దసరా వచ్చింది.. సరదా తెచ్చింది!!


Sun,October 6, 2019 01:19 AM

Dussehra
దసరా వచ్చిందంటే చాలు.. దేశంలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహాలో కనీవినీ ఎరుగని స్థాయిలో దసరా వేడుకలు జరుగుతాయి. నవరాత్రులు పేరుతో నిర్వహించే ప్రతి వేడుకకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎప్పడూ ఒకే ఊరిలో ఒకే తరహా దసరా ఉత్సవాలను చూసి బోరుకొట్టిందా? అయితే ఈ ఏడాది దసరాను భిన్నంగా జరుపుకోవాలంటే తప్పకుండా దేశంలోని కొన్ని ప్రాంతాలను సందర్శించాల్సిందే. ఓ వైపు దసరా ఉత్సవాల్లో పాల్గొన్నట్లు ఉండడంతో పాటు పర్యాటక ప్రదేశాలనూ సందర్శించినట్లు ఉంటుంది. అందుకే ఈసారి భిన్నమైన దసరా ఉత్సవాలను చూసొద్దామా?

- మధుకర్‌ వైద్యుల
Dussehra1

తెలంగాణ బతుకమ్మ

దసరా నవరాత్రుల కాలంలోనే తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే అందమైన వేడుక ఇది. అమ్మవారిని ‘ప్రకృతి స్వరూపిణి’గా భావించి, వివిధ పుష్పాలతో వరసగా అలంకరించి ‘బతుకమ్మ’గా ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆటపాటలతో సాగే ఈ వేడుక తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నది. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవంలో నవవిధ భక్తిమార్గాలు, నవ నిధులకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పుష్పాలతో తొమ్మిది వరుసల్లో అమరుస్తారు. తొమ్మిది రోజులూ గౌరీదేవిని..బతుకమ్మగా పుట్టింటికి వచ్చిన తమ ఇంటి ఆడబిడ్డగా ఆరాధిస్తారు.
Dussehra2

కోల్‌కతా దుర్గాపూజ

పశ్చిమ బెంగాల్‌లో అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరుపుకునే వేడుక దసరా. బెంగాల్‌ ప్రజలు ఈ పండుగను దుర్గాపూజ లేదా పుజొ పేరుతో జరుపుకుంటారు. దసరా సందర్భంగా కోల్‌కతా నగరమంతా సినిమా సెట్టింగులను తలపించే పెద్ద పెద్ద పెండాళ్లు (మండపాలు) ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క మండపానికి ఒక్కో ప్రత్యేక థీమ్‌ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో లక్షలు వెచ్చించి మరీ మండపాలను తీర్చిదిద్దుతారు. అంతేకాదు, ‘బొనెది బరీ’ పేరుతో కోల్‌కతాలో ఉండే రాజభవనాల్లో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కూడా ఇదే తరహాలో వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే మండపాల మధ్య పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడి అమ్మవారి విగ్రహాల్లో జీవకళ ఉట్టిపడుతుంది.
Dussehra3

ఢిల్లీ రామలీల

దసరారోజు ఢిల్లీలో వేడుకలు అం బరాన్నంటుతాయి. రామలీల మైదానంలో రావణ దహన కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొంటారు. 170 ఏళ్ల కింద మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ ఈ వేడుకలను ప్రారంభించినట్లు సమాచారం. కంజక్‌ పూజా పేరుతో పూరీ, హల్వా, చెనాలను ప్రసాదంగా ఇస్తారు. రెస్టారెంట్లలో నవరాత్రి స్పెషల్‌ వంటకాలను వడ్డిస్తారు. నవరాత్రుల ఆఖరి రోజు రామలీలా మైదానంలో ఏర్పాటుచేసే రావణ, మేఘనాథ, కుంభకర్ణ బొమ్మలను దహనం చేస్తారు.

కులశేఖరపట్టణం

తమిళనాడులోని కులశేఖరపట్టణంలో పది రోజుల పాటు ‘కులసాయి పండుగ’ పేరుతో దసరా వేడుకలు నిర్వహిస్తారు. ప్రసిద్ధ ముతరమ్మన్‌ ఆలయం వద్ద ఇవి జరుగుతాయి. వివిధ నృత్యాలు, నాటకాలు, ఆటపాటలతో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. తరాయ్‌ తప్పట్టం నృత్యాలు ఆకట్టుకుంటాయి.
Dussehra4

