ఖుర్బాని


Sun,November 17, 2019 01:59 AM

మబ్బుల లేసి.. పొద్దుపొడుపుకంటే ముందుగాల సద్వాల్సిన ఫజర్ నమాజ్ సదువుకున్నడు బిలాల్. రెండు చేతుల దోసిల్లు ఎత్తిపట్టి అల్లాను ప్రార్థించుకున్నడు. లేసి ఇంట్లకెల్లి బయటి వాకిట్లకొచ్చిండు. యింకామసక వెలుతురుగానే ఉంది. రేపు బక్రీద్ పండుగ.ఖుర్బాని కోసం తెచ్చిన యాటపోతుకెల్లి చూసిండు. అది బిలాల్‌ను చూసి లేసి నిలబడింది మేతకోసం. జువ్వాకు మండలు నాలుగు దాని ముంగటేసిండు. అది ఆబగా పరపరా నమలబట్టింది. దానీపు నిమిరి అక్కడికెళ్లి కదిలిండు బిలాల్. సరిగ్గా అప్పుడే..పెద్దర్వాజ తలుపులు తోసుకొని హసీనా బయటికెళ్లి ఇంట్లెకొచ్చింది.ఏం సమజ్‌గాలే బిలాల్‌కు. కొద్దిసేపు మానులా నిలబడిండు. హసీనా గీ చీకట్ల యాడికిబోయింది? ఎందుకుబోయింది? ఇంట్లకు బోయి ఆమెను అదేమాటడిగిండు.
KURBANI

ఆమె కళ్లు తుడ్సుకొని రాములమ్మొదిన బిడ్డ.. జయమ్మకు... యింకా ఏదోమాట చెప్పబోతుండగానే..ఆ.. జయమ్మకు.. ఏమైంది? గాభరాగా అడిగిండు బిలాల్. అదే చెప్తున్న. జయమ్మకు ఏం బాగలేదు. తొల్సూరు కాన్పు తల్లిగారింట్లనే చెయ్యాలని, నిన్న ఆటోల జయమ్మను ఇంట్ల దింపి పోయిండు ఆ పిల్ల పెనిమిటి. రాత్రి పదకొండు గంటలప్పుడు పిల్లకు నొప్పులు మొదలయ్యినయ్యంట. గంగన్న మంత్రసాని సాయమ్మను పిల్సుకొచ్చిండంట. ఆమె ఆపతిపడ్తున్న పిల్లను చూసి కడ్పుల బిడ్డ అడ్డం తిరిగింది. నా వల్ల కాదు. పెద్దాసుపత్రికి తీస్కపోవాల. లేకపోతే పెద్ద పాణానికే ముప్పు రావచ్చు అనిందట. కూలీ బతుకులాయె. ఇంట్ల చిల్లి గవ్వ లేదు. గంగన్న రాత్రిల్లే ఊర్లె శానామంది ఇండ్లల్లకు బోయి అప్పు అడిగిండట. ఎక్కడా ఏకానా అప్పు పుట్టలే. బిడ్డ పడ్తున్న ఆపతి సూస్తూ ఏం చేయలేక రాములమ్మొదిన గంగన్న ఏడ్వబట్టిండ్రు. ఆల్ల ఏడ్పులిన్న సుట్టుపక్కలోల్లందరొచ్చింరు. ఆల్లయి గూడ సాయం చేసే తాహతులేని కూలీ బతుకులేనాయే. నాకు నిద్దట్ల ఏడ్పులు ఇనిపిస్తుంటే కలల్నే అనుకున్న. లేసి సూస్తే.. ఏడ్పులు రాములమ్మొదిన ఇంటి నుంచి. నిన్ను లేపుదామనుకున్న. మంచి నిద్రలో ఉన్నవ్. ఆనక్క లేపొచ్చులే అనుకొని, రాములమ్మొదినింటికి పోయిన. సూద్దునుగదా ఇదీ సంగతి అన్జెప్పి ముక్కు చీది పైటకొంగుతో తుడ్సుకుంది హసీనా.

