిగిండు.
కొంత బిడియం పోయింది. తేలికగా నవ్వుతూ ‘ఇప్పుడా అప్పుడా.. నా చిన్నప్పటి ముచ్చట. ఈ ఊర్లెనే దొర సవారు కచ్చురం నడుపుతుంటి. ఒకసారి జీపుల ఇద్దరం చిప్పలపెల్లి జంగల్‌కు షికారికి పోయినం. అప్పుడది పెద్ద అడివాయె. పెద్దపులి దాడి చేసింది. నేను పాణాలకు తెగిచ్చి దొరను కాపాడిన. అప్పటికప్పుడే రాసిచ్చిండు ఈ కాయిదం’ చెప్పిండు జేబులున్న కవరును చూపిస్తూ.
‘అయితే అప్పుడే పట్టా చేసుకోవద్దా మరి.. పట్వారితోని రాపిత్తె అయిపోతుండె’ అన్నడు.
‘అప్పుడే రాపిత్తనన్నడు సార్‌. తెల్లారితె పని అయిపోతుండె. ఆగో.. అదే రాత్రి దరిద్రం నా నెత్తిమీద కూసున్నది. నేను మంచి పనే చేసిన్ననుకున్న. కాని దొరకు కోపమచ్చింది. ‘భూమి కాదుగదా నేను కనవడితె నరుకుతా అన్నడు’ చెప్పిండు బొందయ బాధగా.

ఎమ్మార్వోకు ఏదో గుర్తొచ్చింది. ఆసక్తిగా చూస్తూ ‘అంత చెడ్డ పనేం జేసినవ్‌ మరి.. మర్రవడ్డవా..’ అడిగిండు.
వింటడో లేదో అనుకున్న బొందయకు ఎమ్మార్వో మాటలతో ఉషారు వచ్చింది. ‘చెప్పిన గద సారూ.. శెనేశరం నెత్తిమీద కూసుందని. అప్పుడు జర అన్నల భయముండె. దొర సిరిసిల్లకు మారిండు. కారు కొన్నడు. నేను కారు డ్రైవర్‌ను అయిన. గీత దాటనంత దాకనే గదా దొర ప్రేమ. దాటినమనుకో.. అగ్గిల చెయ్యి వెట్టినట్టు ముప్పే’ అంటూ చెప్పడం మొదలువెట్టిండు.
కారు వేగంగా పోతున్నది. డ్రైవర్‌కు నెమ్మదిగా వెళ్లమని చెప్పి అతడు చెప్పింది వింటుండు ఎమ్మార్వో.
* * *

‘అరె బొందా..’ పిలిచిండు దొర. లోపలినుంచి పరుగెత్తుకొచ్చిండు బొందయ.
‘వీర్నపెల్లి పోవాలెరా’ అన్నడు దొర.
అప్పుడప్పుడే పొద్దు గూకుతుంది. వరుసగా వారంనుంచి వానలు. వాగులు ఒర్రెలు పొంగి పారుతున్నయి. రోడ్డు కూడా బాగలేదు. ఈ రాత్రిపూట వీర్నపెల్లి పోవుడంటే చాలా కష్టం. అయినా ఎందుకని అడుగలేదు. ‘సరే’ అన్నడు బొందయ.
‘దొర్సానులిద్దరత్తరు. ఇట్ల వోయి అట్ల రా.. అసలే రోజులు మంచిగ లెవ్వు. రాత్రి ముచ్చట. ఔగనీ, రేపు ఒక్కముచ్చట యాది జెయ్యిరా. బండలింగంపల్లి పోతన్న. పట్వారికి చెప్పి నీకు ఇత్తనన్న భూమి నీ పేరుమీద రాయిస్త’ అన్నడు.
‘సరే’ అంటూ బొందయ్య పైకి చూసిండు. పొద్దు తల్లి కడుపుల పడ్డది. బట్ట అందుకుని కారు దగ్గరికి వచ్చిండు. అక్కడే పనిమనిషి బాలయ ఉన్నడు. ‘అరే బాలీ.. నువ్వు గూడ వోరా.. సోపతోలుంటది. నువ్వుంటే జెల్దినత్తరు. వీడసలే జాం మనిషి’ అన్నడు దొర.

