వినికిడి శక్తి లేదని.. టెలిఫోన్ తయారుచేశాడు!


Sun,October 27, 2019 02:54 AM

అది.. 1847. స్కాట్‌లాండ్‌లోని ఎడిసన్ ఏరియా. అప్పుడే అలెగ్జాండర్ పుట్టాడు. అతడి తల్లి ఎలిజా గ్రేస్. కానీ చెప్తే వినేది కాదు. ఎందుకంటే ఆమెకు చెవుడు. తలుపు పెట్టి చెప్తే కొలుపు పెట్టే వినే రకం అన్నమాట. చిన్నప్పుడు అలెగ్జాండర్ అమ్మా.. ఆకలేస్తుంది తినడానికి ఏదైనా పెట్టవా?.. అని అడిగితే ఓహో.. ఆడుకుంటావా?.. వెళ్లు జాగ్రత్తగా ఆడుకో అనేది. అప్పుడు గ్రాహంబెల్‌కు చాలా నవ్వొచ్చేది. తల్లి మాటల్ని సరదాగా తప్పితే సమస్యగా ఏనాడూ భావించలేదు.

-దాయి శ్రీశైలం, సెల్: 8096677035

అంతకు ముందే..

గ్రేస్‌కు ఇద్దరు కొడుకులు. మెల్విలే జేమ్స్ బెల్.. ఎడ్వర్డ్ చార్లెస్ బెల్. ఇద్దరూ క్షయ వ్యాధితో చనిపోయారు. వీరిపేరు ఎప్పటికీ గుర్తుండాలని తండ్రి మెల్విలే బెల్.. ఒక కొడుకు పేరులో నుంచి గ్రాహం.. ఇంకో కొడుకు పేరులో నుంచి బెల్ తీసుకొని అలెగ్జాండర్ పేరును అలెగ్జాండర్ గ్రాహంబెల్‌గా మార్చాడు. అతడొక ప్రొఫెసర్. మాటలు.. సంజ్ఞల మీద అధ్యయనం చేస్తుండేవాడు. తండ్రి ఏం చేస్తున్నాడో అలెగ్జాండర్‌కు చిన్నప్పుడు ఏమీ అర్థంకాకపోయేది. పరిశోధనలు ఇంట్లోనే చేసేవాడు కాబట్టి తండ్రిని పరిశీలిస్తుండేవాడు. నాన్నా.. మీరేంటీ ఎప్పుడూ ఏదో చేస్తుంటారు? మీకేమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా? ఇంకా.. మనమేదో అంటుంటాం.. అమ్మ ఏదో చెప్తుంటుంది. నాకైతే ఏమీ అర్థం కాదు. కానీ మీకు అన్నీ అర్థమవుతాయి.
Telephone

ఎలా అర్థమవుతాయి అమ్మ చెప్పే మాటలు? మీ దగ్గరేదైనా మంత్రదండముందా? అంటూ కుశల ప్రశ్నలు వేసేవాడు. చూడు బాబూ.. అమ్మ అందరితో ఒకేలా మాట్లాడుతుంది. నాకు అర్థమై.. నీకు కావడం లేదు అంటే నువ్వు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. అమ్మకు ఒక సమస్య ఉంది. ఏదీ గట్టిగా చెప్పనిదే వినిపించదు. అర్థం కాదు కూడా. అంటే ఆమెకు చెవుడు. వాళ్ల నాన్న ఎప్పుడైతే అలెగ్జాండర్‌కు తన తల్లి సమస్య అర్థం కాలేదు అన్నాడో.. అప్పట్నుంచి విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆమెకు వినిపించేలా పెద్దగా శబ్దం చేస్తూనో లేక సంజ్ఞల ద్వారానో అర్థమయ్యేట్లు మాట్లాడేవాడు. వాళ్లమ్మకు సమస్య ఉంది.. క్షయతో చనిపోయిన తన అన్నలిద్దరికీ కొద్దిగా చెవుడు ఉండేది. ఇలా ఒక ఇంట్లోనే ఒకరిద్దరు ఉంటే బయట ఇంకెంత మంది ఉన్నారో? చెవుడు ముదిరి ఇతర ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది కదా? అని ఆలోచించాడు.

స్కూల్‌కెళ్లే వయసులో..

పాఠశాలకు వెళ్లే సమయం.. వయసు వచ్చినా తండ్రి దగ్గర ఉంటూ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిచేశాడు అలెగ్జాండర్. తండ్రి చేసే పనుల్ని పరిశీలించి ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్‌పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. హైస్కూల్ విద్యను ఎడింబరోలోని రాయల్ స్కూల్‌లో చదివాడు. పదహారేండ్లు వచ్చేసరికి అందరికీ అర్థమయ్యేట్లు మాట్లాడాలి.. అందరి సమస్యలనూ అర్థం చేసుకోవాలనే ఆలోచనతో ప్రసంగ నైపుణ్యం పెంపొందించుకున్నాడు. ఎన్ని సమస్యలున్నా పైకి కనిపించకుండా ఉండేందుకు సంగీతం నేర్చుకున్నాడు. ఈ రెండు నైపుణ్యాలు తనకే కాదు అందరికీ అవసరం అని భావించి ట్యూషన్ క్లాస్‌లు చెప్పేవాడు. తల్లికి వినికిడి శక్తి రోజు రోజుకూ క్షీణిస్తుండటంతో ఆమెతో మాట్లాడే క్రమంలో సంజ్ఞలతో భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు. తన తల్లికి వినిపించాలని ఏదో పనిచేసుకుంటూ.. అమ్మా.. నీకు చెవుడు ఉండొచ్చు. కానీ అదేమంత పరిష్కరించలేనిది కాదు. నేను నాన్న దగ్గర చదువుకున్నాను. ఆయన చేసే ఎన్నో పరిశోధనలను బేస్ లెవల్ నుంచే పరిశీలించాను. నాకున్న పరిజ్ఞానం.. అవగాహన మేరకు అతి త్వరలో నీ సమస్యను నేను పరిష్కరింపచేస్తా. దానిపై ఇప్పటికే పనిచేస్తున్నా. నాన్నకు కూడా ఈ విషయం తెలియదు. తెలిస్తే కనుక ఆయన ఆశ్చర్యపోవడం పక్కా అని చెప్పాడు. కానీ వాళ్లమ్మకు అతడేమన్నాడో వినిపించలేదు. కానీ కొడుకు భావేద్వాగానికి గురవడం గమనించింది.
Telephone1

కొద్ది రోజుల తర్వాత..

ఆమె నుదుటి ఎముకకు దగ్గరగా ఒక రకమైన ఉచ్ఛారణతో మాట్లాడే ప్రయత్నంలో ధ్వని శాస్ర్తాన్ని అర్థం చేసుకున్నాడు. అప్పుడు చాలా మెల్లగా.. అమ్మా.. అన్నాడు. ఆమె మెదడులో ఓ మెరుపు వెలిగింది. ఆశ్చర్యంగా అలెగ్జాండర్ వంక చూసింది. కొద్దిరోజుల క్రితం అతడు ఎమోషన్‌గా చెప్పిన విషయం ఇదే అయుండొచ్చు అనుకున్నది. విషయాన్ని సీరియస్‌గా తీసుకొన్న అలెగ్జాండర్ ఎడింబరో యూనివర్సిటీలో ధ్వని.. వినికిడి శాస్ర్తాలు అభ్యసించాడు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో వోకల్ ఫిజియాలజీలో ప్రొఫెసర్ అయ్యాడు. బధిరుల కోసం పరిశోధనలు చేసి వారు వినగలిగే శబ్ద పరికరాలను రూపొందించాడు.

అది.. 1877.

అలెగ్జాండర్‌కు మాబెల్ హబార్డ్‌తో పెండ్లయింది. పనులు చేయడంలో తన తల్లికి శ్రమ తప్పుతుంది అనుకున్నాడు. ఆర్నెళ్లు గడిచాయి. తన తల్లిలాగే మాబెల్ కూడా గట్టిగా చెప్తేనే పలుకడం గమనించాడు. ఏంటి మాబెల్ అంత గట్టిగా అరిచినా పలుకవెందుకు? అని అడిగితే.. ఓహో.. ల్యాబ్‌కు వెళ్తావా? వెళ్లు అనడంతో అతడికి విషయం పూర్తిగా అర్థమైంది. తాను రూపొందిస్తున్న పరికరం తల్లికి.. భార్యకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నాడు.

అంతకుముందే.. అంటే 1876లో.. ఒక ఐడియా..

బధిరుల కోసం ఏదో చిన్న పరికరం రూపొందించి వారి సమస్యను తీర్చగలిగాను. రేపు ఇంకేదో సమస్య తారసపడితే దానికి సంబంధించిన పరిష్కారం కనిపెట్టవచ్చు. కానీ ఇవి కాకుండా అసలు ఒక మనిషికి ఇంకో మనిషికి ప్రత్యక్ష సంబంధం లేకుండా సంభాషణ జరిపే అవకాశం లేదు కదా? దీనిపై దృష్టి పెడితే ఎలా ఉంటుంది? అని ఆలోచించాడు. తోటి ప్రొఫెసర్‌లతో తన ఐడియా షేర్ చేసుకున్నాడు అలెగ్జాండర్. చప్పట్లు వస్తుండొచ్చు అనుకున్నాడు. కానీ అహ్హహ్హహ్హా.. అంటూ హేళనలు రావడంతో బాధపడ్డాడు. చాలామంది హేమాహేమీలే రకరకాల ప్రయోగాలు చేసి చేతులెత్తేశారు. నీ వల్లేమవుతుంది? అనే డిస్కరేజ్‌మెంట్ కూడా తోడైంది. హేమాహేమీలు ఫెయిలయ్యారేమో.. కానీ నేను మాత్రం సాధిస్తా. నా ప్రయోగం ఫలిస్తే తొలుత ఆ పరికరంతో మీతోనే మాట్లాడుతా.. ఇది ఛాలెంజ్ అని సవాలు విసిరాడు అలెగ్జాండర్. నీ సవాలు మంచిదే. స్వాగతించదగ్గదే. నువ్వు ఆ ప్రయోగం సాధిస్తే మేమూ ఆనందిస్తాం. కానీ నీలాంటివాళ్లను ఎంతోమందిని చూశాం. సమయం వృథా చేసుకోకు. తర్వాత బాధపడకు. ఆల్ ది బెస్ట్ అనే సలహాను పాజిటివ్‌గా తీసుకొని ప్రయోగం ప్రారంభించాడు. తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగేలా రాత్రింబవళ్లు పరిశోధనలు చేసి టెలిఫోన్ కనిపెట్టాడు. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

ప్రయోగ పరిశీలనలో భాగంగా..

హలో.. డియర్. ఇప్పుడు చూడు. నా మాటలు మంచిగానే వినిపిస్తున్నాయా? అర్థం అవుతున్నాయా? వాస్తవానికి నాతో అవుతుందో లేదో అనుకున్నాను. కానీ మీరు మంచి సవాలే.. ఆహ్వానించదగ్గ సవాలే అని ప్రోత్సహించడంతో నాలో కసి పెరిగింది. మీరు వాస్తవానికి నిరుత్సాహపరిచేందుకు అలా అన్నారేమో. కానీ అది నాలో కొత్త ఆశల్ని చిగురింపచేసింది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరిన్ని ఆవిష్కరణలను మీ ముందు ఉంచుతా. ధన్యవాదాలు అని తన అనుభూతిని పంచుకున్నాడు. అమ్మా.. ఒకప్పుడు నీ వినికిడి లోపం చూసి బాధపడ్డాను. తర్వాత దాని పరిష్కారం కోసం ఒక పరికరం కనిపెట్టాను. మీ సమస్యను పరిష్కరించే క్రమంలో నేను ఎంచుకున్న మార్గమే నాలోని ఆవిష్కర్తను బయటకు తీసుకొచ్చింది. మీకు వినికిడి సమస్య లేకుంటే నా టాలెంట్ తెలిసేది కాకపోయేదేమో.. నేను ఆ దిశగా ఆలోచించేవాడిని కాకపోయి ఉండేవాడినేమో. నీకు.. నాన్నకు.. మా బెల్‌కు కృతజ్ఞతలు అని ఎమోషన్ అయ్యాడు అలెగ్జాండర్.
అలా.. మనుషుల మధ్య దూరం పెంచుతున్న వినికిడి లోపాన్ని పరిష్కరించే క్రమంలో వచ్చిన ఒక ఐడియాతో మనుషుల్ని మరింత దగ్గర చేసే టెలిఫోన్‌తో ఒక అద్భుత ఆవిష్కరణ చేశాడు. చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లి చదువుకోలేదు. తల్లి సమస్యను చూసి భయపడ్డాడు. ఆ తర్వాత సోదరుల మరణం గురించి తెలుసుకొని బాధపడ్డాడు. కానీ సమస్య నుంచే పరిష్కారం వెతుక్కోవచ్చనే సంకల్పంతో వాటన్నింటినీ సవాలుగా తీసుకొని ముందడుగు వేశాడు అలెగ్జాండర్. సమస్యలను చూసుకుంటూ కూర్చుంటేనో.. సన్నిహితుల డిస్కరేజ్‌మెంట్‌కు బాధపడి ఉంటేనో మనకు టెలిఫోన్‌తో మాట్లాడే అవకాశం రాకపోయి ఉండును. తన కుటుంబ సభ్యులకు ఉన్న వినికిడి లోపం ఒక్కటే సమస్య కాదు.. దానికంటే తీవ్రంగా సమాజంలో సమాచార లోపం ఉంది.. దానిని పరిష్కరింపజేయాలి అనుకున్నాడు. మైండ్‌లో ఏది అనుకున్నాడో.. ఆచరణలో అదే పెట్టాడు. అద్భుత శబ్ద సమాచార స్రవంతిని మనకు అందించి 1922లో మరణించాడు అలెగ్జాండర్ గ్రాహంబెల్.

753
Tags

More News

VIRAL NEWS