మరి ఇప్పుడెట్లుంది జయమ్మకు? అడిగిండు బిలాల్.అట్టనే ఉంది పాపం పిల్ల.. ఎంత యాతన పడ్తుందో ఏందో.. తల్సుకుంటెనే.. కాళ్లు చేతులాడ్తలేవు నాకు. మనమేమన్నా సాయం చేయగలమేమో.. జర సొచాయించరాదు అంది భర్తతో హసీనా. భార్య చెప్పింది విన్నంక, ఆపతి పడ్తున్న జయమ్మ కళ్లల్ల తిరిగింది బిలాల్‌కు. రాములక్క ఇల్లు, తమ ఇల్లు పక్కపక్క గలమలే. నడుమ గోడే అడ్డం. కష్టమొచ్చినా, కార్యమొచ్చినా తోడుగా పంచుకుంటూ, కలిసికట్టుగా బతుకుతున్న కుటుంబాలు తమవి. జయమ్మ యాడాదిన్నర పాపగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఎక్కువ ఉండేది. తన ముద్దు ముద్దు మాటల్తో పిలాల్ మామ.. పిలాల్ మామ! నన్నెత్తుతోవా? అంటూ తన భుజాలెక్కి తిరిగాడుకున్న పిల్ల. ఇప్పుడెంత బాధపడ్తుందో? అట్టా ఆలోచిస్తున్న బిలాల్‌కు మనసులో చాలా బాధనిపించింది. ఏం చేయాలనే ఆలోచనలో పడిండు. బిలాల్ కూడా ధనవంతుడేం కాదు. తాత తండ్రుల నుంచి వచ్చిన పొలముంది. ఏడాదికి సరిపడా తిండి గింజలొస్తయి. తన ఆటో నడుపుతడు. భార్య హసీనా భర్తకు చేదోడుగా కుట్టుపని చేస్తది. ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో బక్రీద్ పండుగకు ఖుర్బాని ఇచ్చేంత ఆర్థిక తాహతు మాత్రమే ఉంది. నిన్ననే తన దగ్గరున్న డబ్బుల్తో యాటపోతును కొనుక్కొచ్చిండు.

ఇంక ఇంట్ల పండుగ ఖర్చులకని ఉంచిన డబ్బులు మాత్రమే ఉన్నయి. జయమ్మనెట్లా ఆస్పత్రికి తీస్కపోవాలే? ఆలోచిస్తుండు బిలాల్..ఈగలు ముసిరినట్లున్నయి. ఖుర్బాని కోసం తెచ్చిన యాటపోతు చెవులు టపటపలాడించింది. బిలాల్ చూపులు దానికెళ్లి మళ్లినయి. ఒక ఆలోచన తట్టింది. యాటపోతును తిరిగిచ్చి డబ్బులు వాపస్ తెచ్చుకుంటే జయమ్మను ఆస్పత్రికి తీస్కపోవచ్చు. అదే ఆలోచన భార్యకు చెప్పిండు. ఆమె కూడా ఒప్పుకుంది.నువ్వు రాములక్క ఇంటికిబోయి, జయమ్మను ఆస్పత్రికి తీస్కపోనీకి డబ్బులు నేను తెస్తున్ననని చెప్పు. మనింట్ల పిల్లలకు జాగ్రత్తగా ఉండమని చెప్పి, నువ్వు కూడా ఆస్పత్రికి రావడానికి తయారవ్వు. వాళ్లకు తోడుగుంటవు. అట్లనే ఇంట్ల పండుగ ఖర్చులకుంచిన డబ్బులు పట్కరా.. అన్జెప్పి ఒక్క సెకను ఆలస్యం చేయకుండా, గుంజకు కట్టేసిన యాటను విప్పి ఎత్తుక పోయి దాన్ని ఆటోల కుదేసి కట్టి, ఐదు నిమిషాల్ల ఆటోను మల్లయ్య ఇంటి గేటు ముందు ఆపిండు. ఆటో దిగి గేటు లోపలికి సూసిండు. మల్లయ్య కూకొని చాయ్ తాగుతుండు.

మల్లయ్య ఇల్లు అరెకరం జాగల ఉంటది. అరవై ఏండ్లపైన ఉంటయ్ మల్లయ్యకు. బుర్ర మీసాలు, ఎత్తుగుంటడు, ఎత్తుకు తగ్గ లావుంటడు. పదిహేనెకరాల పొలం, ట్రాక్టర్, ఐదు వందల జీవాలకు ఆసామి మల్లయ్య. బక్రీద్ పండుగ వచ్చిందంటే మల్లయ్య ఇల్లే ఒక సంత. మారు బేరగాళ్లు పట్నంకెళ్లి వచ్చి యాటపోతుల్ని కొనుక్కపోతరు. ఎంత గిరాకీ ఉన్న ధర పెంచకుండా అగ్గువ ధరలకే యాటలమ్ముతడని మంచి పేరుంది మల్లయ్యకు. నిన్న బిలాల్ ఇక్కన్నే యాటపోతు కొనుక్కపోయిండు. ఆటోల యాటపోతును కట్టేసిన తాడు ఇప్పి, పోతును దింపి, తాడు పట్టి లాక్కుంట గేటు దాటి మల్లయ్య కూకున్న కాడికొచ్చి.. నమస్తే కాకయ్య! అన్నడు బిలాల్. నమస్తే బేటా ఏందిరా పాపం దాన్నట్టా లాక్కొస్తుంటివి అన్నడు మల్లయ్య. మీసాలకంటిన చాయ్ తుడ్సుకొని చాయ్ కప్పు కింద పెడ్తూ..

కాకయ్యా.. మా అక్క బిడ్డకు కాన్పు కష్టమైతాంది. అర్జెంటుగ పెద్దాస్పత్రికి తీస్కపోవాల. డబ్బులు గావాలె కాకయ్య! గీయాట పోతును వాసప్ తీస్కొని డబ్బులియ్యి అన్నడు బిలాల్. బిలాల్ గురించి తెల్సిన మల్లయ్య అట్టనా బేటా! సరే ఇస్తా! పట్కపో! అన్జెప్పి, భార్య సూరమ్మను పిల్సి, ఇంట్ల చెక్కపెట్టెలకెల్లి ఎనిమిది వేలు తెచ్చియ్యి అని చెప్పిండు. ఆమె ఇంట్లకు బోయి డబ్బులు తెచ్చి మల్లయ్య చేతికిచ్చి, తిరిగి ఇంట్లకు బోయింది. అయి లెక్కపెట్టి బిలాల్ చేతికిస్తూ.. బేటా బిలాల్! యాటపోతుకు కట్టిన డబ్బులు కూడా తీస్కపో! యాటను కూడా పట్కపో! పండుగ ఎల్లినంక ఇయ్యి డబ్బులు అన్నడు.అట్ల కుదురదు కాకయ్య..! అప్పుచేసి ఖుర్బాని ఇయ్యడం చెల్లదు. సొంత కష్టార్జితం డబ్బుల్తోనే ఖుర్బాని ఇయ్యాలె! అది పద్ధతి అన్నడు బిలాల్.అట్టయితే ఇప్పుడు నేనిచ్చిన డబ్బులు అప్పు అనుకొని తర్వాత ఇయ్యి అన్నడు మల్లయ్య.

