నెట్టిల్లు


Sun,October 27, 2019 01:13 AM

ఒకరిది డైరెక్షన్ చేయాలన్న కల, ఇంకొకరిది బాగా రాయాలన్న కల, వేరొకరిది నటించాలన్న కల. సినిమా అనే కళారంగంలో వారి కలల ప్రపంచాన్ని నెరవేర్చుకొనేందుకు పయత్నాలు చేస్తున్నారు. వాటికి ప్రతిరూపాలే ఈతరం యువకుల లఘుచిత్రాలు. కిందటి వారం వచ్చిన ఇలాంటి కొన్ని లఘుచిత్రాల సమీక్షలు ఇక్కడ ఇస్తున్నాం.. మీరూ చదవండి, చూడండి..

ME TOO

దర్శకత్వం: యశ్విన్
లీడ్‌రోడ్ : రోహిణి రాచెల్
శైలజ ఓ కంపెనీలో ఉద్యోగిణి. ఓ రోజు ఆమె నియోజకవర్గ ఎమ్మెల్యేను కలవడానికి వెళ్తుంది. కలుస్తుంది. విషయం ఏంటి అని అడుగుతాడు ఎమ్మెల్యే.. నియోజకవగర్గంలో అన్ని పనులు సక్రమంగా ఉన్నాయి. బాగుంది అని చెప్పడానికి వచ్చాను అని అంటుంది. దానికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు ఎమ్మెల్యే. అప్పుడే ఆమె ఓ సాయం కావాలని కోరుతుంది. సరే అంటాడు. ఆమె ఓ చెంబు కావాలి అంటుంది. తెప్పిస్తాడు. ఆ చెంబును నీటితో నింపుతుందామె. మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లుంటే ఈ చెంబు పట్టుకొని బయటకు వెళ్లమని చెప్పండి అంటుంది. దీంతో ఎమ్మెల్యేకు కోపం వస్తుంది. కానీ ఆమె తీరిగ్గా విషయం చెప్తుంది. తన లాంటి మహిళలు ఆరుబయటకు వెళ్తున్నారు. ఎక్కడ, ఏం జరుగుతుందో తెలియడం లేదు. రక్షణ లేకుండా పోయింది. దయచేసి మరుగుదొడ్లు కట్టించండి అని వేడుకుంటుంది. దీని కోసం నిధులు లేవు అంటాడు ఎమ్మెల్యే. అప్పుడు శైలజ తన బ్యాగ్‌లోంచి డబ్బులు తీసి అతనికి ఇచ్చి, అప్పు తీసుకున్నట్టు రాసివ్వండి, ఈ డబ్బుతో పనులు మొదలు పెట్టి, నిధులు వచ్చాక నా డబ్బు నాకు ఇవ్వండి అంటుంది. ఎమ్మెల్యేకు అంతా అర్థం అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి.
mee-too

Total views 85,883 + (అక్టోబర్ 19 నాటికి) published on Oct 12, 2019

AB

దర్శకత్వం:హర్ష
నటీనటులు : అరవింద్, సంకీర్తన
భరత్‌కు ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలన్నది కల. అది నెరవేరుతుందని చాలా నమ్మకంగా ఉంటాడు. మరోవైపు అతడు ప్రేమలో కూడా ఉంటాడు. ఆమె పేరు ఆరాధ్య. కానీ ఆమెకు ఈ విషయం తెలియదు. ఓ రోజు ఎలాగైనా తన ప్రేమ విషయం ఆరాధ్యకు చెప్పాలనుకుంటాడు. కలిసి చెప్తాడు. కానీ ఆమె భరత్‌ను ఎప్పుడూ ఓ ఫ్రెండ్‌గానే భావిస్తున్న అని చెప్తుంది. దానికి భరత్ తన దగ్గర ఉన్న ప్రేమ థియరీని చెప్పి ఆలోచించు అని వెళ్తాడు. వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఒకరు వచ్చిన సాయం చేస్తారు. అతను కూడా అచ్చం భరత్‌లాగే ఉంటాడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు భరత్. దానికి అతను స్పందిస్తూ.. నేను నువ్వే.. వేరు కాదు. నువ్వున్నది ఇప్పుడు 2025లో అంటాడు. కొన్ని డైలాగులు చెప్తాడు. భరత్‌కు అర్థం కాదు.. మిగతాది మీకూ అర్థం కావాలంటే యూట్యూబ్‌కు వెళ్లండి.
AB

Total views 7,171 +(అక్టోబర్ 19 నాటికి) Published on Oct 18, 2019

KALA

దర్శకత్వం: రాహుల్
గౌతమ్ ఒక కథా రచయిత. ఎప్పటికైనా సినిమా తీయాలనుకుంటాడు. ప్రొడ్యూసర్ కోసం వెతుకుతాడు. కొన్ని రోజుల తర్వాత ఓ ప్రొడ్యూసర్ దగ్గర అప్పాయింట్‌మెంట్ దొరుకుంది. వెళ్లి కథ చెప్తాడు. అది ఇలా ఉంది.. కొత్తగా పెండ్లయిన ఇద్దరు ఓ రోజు ఉన్నఫలంగా అమ్మాయి వాళ్ల ఇంటికి వస్తారు. కానీ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు అప్పుడే బయటకు వెళ్తారు. వీళ్లే ఉంటారు. కొద్దిసేపటికి అబ్బాయి కూడా బయటకు వెళ్తాడు. అమ్మాయి ఒక్కతే హాల్‌లో ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. వింత శబ్దాలు, ఏవో కదలికలు ఉన్నట్టు ఆమెకు అనిపిస్తుంది. భయపడుతుంది. ఇంతలోనే డోర్ బెల్ మోగుతుంది. ఆమె తలుపు తీయడానికి వెళ్తుంది. తర్వాత ఏమైందని ప్రొడ్యూసర్ అడుగుతాడు. ఉలిక్కిపడ్డ గౌతమ్ నిద్రలోంచి లేస్తాడు. కలలో జరిగినట్టే అతనికి ఆ రోజూ కూడా జరుగుతుంది. కలలో కనిపించిన ప్రొడ్యూసర్ గురించి తెలుసుకొని వెళ్లి కథ చెప్పడం ప్రారంభిస్తాడు.. డ్రమెటిక్‌గా, హర్రర్‌గా ఉంటుంది. మీరూ చూడండి.
kala

Total views 10,008+ (అక్టోబర్ 19 నాటికి) Published on Oct 15, 2019

ఓ చిట్టి తల్లి

దర్శకత్వం: అమీర్
నటీనటులు : స్వాతి, మున్న
గంగారాంది చాలా పేద కుటుంబం. అతనికి ఓ కూతురు. పద్దెనిమిదేండ్లు. కానీ చిన్నప్పటి నుంచి అంగవైకల్యంతో ఉంటుంది. ఆమె పరిస్థితికి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఓ రోజు గంగారాంకు అప్పు ఇచ్చిన వ్యక్తి డబ్బుల కోసం వస్తాడు. ఇంటి దగ్గర గంగారాం కూతురును అదోలా చూస్తాడు. దీనికి తల్లి తీవ్రంగా భయపడుతుంది. తర్వాత ఓ రోజు కూతురుని ఇంట్లో ఉంచి, తల్లిదండ్రులు ఇద్దరూ బయటకు వెళ్తారు. మరోసారి డబ్బుల కోసం వచ్చిన వ్యక్తి ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలోనే తల్లి నిద్రలోంచి మేల్కొంటుంది. కలనే కావచ్చు కానీ ఎప్పటికైనా ఇది జరుగుతుందేమో అని భయపడుతుంది. అందుకు గంగారాంతో ఓ మాట అంటుంది. కూతురుకు మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాం. కనీసం ఈ సమాజం నుంచి రక్షించి మంచి చావును అయినా ఇద్దాం అని. దీనికి గంగారాం ఆశ్చర్యపోతాడు. మరి భార్య మాటను గంగారాం ఒప్పుకుంటాడా? లేదా? మీరే చూడండి..
o-chitti-thally

Total views 752+ (అక్టోబర్ 19 నాటికి) Published on Oct 16, 2019

వినోద్ మామిడాల, సెల్: 7660066469

188
Tags

More News

VIRAL NEWS