బాలయకు ఎప్పటినుంచో కారు ఎక్కాలని కోరిక. బొందయను ఎన్నోసార్లు అడిగిండు కనీ వాడు సందు ఇయ్యలేదు.
‘ఆ.. పోత దొరా..’ సంబురంగా అంటూ తనూ ఓ బట్టను అందుకుని కారును తుడుచుడు మొదలు వెట్టిండు.
ఐదు నిమిషాల్లో అత్తా కోడలు ఇద్దరూ వచ్చి కారు ఎక్కి కూసున్నరు. అందరికి అన్ని జాగ్రత్తలు చెప్పిండు దొర. మరోసారి ‘బాలీ.. అరేయ్‌.. వాళ్లు ఆడోళ్లు.. జాము జేత్తరు. మీరే తొందర పెట్టాలె. పోను గంట రాను గంట. అక్కడో రెండు గంటలు అంతే. పదిటి వరకు మీరు ఇక్కడ లేరనుకో.. నీ బొక్కబొక్కకు నీళ్లు వోత్త..’ బెదిరించిండు.
బాలయకు పెత్తనమిచ్చినట్టయింది. ‘అట్లనే దొరా అద్దగంట ముందే ఉంటం సూడూ’ అంటూ ఎక్కి బొందయ పక్కన కూసున్నడు. ఎలిసిందనుకున్న వానముసురు మళ్లీ మొదలయింది. కారు ముందుకు సాగింది. పోతుంటే పోతుంటె వాన పెరిగిందిగనీ తగ్గలేదు. వెంకటాపురం దాటి పదిర చేరుకోనేసరికి మరింత జోరందుకుంది. పదిర వాగును చూసినంక బొందయ గుండె దడీలు మంది. అప్పటికి చీకటి పడింది.
‘దొర్సానీ.. మనమైతే కొనముట్టం సూడు.. నడుమల నుంచి తిరిగి వచ్చుడే. వాగుజూడు ఎంత వారుతుందో. అక్క పెల్లి వాగు మనను అస్సలు దాటనియ్యది సూడు..’ అన్నడు.
వెంటనే బాలయ అందుకుని ‘పిచ్చోడా.. తొవ్వ తెలుసుకోందే తోలినాడురా దొర.. అక్కపెల్లి వాగు దాటనియ్యకపోతే గొల్లపెల్లి మీదినుంచి పోదాం..’ అన్నడు.
ఈ మాటలు విన్నది పెద్ద దొర్సాని. వెనుకనుంచి గదరాయస్తూ ‘అరేయ్‌.. అక్కపెల్లి గొల్లపెల్లని ఇటే తిరుక్కుంట ఉంటవా.. సక్కగ రాజన్నపేట మీదికెల్లి పోని.. వాగుండది వరుదుండది. ఎల్లమ్మకాడికి తేలవోతం’ చెప్పింది.
‘ఆ.. ఔనవును.. నేను గట్లనే అనుకుంటున్న దొర్సానీ..’ అన్నడు బొందయ.

‘ఆ.. నీ బొంద.. అట్లనుకున్నోనివి ఇట్లెందుకు చెప్పినవు. దొర్సాని చెప్పకపోతె ఆగం జేత్తువు..’ దెప్పిపొడిచిండు బాలయ.
‘నీ.. నేనెన్ని సార్లు పోలేదు కాకా.. చిన్న దొర్సానిని తీసుకుని.. ఇంక అడుగు’ అన్నడు బొందయ.
ఎక్కిరిత్తున్నట్టు నవ్వి ‘అరేయ్‌.. నువ్వు చిన్న దొర్సాని పెండ్లి నుంచి వత్తున్నవు.. నేను పుట్టుక నుంచే వత్తున్న తెలుసునారా.. ఈ తొవ్వల ఒంటెద్దు కచ్చురం కొట్టింది నేనే.. దొర ఎవలను నమ్మకపోతుండె. బాలుగాడే పోవాలని నన్నే తోలుతుండె. అప్పుడు నింగంపెల్లిలనే ఉంటిమి.. కాదా దొర్సానీ..’ వెనక్కి తిరిగి అన్నడు బాలయ.
అసలే పెద్దదొర్సాని కోపం మీదుంది. మేనరికమని పట్టువట్టి తమ్ముని బిడ్డను చేసుకుంది. చేసుకున్నంక మరదలితో మాట వచ్చింది. రాకడ పోకడ బందయింది. అన్నదమ్ములకు కుడుక చెక్కర్లు పొయ్యాలని పుకారు పుట్టింది. పట్నం ఎవలు పోతరులే అనుకుంది. కాని ఏదో పని మీద తమ్ముడే ఊరికి వచ్చిండు.పాసిపోతమా ఓ పనైపోతదిలే అనుకుని ముండ్లమీద పోయినట్టు పోతుంది.
‘అరేయ్‌.. పిచ్చి పిచ్చిగుందారా.. బాతకాండ్లు గొడుతరా బండి నడుపుతరురా..’ విసుక్కుంది దొర్సాని.
ఇద్దరు భయం భయంగా మొహాలు చూసుకున్నరు. నోర్లకు తాళం పడ్డది. కారు గొల్లపెల్లి దాటి రాజన్నపేట తొవ్వ పట్టింది. సిరిసిల్ల నుంచి ఇక్కటిదాక వచ్చింది ఒకెత్తు. ఇక్కడినుంచి వీర్నపెల్లికి పోవుడు ఒకెత్తు. పైన వాన. కింద బురద. పైగా చీకటి.
వాన కొద్దిగ తెరిపినిచ్చినా ఎప్పుడో ముంత పొగలు పోసేతట్టుగా మొగులు నిండుకుంది. గుంతల రోడ్డులో పడవ ఊగుతున్నట్టుగా ఊగుతంది కారు. వట్టిగ తిడితినని ఏమనుకుందో దొర్సాని ‘బాలుగా.. బిడ్డలగ్గం ఎప్పుడు జేత్తవురా... యాడన్న కుదిరిందా..’ అడిగింది.

అదే పదివేలన్నట్టు ‘యాడ బాంచెన్‌.. మీకు తెలువకుంటనే కుదురుతదా.. పెద్దపొల్ల లగ్గమప్పుడు మీరు పూనుకుంటెనే అయింది. దీనికి గూడ అట్లనే జెరంత సాయం జేత్తిరా గడ్డకు వడుత..’ అన్నడు.
‘నువ్వు కాయం జేసుకోరా.. కట్నం కర్సు నీది కాయగూర కర్సు నాది... మరి గీ బొందడెప్పుడు చేసుకుంటడట.. వో పోడా.. జెట్టన జేసుకోరా.. మీ అవ్వకింత ఆసరుంటది..ఒక్కతి సావు జత్తుంది’ అన్నది గదరాయిస్తూ.
బొందయ సిగ్గు పడ్డడు. బాలయ అందుకుని ‘వీని పోకడ చూసిండ్రా దొర్సానీ.. సదువుకున్న పొల్ల గావన్నట.. యాడ దొరుకుతది..’ ఎక్కిరిస్తూ అన్నడు.
చిన్న దొర్సాని కిసుక్కున నవ్వింది. బొందయకు కోపమచ్చింది. ‘గట్ల నేను నీతో జెప్పిన్నా కాకా..’ అన్నడు బాలయతో.
‘ఓ దిక్కు మీ అయ్య పాటనే పాడవట్టే.. నా కొడుకు సదివిండు కోడలుగూడా సదువాలని..’ అన్నడు బాలయ.
చీకటి నిండుగా ముసురుకుంది. వాన ముసురు మళ్లీ మొదలయింది. అటో ఇటో రాజన్న పేట దాటింది కారు. అక్కడినుంచి తొవ్వ మరింత బురదగా ఉంది. ఊరు దాటగానే అడవి మొదలయింది. పెద్ద పెద్ద గుట్టలు. గుట్టలమీదచెట్లు. దారికడ్డంగా పరిగెత్తుతున్న నెమళ్లు. అక్కడక్కడా కారు లైటుకు ఆగుతున్న కుందేళ్లు. మందలు మందలుగా పోతున్న అడవి పందులు.
ఆగి ఉన్న ఓ కుందేలును చూసి కారును ఆపి ఉషారుగా ‘పడుదామా కాకా..’ అన్నడు బొందయ.
‘ఓ పోడా.. పైత్యమారా.. పోనీ. చీకట్ల వచ్చుడే ఇదంటే జంగల్ల ఆగుతవా ఇంక..’ గద్దించింది దొర్సాని.
రోడునిండా బొందలు, కయ్యలు, ఒరెల్రు. వీర్నపెల్లికి చేరుకునేసరికి గంట అనుకున్న ప్రయాణం గంటన్నర దాటింది.
కారు దిగగానే బాలయ ‘దొర్సాని జర జెట్టన గానియ్యిండ్రి... లేటయితే దొర కోపానికత్తడు..’ అన్నడు.
‘ఆ.. నేను సుట్టీర్కానికచ్చిన్నారా.. మీకంటె ఎక్కో నాకే ఉంది పోవాలని. ముందు మీరు తినుపోండ్రి. అద్దగంటల పోదాం..’ అంటూ వాళ్లకు అన్నం పెట్టమని ఎవరికో చెప్పి కోడలుతో లోపలికి పోయింది దొర్సాని.
‘బొందిగా తింటావురా.. నువ్వు మా తింటవు.. వల్లనంటవా.. నాకయితె వద్దు’ నవ్వుతూ అన్నడు బాలయ.
‘ఏ...గిప్పుడేం తింటం. రాంగనే తింటిమి గనీ ఊరు చూసొద్దాం పా.. బాగ రోజులయింది రాక..’ అన్నడు బొందయ.
‘గీ చీకట్లేం జూత్తవురా.. అయినా ఊర్లేముంది.. ఇదేమన్న పట్నమా..’ అడిగిండు బాలయ.