వద్దు కాకయ్య.. పిల్లలకు ఫీజులు కట్టాలి. మల్ల నీకు టైంకు ఇయ్యకపోతే మాట పోద్ది. నా మీద నీకున్న భరోసాకి యాటపోతును వాపస్ తీస్కొని డబ్బులిచ్చినందుకు షుక్రియా కాకయ్యా! ఎల్తున్న అన్జెప్పి యాటపోతును అక్కడొదిలేసి, గేటు బయటకొచ్చి ఆటోలో కూకొని స్టార్ట్ చేసిండు. ఐదు నిమిషాల్ల రాములమ్మ ఇంటి ముందాపిండు ఆటోని.హసీనా గబగబా ఆటోకాడికొచ్చి పని అయ్యిందా? అడిగింది. ఆ అయ్యింది! నువ్వు రాములక్క ఇంట్లకు బొయ్యి జయమ్మను త్వరగా తీస్కరమ్మని చెప్పు వెళ్లు అన్నడు.
హసీనా పరుగున రాములమ్మ ఇంట్లకు బోయింది. మరికొద్దిసేపట్లనే జయమ్మను నలుగురు ఆడోళ్లు పట్టుకొచ్చి, ఆటోల పడుకోబెట్టిర్రు. రాములమ్మ, హసీనా జయమ్మను పట్టుకొని ఆటోల కూకుర్రు. గంగయ్య బిలాల్ పక్కన కూకుండు. బిలాల్ ఆటోను ముందుకు పోనిచ్చిండు. జయమ్మకు ఏ మాత్రం ఇబ్బంది కల్గకుండా జాగ్రత్తగా, గంటసేపట్ల మిర్యాలగూడల ప్రసూతి ఆస్పత్రి ముంగట ఆపిండు. వెంటనే ఆటో దిగి ఆస్పత్రిలకు బోయిండు. కంపౌండర్ వీల్ చైర్ ఆటో కాడికి తీస్కొచ్చిండు. ఇద్దరు నర్సులు కల్సి జయమ్మను ఆటోల నుంచి దించి వీల్ చైర్‌లో కూకోబెట్కొని ఆపరేషన్ థియేటర్లకు తీస్కపోయిర్రు.అప్పటికీ డాక్టరమ్మతో మాట్లాడి డబ్బులు డిపాజిట్ చేసిండు బిలాల్. డాక్టరమ్మ ఆపరేషన్ థియేటర్లకు బోయింది.పావుగంట తర్వాత ఆపరేషన్ థియేటర్లకెళ్లి నర్సు బయటికొచ్చి పేషెంట్‌కు బ్లీడింగ్ శానా అయిందని, అర్జెంటుగా ఓ నెగెటివ్ రక్తం కావాలని గాభరా పడుతూ చెప్పింది. హసీనా బ్లడ్ గ్రూప్ అదే కావడంతో రక్తమిచ్చింది. రెండు గంటలు గడిచినంక నర్సు బయటికొచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని, మగబిడ్డ అని, తల్లీబిడ్డలు బాగున్నారని చెప్పి, తిరిగిలోనికి వెళ్లింది.

అందరూ గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకున్నారు.ఇంకో నర్సు హసీనాను పట్టుకొచ్చి బయట హాల్లో కూకోబెట్టిపోయింది. మరో గంట గడిచినంక తల్లినీ బిడ్డను ఏరే గదిలోకి మార్చినట్లు చెప్పింది నర్సు. అందరూ నర్సు చెప్పిన గదిలకు పోయిండ్రు.

జయమ్మ నీరసంగా కళ్లు తెరిచి అందరొంక చూసి తిరిగి కళ్లు మూసుకొని పడుకుంది. పిలగాడు తల్లిపక్కల హాయిగా నిద్రపోతుండు. అందాక పచ్చి మంచినీళ్లు ముట్టలేదెవ్వలు. అప్పుడు జర ఆకలి అన్పించింది అందరికీ. బిలాల్ హోటల్‌కు బోయి అన్నాలు, రొట్టెలు, పాలు, పండ్లు పట్టుకొచ్చిండు. అందరూ కాస్త ఎంగిలి పడ్డరు. గప్పుడు పగలు మూడు గంటలయితంది. అంతా మంచిగనే జరిగింది కాబట్కి, హసీనా బిలాల్‌లు ఇంటికి పోదామనుకున్రు. అదే సంగతి రాములమ్మకు చెప్పి, హసీనాను డబ్బులడిగి తీస్కొని, అందుల నుంచి పదిహేనొందలు తీసి చేతి ఖర్చులకు ఉండనీమని రాములమ్మకిచ్చిండు. తన సెల్ నంబర్ కాయితంల రాసిచ్చిండు. అవసరమైతే ఫోన్ చేయమని చెప్పిండు.రాములమ్మ గాడబ్బులు తీసుకుంటూ, బిలాల్ రెండు చేతులు పట్టుకొని తమ్మి బిలాల్.. నువ్వు, నీ భార్య హసీనమ్మ ఉండబట్కే నాబిడ్డ జయమ్మ దానికొడుకు బతికిన్రు. తల్లీబిడ్డల్ని బతికిచ్చిన మీరు, మా పాలిట దేవుళ్లయ్యా! మీ రుణం ఈ జన్మల తీర్సుకుంటనో లేదో? అంటూ కంట నీరుబెట్టింది.బిలాల్ రాములమ్మను ఓదారుస్తూ ఊర్కో అక్కా ఏడ్వకు! మమ్ముల్ని దేవుళ్లతో పోల్చమాకు. చిన్నప్పటికెళ్లి నేను అక్క అంటూ నువ్వు తమ్మీ అంటూ నోరారా పిల్సుకుంటూ, సొంతోళ్లకంటే ఎక్కువ ప్రేమగా కల్సిమెల్సి ఆడుకుంట పెరిగి పెద్దయ్యినోళ్లం మనం. అస్వంటి అక్క బిడ్డకు ఆపతి వస్తే ఆదుకోవడం తమ్ముడి బాధ్యతే అక్కా! అంతే నేను చేసింది. ఊర్కో ఏడ్వమాకు! అన్నడు బిలాల్. బిలాల్ అన్న ఆ ఆత్మీయ మాట విన్న రాములమ్మ కళ్లల్ల మరిన్ని కన్నీళ్లు ఉబికినయి.

