గాల్లో భోజనం ఆరగిద్దామా!


Sun,November 3, 2019 04:12 AM

నాకే గనుక రెండు రెక్కలుంటే.. ఓ పక్షిలా గాల్లో ఎగిరేవాణ్ణి. ఏదో ఒక సందర్భంలో ఈ మాట మనం అనే ఉంటాం. గాల్లో తేలిపోవడమన్నా.. ఆకాశంలో విహరించడమన్నా ఇష్టం లేనివారుండరు. జాతరలు, పండుగల సమయాల్లో, పార్కుల్లో జాయింట్ వీల్ ఎక్కి ఆ కోరిక తీర్చుకుంటారు. గాల్లో తేలిపోవాలనుకునే వారికి మరో శుభవార్త. మీరు ఓ అరగంట పాటు ఆకాశంలో ఉండొచ్చు. అంతేకాదు.. మీకిష్టమైన ఆహారాన్ని కూడా అక్కడే తినొచ్చు. అదెలా సాధ్యమంటే..
Sky_Dining

భూమికి ఆకాశానికి మధ్య నూటా అరవై అడుగుల ఎత్తు. అక్కడినుంచి చూస్తే మనుషులు చీమలే. అలాంటి ప్రదేశంలో కూర్చోవచ్చు. మేఘాల్ని దగ్గరగా చూడొచ్చు. అంత ఎత్తులో కొన్ని కుర్చీలు. కొద్దిగా గాలి వీస్తే పడిపోతామేమోనని వణుకు. ఓ 30 నిమిషాలు అక్కడే గడపడం ఓ అనుభూతి. అక్కడే భోజనం చేయడం మరో మధురానుభూతి. గాల్లో తేలుతూ చిన్న చిన్నపార్టీలు, ఫంక్షన్లు సైతం చేసుకుంటున్నారక్కడ. బర్త్‌డే కేక్‌లను సైతం కట్ చేస్తున్నారు. ఫొటోలు దిగుతున్నారు. సరదాగా గడుపుతున్నారు. ైఫ్లె డైనింగ్ సాహసప్రియులకు కొత్త హుషారునిస్తున్నది. భోజనప్రియుల్ని కట్టిపడేస్తున్నది.

గాల్లో తేలుతూ..

జంపింగ్ ఇండియా అనే అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ ైఫ్లె డైనింగ్ రెస్టారెంట్‌ను బెంగళూరులో ప్రారంభించింది. ఇందులో 160 అడుగుల ఎత్తులో తేలుతూ భోజనం చేసేలా ఏర్పాట్లు చేసింది. అంటే దాదాపు 10 అంతస్తుల ఎత్తు అన్నమాట. ఈ రెస్టారెంట్ పక్కనే నాగవార, మాన్యతా టెక్ పార్క్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ పార్కు అందాల్ని చూడవచ్చు. ప్రకృతినీ ఆస్వాదించవచ్చు. బర్త్‌డే పార్టీలు, ఇతర శుభకార్యాలు సైతం ఇందులో చేసుకోవచ్చు. కాకపోతే ఈ రెస్టారెంట్‌లో 22 కుర్చీలు మాత్రమే ఉంటాయి. ఒక్కరు లేదా ఇద్దరు కలిసి మొత్తం కుర్చీలను బుక్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఇందులో వడ్డించేందుకు నలుగురు సిబ్బంది ఉంటారు. ఫొటోలు తీసేందుకు ఒక ఫొటోగ్రాఫర్ కూడా ఉంటాడు. మూడు సీట్ బెల్టులు పెట్టుకోవాల్సి ఉంటుంది. బాగా గాలి వీచినప్పుడు, అత్యవసర సమయంలో కిందికి దింపుతారు.

ఇండియాలో మొదటిది

ప్రపంచవ్యాప్తంగా సుమారు 65 ైఫ్లె డైనింగ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి. ఇండియాలో మాత్రం ఇదే మొదటిది. పెద్ద డైనింగ్ టేబుల్‌తో ఉండే ఈ రెస్టారెంట్‌ను క్రేన్ ద్వారా పైకి లేపుతారు. ఒక్కో వ్యక్తి అరగంట పాటు ఇక్కడ గడపవచ్చు. ఈ రెస్టారెంట్‌లోకి గర్భవతులు, 14 ఏండ్లలోపు చిన్నారులను అనుమతించరు. పర్యటకులు కనీస ఎత్తు 4.5 అడుగులు ఉండాలి. బరువు విషయంలో పట్టింపు లేదు. వర్షం కురిసినా తడువకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. తీవ్రమైన గాలులు వీచినప్పుడు మాత్రం ఈ రెస్టారెంట్‌ను కిందికి దింపుతారు. సాయంత్రం పూట నిశీధిలో రంగు రంగుల లైట్ల మధ్య గడపవచ్చు. వెజ్, నాన్‌వెజ్, సూప్‌లు, కూల్‌డ్రింక్‌లు, పండ్ల రసాలతో కూడిన మెనూ ఉంటుంది.

ధరలు ఇలా..

సాధారణ రోజుల్లో.. మధ్యాహ్న భోజనం ఒకరికి రూ.8,756. మాక్ టైల్(నాన్ ఆల్కహాల్ డ్రింక్)కు రూ.8,020, రాత్రి సమయంలో ఒక్కొక్కరికి రూ. 10,228 చెల్లించాల్సి ఉంటుంది. వారాంతాల్లో ఈ రెస్టారెంట్‌కు ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకని వారాంతాల్లో ప్రత్యేక ధరలుంటాయి. మధ్యాహ్న భోజనం రూ. 10,228. మాక్ టైల్‌కు రూ. 7,761. ఈ రెస్టారెంట్‌లో భోజనం చేయాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. flydining.com ద్వారా బుక్ చేసుకోవచ్చు. రెస్టారెంట్‌లోని 22 సీట్లను ఒకరు లేదా ఇద్దరు కలిసి కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా నిర్వాహకులు కల్పించారు. ఏరోజుకారోజు ఆఫర్లు కూడా పెడుతున్నారు. మరింకెందుకు ఆలస్యం బెంగళూరు వెళ్తే ఓసారి ైఫ్లెడైనింగ్ రెస్టారెంట్‌కి వెళ్లి వస్తారా!
Sky_Dining1

విదేశాల్లో చూశా..

2013లో చైనా వెళ్లినప్పుడు ైఫ్లె డైనింగ్ చూశా. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. 2014 నుంచి ఈ ైఫ్లె డైనింగ్ ప్రారంభించాలని ప్రయత్నాలు చేశా. 2016లో పనులు ప్రారంభించా. గతేడాది అక్టోబర్‌లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించా. సీజన్‌తో సంబంధం లేకుండా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. గాల్లో తేలుతూ ఇష్టమైన ఆహారాన్ని తింటూ ఆనందంగా గడుపుతున్నారు. వారాంతాల్లో అయితే రద్దీ ఎక్కువగా ఉంటున్నది. త్వరలోనే మరో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నా.
- నేహా గుప్త, సీఈవో, జంపింగ్ ఇండియా అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ

377
Tags

More News

VIRAL NEWS