ఒట్టిపోయిన అడవి


Sun,October 20, 2019 01:06 AM

adavi
అప్పటిగూడ వానలు పడవంటడా ఏంది? ఎవరికి తోచినట్టు వాళ్ళు ముసలయ్య మీద గయ్యిన లేచారు.మీలెక్కన్నే నాకు తోసింది. నేను జెప్పిన. అండ్ల తప్పేముంది? మరోసారి కల్లు కోసం చేతిలోని దొప్పను ముందుకు చాపుతూ అన్నాడు ముసలయ్య.అతని మాటల్లోని వాస్తవాన్ని అర్ధం చేసుకున్న కాబోయే వియ్యంకులిద్దరూ ఏంజేద్దాం? అన్నట్టు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
శిరంశెట్టి కాంతారావు
సెల్: 98498 90322

నుబోతులగూడెం నడిమిగుంపు పెద్ద పధ్ధం అడివయ్య ఊరు మధ్యనున్న దేవరచెట్టు కింద నిల్చుని కడుపులో పేగులన్నీ నోట్లోకొచ్చేటట్టు బుక్కబట్టి మూడుసార్లు హక్కుం (అర్ధచంద్రాకృతిలో వుండే చిన్న బూర) ఊదాడు.ఆ నాదాన్ని విన్న గుంపు మొత్తం బిర బిర మంటూ వచ్చి అతణ్ణి చుట్టుముట్టింది.అక్కడ చేరిన వాళ్ళందరి వంక చూస్తూ నా కిప్పుడు డ్బ్బై రొండేండ్లు. ఇప్పటిదాకా నా జన్మల ఇంత ఒరుపు ఎరగ. నాలుగేండ్లసంది పట్టుమని రొండు దుక్కుల వానగూడ పడ్డపాపాన పోలేదు. ఆడివిల కాయ గసరు, దుంప దుట్ట అన్నీ బంగారమైపోయినై. పుట్టిన గడ్డనిడి మనం ఇటు దిక్కొచ్చిన రోజుల్ల ఈ లోతువాగు యాడాది పొడుగున నడుముల్లోతున పార్తనే వుండేది. మరిప్పుడుజూస్తే నిండువానకాలంగూడ మోకాటిలోతునన్న పట్టుమని పదిరోజులు పారట్లేదు.పుబ్బకార్తెగూడ సాంతిమి ఎల్లకముందల్నే ఎండిపోయిన వాగులబడి, లారీలకొద్ది ఇసిక తోల్కపోతున్నరు. ఇసికతోడిన వాగు సచ్చిన కొండసిలువ బొక్కలగూడు లెక్క కనబడ్తాంది.లారీలోల్లు తోడుపోంగ మిగిలిపోయిన వాగు ఇసికెల సెలిమలుతోడుకోని ఆ నీల్లతోటె పశులు,మేకలు, మనం కనాకష్టంగ రోజులు ఎల్లదీస్తున్నం. కడుపునిండ రెండుపూటలబువ్వలేకపోయినా వొకపూట వాగునీల్లన్నతాగి బత్కోచ్చన్కుంటే, సెలిమల్లగూడ గుటికెడు నీల్లు దొర్కుత లెవ్వాయె. మరింగ మనం బత్కేదెట్ల? అంటూ తన మనసులోని ఆవేదననంతా వెళ్ళగక్కాడు.అతని మాటలిన్న గుంపంతా మరిప్పుడేంజేద్దామా? నువ్వే జెప్పు! అంది.ఆయిన్నేం జెప్పమంటరు? నిన్నగాక మొన్న ఈసం పుల్లన్న ఇంట్లో ఏం జరిగిందో మీకు తెల్వదా? బలంగా ఊపిరి తీసుకుంటూ అన్నాడు పూజారి కంపయ్య. అతని మాటలను విన్న గుంపు మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమై పోయింది.

మనుబోతులగూడెం ఎగువ గుంపు ఈసం పుల్లన్న బిడ్డ గట్టెమ్మకు, నడిమిగుంపు వాసం సుకన్న కొడుకు చిగురన్నకు అడివికి మేకలు కాయబోయినకాడ మనసులు కలిశాయి.ఏ ముచ్చట దాగినా ఆ ముచ్చట దాగదన్నట్టు వాళ్ళ ప్రేమ సంగతి త్వరలోనే రెండు గుంపుల్లోనూ తెలిసిపోయింది.ఓ రోజు రెండు గుంపుల పెద్దమనుషులు పుల్లన్న ఇంటిముందు కూర్చుని మంచీ-చెడూ మాట్లాడుకొన్న తరువాత పూజారి కంపన్నతో పెండ్లి ముహూర్తం పెట్టు అన్నారు.కొంతసేపు తన్లో తాను ఏదో కూడబలుక్కుని రోణికార్తె జొరబడ్డ మూడోరోజు గుంపు అడివికి పొయ్యే పొద్దుల లగ్గం ఖాయం జేస్తున్న అంటూ ముహూర్తం పెట్టాడు.పుల్లన్న తన ఇంటివెనుకనున్న జీలుగుచెట్ల కల్లు దింపించుకొచ్చాడు. పుల్లన్న భార్య పువ్వమ్మ పొయ్యిమీద వుడికున్న చిక్కుడు గుగ్గల్లు పోపు నేసింది.ఇరుగు పొరుగు ఆడవాళ్ళల్లో కొందరు పారుటాకు దొప్పలు కుట్టి అక్కడున్న వాళ్ళందరికీ పేరుపేరున అందిస్తే.. మరికొందరు వాటిల్లో కల్లు నింపసాగారు.కల్లుతాక్కుంటూ, గుగ్గిల్లు తినుకుంటూ పెండ్లి ఎట్లెట్ల చెయ్యాల? అన్న ఆలోచన చెయ్యసాగారు.అందరి మాటలు వింటూ అప్పటిదాకా నిశ్శబ్దంగా కూర్చున్న వృద్ధుడు తాటి ముసలయ్య అసలు సంగతి పట్టించుకోకుంట అట్ల ఏందేందో మాట్లాడ్తున్నరేంది!? బోసినోటిలో పోసుకున్న గుగ్గిల్లను దౌడలతో ఒత్తి నములుకుంటూ అన్నాడు.ఏందో సెప్పరాదు అన్నాడు పెండ్లికొడుకు తండ్రి సుక్కన్న.ఏంజెప్పాల? కత్తెర్లనే ఇంతగనం ఎండలు కాస్తున్నై, మూర్తం జూస్తే ఇంక పద్దినాలుగూడ లేదు.

ఇప్పటికే సెలిమలన్ని బిక్కిపొయ్యి, తాగనికే నీల్లుదొర్కుతలెవ్వు. మరి కాలం గిట్లనేవుంటే రేపు పెండ్లి నాటికి నీల్లకు ఎంత కస్టమైతదో ఆలోసించిండ్రా? నీల్లులేకుంట పెండ్లెట్ల జేద్దామను కుంటుండ్రు? ముఖం మీది ముడుతలు జీవితానుభవాన్ని సూచిస్తుంటే తన మనసులోని ఆలోచనను బయటపెట్టాడు ముసలయ్య.ఈ ముసలోనికి ఎక్కల్లేని అనుమానాలొస్తయి. అన్ని సొండి మాటలు మాట్లాడ్తుంటడు అప్పటిగూడ వానలు పడవంటడా ఏంది? ఎవరికి తోచినట్టు వాళ్ళు ముసలయ్య మీద గయ్యిన లేచారు.మీలెక్కన్నే నాకు తోసింది. నేను జెప్పిన. అండ్ల తప్పేముంది? మరోసారి కల్లు కోసం చేతిలోని దొప్పను ముందుకు చాపుతూ అన్నాడు ముసలయ్య.అతని మాటల్లోని వాస్తవాన్ని అర్ధం చేసుకున్న కాబోయే వియ్యంకులిద్దరూ ఏంజేద్దాం? అన్నట్టు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

ముందైతే మూర్తం పెట్టుండ్రి. పెండ్లికి నీల్లు దొర్కుతయో, లేదోనని మూర్తం బెట్టుకోకుంట కూసుంటెట్ల? ఒకేల వానలు పడితే? అప్పటికప్పుడు రమ్మంటే సుట్టాలొస్తరా అన్నారు కొంతమంది యువకులు.వాళ్ళ మాటలకు పెద్దవాళ్ళెరూ బదులు చెప్పలేక సరే మూర్తం ఖాయం జెయ్యి! పూజారి కంపయ్యతో అన్నారు.అదేం చిత్రమోగాని! గడ్డెమ్మ, చిగురన్నల పెండ్లి ముహూర్తం పెట్టుకున్న దగ్గర్నుండి ముసలయ్య అన్నట్టుగా ఎండలు అంతకంతకూ ముదిరిపోతున్నాయి తప్ప వర్షం పడేసూచనలు కనుచూపుమేరలో కన్పించడం లేదు.అసలే అంతంత మాత్రంగా నీల్లు దొరికే వాగులో చెలిమలన్నీ పూర్తిగా ఇంకిపోయాయి. ఇక దాంతో గత్యంతరంలేక గుంపంతా మరింత దూరం వాగుదిగువకు బొయ్యి చెలిమలు తోడారు.కొద్ది కొద్దిగా ఊరుతున్న నీల్లను లోటాలతోను, గ్లాసుల్లోనూ ఎత్తి కుండల్లో పోయడానికి వీలుగాక పాతబట్టలను నీల్లమీదవేసి, అవి పీల్చుకున్న నీళ్ళను కుండల్లోకి పిండుకోసాగారు.ఆ విధంగా వాళ్ళు పాతబట్టలనే స్పాంజ్లుగా చేసుకొని ఒక్కోనీటి బొట్టును ఒడిసిపట్టుకొని ప్రాణాలను నిలబెట్టుకోసాగారు.సాధారణంగా గుంపుల్లో మగవాళ్ళు బుడ్డగోసులు పెట్టుకుని, వాటిమీద ముదురురంగు గల్ల తువ్వాలలు చుట్టుకుని వాటిమీద రంగు రంగుల బనీన్లు వేసుకుంటారు.

అడవాళ్ళు నాసిరకం లోలంగాలు తొడుక్కుని వాటిమీద చీరతుంపులను లుంగీల మాదిరిగా చుట్టుకుంటారు. జాకెట్లు వున్నవాళ్ళు, లేనివాళ్ళుకూడా ఛాతికి అడ్డంగా తువ్వాలలనో, పాతగుడ్డలనో మెడలమీదికి తీసి కట్టుకుంటారు.ఆడమగ తేడాలేకుండా చిన్న పిల్లలంతా వంటిమీద బట్టల్లేకుండానే తిరుగుతుంటారు. మామూలుగా గుంపుల్లో వాళ్ళు స్నానాలు చెయ్యాలనుకుంటే వాగుకెళ్ళి స్నానాలు చేసి, బట్టలు పిండుకుని వస్తుంటారు.మరిప్పుడు తాగటానికే నీల్లు దొరక్క వాళ్ళు కిరుసుగడ్డలు నములుతూ దప్పిక తీర్చుకుంటుంటే ఇంక స్నానాలెక్కడ చేస్తారు? స్నానాల్లేక, బట్టలు మార్చుకోక,చమరకాయలతో శరీరాలు వట్టిపోయి పిల్లలు పెద్దలు నానా ఇబ్బందులు పడసాగారు.పశువులు, మేకలు, ఆవులు, పందులు నీల్లకోసం వెంపర్లాడిపోతుంటే, కొంతమంది వాటి బాధ చూడలేక నీల్ల తావుల్లో వున్న తమ చుట్టాల దగ్గరికి వాటిని తోలుకుపోయారు.

అట్లాంటి వసతిలేని వాళ్ళు సంతలకు తోలుకుపోయి అడ్డికి పావుశేరన్నట్టు వచ్చిన కాడికి అమ్మేసుకున్నారు. పొద్దునలేస్తే ప్రాణాలన్నీ చూపుల్లోకి తెచ్చుకుని మబ్బులవంక ఆశగా చూస్తూ రోజొక యుగంగా బతుకుతున్నారు.ప్రాణాలు నిలబెట్టుకోడానికి ఆసరాగా మిగిలున్న ఒకటిరెండు చెలిమెలమీద రాత్రివేళల్లో ఏ అడవి జంతువులోపడి ఊరిన ఆ కాసిని నీళ్లను తాగి పోతాయన్న భయంతో వాటిచుట్టూ దట్టంగా ముండ్లకంచెలు ఏర్పాటుచేశారు.గడ్డెమ్మ, చిగురన్నల పెండ్లి ఇంకో ఐదురోజులుందనగా ఆ సాయంత్రం రెండుగుంపుల పెద్దమనుషులు గడ్డెమ్మ వాళ్ళ ఇంటిముందు కూర్చుని తాగనికే నీల్లులేక పూట పూటకు సచ్చి బత్కుతుంటే ఇంగ పెండ్లి జేసేదెట్ల? అంటూ పెండ్లిని నిరవధికంగా వాయిదా వేశారు.

చూస్తుండగానే మరో వారం పది రోజులు పడమటికొండల్లో కుంగిపోయాయి. ఎక్కడా వానచుక్క జాడలేదు.
అలుకుపిడచల మాదిరిగా బతుకులు పిడచ కట్టుకుపోతుంటే వద్యశిలమీది గొర్రెపిల్లల మాదిరిగా ఏమీచేయలేక సినుకు పడ్డదాన ఇండ్లకు తడికలు అడ్డంకట్టి కొన్నాల్లపాటు, బద్రాచలం దిక్కుబొయ్యి పానాలు నిల్పుకుందాం అనుకోసాగారు.గుంపుకేదన్న ఆపదొస్తే దాన్ని దాటేటంద్కు నేనే ఏదన్న తొవ్వ జూపిచ్చాల. పూజారిగ అది నా ధర్మం అనుకున్న కంపయ్య ఓరోజు రాత్రి గుంపునంతా దేవరగద్దె దగ్గరపోగేసి మృగశిర కార్తెగూడ ఎల్లిపొయ్యి ఆరుద్ర సెరిసగాన పడ్డది. అయినా, వానసినుకు జాడలేదు. అందుకే ఎట్లనన్నజేసి వచ్చే ఆదారంనాడు భూమి పండగజేద్దాం. అప్పుడన్న పేన్కు మనమీన దయజూపిచ్చి వాన కురిపిస్తడేమో అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
వరదన కొట్టుకుపోయేవాడికి పూచిక పుల్లదొరికినా అదో వటవృక్షంలా భావించి దాని సాయంతో గట్టెక్కొచ్చనుకుంటాడు. పూజారి మాటలను అదే విధంగా భావించిన గుంపంతా వెంటనే సరే! అంటే సరే! అంది.

గుంపులో ఇండ్లన్నీ గుంజలమీద నిట్టాడు వేసి, దానికి వాసాలు కొడతారు. వాటిమీద పెండెకట్లుకట్టి గుట్టగడ్డితో కప్పుతారు. గుంజల్ని కలుపుతూ ఇంటిచుట్టూ జానపొరకతో దళ్ళుకడతారు. ఆ దళ్ళమీద పాటిమట్టి, ఆవుపేడలతో లోపల వెలుపల నున్నగా అలుకుతారు. ఇంటిని, ఇంటిముందుండే అరుగులను కూడా అదే విధంగా అలుకుతారు.
ఇంటిలోపల, అరుగులమీద సున్నంతో చుక్కల ముగ్గులు వేస్తారు. ఇంటికి వెనుకపక్క తప్ప మిగిలిన మూడుపక్కలావుండే గోడలమీద తమ ఇలకట్ల (ఇంటి పేర్ల) చరిత్రను తెలిపే పటం బొమ్మలు వేస్తారు.

ఆవులకు, మేకలకు దొడ్లను, కోల్లకు, పావురాలకు గూల్లను ఏర్పాటు చేస్తారు. ఇంటింటికి ఒకటో రెండో తాటి, జీలుగు, మామిడి చెట్లను పెంచుతారు. చూడ్డానికా ఇండ్లు అందంగా, ప్రశాంతంగా ఋష్యాశ్రమాల్లా వుంటాయి. అటువంటి ఇండ్లిప్పుడు నీల్లులేక మిడతల దండుపడిన జిల్లేడుపొదల మాదిరిగా అయిపోవడంతో అటువంటి ఇండ్లల్ల పండగెట్ల జెయ్యాల? అన్న ఆలోచనతో అడవాళ్ళంతా మౌనంగా నిల్చుండిపోయారు.వాళ్ళ మౌనం వెనుకనున్న వేదనను అర్థం చేసుకోలేకపోయిన పూజారి కంపయ్య మీరంతట్ల ఏనే గుండ్ల లెక్క నిలబడి పోతిరేంది!? అంటూ గుచ్చి గుచ్చి ప్రశ్నించాడు.దాంతో వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ గోడును వెళ్ళ బోసుకున్నారు.సూద్దాం ఏ పుట్టల ఏ పాముంటదోనన్నట్టు పండుగ జేస్తేనన్న దేవునికి మనమీన శమదర్మంకల్లి వాన కురిపిస్తడేమో అంటూ వాళ్ళందరినీ ఊరడించాడు కంపయ్య.ఇక దాంతో వాళ్ళంతా విధిలేక సగం మనసుతోనే సరే అంటూ తలలూపారు. లంద తయారు చెయ్యడానికని ఆ రాత్రే ఎవరింట్లో వాళ్ళు వడ్లు నానబోశారు. మూడోనాటికల్లా మొలకలొచ్చిన వడ్లను తీసుకుపోయి గుంపు చివరనున్న పర్పుబండ మీద ఆరబోశారు. సాయంత్రంకల్లా అవి ఉసిళ్ళ మాదిరిగా ఆరిపోయాయి. బండమీద ఆరబోసిన వడ్లను ఎత్తుకొచ్చి దంచిన పువ్వమ్మ, బియ్యాన్ని ఓ వెదురుబుట్టలోకి ఎత్తి పెట్టింది.పొద్దు గూట్లో పడకముందే ఇంత తిని, కిరసనాయిల్ బుడ్డి గుడ్డి వెలుగులో విసుర్రాయి ముందేసుకొని బిడ్డతో కలిసి పాటలు పాడుకుంటూ వెదురు బుట్టలోని బియ్యాన్ని మొత్తం పిండి విసిరింది.

ఆ బియ్యప్పిండితోపాటు అంతకు ముందే విసిరివుంచిన మొక్కజొన్నపిండినీ ఓమట్టికుండలోకి ఎత్తారు. ఎంత పిండికి ఎన్ని నీళ్లు కలపాలో అన్నే కలిపి దాన్నో చుట్టకుదురుమీద ఊరబెట్టి అప్పుడు పడుకున్నారు. మూడో రోజుకల్లా కుండలో కలిపి పెట్టిన పిండి పుల్లగా పులిసి ఇల్లంతా ఓ విధమైన వాసనతో నిండిపోయింది. నాలుగోరోజు చుట్టకుదురు మీదనుండి దించిన బానలో ఏవేవోచెట్టు బెరల్లువేసి పొయ్యిమీద పెట్టి జావగాసింది పువ్వమ్మ అట్లా తయారైన లందవంక సంతృప్తిగా చూసుకుంటూ దాన్ని తిరిగి చుట్టకుదురు మీదికెక్కించింది. గుంపులోని ప్రతి ఇంటివాళ్ళు ఆ విధంగా లంద, విప్ప సారాలు తయారుచేసి పెట్టుకున్నారు.ఆదివారం పండుగ కాబట్టి శుక్రవారం పొద్దున్నే కొంతమంది యువకుల్ని వెంటబెట్టుకున్న గుంపు పెద్ద అడివయ్య ఇంటింటికీ తిరిగి ఐదు లీటర్ల నీళ్లు, రెండు కిలోల బియ్యం, యాభైరూపాయల వంతున వసూలు చేసుకొచ్చి ఇంట్లో పెట్టాడు.

సందకాడ అన్నం తినగానే అడివయ్య హక్కుం పూరించాడు. పావుగంట అటూ ఇటుగా గుంపంతా దేవరగద్దె దగ్గరికి చేరుకుంది. ఆడమగ, చిన్నా పెద్ద అన్న తేడాలేకుండా వచ్చిన వాళ్ళంతా లందనో, సారానో తాగివచ్చారు.వచ్చిన వెంటనే కొంతమంది యువకులు పురికట్టలు (ఎద్దు కొమ్ములతో చేసిన తలపాగాలు) తలలమీద పెట్టుకొని గండ్లలు (డోల్లు) కొడుతుంటే, మరికొంతమంది యువతులు గుజ్జోడీ (మడత మంచం కడ్డీల్లాంటి కడ్డీలచివర ఇనుముతో తయారుచేసిన అవిశపువ్వుల్లాంటి పూలగుత్తులు) లను భూమికి తాటిస్తూ లయబద్ధంగా వెనక్కి ముందుకు అడుగులు వేస్తూ నాట్యం చెయ్యసాగారు.వాళ్ళ చుట్టూ గుమిగూడిన జనంలో నుండి కొంతమంది ఆడవాళ్ళు యాటకు పొవ్వాల మెకాన్ని కొట్టాల దేవరకు బెట్టాల పండగ జెయ్యాల వానల్లు కురవాల అడివంత పండాల అంటూ పాట అందుకున్నారు.సముద్రం మధ్యలో చిన్నగా లేచిన తుఫాన్ క్రమక్రమంగా బలం పుంజుకుని ఉప్పెనై పెను ఉప్పెనై గుండెలు జలదరించి పోయేలా హెూరుమనే ప్రళయ భీకరనాదం వలయాలు వలయాలుగా సముద్రమంతటా విస్తరించినట్టు మెలమెల్లగా మొదలైన ఆట, పాటలు క్రమక్రమంగా ఉధృతమై మోడుబారిన అడవిని, ఎండకు కానీ కానీ నలుపెక్కిన కొండలను అలలు అలలుగా ముంచెత్తసాగాయి.అట్లా అర్ధరాత్రిదాకా సాగిన ఆటపాటలు పూజారి సూచనతో మెల్లగా ఆగిపోయాయి.ఇండ్లకు వెళ్ళిన మగవాళ్ళంతా రేప్పొద్దున్నే లేసి అడివికి పొయ్యి దేవరకు బలియ్యనికి ఏదోక మెకాన్ని కొట్టకరావాలి అనుకుంటూ నిద్రకొరిగారు.

వేగుచుక్కతోపాటే లేచిన అడివయ్య దేవర గద్దె దగ్గరికి చేరి హక్కుం పట్టాడు. ఆ మోత వింటూనే చప్పున పక్కల మీదనుండి లేసిన ఆడమగ పిల్లజెల్ల, ముసలిముతక అంతా గద్దెదగ్గరికి చేరారు.వస్తూ వస్తూ పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా గుంపులో మొలతాడుగట్టిన మగవాళ్ళంతా వలలు, కత్తులు, గొడ్డల్లు విల్లంబులతోపాటు కుక్కల్నికూడా తీసుకుని వచ్చారు.ఆడవాళ్ళంతా సొరబుల్ల్రో కల్లు, సారా, లంద, నీల్లను డబరాగిన్నెల్లో అన్నం కూరల్ని సద్దులు గట్టుకొని తెచ్చారు. అంతా కలిసి గుంపు చివరనున్న సమ్మక్క గద్దె దగ్గరికి చేరుకున్నారు.అమ్మకు మొక్కుకున్న తరువాత ఆడవాళ్ళు వేటకు సంబంధించిన పాటలు పాడుతూ మంచి యాటపడాల అంటూ మగవారికి వీడ్కోలు చెప్పి వెనుదిరిగారు.మగవాళ్ళంతా అడవిలో కొంతదూరం వెళ్ళిన తరువాత పిల్లలను, ముసలివాళ్ళను ఓ బయలు ప్రదేశంలోవున్న నెమలి చెట్లకింద వుంచి వాళ్ళకు కావాల్సిన అన్నం నీల్లను ఏర్పాటుచేసి తిరిగి ముందుకు కదిలారు.చీకట్లో సైతం వాసనచూసి జంతువుల జాడను పసిగట్టి పట్టిచ్చే కుక్కలకు ఆ రోజు ఒక్క జంతువు జాడ కూడా దొరక్క పోవడంతో అవి ఉన్మాదంగా మారిపోయి ఆడవంతా పరుగులు పెట్టసాగాయి.

కంప, కట్టె, చెట్లు, తుప్పలని చూసుకోకుండా అంతా వాటి వెనుకే పరుగులు తీయసాగారు.వాళ్ళకు తెలిసిన నీళ్ళ తావులన్నీ గాలించారు. ఏ ఒక్కతావులోనూ చుక్కనీరులేదు. నీరేలేని తావుల్లో జంతువులు మాత్రం ఎందుకుంటాయ్? అవి నీటిజాడలను వెతుక్కుంటూ ఎటు వెళ్ళిపోయాయో? దాంతో ఎక్కడివాళ్ళక్కడ నీరసంతో ఈడిగిలబడి పోసాగారు.సొరబుర్రలు, డబరాగిన్నెలు మొత్తం ఖాళీ అయిపోయాయి. కానీ, వేట మాత్రం పడలేదు.జంతువులే కాదు కనీసం పక్షులుకూడా కనిపించకపోవడంతో ఆశ్చర్యానికిలోనైన వాళ్ళంతా ఏందిది!? లూటుబోయిన పత్తిసేన్ల లెక్క అడివంత వొక్కసారే ఇట్ల గొడ్డుబోయినట్టయ్యిందేంది!? అనుకున్నారు.ఇదీ అని చెప్పలేని ఓ రకమైన కసితో అసహనానికి లోనైన వాళ్ళంతా రాత్రివేళల్లో తిప్పతీగ తొక్కిన వాళ్ళ మాదిరిగా తిరిగిన తావుల్లోనే తిరుగుతూ అడవంతా జల్లెడబట్టి గాలించినా కనీసం కుందేలు పిల్లకూడా దొరక్కపోవడంతో యాట లేకుంట ఇండ్లకు బొయ్యి ఆడోల్లకు మొకాలెట్ల సూపించాలె? అనుకుంటూనే చీకటి తెరలు అడవిని కమ్మేస్తుండడంతో ఇక అక్కడ వుండలేక ఒక అడుగు ముందుకి ఏడడుగులు వెనక్కి అన్నట్టు ఊరిబాట పట్టారు.సందె చీకట్లు ముసురుకుంటుండగా అడవాళ్ళంతా ఊరుచివర సమ్మక్కగద్దె దగ్గర చేరి, మగవాళ్ళు ఏసుకొచ్చే వేటకోసం ఆశగా ఎదురు చూడసాగారు.

కండ్లు కణతల్లో చేరి, ముఖాలు పీక్కుపోయి, వళ్ళంతా ముండ్లు గీరుకుపోయి నెత్తుర్లు కారుతుంటే యుద్ధరంగాన శత్రువులచేతిలో శృంగభంగమైపోయిన సిపాయిలమాదిరిగా ఎట్ల వెళ్ళినవాళ్ళు అట్ల వుత్తచేతులతో తమవాళ్ళు తిరిగిరావడాన్ని గమనించిన ఆడవాళ్ళకు అడవిలో జరిగిందేమిటో అర్ధమై ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ..
యాటకు బోయిన కోయోనికి ఓ కుందేలు పిల్లగూడ దొర్కని పాడుకాలమొచ్చెగద! యాట దొరక్కపోతే రేపు పండగ జేసేదెట్ట!? అన్న ఆందోళనకు లోనవ్వసాగారు. యాట పడ్డా పడకపోయినా మనం ఏదోరకంగ పండగైతే సెయ్యాలగద? అన్నాడు పూజారి కంపయ్య. ఎట్ల జేస్తం? అన్నట్టు అతని వంక చూశాడు అడివయ్య. ఎట్లా చెయ్యాలో ఓ మార్గాంతరాన్ని తెలియజేశాడు కంపయ్య.

మరునాడు పొద్దున్నే కొంతమంది ఊళ్ళో వసూలు చేసిన బియ్యం, నీల్లతోపాటు వొంటగిన్నెల్ని కూడా మోసుకుని గుంపుకి దక్షిణం దిక్కున వున్న దేవర తునికి చెట్టుకిందికి చేరారు.కొంతమంది పారుటాకులు ఏరుకొచ్చి తునికిచెట్టు పక్కనేవున్న చింతకింద కూర్చుని దొప్పలు కుట్టి పక్కన అద్దపెట్టసాగారు. ఇంకొంతమంది పచ్చనాకుల్తో దేవరచెట్టు కింద పందిరేసి దాని చుట్టూ దడికట్టారు.పొలిమేర అవతల్నుంచి తెచ్చిన జీవినే దేవరకు బలియ్యాలనడంతో చీకటితోనే ఇద్దరు మనుషులు వేములూరు పొయ్యి ఓ జుట్టు (ఫారం) కోడిని కొనుక్కొచ్చారు.చెట్టుమొదట్లో దేవరను నిలబెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించిన పూజారి తన్లో తను ఏవో మంత్రాలు చదువుతూ జుట్టుకోడిని దేవరకు ఎదురిచ్చి కాల్లు, తలకాయను దేవరకు ఎదురుగా పందిరికి వేల్లాడదీశాక ఇగ దీన్ని పొతం జెయ్యుండ్రి! అంటూ మిగిలిన కోడిని పక్కనున్న వాళ్ళ కందించాడు.
వెంటనే వాళ్ళు దాని బూరుపీకి, మంటమీద కాపి, ముక్కలు కొట్టి పావుగంటలో తిరిగి అతనికి అందించారు. ఇంతలో మరికొంతమంది చింతచెట్టు కింద పొయ్యిరాల్లు పొందిచ్చి వంటమొదలు పెట్టారు. అన్నం గంజిపట్టకుండా చూసుకొని ఉయ్యాల్ల మాదిరిగా వున్న రెండు పెద్ద వెదురు బుట్టల్లోకి వార్చారు. అదే పొయ్యి మీద కోడికూర కూడా వండి పక్కన పెట్టారు.

వంటలు అయిపోగానే కంపయ్య ఇంత నిండుకుండ అన్నాన్ని, కూరను పారుటాకు విస్తళ్ళు పర్చిన కొత్తచాటలోకి తీసుకుని దాన్ని బాగా కలిపి బోనం తయారుచేశాడు.
బోనాన్ని దేవరముందు పెట్టి సొర బుర్రల్లో తెచ్చిన లందను, సారాను వారబోసిన తరువాత అక్కడున్న వాళ్ళందరితో ఇండ్లకు బొయ్యి బుట్టలు తీసుకొచ్చుకోండ్రి! అన్నాడు.
వెంటనే వాళ్ళంతా ఇండ్లకురికి పారుటాకు విస్తళ్ళు పరిచిన నలుచదరపు చిన్న చిన్న వెదురుబుట్టల్ని తీసుకొచ్చి పొయ్యి రాలకు దగ్గర్లోనే ఒకదానివెనుక ఒకటి వరుసగా నేలమీద పెట్టి పక్కకు తప్పుకున్నారు.

కంపయ్య దేవర ముందుంచిన బోనాన్ని తీసుకొచ్చి పారుటాకు దొప్పల్లో తలా ఇంత ప్రసాదం మాదిరిగా పెట్టాడు. ఆ ప్రసాదం తిన్న డొప్పల్లోనే అందరికీ కల్లు, లంద, సారాలను వంచారు. తాగడం అయిన తరువాత మళ్ళీ వాటిల్లోనే అన్నాన్ని పెట్టించుకుని తిన్నారు. తిన్న తరువాత ఎంగిలి డొప్పలను ఎక్కడ పడితే అక్కడ పారెయ్యకుండా ప్రతివాళ్ళు వాటిని తీసుకుపోయి ఆ పక్కనే వున్న విప్పచెట్ల ఆకులకు వెదురు ఈనెలతోకుట్టి వేళ్ళాడదీశారు. ఎంత తాగినా, తిన్నా వేటపడక కొనుక్కొచ్చిన జుట్టుకోడితోటి పండుగ చేసుకోవాల్సి వచ్చిందే అన్నవిషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్న బాధ వాళ్ళ ప్రతికదలికలోనూ కన్పిస్తున్నది.భోజనాలైన తరువాత పెద్దబుట్టల్లో మిగిలిన అన్నాన్ని వరుసలో పెట్టి వుంచిన చిన్న బుట్టల్లో సమానంగా పెట్టేశారు.పొద్దు పడమరకు తిరుగుతుండగా వాళ్ళంతా మొదట్రోజు మన మొగోల్ల పండగ పద్ధతెమ్మటి జరుగాలనుకుంటూ అన్నం బుట్టల్ని, సామాన్లను తీసుకుని ఇండ్లకు మళ్ళారు.

దేవర చెట్టు దగ్గర్నుండి ఇండ్ల కొచ్చిన వాళ్ళంతా అక్కడి విశేషాలను ఆడవాళ్ళతో పంచుకుంటూ మెల్ల మెల్లగా మగత నిద్రలోకి జారుకున్నారు.
హక్కుం చప్పుడుకు గుంపంతా ఉలిక్కిపడి లేచింది.మరునాడు జరుగబోయే ఆడవాళ్ళ పండగ కోసం మొన్నటి మాదిరిగానే మగవాళ్ళంతా మళ్ళీ వేటసరంజామానంతా తీసుకొని దేవరగద్దె దగ్గరికి చేరుకున్నారు.వారి వెనుకనే ఆడవాళ్ళు, పిల్లలూ వచ్చారు. మొన్నటి మాదిరిగానే ఆటపాటలు మొదలయ్యాయి. లేగదూడలు ఇండ్లచుట్టూ గెంతులు వేస్తూ తూర్పుదిక్కుగా పరుగులు తీయసాగాయి.

గూళ్ళల్లో కూర్చున్న పక్షులు ఖుషీగా ఉషాబాలకు స్వాగతం పలుకుతూ చేస్తున్న కలరవాలు చెవులకు ఇంపుగా సోకుతున్నాయి.తూరుపుగాలి పడుతున్న వింజామరకు పరిసరాలు ఆహ్లాదంతో పులకరింతకు లోనవ్వసాగాయి. ఆటపాటలను కట్టిపెట్టిన తరువాత మగవాళ్ళంతా మొన్నటి మాదిరిగానే వేటకోసం అడవిలోకి దారితీశారు. వాళ్ళను సాగనంపిన ఆడవాళ్ళంతా.. ఈ రోజన్న యాటపడుద్దా? రీతి దప్పి జేస్తున్న పండగతోటి దేవర మెచ్చి వాన కురిపిస్తడా? నీల్ల కర్వు తీరుద్దా? బుక్కెడంత బువ్వ కోసం శారడంత పోడు కొట్టుకొనే మమ్ముల దొంగలెక్క జూసే సర్కారోడు, రకరకాల పేర్లతోటి అడివిల జొరబడే కాంట్రాక్టర్లు మిషిన్ల మీన వొందలేకరాల అడివిని, వాగుల్ల ఇసికను, కొండలమీది రాల్లను దోస్కపోతుంటే వాల్ల జోలికి మాత్రం పోడు.వాల్లంత అట్ల అడివిని దోస్కతిన్నంక మరి వాన పడమంటే యాడపడుద్ది? మా నీల్ల కర్వెట్ల దీరుద్ది? ప్రశ్నల మీద ప్రశ్నలు జవాబుల్లేని ప్రశ్నలు మెదళ్ళను కుమ్మరి పురుగుల మాదిరిగా తొలుస్తుంటే నివురుగప్పిన నిప్పుకణికల మాదిరిగా ఇండ్లకు మళ్ళారు.

kantharavo

రచయిత పరిచయం

శిరంశెట్టి కాంతారావు విశ్రాంత ఉద్యోగి. సూర్యాపేట జిల్లా ఫణిగిరి వీరి సొంతూరు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వందల కథలు రాశారు. ఐదు కథా సంపుటాలు, ఒక హిందీ కథా సంపుటి, ఏడు నవలలు రాశారు. తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సాహిత్య అకాడమీల నుంచి పురస్కారాలు అందుకున్నారు.

296
Tags

More News

VIRAL NEWS