ఏడ్వకు వదిన! మేము మీకు అప్పిచ్చి కాయితం రాయించుకోలే! మేం ఖర్చు పెట్టిన డబ్బులు రుణం అన్న సంగతి మతిల నుంచి తీసెయ్యి! ఊకో వదిన అంటూ తన చేతుల్తో రాములమ్మ కంట నీరు తుడ్సింది హసీనా. గంగయ్య బావో! మనవడిని మంచిగ సూస్కో! లేకపోతే పెద్దయ్యినంక దుడ్డు కర్రతోని నీ ఈపు పగులగొడ్తడు అన్నడు బిలాల్ నవ్వుతూ. ఆ మాటలకు రాములమ్మ గంగయ్య నవ్వుతుంటే.. యింక మేం ఎల్తున్నం అన్జెప్పి ఆస్పత్రిల నుంచి బయట ఆటో దగ్గరికొచ్చిర్రు. హసీనా.. జయమ్మకు రక్తం ఇచ్చింది కాబట్టి నీరసంగా ఉంటే.. హసీనా చెయ్యిపట్టి ఆటోల కూకోబెట్టిండు బిలాల్. పిల్లల కోసం పండ్లు తెస్త అని హసీనాకు చెప్పి పండ్ల బండైపు పోబోతుంటే.. మల్లయ్య ఎదురైండు. ఏం కాకయ్య! ఇటెంకొచ్చినవ్? అడిగిండు బిలాల్. ఒరేయ్ బేటా ఇంత అన్యాయమారా? ఒక్క మాట చెప్పవైతివి? అన్నడు మల్లయ్య.బిలాల్‌కు ఏం అర్థం కాలే ఏం మాట కాకయ్య! అడిగిండు. ఏం తెల్వనట్టె అడుగుతున్నవేందిరా? అక్కబిడ్డకు ఆపతి అని చెప్పి యాటపోతు వాపసు తీస్కొని డబ్బులిస్తి. అక్క బిడ్డకని నువ్వు చెప్తె నీ సొంత అక్క బిడ్డకేమో అనుకున్న. ఒక్క మాట రాములక్క బిడ్డ జయమ్మ ఆపత్ల ఉందని చెప్పవైతివి. రాములమ్మ ఎవరనుకున్నవ్? సొంత నా అన్న బిడ్డ. జయమ్మ పరేశాన్గుంటే సూస్తు కూకున్నవని, నాకు శాపనార్థాలు పెట్టరారా? ఒక్క మాట నాతో అంటే నీ సొమ్మేం పోయింది చెప్పు! నువ్వు ఆటోల జయమ్మను తీస్కొని ఊరు దాటినంక ఎర్కయింది బేటా! యింక ఊర్లె ఉండబుద్దికాలే. అందుకే వచ్చిన అన్నడు మల్లయ్య.అది కాదు కాక! మీకు మీకు మాటల్లేవు కదా.. అందుకని నసిగిండు బిలాల్. అవున్నిజమే! మాట మీనమాటొచ్చి మాట్లాడడం బంద్జేస్కున్నం. గని పొడ్సుకున్నమా, సంపుకున్నమా? అయినోళ్లు కష్టాల్లో ఉంటే సూస్తూ కూకుంటమా? అట్టాకూకుంటే మనకీ మూగజీవాలకీ తేడా ఏముంటది చెప్పు? అన్నడు మల్లయ్య.

ఏమో కాకయ్య! తప్పయితే మాఫ్‌జెయ్యి! అన్నడు బిలాల్.నువ్వు తప్పు జేసినవ్ అంటలేను బేటా! నాకు మనసుల బాధన్పించి నీకు చెప్పిన అంతే! సరే గీ ముచ్చట పోనీగనీ ఇప్పుడు జయమ్మకెట్లుంది? ఏ ఆ ఆస్పత్రిల జేర్పిచ్చిండ్రు? అనడిగిండు మల్లయ్య.
జయమ్మకు పెద్దాపరేషన్ అయ్యిందని, మగబిడ్డ అని తల్లీ బిడ్డ బాగున్నరని చెప్పి, ఆస్పత్రి చూపించిండు బిలాల్. మల్లయ్య ఆస్పత్రొంక పోతాపోతా ఆగి వెనక్కి తిరిగి ఇంటికి ఎప్పుడు పోతున్రు బేటా అడిగిండు.. పిల్లలకు పండ్లు కొనుక్కొచ్చుకొని ఇంటికి బోవుడే కాకయ్యా అన్నడు బిలాల్. జర ఆగుండ్రి బేటా! నేనూ మీతో వస్త. జయమ్మను, దాని కొడుకుని చూసి, మా రాములమ్మను కల్సి, జర ధైర్యం జెప్పి వస్త. కల్సి పోదాం ఇంటికి. మీ కాకమ్మ కూడా ఒక్కత్తే ఉంది. ఇంటికాడ అని జెప్పి మల్లయ్య ఆస్పత్రిలకు బోయిండు.

బిలాల్ పండ్లు తీస్కొచ్చి ఆటోల కూకున్న భార్య చేతికిచ్చి మల్లయ్య కోసం ఎదురు చూస్తూ నిలబడ్డడు. అంతల్నే మల్లయ్య వచ్చిండు. పోదామా కాకయ్యా అనడిగిండు బిలాల్.. పోదాం గనీ.. తలదిమ్ముగుంది బేటా గుక్కెడు వేడి వేడి కాఫీ తాగిపోదాం అన్నడు మల్లయ్య. ఇద్దరూ హోటళ్లకు బోయి కూకొని చెరొక కాఫీ తాగిన్రు. కాఫీ బిల్లుతో పాటు హోటల్ బోయ్‌కు పదిరూపాయల టిప్ ఇచ్చిండు మల్లయ్య. హోటల్ బోయ్ సంతోషంగా నమస్తే పెట్టి, మరో టేబుల్ కాడికిబోయిండు. ఇద్దరు హోటళ్లకెల్లి లేసి బయటికొచ్చిండ్రు. ఆటోకాడికి వస్తూ దారిలో మల్లయ్య అడిగిండు బేటా బిలాల్! నాకెర్కలేక అడుగుతున్న మనం హోటళ్ల పిల్లగాన్కి టిప్ ఇచ్చినం గదా! గా డబ్బులు వాడి కష్టార్జితమేనంటవా? అవునన్నట్లే కదా కాకయ్య! వాడు మనకు చేసిన సర్వీస్‌కు మనం తృప్తి పడి టిప్ ఇచ్చినం. అంటే అయి వాడి కష్టార్జితమన్నట్లే కదా! అన్నడు బిలాల్. అవ్ నిజమే బేటా అన్నడు మల్లయ్య. ఇద్దరూ మట్లాడుకుంట ఆటోకాడికొచ్చిన్రు. మల్లయ్య ఆటో ఎక్కి కూకుంటూ.. ఊరి బయట రామయ్య గుడి కాడ జరసేపు ఆటో ఆపు బేటా! రామయ్య సామికి దండం పెట్టుకొనొస్త! అన్నడు.

సరే కాకయ్య ఆటో స్టార్ట్ చేసి పదినిమిషాల్లో ఊరిబయట గుడికాడ ఆటో ఆపిండు బిలాల్. మల్లయ్య ఆటో దిగి గుళ్లెకు పోయి పది నిమిషాల తర్వాత తిరిగొచ్చి ఆటో ఎక్కి చల్ పా బేటా అన్నడు మల్లయ్య. బిలాల్ ఆటో స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తూ రామయ్య సామికి జయమ్మను, జయమ్మ కొడుకును సల్లంగ సూడమని, కోరుకున్నవా కాకయ్య అడిగిండు.లేదు బేటా అన్నడు మల్లయ్య. భార్య భర్తలిద్దరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూస్తున్నరు. అనుమానం తీర్చుకోవడానికి మరేం కోరుకున్నవ్ అనడిగిండు బిలాల్. ఇంటింటికి బిలాల్‌లాంటి మంచి మనసున్న కొడుకునీ, హసీనాలాంటి సహృదయమున్న బిడ్డనీ ప్రసాదించు స్వామి అని కోరుకున్న. యింకా నా దేశంల, ఒకే తోటల పూసిన రంగురంగుల పువ్వుల్లా బతికే మాపైన ఏ దుష్టపు చూపు సోకకుండా సల్లంగ సూడు సామి! అని కోరుకున్న అన్నడు మల్లయ్య!ఆ మాటవిన్న బిలాల్‌కు ఇంకేం మాట్లాడాలో తోచలే. ఆటో తోల్తా ఉండిపోయిండు.

కొద్దిసేపట్ల ఊర్లెకొచ్చింది ఆటో. మల్లయ్య ఇంటి గేటు కాడ ఆటో ఆపిండు బిలాల్. మల్లయ్య ఆటో దిగి జేబులంగ ఇరువై రూపాయలు తీసి బిలాల్‌కు ఇస్తూ కిరాయి డబ్బులు తీస్కో బేటా అన్నడు. వద్దు! ఉండనీ కాకయ్య! ఇయాల నేను ప్యాసింజర్ ఆటోనడ్పలే! సొంత పనికి నడిపిన! అన్నడు బిలాల్. బేటా బిలాల్! నువ్వు నాకాడ డబ్బులిచ్చియాట పోతును కొనుక్కపోతవ్.. నేనేమో నీ ఆటోల పుకట్‌కే తిరగాలా? అట్టా కుదరదు బేటా.. ఇగో తీస్కో డబ్బులు అన్నడు మల్లయ్య.ఎదురు చెప్పలేక డబ్బులు తీసుకున్నడు బిలాల్. యింకో జేబుల నుంచి డబ్బులు తీసి ఇగో బేటా బిలాల్ నువ్వు నన్ను క్షేమంగా ఇంట్ల దింపినందుకు, నేను సంతోషంగా పదివేలు టిప్ ఇస్తున్న తీస్కో.. అన్నడు మల్లయ్య. డబ్బులు సూసి కంగారుపడి వద్దు వద్దు కాకయ్య అన్నడు బిలాల్.బేటా బిలాల్! ఈ డబ్బులు అప్పుగ ఇయ్యట్లేదు! టిప్‌గా ఇస్తున్నా. బేటా! చిన్నోనివైనా, నువ్వెంత గొప్పపనిచేసినవో నీకెర్కేనా? రాములమ్మ నాకు అన్ని సంగతులు చెప్పింది బేటా! బిడ్డను ఆస్పత్రికి తీసుకపోవడానికి, ఎక్కడ ఏకానా పుట్టక, ఆపతి పడ్తున్న బిడ్డను చూసి ఏం చేయలేక ఏడుస్తూ కూకుంటే అయినోనివి కావు, కులపోనివి కావు, మతపోనివి కావు.

మరుసటిరోజు బక్రీద్ పండుగ ఖుర్బానికి తెచ్చిన యాటపోతును వాపసిచ్చి, ఖుర్బాని కార్యాన్ని మానుకొని, అడుగకముందే స్వయంగా ముందుకొచ్చి జయమ్మని, దాని బిడ్డను కాపాడినవ్ బేటా! నీ అంత గొప్ప మనసు నాకుంది అని నేననుకోవడం లేదు. కానీ, బేటా ఈ కాకయ్య లోపల నియ్యతున్న చిన్న మంచి మనిషి ఉన్నడు బేటా! నువ్వు రాములమ్మకు చేసిన సాయం ముందు నేనిచ్చే ఈ పదివేల టిప్ ఏపాటిది? నువ్వుగింజతో సమానం బేటా! డబ్బులు వద్దు అనమాకు. పొద్దున యాటపోతును కూడా తీస్కపో బేటా అంటే నువ్వేమన్నవ్? కష్టార్జితం డబ్బుల్తోనే ఖుర్బాని ఇయ్యాలన్నవ్ గుర్తుందా? నేను సంతోషంగా ఇస్తున్న ఈ టిప్ డబ్బులు నీ కష్టార్జితమే. ఈ డబ్బుల్తో యాట పోతును కొనుక్కపోయి రేపు ఖుర్బాని ఇయ్యి అని డబ్బులు బిలాల్ చేతిలో పెట్టిండు.

భార్య సూరమ్మను పిల్సి - పొద్దున్న బిలాల్ పట్టుకొచ్చిన యాటపోతును తెమ్మన్నడు. ఆమె యాట పోతును తెచ్చింది. బిలాల్ మల్లయ్య ఇచ్చిన డబ్బుల్లోంచి యాటపోతు డబ్బులు ఆమెకిచ్చిండు. ఆమె డబ్బులు తీస్కొని ఇంట్లకుబోయింది. హసీనా ఇద్దర్నీ గమనిస్తూ ఉన్నది. ఒకరిని మించిన మంచితనం మరొకరిది అనుకున్నది మనసుల. మల్లయ్య యాటపోతును ఆటోల ఎక్కించి బిడ్డా హసీనా! బిలాల్ రేపు ఖుర్బాని పనిలో పడి నన్ను మర్చిపోతడేమో! ఈ పేదోనిక్కూడా నాలుగు ఖుర్బానీ ముక్కలు పంపమని యాది చెయ్యి! అన్నడు. హసీనా నవ్వి యాది చేసి పంపిస్తాలే మామ! అంది. మల్లయ్య చూపించిన మంచితనంతో బిలాల్ కళ్లు సంతోషంతో చెమర్చినయి. బయటికి కనబడకుండా తుడ్సుకొని ఎల్లొస్తం కాకయ్య అన్నడు. పోయి పండుగ మంచిగ చెయ్యుండ్రి బేటా! అన్నడు మల్లయ్య. యా అల్లా ఇది నా దేశ సంస్కృతి. ఇట్లాగే కాపాడు.. మా మధ్య ఉన్న ప్రేమ ఆత్మీయతల్ని ఇలాగే కొనసాగనీ.. తేనెలూరే ఊటబావుల్లాంటి మా ఊర్లపై ఏ చెడు దృష్టిపడకుండా కాపాడు! అని మనసులో అల్లాను ప్రార్థించుకొని, ఆటో స్టార్ట్ చేసి తమ ఇంటి బాటకు మళ్లించిండు బిలాల్.

రచయిత పరిచయం

సయ్యద్ గఫార్.. 25 ఏండ్ల నుంచి జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. నల్లగొండ జిల్లా వాడపల్లి మండలం వాడపల్లి ఊర్లో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. 35 యేండ్లుగా సాహితీ ప్రయాణంలో ఉన్నారు. ఈయన రాసిన జీవన ధ్వని కవితా సంపుటి ముద్రితమైంది. మౌనధ్వని నాటిక ముద్రణా ప్రక్రియలో ఉంది.

నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి
పొందిన కథ (రూ. 5,000/-)


సయ్యద్ గఫార్, సెల్: 81067 40593

663
Tags

More News

VIRAL NEWS