కులు దసరా

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు.. ప్రకృతి అందానికే కాదు, దసరా వేడుకలకూ ప్రత్యేకమే. ఈ అక్టోబర్‌లో కులు మనాలి పర్యటనకు వెళ్లేవారు తప్పకుండా దసరా వేడుకలను చూడాల్సిందే. కులులోని ధలపూర్‌ మైదానంలో రఘునాథ రథయాత్ర నిర్వహిస్తారు. కులు సమీపంలోని వివిధ గ్రామాల నుంచి 200లకు పైగా విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1637లో రాజా జగత్‌సింగ్‌ ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. దేశంలో దసరా వేడుకలు ముగిసిన తర్వాత విజయదశమి నుంచి కులు దసరా వేడుకలు ప్రారంభమవుతాయి.ఇక్కడ రావణ విగ్రహానికి బదులు ఆకులు, గడ్డి కాల్చుతూ ‘లంకా దహనం’ నిర్వహిస్తారు.
Dussehra5

చెన్నై బొమ్మల కొలువు

దసరా రోజు చెన్నై వెళ్తే.. బొమ్మల కొలువులను చూడొ చ్చు. వేడుకల్లో భాగంగా చెక్క అల్మారాల్లో దేవుడి బొమ్మలను అందంగా అలంకరిస్తా రు. ఈ అలంకరణల్లో కూడా ప్రత్యేకథీమ్‌లు ఉంటాయి. రామాయణం, మహాభారతం థీమ్‌లలో బొమ్మలను ఏర్పాటు చేస్తారు. వీటి మధ్య పోటీ కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ఈ పండుగను బొమ్మై కలు అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో బొమ్మల కొలువు, కర్ణాటకలో బొమ్మె హబ్బా అని పిలుస్తారు.
Dussehra6

వారణాసి రామలీల

మైసూర్‌: దసరా ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు. నవరాత్రి వేడుకలను విజయదశమితో కలిపి పది రోజుల పాటు నిర్వహిస్తారు. మైసూరులో చేసే దసరా వేడుకలకు దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది.

దసరా వేడుకల్లో ప్రత్యేకం ‘వారణాసి రామలీల’. 1800 సంవత్సరం నుంచి సాంప్రదాయకంగా వస్తున్న ఈ వేడుకను రామ్‌నగర్‌ కోటలో నిర్వహిస్తారు. ఈ కోట మొత్తాన్ని ఓ భారీ వేదికగా మార్పు చేశారు. ఇక్కడ అయోధ్య, లంక, అశోకవాటిక రూపంలో పర్మినెంట్‌ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు.
Dussehra7

బస్తర్‌ దసరా

దసరా అంటే తొమ్మిది రోజులే జరుకుంటారని భావిస్తే పొరపాటే. చత్తీస్‌ఘడ్‌ ఆదివాసీలు 75 రోజుల పాటు దసరా వేడుకలు నిర్వహిస్తారు. బస్తర్‌ దసరాను ప్రకృతి ఆరాధనగా భావిస్తారు. దేవీ దంతేశ్వరికి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. 13వ శతాబ్దంలో బస్తర్‌ రాజు పురుషోత్తమ్‌ దేవ్‌ జగదల్‌పూర్‌లో ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. వేడుకల్లో భాగంగా చెట్లను ఆరాధిస్తారు. దేవికి పూజలు చేస్తూ ఆదివాసీ సాంప్రదాయాల్లో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకలు చాలా భిన్నంగా ఉంటాయి.
Dussehra8

అహ్మదాబాద్‌ నవరాత్రులు

గుజరాత్‌లో నవరాత్రి వేడుకలను కనులపండువగా నిర్వహిస్తారు. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో జరిగే వేడుకల్లో ప్రదర్శించే గర్బా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డోలు భాజాలు వాయిస్తూ రంగు రంగుల దుస్తుల్లో కళాకారులు ప్రదర్శించే నృత్యాలు ఆకట్టుకుంటాయి. అమ్మవారికి నిర్వహించే ‘గుజరాతీ హారతి’ నృత్యం తప్పకుండా చూడాల్సిందే.
Dussehra9

ఆంధ్రప్రదేశ్‌ సిరిమాను

ఇంద్రకీలాద్రిలో దసరా వేడుకలు అంబరాన్ని తాకుతాయి. కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవం కనువిందు చేస్తుంది. పశ్చిమ గోదావరిలో ఏనుగుల సంబరాన్ని తప్పక చూడాలి. విజయనగరంలో దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నిర్వహించే సిరిమాను ఉత్సవాన్ని తప్పకుండా చూడాల్సిందే.

529
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles