స్వచ్ఛ దీపావళి


Sun,October 27, 2019 03:23 AM

అమావాస్య పరిచిన చిమ్మచీకట్లను చీల్చుతూ వెన్నెలకాంతులు వెదజల్లే వెలుగు జిలుగులు పంచే దీపావళి పండుగొచ్చింది. దీపావళి అంటేనే దీపాల వరుస. వెలిగే ఒక్కోదీపం జీవితంలో ఎన్నెన్నో వెలుగులు నింపాలని, ఆ కాంతుల సమూహంలో బాధలన్నీ మరిచిపోయి సంతోషాల చిరునవ్వులు విరియాలనీ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కులం, వర్గం, ప్రాంతం, చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా జరుపుకునే ఆనందాల వేడుక దీపావళి. దీపావళి అనగానే చాలామంది క్రాకర్స్ కాల్చడమే అనుకుంటారు.
పండుగలో అదీ ఒక భాగం అంతే. కానీ ఆ క్రాకర్స్ మూలంగా జరిగే నష్టం మాత్రం పూడ్చలేనిది. అందుకే ఈసారి మరింత ఆనందంగా, పర్యావరణానికి హానీ చేయనటువంటి హరిత దీపావళి, కాలుష్య రహితంగా జరుపుకోగలిగితే అదే అచ్చమైన ఆనందాల స్వచ్ఛ దీపావళి.

-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

పండుగ ఏదైనా మనతో పాటు నలుగురికీ మంచి చేసేదిగాను, నలుగురి కడుపునింపేదిగాను, నవ్వులు పంచేదిగాను, నాలుగు కాలాలపాటు జీవితానికి వెలుగులు పంచేదిగాను ఉండాలి. అప్పుడే దానికి సార్థకత. పురాణాల ప్రకారం నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు చీకటిపై సాధించిన విజయంగా దీపాలను వెలిగించి దీపావళి జరుపుకుంటారని ప్రతీతి. కానీ దీపావళి అనే మాటకు రూపురేఖల్ని చెరిపేసేలా ప్రకృతికి, జీవావరణానికీ, మనిషి ఆరోగ్యానికీ నష్టం కలిగించేలా బాణసంచాను విచ్ఛలవిడిగా కాలుస్తూ కాలుష్యరాక్షసున్ని పెంచుతున్నారనే విషయాన్ని మరుస్తున్నారు. దీపావళి అంటే పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి పండగ చేసుకోవడం కాదు. మనతో పాటు ఎవరికీ నష్టం కలుగకుండా, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా కాలుష్యం లేకుండా, భారీ శబ్దాలు రాకుండా ఏకోఫ్రెండ్లీ దీపావళిని జరుపుకుంటే ఎంత బాగుంటుంది.
Diwalii

వెలుగుల వెనుక కాలుష్యం

దేశమంతా సంతోషంతో సంబురాలు జరుపుకునే రోజు దీపావళి. రానురాను ఆ రోజు కాలుష్యకారకమైన రోజు గా మారింది. దీపావళి సమయంలో 6 నుంచి 10 శాతం కాలుష్య స్థాయి పెరుగుతున్నది. నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వంటివి ప్రమాదకర స్థాయిలో పెరుగు తున్నాయి. దీపావళి పండుగ రోజున పేల్చే బాణసంచా లు ఒకవైపు వెలుగులు పంచుతూనే మరోవైపు చీకట్లను మోసుకొస్తున్నాయి. వాటిలో ఉండే రసాయనాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నది. స్వచ్ఛమైన గాలిని మన చేజేతులా కాలుష్యమయం చేసుకుంటున్నాం. పండుగరోజు కాల్చే పటాకుల్లో సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రోజన్‌ఆక్సైడ్, పొటాషియంనైట్రైట్, సోడియం కాంపౌండ్స్, మెర్క్యురీ కాంపౌండ్స్, లిథియంతోపాటు కొన్ని మెటల్ కాంపౌండ్స్ ఎక్కువగా వాడతారు. చైనా నుంచి వస్తున్న కొన్ని మందుగుండు సామగ్రిలో పొటాషియం నైట్రైట్ వంటి ప్రమాదకర రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటున్నట్లు నిరూపితమయ్యాయి. ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో 200 మైక్రో గ్రాములు దాటకూడని కాలుష్య కారక ధూళి కణాలు అనూహ్యంగా పెరిగిపోతాయి. ఫలితంగా శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. బాణసంచాలో రంగురంగుల అగ్నిపూలు కురిసేందుకోసం పొటాషియం నైట్రేట్ రసాయన మిశ్రమం వాడతారు. దీని ప్రభావం దీర్ఘకాలం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఊపిరితిత్తుల కేన్సర్ కారకం కూడా. అంతేకాదు, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
Diwalii1

శబ్దకాలుష్యం

బాణసంచా కాల్చడం వల్ల గాలి కాలుష్యం మాత్రమే కాదు ధ్వని కాలుష్యం కూడా ఏర్పడుతుంది. మనం కాస్త గట్టిగా మాట్లాడుకునే మాటలు 50 డెసిబుల్స్ మాత్రమే ఉంటాయి.అదే దీపావళి టపాసులు మాత్రం దాదాపు 150 డెసిబుల్స్ దగ్గర పేలతాయి. 100 డెసిబుల్స్‌ని దాటి వినే శబ్దం ఏదైనా కూడా మన చెవులకి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక 140 డెసిబుల్స్‌ని దాటే శబ్దాల వల్ల మన కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద శబ్ధాలతో కూడిన బాణసంచా కాల్చేవారిలో ఎక్కువగా వినికిడి లోపాలున్నట్లు నిరూపితమైంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వినికిడి లోపం, గుండె సంబంధ వ్యాధులకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు పక్షులు, జంతువులకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదముంది. క్రాకర్స్ కాల్చినప్పుడు వాటికి నాలుగుమీటర్ల దూరంలో శబ్దం 125 డెసిబుల్సుకు మించి ఉండకూడదని చట్టం చెబుతున్నది. ఈ శబ్ధ కాలుష్యం వల్ల మనిషిపై ఎంతో ప్రభావం పడుతోంది. పెద్ద శబ్ధాల వల్ల వినికిడి సమస్య రావచ్చు. రక్తపోటు పెరగడంతోపాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

దీపావళి అంటే దీపాల వరుస. మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానకాంతులను విరజిమ్మే పండుగ. దేశమంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ. చిమ్మ చీకట్లను కురిపించే అమావాస్య రాత్రిని పిండారబోసినట్లు అనిపించే వెన్నెల వెలుతురుతో నింపేసే పండుగ. వయోబేధాలు లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ. అందుకే ఇది నవ్యకాంతుల దీపావళి, దివ్య జ్యోతుల దీపావళి. దీపావళి అంటే సంతోషం ... సందడి ... సంబరం. దీపావళి రోజున ఉదయం వేళలో ఇళ్లన్నీ పసుపు గడపలతో ... మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక చీకటిపడేసరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసిడి వెలుగులను విరజిమ్ముతుంటాయి. చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటాం. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ... ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబురాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతున్నది.ఈ కథ ఇలా వుంటే, ధర్మశాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతున్నది. దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం ... తారాజువ్వలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటున్నది.

ఈ రోజుల్లో వానలు కురవడం ... చలి పెరుగుతూ వుండటం వల్ల అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగవల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు. ఇక ఈ రోజున శ్రీ కృష్ణుడు 16000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు. మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు. ధనత్రయోదశి .. నరకచతుర్దశి .. దీపావళి ... బలిపాడ్యమి ... యమద్వితీయ అయిదు రోజుల పండుగను జరుపుకుంటారు. కనుక కొందరు అయిదు దీపాలనూ వెలిగిస్తుంటారు.

వ్యాధులకు కారణం

దీపావళి రోజున బాణసంచా కాల్చేది కొన్ని గంటలే. కానీ ఆ కొన్ని గంటల ఆనందానికి జీవితా న్ని బలిపెట్టడం ఏ మాత్రం సరికాదు. మందుగుండు కాల్చిన తర్వాత రసాయనాలన్నీ పీల్చే గాలిలో కలిసి మనిషి శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిలో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారణమవుతున్నాయి.క్రాకర్స్‌లో వాడే మెగ్నీషియం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. జ్వరం, తలనొప్పి, జలుబు, వాంతులు వచ్చే ప్రమాదం ఉంటుంది. జింక్ వల్ల తలనొప్పి, వాంతులు వస్తాయి. సోడియ ం వల్ల శరీరంపై దద్దుర్లు, చర్మ వ్యాధులు వస్తాయి. ఇది తీవ్రంగా ఉంటే చర్మక్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. నైట్రేట్ మోతాదు మించితే మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. చిన్నారులపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాపరును పీల్చడం వల్ల విపరీతమైన తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. శ్వాస ఆడకపోవడంతోపాటు విపరీతమైన దగ్గు వస్తుంది. కాడ్మియాన్ని పీల్చడం అనీమియాకు దారితీస్తుంది. ఎక్కువగా పీలిస్తే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. రక్తహీనత తలెత్తుతుంది. లెడ్ శరీరంలోకి ప్రవేశిస్తే నరాల వ్యవస్థ దెబ్బతింటుంది.

సంప్రదాయ వాదుల వాదన

దీపావళి రోజున పటాకులు కాల్చడం అనేది చాలాకాలంగా వస్తున్నది. అయితే కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో బాణసంచా నిషేధించాలనే నినాదం ఒకవైపు ఊపందుకుంటుండగా, బాణసంచా కాల్చడం వల్ల లాభాలు కూడా ఉన్నాయని సంప్రదాయవాదులు అంటున్నారు. ఒకవైపు ఆ కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయనే విషయాన్ని అంగీకరిస్తూనే మేలు చేసే విషయాలు కూడా ఉన్నాయంటున్నారు. వర్షాకాలం గడచిపోయిన అనంతరం దీపావళి వస్తుంది. వర్షరుతువులో క్రిమికీటకాల సంఖ్య పెరుగుతుంది. టపాసులు కాల్చడం వల్ల వెలువడే విషవాయువుల భారిన పడి ఆ కీటకాలు చనిపోతాయి. తద్వారా పరిసరాల్లోని వాతావరణం పరిశుభ్రమవుతుంది. రాబోయే శీతాకాలపు వాతావరణం స్వచ్ఛంగా ఉండడానికి ఇది ఎంతైనా తోడ్పడుతుంది. దీపావళి వెలుగుల వేడిలో కీటకాలు నశిస్తాయి. పటాకులలో ఉండే గంధకం పెద్ద ఎత్తున గాలిలోకి చేరుతుంది. గంధకపూరిత వాతావరణం పంటల పెరుగుదలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వాతావరణంలో గంధకం భారీ పరిమాణంలో ఉంటే మొక్కలు దాన్ని బాగా పీల్చుకోగలుగుతాయి. కనుక టపాసులు కాల్చడం వల్ల వెలువడే గంధకం మేలుచేస్తుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అమిత ప్రయోజనకరమవుతుంది.

వారి వాదన కాదనలేం

గడచిన కొన్నెండ్ల నుంచే దీపావళి బాణసంచా ప్రమాదకరంగా తయారైందనేది వాస్తవం. గతంలో సల్ఫర్, బొగ్గు, పొటాషియం తగిన మోతాదులో కలిపి, ఆ మిశ్రమంతో తారాజువ్వలు, వెన్నముద్దలు, చిచ్చుబుడ్లు వంటి రకరకాల బాణసంచాను ఇంట్లోనే తయారు చేసుకునేవారు. వాటినే అందరూ దీపావళి నాడు కాల్చేవారు. వర్షాకాలం నుంచి శీతాకాలం మారిన సందర్భంలో జబ్బులకు గురిచేసే అనేక హానికర క్రిమికీటకాలను ఆ మతాబులు నాశనం చేసేవి. అంతేకాదు అవన్నీ పర్యావరణ హితంగానే ఉండేవి. నాటి దీపావళి ఆనందాలను పంచేది. కానీ ఆధునికత పెరుగుతున్న కొద్ది పటాకుల్లో రసాయనాల వాడకం కూడా పెరిగి కాలుష్యానికి కారణమవుతున్నాయి.

పొగరాని పటాకులు

పంజాబ్‌లోని ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్) శాస్త్రవేత్తలు, దీపావళి నేపథ్యంలో పొగరాని టపాసులను కనిపెట్టారు. అవి హరిత టపాసుల శ్రేణిలోకి వస్తాయని చెప్తున్నారు. ఇవి కాలుష్య రహిత టపాసులు అంటున్నారు ఐఐఎస్‌ఈఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సామ్రాట్ ఘోష్.ఇవి సూపర్ గ్రీన్ కేటగిరీకి చెందిన టపాసులు. సూపర్ గ్రీన్ ఎందుకంటే... ఇవి పర్యావరణ హితమైనవే కాకుండా.. వీటి తయారీకి మేం అనుసరించే ప్రక్రియ కూడా పర్యావరణానికి ఎలాంటి నష్టం చేయదు. టాపాసుల్ని కాల్చిన తర్వా త వెలువడే ఉద్గారాలు, అందులోంచి విడుదలయ్యే పార్టిక్యులేట్ మ్యాటర్... సూక్ష్మ కాలుష్య కారకాలు చాలా తక్కువగా ఉండాలి. అప్పుడే వాటిని గ్రీన్ క్రాకర్స్ అంటారు అని సామ్రాట్ ఘోష్ అన్నారు. ఆ తర్వాత వీటికి ధరలను నిర్ణయించడం ఒక ముఖ్యమైన అంశం. పొగరాని, సూపర్ గ్రీన్ టపాసులు నిజానికి చాలా చౌక. మాకు వీటిని తయారు చేయడానికి ఒక్కో పటాకుపై 5 రూపాయలు ఖర్చవుతున్నది. కానీ మేం దీన్ని బయటి తయారీదారులకు అందిస్తే ఈ ధర వారికి గిట్టుబాటు కాదు అని సామ్రాట్ ఘోష్ వివరించారు.

ఆన్ లైన్ లో నో

ఇప్పుడు మనం ఏది కొనాలన్నా ఆన్‌లైన్‌లోనే. అయితే పటాకులు కూడా అమ్మాలని అనుకున్న ఆన్‌లైన్ మార్కెట్లకు సుఫ్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ లాంటి ఆన్ లైన్ పోర్టళ్లలో పటాకుల అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. బాణసంచా, క్రాకర్స్ అమ్మకాలకు సంబంధించి ఈ కామర్స్ వెబ్ సైట్లకు స్టే ఇచ్చింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి ఆన్‌లైన్‌లో ఎవరైనా అమ్మకాలు చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే వీటిని అమ్మాలని ఆదేశించింది.
Diwalii2

రెండు గంటలే

దీపావళికి ప్రత్యేకమైన పటాకులు, బాణసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు గతంలో కీలక తీర్పు ఇచ్చింది. భారీస్థాయిలో పటాకులు, బాణసంచా కాల్చడంతో పర్యావరణం కలుషితం అవుతుందంటూ దాఖలైన పిటిషన్లను విచారణ చేసిన ధర్మాసనం షరతులు పాటిస్తూ.. పటాకులు పేల్చుకుని సంబురాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని ఆదేశించింది. దీనిపై అన్ని రాష్ర్టాలు నిఘా పెట్టాలని, దీపావళి పండుగకు వారం రోజుల ముందు.. వారం రోజుల తర్వాత గాలిలో కాలుష్య పరిమాణం ఎంత ఉందో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

మూగజీవాలు జాగ్రత్త

అందరూ ఆనందంగా జరుపుకొనే దీపావళి పండగ మూగజీవాలకు మాత్రం ప్రాణసంకటంగా మారుతున్నది. పటాకులు కాల్చడం వల్ల ఉత్పన్నమయ్యే శబ్దం, ఎగిసిపడే నిప్పు రవ్వల కారణంగా ఏటా వందల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ రోజుల్లో ఉండే శబ్ద కాలుష్యం దీపావళి రోజున రెట్టింపు అవుతుంది. వాయు కాలుష్యం అయితే ఇక చెప్పక్కరలేదు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఇళ్లల్లో పెంచుకునే పెంపుడు నేస్తాలను కూడా కోల్పోవాల్సివస్తుందని జంతు ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.దీపావళి పటాకుల మోతకు ఇళ్లలో పెంచుకునే శునకాలు భయంతో బయటకు పరుగులు తీస్తాయి. పక్షులు భయంతో దూరంగా ఎగిరిపోతాయి. కుక్కల, పిల్లుల చెవులు సున్నితంగా ఉంటాయి. భారీ శబ్దాలను ఇవి తట్టుకోలేవు. పటాకుల మోతకు ఇవి బిగ్గరగా అరవడం, పారిపోవడం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా పండగను జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మూగజీవాలను ఇబ్బంది పెట్టకుండా.. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పండగ జరపుకొని హరిత దీపావళికి జై కొట్టాలని పర్యావరణవేత్తలు పిలుపునిస్తున్నారు. ఆకాశంలోకి వెళ్లి నిప్పురవ్వలు వదిలే రాకెట్లను మాత్రం అస్సలు కాల్చొద్దని సూచిస్తున్నారు. ఈ నిప్పురవ్వలు చెట్ల మీద ఉండే పక్షులతో పాటు అవి కట్టుకున్న గుళ్లను నాశనం చేస్తున్నాయి. వీటివల్ల వివిధ జంతువులు కూడా ప్రమాదం బారిన పడుతున్నాయి. అందువల్ల వాటికి ఇబ్బంది కలుగకుండా పటాకులు కాల్చడం మంచిది.

పక్షుల కోసం నో క్రాకర్స్

దీపావళిపై రకరకాల ఆంక్షలు ఎన్ని వస్తున్నా అనేక ఏండ్లుగా దీపావళి బాణసంచానే పేల్చని గ్రామం ఒకటుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. నమ్మశక్యంగా లేకున్నా ఇదినిజం.తమిళనాడులోని శివగంగ జిల్లావాసులు కొన్ని సంవత్సరాలుగా దీపావళి జరుపుకోవడమే మానేశారట. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చడం మానేసి.. నిశ్శబ్ద దీపావళిని జరుపుకొంటూ.. అక్కడికి వచ్చే వలసపక్షులను సంరక్షిస్తున్నారట. శివగంగ జిల్లాలోని కొల్లుకుడిపట్టి, సింగాంపునారి ప్రాంతాలకు ఉత్తర భారతదేశం, సైబీరియా, న్యూజిలాండ్ నుంచి అక్టోబరు-నవంబరు నెలల్లో కొన్ని రకాల పక్షులు వలస వస్తుంటాయి. వీటిలో కొంగలు, చెరువు కాకులు వంటి వివిధ రకాలు పక్షులున్నాయి. ఇవి మార్చి వరకూ ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు అయ్యేంత వరకూ ఉంటాయి. ఈ క్రమంలో టపాసుల కారణంగా ఆ పక్షుల జీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ ప్రాంతవాసులు నిశ్శబ్ద దీపావళి జరుపుకొంటున్నట్లు తెలిపారు.చిన్నారులు కూడా వలస పక్షుల సంరక్షణ దృష్ట్యా తమ నివాస ప్రదేశాల నుంచి దూరంగా రెండు కిలోమీటర్ల వరకూ వెళ్లి మరీ టపాసులు కాలుస్తారట.మరోవైపు కోయంబత్తూరులోని కిట్టంపలాయం అనే మరో ప్రాంతంలో పురాతన కాలం నాటి ఓ చింతచెట్టు ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల కొద్ది గబ్బిలాలు అక్కడికి వలస వస్తుంటాయి. వాటి నివాసానికి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ ప్రాంతవాసులు టపాసులు కాల్చడమే మానేసినట్లు పేర్కొన్నారు.

ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్

పర్యావరణ వాదుల ఆందోళనతోపాటు, ప్రజల్లో పెరుగుతున్న పర్యావరణ స్పృహ నేపథ్యంలో దీపావళి క్రాకర్స్ గతంలోని తమ స్వభావాన్ని మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద శబ్ధాలు చేసే బాణసంచా కాల్చడానికే ఇష్టపడేవారు ఇప్పుడు పర్యావరణానికి హానీ చేయని ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. వాతావరణానికి ఎలాంటి హాని చేయని, ధ్వని కాలుష్యం కలిగించని గ్లో స్టిక్స్, కాన్ఫెట్టి, స్నేక్మిక్స్, ఫేక్నోట్, ఫ్లవర్ పవర్ వంటి ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని రీసైకిల్ పేపర్స్‌తో తయారుచేస్తున్నారు. ఇవి ధ్వనిని తక్కువ ఉత్పత్తి చేయడంతో పాటు కాలుష్యం కలిగించని రంగురంగుల మెరుపులను వెదజల్లుతాయి. కేవలం గన్‌ఫౌడర్, ఫాస్పేట్‌ను మాత్రమే వాడి వీటిని తయారు చేస్తారు.

గ్రీన్ క్రాకర్స్

అస్సొంలోని గనక్కుకి గ్రామంలో.. 130 సంవత్సరాలుగా గ్రీన్ క్రాకర్స్‌ను తయారు చేస్తున్నారు. ఈ బాణసంచా కాలిస్తే, తక్కువ శబ్ధం, పొగ, కెమికల్స్ అసలే రావు. ఇవి కాలిస్తే మనకు, పర్యావరణానికి కూడా మంచిది. ఇవి ప్రస్తుతం మార్కెట్ లో దొరికే బాణసంచా కన్నా తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి.. సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగానే ఈ గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయి. సేఫ్ వాటర్ రిలీజన్(స్వాప్), సేఫ్ మినియల్ అల్యూమినియం (సఫల్), సేఫ్ థెర్మైట్ క్రాకర్ (స్టార్) అని ఈ గ్రీన్ క్రాకర్స్ పేరు పెట్టారు. గ్రీన్ క్రాకర్స్‌కు మండే పదార్థాలకు బదులు తక్కువ కాలుష్యాన్ని కలిగించే మెగ్నీషియంను ఉపయోగిస్తారు. పొటాషియమ్ నైట్రేట్, సల్ఫర్ వంటివి కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి.రీసైకిల్ పేపర్‌తో వాక్యూమ్ కంబ్యూషన్ పద్ధతిలో తయారు చేస్తారు. అందుకే తక్కువ శబ్దాలు, తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతాయి. సాధారణ బాణసంచాతో పోలిస్తే వీటి ధర తక్కువే. పటాకులనుబట్టి రూ.15 నుంచి రూ.3,500 వరకు అందుబాటులో ఉన్నాయి.

జాగ్రత్తలు

పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్ దుస్తులనే ధరించడం మంచిది.పిల్లలను క్రాకర్స్ కాల్చేటప్పుడు పెద్దవారు తోడుగా ఉండాలి.చేతులకు గ్లోవ్స్, కళ్లకు అద్దాలు, కాళ్లకు బూట్లు వేసుకొని క్రాకర్స్ కాల్చడం మంచిది. జేబుల్లో టపాసులు పెట్టుకుని తిరగడం చాలా ప్రమాదకరం. నిప్పురవ్వలు మీద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుకోవాలి. బాణసంచా ఎప్పుడూ ఇంట్లో కాల్చేందుకు ప్రయత్నించవద్దు. బహిరంగ ప్రదేశాల్లోనే వాటిని పేల్చండి.అగ్నిప్రమాదం జరిగితే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు నీళ్లు అందుబాటులో ఉంచుకోండి.పేలకుండా మధ్యలో ఆగిపోయిన టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయరాదు. అదిపైకి మండకపోయినా లోపల ఉండిపోతే దాన్ని చేతిలోకి తీసుకోగానే పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ముందు జాగ్రత్తగా అలాంటివాటిపై నీటిని చల్లి తడపండి.మంటలు అంటుకునే అవకాశం గల ప్రాంతాలకు దూరంగా బాణసంచాను పేల్చాలి. భవనాలు, చెట్లు, ఎండుగడ్డి లాంటి చోట టపాసులు పేల్చడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ.ఇంటి ముందు లేదా మేడపైన తాటాకులు కాల్చేముందు నీళ్లు చల్లండి. పందిరి ఉంటే దానిపై కూడా చల్లాలి.బాణసంచా కాల్చేటప్పుడు చేతులను టపాసులకు దూరంగా ఉంచి జాగ్రత్తగా అంటించాలి. అలాగే టపాసుకు ముఖాన్ని దూరంగా ఉంచడం మర్చిపోవద్దు.
Diwalii3

ప్రథమ చికిత్స

దీపావళి అంటేనే వెలుగుల పండుగ. అందులోనూ నిప్పుతో ఆటలు. కనుక పటాకుల వల్ల ప్రమాదం ఏర్పడితే ప్రథమ చికిత్స గురించి కూడా అవగాహన ఉండాలి. నిప్పు అంటుకుని గాయమైన శరీర భాగంపై నుంచి వస్ర్తాలు తొలగించాలి. గాయాలపై చల్లని నీటిని పోయాలి. నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా తాగే పానీయమైనా పర్వాలేదు. గాయాలపై ఐస్‌తో మర్దన చేయవద్దు. అలాగే వెన్న, గ్రీజ్, పౌడర్ లాంటి వాటిని రాయడానికి కూడా ప్రయత్నించవద్దు. వీటి వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఇవన్నీ చేసేలోపు వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి.

667
Tags

More News

VIRAL NEWS