‘అన్నలుంటరటగదా.. ఎట్లుంటరో సూద్దాం..’ అన్నడు బొందయ.
‘అ.. నువ్వచ్చినవని ఎదురుంగత్తారురా.. వాళ్లు మనలెక్క మనుసులే..ఏ గుట్టలల్లనో చెట్లల్లనో ఉంటరు. అయినా మన దొరలు మంచోళ్లురా.. వీల్లని అన్నలేమనరు..’ అన్నడు.
‘నువ్వత్తవా రావా.. అది జెప్పు ముందు. జెట్టన తిరిగద్దాం’ కారెక్కుతూ అన్నడు.
‘అరేయ్‌.. కారును తుడుసుడే గనీ ఎన్నడెక్కింది లేదు.. నిన్ను బతిలాడితే చింతకొమ్మల్ల కూసుంటివి. లేకలేక ఇయ్యల్ల దొరికె. ఎందుకురాను.. మరి జెల్దిన రావాలె పా..’ అంటూ ఎక్కి కూసున్నడు బాలయ.
ముసురు ముసురుగా ఉంది. చల్లగాలి జివ్వుమంటుంది. వీధిలైట్లు వెలుగుతున్నయి. అప్పుడప్పుడు గొంగడి కప్పుకునో చెత్తిరి పట్టుకునో ఒకరిద్దరు తప్ప జన సంచారం లేదు. గతుకుల గతుకుల మట్టిరోడ్డు. ఒక్కోచోట పయ్యలు మునిగేంత బురద. సెకండ్‌ గేర్‌లో తప్ప కారు నడవడం లేదు. మూల మలుపుల దగ్గర ఇరుకుగా ఉండి తిరగడం కష్టంగా ఉంది. రావడమైతే వచ్చిండు గానీ ఎందుకు వచ్చినరా అనుకుంటున్నడు బొందయ. బాలయ మాత్రం సంతోషంగా చుట్టూ చూస్తున్నడు.
అటో ఇటో కారు ఊరు దాటింది. ‘ఇంతేరా ఊరు. ఎనుకకు తింపుకో, వచ్చిన తొవ్వనే పొదాం..’ చెప్పిండు బాలయ.
‘ఈ సందిలకెళ్లి పోతదిగదా..’ అడిగిండు బొందయ.

అరేయ్‌... కారును తుడుసుడే గనీ ఎన్నడెక్కింది లేదు... నిన్ను బతిలాడితే చింతకొమ్మల్ల కూసుంటివి. లేకలేక ఇయ్యల్ల దొరికె. ఎందుకురాను... మరి జెల్దిన రావాలె పా...’ అంటూ ఎక్కి కూసున్నడు బాలయ. ముసురు ముసురుగా ఉంది. చల్లగాలి జివ్వుమంటుంది. వీధిలైట్లు వెలుగుతున్నయి. అప్పుడప్పుడు గొంగడి కప్పుకునో చెత్తిరి పట్టుకునో ఒకరిద్దరు తప్ప జన సంచారం లేదు. గతుకుల గతుకుల మట్టిరోడ్డు. ఒక్కోచోట పయ్యలు మునిగేంత బురద.‘ఆ.. పోతదిగనీ...అటన్ని మాదిగిండ్లున్నయి..’
‘అయితేంది ఊరు గాదా.. పోదాం..’ అంటూ ఆటువైపు కారును మలిపిండు బొందయ.
అక్కడ వీధిలైట్లు కూడా లెవ్వు. అంతా చీకటిగా ఉంది. కారు చప్పుడువిని కొందరు లైటు వెలుతురును చూసి కొందరు బయటకు వచ్చి వింతగా చూస్తున్నరు. నాలుగిండ్లు దాటాక ఒకింటిముందు నలుగురైదుగురు మనుషులు నిలబడి ఉన్నరు.
‘అగో.. కాకా.. ఆన్నలే అంటవా..’ ఆసక్తిగా అడిగిండు బొందయ. బాలయకు కొద్దిగా భయమయింది. కంగారుగా పక్కకు చూసి గొంతు తగ్గించి ‘అన్నలు లేరు తమ్ములు లేరు.. నడుపురా.. దొర్సాని కోపానికత్తది..’ అన్నడు.
‘ఏ.. నీ కథ.. ఇప్పడిదిప్పుడే పనయిపోతదా.. గట్లనే అంటరుగనీ గంట రెండు గంటలయితది సూడూ. రాకరాక వచ్చిండ్రని ఇడువకుంట ముచ్చట వెడుతరు.’ అంటూ కారును స్లో చేసి బయటకు చూసిండు బొందయ..
ఒక్కసారిగా పెద్దగా ఏడుపు వినిపించింది. ‘యాడవోదునే బిడ్డా నేనేమిజేద్దునే బిడ్డా.. ఎంత పనాయెనే.. బిడ్డా..’ ఎవరో ఆడమనిషి. ఇంకెవరో మూలుగుతూ అరుస్తున్నరు. బయట నిలబడ్డవారు వానకు నిలువునా తడిసి ఆగమాగమున్నరు.
‘ఏంది కాక ఏమయింది.. ఎవలో ఏడుత్తున్నట్టున్నరు’ కారును ఆపి అడిగిండు బొందయ.
‘నాకేం తెలుసురా.. ముందు నువ్వు నడుపు.. పోదాం..’ గదమాయించిండు బాలయ.
బొందయకు కోపమచ్చింది. ‘ఏ.. ఆగు.. పోత పొత.. మా పోదువు తియ్యి.. అక్కడెవలో సావు కేక వెడితే నువ్వు పోతపోత నంటవు’ అంటూ కారు దిగిండు. బాలయ మాత్రం గొనుక్కుంటూ అందులోనే కూర్చున్నడు.
పక్కనే ఆగిన కారును, దిగిన బొందయను భయం భయంగా చూస్తూ మాటలు ఆపేసారు నిలబడ్డవారు. చీకట్లో వారి మొఖాలు కనిపించడం లేదు కాని భయపడుతున్నట్టు మాత్రం తెలిసిపోతున్నది. అరుపులు ఏడుపులు మాత్రం ఇంట్లోంచి అలాగే వినిపిస్తున్నయి.

