వాస్తు


Sun,November 3, 2019 01:12 AM

మేము కవల పిల్లలం. మా ఇండ్లు ఎక్కడెక్కడ ఎలా కట్టుకోవాలి? -ఊడుగుల అజయ్, విజయ్, మేడ్చల్

మీ గృహాలు ఎవరు ఎక్కడ కట్టుకున్నా దోషం లేదు. ముందు పుట్టినవారు పెద్దవారు అనుకున్నా మెడికల్ ప్రకారం వెనుక పుట్టిన వారే పెద్దవారు అంటారు. కాబట్టి మీ ఇష్టానుసారం ఒకే స్థలాన్ని రెండు భాగాలు చేసుకొని ఎవరు ఎటువైపు అయినా ఉండవచ్చు. కలిసి పుట్టారు కాబట్టి ఇంటిని కలిపి కట్టవద్దు అంటే.. ప్రహరీలు లేకుండా కామన్ వాల్స్‌పెట్టి కట్టొద్దు. ఎవరి కాంపౌండ్ వారిదే.. ఎవరిగేటు వారిదే ఉండాలి. మీ స్థలాలను నిర్ణయించుకొని ఎవరి ఇల్లు వారు స్వతంత్రంగా కట్టుకోండి. మీరు కట్టే ఇల్లు శాస్ర్తానికి చక్కగా కుదిరి ఉండాలి. ఇంటి విభజనలో లోపాలు చేసుకోవద్దు. పోతే ఒకే స్థలంలో ఒకే ఇంట్లో కింద ఒకరు మీద ఒకరు కూడా కట్టుకోవచ్చు. మీమీ జీవితాలను, ఉద్యోగాలను బట్టి ఎవరు ఎక్కడికైనా వెళ్లి కట్టుకోవచ్చు. ఒకేచోట ఉండాలనే నియమం లేదు.
Vasthu

రోడ్డు ఎంత వెడల్పు ఉందో అంత ఇంటి స్థలం ఉంది. దాంట్లో ఇల్లు కట్టుకోవచ్చా? వెంటిలేషన్ ఉంటుంది కదా! -ఉయ్యాల కృష్ణవేణి, వసంతనగర్, హైదరాబాద్

ఇంటికి అనుకూలమైన రోడ్డు ఉన్నప్పుడే గృహం చక్కగా ప్రకృతిలో ఒదిగి ఉంటుంది. ప్రధానంగా రోడ్లు ఎదురుగా (అభిముఖంగా) వచ్చినప్పుడే జాగ్రత్తగా ఆలోచించాలి. వెంటిలేషన్‌కు ఏ రోడ్డు వచ్చినా ప్లాన్ చేయవచ్చు. ట్రాఫిక్ రోడ్డులో రాంగ్ రూటులో బైక్‌తో ప్రయాణించినట్టు ఉంటుంది. ఆ ఇల్లు ముఖ్యంగా రోడ్ల విషయంలో ఎంతో విశ్లేషణ చేసుకోవాలి. అవి సాధారణంగా కనబడుతూ అసాధారణ ఫలితాలు వెల్లడి స్తుంటాయి. ఇంటిని మింగే దారి ఎదురుగా రావడం వల్ల ముందుగా ఇంట్లో అనేక రకాల కాలుష్యాలు ఏర్పడతాయి. ధ్వని వాయు, ప్రైవసీ (ఏకాంతం) దృశ్య, గంధ (వాసన) కాలుష్యాలు మన ఇంటిని ముట్టడిస్తాయి. అలా పూర్తిరోడ్డు తూర్పు భాగం అయినా, ఉత్తరం దక్షిణం లేదా పడమర కూడా పనికిరావన్నది పరిశీలించాల్సిన అంశం. వీధి చూపుల అంశం వేరు. ఎప్పుడైనా ఇంటికి రోడ్లు ఒదిగి ఉండాలి. అధిగమించి ఉండొద్దు. గృహం, గుహ్యం (రహస్యం)గానే ఉంటే మంచిది. బజార్లో పడ్డట్టు ఉండొద్దు.

బావి దగ్గర పంపు రూము ఎటువైపు కట్టాలి? -పి.నర్సిరెడ్డి, మోత్కూర్

వ్యవసాయ స్థలంలో ఒకప్పుడు నీళ్లు పోసే మోటర్ బావిలోనే బిగించేవారు. దాని స్విచ్ బోర్డు పైన బావి అందునా ఒక రాయి పాతి దానికి పెట్టేవారు. డ్రిప్ విధానం గొప్పగా అమలు జరుగుతుంది. అందుకు సంబంధించిన సాంకేతిక పద్ధతికి తప్పనిసరి రూము అవసరం. ఒక వ్యక్తి దానిని ఆపరేట్ చేయాల్సి ఉంది. ఆ విధానంలో ఆ గదిని బావికి తూర్పులో, ఉత్తరంలో ఈశాన్యంలో కాకుండా బావి ఈశాన్యంలో వచ్చేటట్టు పైపులు తూర్పు గోడనుండి లేదా ఉత్తరం గోడనుండి బయటకు వెళ్లేవిధంగా అమర్చుకోవాలి. దానిలో అరుగులు కట్టి ట్యాంకులు బిగిస్తారు. వాటిని దక్షిణం గోడవైపు పెట్టుకోవాలి. సాధారణ ప్లోరింగ్ వేసుకోవచ్చు.

టాయిలెట్లు ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కన్నా ఎత్తు రావచ్చా? -అనకాపల్లి దాసు, వంగపల్లి

అపార్ట్‌మెంట్లలో ప్రధానంగా ఈ పరిస్థితి కనబడుతూ ఉంటుంది. రెగ్యులర్ స్లాబ్‌మీద టాయిలెట్లు పెడుతూ ఉంటారు. అప్పుడు స్లాబ్ లెవెల్ కన్నా టాయిలెట్లు ఫ్లోరింగ్ పైకి లేస్తూ ఉంటుంది. ఇలా స్లాబ్‌మీద టాయిలెట్లు తప్పనిసరి అయినప్పుడు ప్రధాన పడకగది (మాస్టర్ బెడ్‌రూము)లో తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ కట్టి దానితో అనుబంధంగా డ్రెస్సింగ్ రూము నైరుతిలో ఏర్పాటు చేసుకొని దాని ఫ్లోరింగ్ కూడా టాయిలెట్ల లెవెల్‌తో సమానంగా కానీ లేదా ఒక అంగుళం ఎత్తు కానీ చేసుకొని కట్టాలి. అయితే ఆ డ్రెస్సింగ్‌కి డోరు పెట్టుకోవద్దు. ఓపెన్‌గానే ఉండాలి. డోరు పెట్టడం వల్ల పడకగదిలో మరో చిన్నగది అవుతుంది.. ఇది దోషం. ఈ విధంగా పైపు లైను వెళ్లే విధంగా టాయిలెట్ల ఫ్లోరింగ్ ఎనిమిది, లేదా తొమ్మిది అంగుళాల ఎత్తు పెంచుకోవచ్చు. అప్పుడు ఏ దోషం ఉండదు. అయితే ఈశాన్యం పడకగది ఉన్నప్పుడు దానికి బాత్‌రూము ఉండకుండా చూసుకోవాలి.

సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

223
Tags

More News

VIRAL NEWS