నిజమైన అద్భుతం


Sun,October 27, 2019 02:00 AM

స్వామీ! నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అన్నాడు. గురువు అంగీకరించాడు. ఆ యువకుడికి యోగ, ధ్యానం మొదలైనవి నేర్పాడు. యువకుడు క్రమంగా గురుబోధనలకు లోబడి సుశిక్షితుడయ్యాడు. గొప్ప ధ్యానం నేర్చుకున్నాడు. ఆధ్యాత్మిక వేత్తగా మారాడు. ఆకర్షణీయంగా ప్రజలకు బోధనలు చేసే స్థితికి చేరాడు.

ఒక వ్యాపారస్థుడు సాయంత్రానికి వసూలైన డబ్బులన్నీ లెక్క పెట్టుకొని సంచీలో వేసుకుని ఏదో పనిమీద వెళ్ళాల్సి రావడంతో తన షాపుమూసి బయల్దేరాడు.ఇదంతా గమనిస్తున్న ఒక దొంగ హఠాత్తుగా ప్రత్యక్షమై వ్యాపారి సంచి లాక్కుని పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన వ్యాపారి దొంగ వెంటబడ్డాడు. వీధిలో జనం కూడా వెంబడించారు. అందరినీ దాటి తప్పించుకోవాలని ప్రయత్నించినా దొంగకు సాధ్యం కాలేదు. మొత్తానికి జనం దొంగను పట్టుకున్నారు. పోలీసు అధికారి దగ్గరకు తీసుకెళ్ళారు.పోలీసు అధికారి దొంగను ఎగాదిగా చూశాడు. దొంగ యువకుడే. ఇంకా పాతికేళ్ళు కూడా నిండనివాడు. నూనూగుమీసాల వాడు. అధికారి దొంగను క్రూరంగా చూశాడు. దొంగ పోలీసు అధికారి కాళ్ళమీద పడి అయ్యా! నన్ను మన్నించండి. ఆకలివల్ల, చెయ్యడానికి పనిదొరక్కపోవడం వల్ల నేను ఇలా చేయవలసి వచ్చిది. నన్ను క్షమించండి అని పోలీసు అధికారి కాళ్ళమీద పడ్డాడు.పోలీసు అధికారి నిర్దయగా ఆ యువకుణ్ణి ఎగిసి తన్నాడు. దెబ్బకు దొంగ దూరంగా పడ్డాడు. ఆ క్షణం దొంగ ఆలోచనలో పడ్డాడు. పోలీసులు బంధిస్తే తనకు చిత్రహింసలు తప్పవు. అధికారి కూడా తనను మన్నించేట్లు కనిపించడం లేదు. పారిపోవడానికి ఇదే సరైన సమయం అని ఒక్కసారిగా లేచి పరుగుతీశాడు.
Marmika

పోలీసు అధికారి దొంగను వెంబడించి పట్టుకోవలసిందిగా పోలీసులను ఆదేశించారు. పోలీసులు దొంగను వెంబడించారు. దొంగ సందులు గొందులు తిప్పాడు. ఎన్నో మలుపులు తిరిగాడు. అలసిపోయాడు. పోలీసులు కూడా అలసి పోయారు. కానీ ప్రాణభయంతో దొంగలేని ఉత్సాహం తెచ్చుకొని పరుగులు తీశాడు. ఊరు దాటి దగ్గరగా ఉన్న అడవిలో అడుగుపెట్టాడు. పోలీసులు వెంబడించారు.అంతా చీకటి. దూరంగా ఒక గుహనుంచి కాంతి మసకమసగ్గా కనిపిస్తున్నది. అటువైపుగా వెళదామని దొంగ పరిగెత్తాడు. కానీ అలసిపోయి కిందపడి స్పృహ తప్పిపోయాడు. దొంగను గుర్తించకుండా పోలీసులు ముందుకు వెళ్ళిపోయారు.
తెల్లివారింది. ఆ గుహలో నివసించే ఒక యోగివచ్చి దొంగ ముఖంపై నీళ్ళుచల్లి సేదతీర్చి తన గుహకు తీసుకెళ్ళాడు. దొంగ కళ్ళు తెరిచి తనకు సురక్షితమైన స్థలం ఇంతకు మించి దొరకదని స్వామీ! నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అన్నాడు. గురువు అంగీకరించాడు. ఆ యువకుడికి యోగ, ధ్యానం మొదలైనవి నేర్పాడు. యువకుడు క్రమంగా గురుబోధనలకు లోబడి సుశిక్షితుడయ్యాడు. గొప్ప ధ్యానం నేర్చుకున్నాడు. ఆధ్యాత్మిక వేత్తగా మారాడు. ఆకర్షణీయంగా ప్రజలకు బోధనలు చేసే స్థితికి చేరాడు.ముప్పై ఏళ్ళు గడిచాయి. గురువు గతించాడు. శిష్యుడు గురుస్థానాన్ని అలంకరించాడు. గురువు కన్నా ఆకర్షణీయంగా ప్రజల్ని తన ప్రవచనాలతో మంత్రముగ్ధుల్ని చేశాడు.

దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రాసాగారు. పక్క గ్రామం నుంచి వృద్ధుడైన ఒక వ్యక్తి వచ్చి స్వామీ! నేను పోలీసు అధికారిగా పనిచేసిన వాణ్ణి. జనాల్ని హింసించాను. నిరపరాధుల్ని కూడా శిక్షించాను. నాకు పాప పరిహారం ఉందా? నాకు విముక్తి ఉందా? అట్లాంటి అవకాశానికి ఆస్కారముందా? అని అడిగాడు. అధికారి స్వామి పాదాలు స్పృశించాడు.

స్వామి ఆనాడు దొంగతనం చేసినప్పుడు తనని బంధించిన పోలీసు అధికారి ఇతనే అని గుర్తించాడు.
అయ్యా! దొంగకు మోక్షమియ్యగా లేనిది దొంగను పట్టుకున్న మీకు దేవుడు ఎందుకు మోక్షమియ్యడు. అద్భుతాలు జరుగుతాయి. ఒకరోజు నేను మీ పాదాలు ముట్టుకున్నాను. ఈ రోజు మీరు నా పాదాలు తాకారు. ఇంతకు మించిన అద్భుతమేముంది? దొంగను క్షమించిన దేవుడు, దొంగను పట్టుకున్న పోలీసు అధికారిని క్షమించడా? అన్నాడు. ఆశ్చర్యపడిన పోలీసు అధికారికి స్వామి గతం వివరించాడు.
కృతజ్ఞతగా పోలీసు అధికారి తలవంచి నమస్కరించాడు.
-సౌభాగ్య

304
Tags

More News

VIRAL NEWS