వారి భయాన్ని గమనించి ముందుకు నడిచి సూరుకింద నిలబడుతూ ‘సావిత్రవ దొర్సానితోని వచ్చినం. మాది సిరిసిల్లనే. ఏమయింది ఏడుత్తున్నరు..’ అడిగిండు బాలయ.
అప్పుడే ఎవరో స్త్రీ బయటకు వచ్చింది. అక్కడ నిలబడ్డవారు ఆమె చుట్టూ చేరారు. ‘ఇగ నాతోని గాదు..పిండెం ఎదురు తిరిగింది... దవాఖాన్లకు పోతెనే బతుకుతది... ఇన్ని జేసినగని ఇంత కష్టపు కానుపు ఎవలకు సూడలేదు..’ అన్నది.
‘ఈ రాత్రి పూట వానల ఎటువోవత్తది. దవఖాన అంటే ఎల్లరెడ్డి పేట పోవాలె. ఇక్కడనా అక్కడనా.. బండిగట్టుకుని పొవాలంటె తెల్లారుతది..’ ఎవలో అన్నరు. ఇంకెవలో ‘దేవుని దయ. బండి తేండ్రి’ అంటున్నరు. అప్పుడే వాన ఎక్కువయింది.
లోపలికి వెళ్లి చూసిండు బొందయ. ఎక్కడో గుడ్డి దీపం వెలుగుతున్నది. నొప్పులు పడుతున్న యువతి అరుస్తూ కొట్టుకుంటున్నది. చుట్టూ ఉన్న అడవాళ్లు ఏడుస్తున్నరు. తల్లి మాత్రం ‘ఓ బిడ్డో ఓ బిడ్డో’ ఆని బొచ్చెంతా చరుచుకుంటుంది. బొందయకు కళ్ల నీళ్లు తిరిగినయి. మనసు వికలమై పోయింది. బయట ఎవరో ఎడ్లను తెస్తున్నరు. అదే వానలో ఎవరో బండిని సదురుతున్నరు. ఎవరో కొయ్యల చుట్టూ దోతిని చుడుతున్నరు.
అరుపులు వినలేక బయటకు వచ్చిండు బొందయ. ‘ఈ వానల.. చీకట్ల బండిమీద ఎట్ల పోతరు... పోయేదాక ఆమె బతుకుతదా..’ అడిగిండు. ఎవరూ సమాధానం చెప్పలేదు. అసలు విన్నట్టుకూడా లేదు. ఎవరి పనిమీద వారున్నరు.
ఏం చెయ్యాలో తోచలేదు బొందయకు. వెంటనే లోపలికి వెళ్లి ‘ఆమెను కారెక్కించుండ్రి.. నేను తీసుకపోత...’ అన్నడు. అందరూ భయం భయంగా చూసారు. మరోసారి అదేమాట గట్టిగా చెప్పి కారువద్దకు పరుగెత్తుకొచ్చిండు.
‘అరేయ్‌.. ఇంతసేపు ఏం జేసినవు.. నడువురా... పోదాం..’ బాలయ అన్నడు కోపంగా బయటకు చూస్తూ.

‘కాకా.. ఎవరో ఆడిమనిషి ఆపది వడుతుంది...నేను జెట్టన ఎల్లరెడ్డిపేట దవాఖానల దించివత్త.. ఏమంతసేపు అద్దగంట.. నువ్వు నాతోనేరా..’ పక్కగా వచ్చి అన్నడు బొందయ.
పిచ్చోడిని చూసినట్టుగా చూసిండు బాలయ. ‘ఔలగానివారా.. దొర సంగతి నీకు తెలువది. సంపనే సంపుతడు.. నోరు మూసుకుని నడువు.. వాళ్లు ఎవలనుకున్నవు..’ బెదిరించిండు.
బొందయ బతిమాలుతున్నట్టుగా గదువ పట్టుకుని ‘ఎవలయితేంది కాకా మనుషులే కదా.. ఆపద ఎవలకయినా ఒక్కటే గదా.. దవాఖానకు పోకుంటే రెండు పాణాలు పోతయి..’ అన్నడు.
‘పోతేపోని.. ఎవని పిండము.. ఎవని గండమురా.. నీకు బతుక బుద్దయితందా లేదా.. నడువూ..’ అన్నడు.
అప్పటికి పూర్తిగా నానిండు బొందయ. నెత్తిలోంచి నీళ్లు దారలు గట్టినయి. ‘కాకా.. మనమే అయితే ఇంటిముందు ఆగిన కారును జూసి జర వత్తరా అని అడుగుదుము. పాపం... ఇంత ఆపదలకూడా వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నరు గనీ అడుగుతున్నారా.. అమాయకులు. వాళ్ల తరపున మనమే ఆలోచించాలె..’ నచ్చజెప్పుతున్నట్టుగా మళ్లీ గదువ పట్టుకున్నడు.
అతని చేతిని విసిరి కొడుతూ ‘ఒరేయ్‌.. దొర్సానికి లేటయితదిరా పిచ్చోడా.. దొర చెప్పింది విన్నవు గదా..’ అన్నడు.

వినిపించుకోలేదు బొందయ. ‘గంట అరగంట లేటయితే ఏమయితది కాకా.. పాణాలేం పోవుగదా.. ఇక్కడ పాణాలే పోతున్నయి.. మన అక్కనో చెల్లెనో అయితే ఇట్లనే ఊకుందుమా..’ అంటూ వెనక డోరు తెరిచిండు.
అతని నిర్ణయం ఏమిటో తెలిసిపోయింది బాలయకు. అరుస్తున్నట్టుగా ‘నీకు మర్యాదగ చెప్పితే ఇనరాదురా... తంతనే సక్కగైతవు.. బాడుకావ్‌.. వత్తవా లేదురా’ అంటూ కారు దిగి చెయ్యెత్తిండు.
బొందయకు సహనం నశించింది. బతిమాలితే వినడని తెలిసిపోయింది. ఎత్తిన చేతిని అలాగే అందుకుని వడి తిప్పుతూ ‘అరేయ్‌.. బాలుగా.. ఎంతసేపూ, దొరా దొర్సాని అని తప్ప మనిషిలా ఆలోచించవారా.. ఓ గంటలో వత్తనన్నగదా.. జెరంత లేటయితే ఎవలకేం నొత్తందిరా. అక్కడ పాణాలు పోయినా లెక్కలేదారా.. నాతోని వత్తవా.. పీకుతవా..’ అన్నడు అరుస్తున్నట్టుగా.
ఆ అరుపునకు ఒక్కసారి గజ్జుమన్నడు బాలయ. కన్నెర్రజేసి చూస్తూ ‘దొర్సానిని గంత మాటంటావురా.. ఎంత కావురంరా నీకు..అగు నీ సంగతి చెప్పుత. నువ్వు ఎట్ల పోగువోత్తవో సూత్త’ అనుకుంటూ వానలోనే నడుచుకుంటూ వెళ్లిపోయిండు.
ఇద్దరు మగ మనుశులు ఆడమనిషిని ఎత్తుకచ్చి కారులో కూర్చోబెట్టారు. ఆమెతోపాటు తల్లికూడా ఎక్కి కూర్చుంది. నొప్పులు ఎక్కువయినట్టున్నయి. ఇంకా ఎక్కువగా అరుస్తున్నది. కారును చూడగానే తల్లికి ధైర్యం వచ్చినట్టుంది. ఏడుపును ఆపి కూతురుకు ధైర్యం చెబుతుంది. ఎక్కుదుమా వద్దా అని బిడియపడుతున్నట్టున్నరు మిగతావారు. వానలో తడుస్తూ బయటనే నిలబడ్డరు. వారిని ఎక్కమని కారును ముందుకు నడిపిండు బొందయ. ఊరు దాటేదాక బాలయ ఎవరినైనా తెచ్చి అడ్డుకుంటాడేమోనని భయమయింది. ఊరు దాటినంక కారు వేగాన్ని అందుకుంది.

‘అరేయ్‌... బాలుగా...ఎంతసేపూ, దొరా దొర్సాని అని తప్ప మనిషిలా ఆలోచించవారా...ఓ గంటలో వత్తనన్నగదా.. జెరంత లేటయితే ఎవలకేం నొత్తందిరా. అక్కడ పాణాలు పోయినా లెక్కలేదారా.. నాతోని వత్తవా... పీకుతవా..’ అన్నడు అరుస్తున్నట్టుగా. ఆ అరుపునకు ఒక్కసారి గజ్జుమన్నడు బాలయ. కన్నెర్రజేసి చూస్తూ ‘దొర్సానిని గంత మాటంటావురా.. ఎంత కావురంరా నీకు.. అగు నీ సంగతి చెప్పుత.ఆమె అరుపులతోపాటు వర్షం కూడా ఎక్కువయింది. గతుకుల దగ్గర ఎంత జాగ్రత్తగా నడిపినా కారు ఎగిరెగిరి పడుతుంది. అరుపులు వింటుంటే కారులోనే చనిపోతుందా అని భయం పట్టుకుంది బొందయకు. వచ్చినప్పుడున్నంత సులువుగా లేదు ప్రయాణం. ఎల్లారెడ్డిపేటకు చేరుకునేసరికి అరగంట అన్నది గంట పట్టింది. కాని, హాస్పిటల్‌లో డాక్టర్‌ లేదు.
అందరికీ గుండెలో రాయి పడ్డట్టయింది. బొందయకు పాణం జల్లుమంది. ఇక్కడ దించి వెంటనే వెళ్దామనుకుస్నడు. అప్పటికే రక్తంతో సీటంతా తడిసింది. అరిచి అరిచి ఆమే నీరసించింది. ఆలోచించేంత సమయంకూడా లేదు. ఏదయితే అదయిందని సిరిసిల్లకు తీసుకపోయాడు. దారిలో విరిగిపడ్డ చెట్లు తెగిపోయిన రోడ్లు దాటుకుని సివిల్‌ హాస్పిటల్‌ చేరుకునేసరికి మరోగంట పట్టింది.
డాక్టర్లు అందుబాటులోనే ఉన్నరు. వెంటనే లోపలికి తీసుకెళ్లారు. అందరూ లోపలికి వెళ్లారు. బొందయ మాత్రం భయంగా అలసటగా అక్కడనే కూర్చున్నడు. దొర దొర్సాని ఎవరూ గుర్తుకు రావడం లేదు. కానుపు కాక తల్లడిల్లిన ఆమె.. బిడ్డకోసం గుండెలు బాదుకున్న తల్లి వీరే కనిపిస్తున్నరు. ఏమయితుందా అని ఆందోళనగా ఎదురు చూస్తున్నడు. పావు గంటలో చంటిపిల్ల ఏడుపు వినిపించింది. అరిచి అరిచి ఆగిపోయిన ఆమె అరుపులాగే ఆకాశం కూడా శాంతించింది.
‘మొగ పిల్లగాడు.. మొగ పిల్లగాడు’ ఎవరో మురిపెంగా అంటున్నరు.
ఆ మాట వినంగనే బొందయకు అలసటంతా పోయింది. ఆనందంగా లేచి నిలబడ్డడు. అప్పుడు గుర్తొచ్చిండ్రు దొర దొరసాని, బాలయ.. వచ్చిన పని. ముందుకు నడువబోతూ పిలుపు వినిపించి ఆగి వెనక్కి తిరిగిండు బొందయ. ఆమె తల్లి చంటిగుడ్డును ఎత్తుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. బొందయ కాళ్లమీద వేసి కళ్లనీళ్లు తీసుకుంటూ ‘దేవుని లెక్క వచ్చినవు బిడ్డా’ అన్నది. పిల్లవాడిని దీవిస్తున్నట్టు చిన్నగా తాకి ముందుకు నడిచిండు బొందయ.
వెళ్తుంటే ‘కొడుకా.. నీ పేరేంది..’ అడిగింది తల్లి.
‘బొందయ.. చచ్చేటోన్ని బతికిన్నట. అందుకే ఆ పేరు పెట్టుకున్నరు’ అంటూ కారు వద్దకు వచ్చిండు.
* * *

చెప్పడం ఆపి ఊపిరి పీల్చుకుని సీటు వెనక్కి వాలిండు బొందయ. అతని ముఖంలో ఏదో బరువు దిగిన భావన.
‘తర్వాత ఏం జరిగింది. ఆ తల్లి పిల్లల్లో ఎవరైనా కలిసారా..’ ఆసక్తిగా అడిగిండు ఎమ్మార్వో.
‘కారును మొత్తం కడుక్కున్న. అదే రాత్రి వీర్నపెల్లికి పోయిన. ఎవలూ లేరు. తిరిగి సిరిసిల్లకు దొర ఇంటికి వచ్చిన. అప్పటికి బలబల తెల్లారుతున్నది. కాళ్లు చేతులు వణుకుతున్నయి. తప్పయిందని దొర కాళ్లు మొక్కుదామనుకున్న. బాలయ ఎంత ఎక్కిచ్చి చెప్పిండోగని వంట జేసే లచ్చక్క వాకిట్లనే కలిసి ‘దొర్సానిని గంతమాటంటావురా ముం.. కొడుకా.. దొర నీకోసమే సూత్తండు. జరాగు నీలగ్గమైతది’ అన్నది. నాకు ధైర్యం ఆసలేదు. కారు అక్కడ పెట్టి భీవండి బస్సెక్కిన. రెండేండ్ల దాక ఇంటిమొఖం సూడలేదు. ఆ తర్వాత నేనెప్పుడూ వీర్నపెల్లి పోలేదు. తల్లి పిల్లలు ఎవలూ నాకు కలువలేదు’ చెప్పిండు.
ఎమ్మార్వో చిన్నగా నవ్విండు. అతని మొఖం నిండా పరవశం. ఏండ్లకేండ్లు తపస్సు జేసినంక కనిపించిన దేవున్ని చూసినట్టు బొందయను చూసిండు.
‘మనం మంచి చేస్తే మంచే జరుగుతది బాపూ. అది నీకే జరుగాలని లేదు. జనాలకు జరిగితే చాలు. నాతో చాలమంది పేద ప్రజలకు మంచి జరుగుతుంది. అన్నట్టు ఆ తల్లి నీపేరెందుకు అడిగిందో తెలుసునా. నాకు పెట్టుకోవడానికే. నువ్వు ఆనాడు పాణంపోసి మంచి చేసిన ఆ పసిగుడ్డును నేనే.. నా పేరు బొందయ..’ అంటూ బిగ్గరగా అలుముకున్నడు ఎమ్మార్వో.
peddinti-ashok-kumar

రచయిత పరిచయం

తెలుగు సాహిత్యంలో పరిచయం అక్కర్లేని పేరు పెద్దింటి అశోక్‌ కుమార్‌. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి పేటలో జన్మించారు. వృత్తిరీత్యా గణిత ఉపాధ్యాయులు. M.Sc B.Ed చదివారు. ఇంతవరకు 200 కథలు, ఆరు నవలలు, వందకు పైగా సామాజిక వ్యాసాలు, ఐదు నాటకాలు రాశారు. ఏడు కథా సంకలనాలను ప్రచురించారు. ‘ఓ అక్రమన్‌ కబ్‌ కా హో చుకా’ పేరుతో హిందీలో, ‘ఓ ఘర్‌ బంద్‌ డాలియా’ పేరుతో మరాఠీలో కథా సంకలనాలు వెలువడ్డాయి. కొన్ని కథలు హిందీ ఇంగ్లీషు మరాఠీ కన్నడలోకి అనువాదం అయ్యాయి. ఆయన రాసిన జిగిరి నవల 9 భాషల్లోకి అనువాదమయింది. తెగారం నాటకానికి నంది అవార్డు వచ్చింది. తెలంగాణ ఉద్యమ చరిత్రను రికార్డు చేస్తూ కథలే కాకుండా యథార్థ సంఘటనలతో ‘పోరుగాలి’ నాటకాన్ని, ‘లాంగ్‌ మార్చ్‌' అనే నవలను కూడా ఈ మధ్య రాశారు. ఐదు సినిమాలకు రచయితగా పని చేశారు. మల్లేశం సినిమాకు ఆయన రాసిన మాటలు, ఒక పాట అందరి మన్ననలను అందుకున్నాయి. ఆరు చిన్న సినిమాలకు కథలను అందించారు. భారతీయ భాషా పరిషత్‌ యువ పురస్కారంతోపాటు ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతీకాత్మకంగా కథలు రాయడం తన ప్రత్యేకత. తెలంగాణ భాష నానుడులు సామెతలకు పెట్టింది పేరు పెద్దింటి. ఆయన రాసిన ‘మాయి ముంత’, ‘ఊటబాయి’, ‘భూమడు’, ‘జుమ్మేకిరాత్‌ మే’ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలకు కథలు, మాటలు రాస్తున్నారు.

1006
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles