స్వీట్ ఆలిస్


Sun,November 17, 2019 02:06 AM

ఇది ప్రధానంగా డెన్వర్ ఎడ్డీ, స్వీట్ ఆలిస్‌ల కథ. కానీ, అనేక ఇతర ప్రముఖపాత్రలుకూడా వస్తాయి. లేదా ఆ ఇద్దరి కథే ఉండదు అతను చెప్పాడు.నేరస్థులమైన మేం ఆరుగురం ఎవరికి వారం అమెరికానుంచి బ్రెజిల్‌కి పారిపోయి వచ్చిన వాళ్ళం. అక్కడే మాకు పరిచయం. ప్రతీ శనివారం రాత్రి మేము కోపా కబానా బీచ్‌లోని ఆ బార్‌లో కలిసి కబుర్లతో కాలక్షేపం చేస్తుంటాం.నేను ఆ శనివారం రాత్రి బార్‌కి వెళ్తుంటే అరవై ఏళ్ళావిడ నన్ను ఆపింది. ఎక్స్‌క్యూజ్‌మీ యంగ్‌మేన్. నేను నీతో ఓ నిమిషం మాట్లాడవచ్చా? ఆవిడ అడిగింది.

తప్పకుండా ఆ వయసులో అంత అందమైన స్త్రీని ఎన్నడూ చూడలేదు.నిన్ను నమ్మబుద్ధి వేసి ఆపాను. నాకో సహాయం చేస్తావా? అర్థించింది.ఏమిటది? ప్రశ్నించాను.ఆవిడ ఎదురుగా ఉన్న ఓ ఇంటిని చూపించి కోరింది.నాకు చాలా ప్రియమైన ఒకరు ఆ ఇంట్లో మరణించాడు. అతని శవపేటికలో నేను ఇచ్చే వస్తువుని ఉంచగలవా? అతని శవంతోపాటు అదికూడా పాతిపెట్టబడాలి. అది అతనికి చెందింది ఆవిడ కంఠం బాధతో స్వల్పంగా వణికింది.మీరే వెళ్ళి దాన్ని అక్కడ ఉంచవచ్చుగా?శవంగా చూడలేను. బతికున్నప్పటి మొహమే నాకు గుర్తుండిపోవాలి. చాలా చాలా ముఖ్యమైంది. దయచేసి కాదనక ఈ సహాయం చేయి ఆవిడ దీనంగా అర్థించింది.అది నిజంగా అంత ముఖ్యమైందా? అడిగాను.అవును ఆవిడ జవాబు చెప్పింది.మీరు ఇచ్చే దాన్ని శవపేటికలో పెట్టేప్పుడు ఎవరైనా చూస్తే? అడిగాను.లోపల ఒక్కరు మాత్రమే ఉన్నారు.ఆవిడ తన హేండ్ బ్యాగ్‌లోంచి ఓ గుండ్రటి లోహపు వస్తువుని బయటకి తీసి కొద్దిసేపు దానివంక ఆరాధనగా చూస్తుండి పోయింది. ఇవ్వడం ఇష్టం లేనట్లుగా దాన్ని కొద్దిసేపు గుండెకి ఆనించుకుని, చటుక్కున ఇచ్చేసింది.
బ్లెస్ యు. దయచేసి ఇది ఎవరికీ కనపడకుండా శవం కింద ఉంచు కోరింది.
Crime_Story

అది ఆడవాళ్ళు పౌడర్‌ని ఉంచుకునే వెండి భరిణెలా తోచింది. ఆవిడ నా వంక నవ్వుతూ చూసింది. అదే సమయంలో ఆవిడ కళ్ళవెంట నీళ్ళు బొటబొటా కారాయి. ఆవిడ తీవ్ర మానసిక వేదనలో ఉందని నాకు అర్థమైంది.సరే. దీన్ని మీరు కోరిన చోట ఉంచి వస్తాను చెప్పి ఆ ఇంట్లోకి నడిచాను.ఆ గదిలో శవపేటిక దగ్గర అరడజను కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. దూరంగా బల్లముందు కూర్చున్న ఓ వ్యక్తి తప్ప ఎవరూ లేరు. అతను తన ముందున్న రిజిస్టర్‌లో నా పేరు, సంతకం తీసుకున్నాడు. నేను దాని దగ్గరకి నడిచి ఆ గదిలోని వ్యక్తి నేను చేసేది చూడకుండా అతనివైపు వీపు పెట్టి జేబులోంచి ఆవిడ ఇచ్చింది తీసాను. శవం మొహాన్ని చూసాను. ఆయన వయసు అరవై, అరవై ఐదు మధ్య ఉండొచ్చు అనుకున్నాను. మొహంలోని ముడతలనిబట్టి జీవితంలో చాలా బాధలు అనుభవించిన వ్యక్తి అనిపించాడు. ఆయన ఎడమ చెవి లేకపోవడం గమనించాను.తీరా చూస్తే అది ప్లాటినమ్‌ది. దాన్ని అమ్మితే కనీసం రెండు వేల డాలర్లు వస్తాయి అనుకోగానే తిరిగి దాన్ని జేబులో ఉంచుకొని బయటకి వచ్చి చూస్తే ఆవిడ లేదు. నేను బార్‌వైపు నడిచాను. మా సభ్యుల్లో ఒకరైన, నెవార్క్‌నుంచి వచ్చిన గస్ మొహంలోని భావాలను గమనించి అడిగాను.ఏమైంది గస్? అలా ఉన్నావేమిటి?నేను దయ్యాలని నమ్మకపోవడం మంచిదైంది. లేదా నేను దెయ్యాన్ని చూసాను అనుకునే వాడిని చెప్పాడు.

ఎక్కడ?బార్ బయట. ఆ ఎదురింటి నించి బయటికి వస్తూ కనిపించింది.అదే కనక దయ్యమైతే అది ఎవరి దయ్యం? నవ్వుతూ అడిగాను.నలభై ఏండ్ల క్రితం నాకు తెలిసిన ఓ వ్యక్తి. నేను అప్పుడే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాను. అసలావిడ ఇంతదాకా జీవించి ఉందని అనుకోలేదు.

ఎవరావిడ?స్వీట్ ఆలిస్. ప్రపంచంలోని అత్యంత అందమైన స్త్రీ. ఆవిడ జీవించి ఉంటే ఎలా ఉండేదో సరిగ్గా అలాగే ఉంది. నేను కారుని పార్క్ చేసి వెళ్ళి చూస్తే అక్కడ లేదు. టాక్సీ ఎక్కి వెళ్ళిపోయి ఉంటుంది.క్రమంగా ఫ్రాంకీ, ఛార్లీ మిగిలిన వాళ్ళంతా వచ్చారు. త్వరలోనే అంతా గస్‌లోని ఆందోళనని గమనించారు.స్వీట్ ఆలిస్‌ని నలభై ఏండ్ల తర్వాత ఇందాక చూసాట్ట చెప్పాను.ఎవరావిడ? ఫ్రాంకీ ఉత్సాహంగా అడిగాడు.ఆవిడది ప్రాణాంతక అందం. నలభై ఏండ్ల క్రితం నాటి మాట ఇది. ఆమెవల్ల ఐదుగురు మరణించారు. నేనూ పోయి ఉండేవాడిని. కానీ, అదృష్టవశాత్తు బయటపడ్డాను గస్ చెప్పాడు.చక్కటి రొమాంటిక్ కథలా ఉంది? ఓ అమ్మాయివల్ల ఐదుగురు ఎందుకు, ఎలా మరణించారో చెప్పు మిల్వాకీ నించి వచ్చిన మిల్లీ అడిగింది.ఐదుగురిని ఆమె చంపిందా? లేక చంపించిందా? ఛార్లీ ఆసక్తిగా ముందుకి వంగి అడిగాడు.లేదు, లేదు. ఆమె ఎవర్నీ చంపలేదు. చంపించనూ లేదు. నిజానికి వారి మరణంలో ఆమె ప్రమేయం కూడా లేదు. కానీ, ఆ చావులన్నీ ఆమెవల్లే జరిగాయి. నలభై ఏండ్లుగా ఆమె, డెన్వర్ ఎడ్డీ ఎవరికీ కనపడలేదు.

వాళ్ళు బ్రెజిల్ వచ్చారని నాకు తెలీదు.డెన్వర్ ఎడ్డీ ఎవరు? అడిగాను.నలభై ఏండ్ల క్రితం డెన్వర్ ఎడ్డీ పేరు తెలియని వాళ్ళు ఉండరు. అతను కిరాయి హంతకుడు. బాంబుల తయారీలో నిపుణుడు. బ్రహ్మచారి. అందగాడు. ఎవరితో ప్రేమలో పడలేదు. ఓసారి వెళ్ళిన స్త్రీ దగ్గరకి రెండోసారి వెళ్ళేవాడు కాదు. ఆ రోజుల్లో నేను షికాగోలో మాంక్ గ్యాంగ్‌లో ఉండేవాడిని. మాంక్‌తోసహా ఆ గ్యాంగ్‌లో మేం మొత్తం ఆరుగురం ఉండేవాళ్ళం.అతను కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడు. అతని మొహంలో బాధని చూడటం మా అందరికీ అదే మొదటిసారి.స్వీట్ ఆలిస్ మాంక్ గర్ల్‌ఫ్రెండ్. ఆమెని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఉంచాడు. ఓ రోజు అతను డెట్రాయిట్‌లోని తన అక్క ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చాక సరాసరి ఆలిస్ అపార్ట్‌మెంట్‌కి వెళ్ళాడు. అక్కడ పడకగదిలో మంచం కింద అతనికి ఓ టై పిన్ కనిపించింది. అది అతనిది కాదు. దాంతో స్వీట్ ఆలిస్‌కి తను ఒక్కడే బాయ్ ఫ్రెండ్ కాదని తేలిగ్గా తెలుసుకున్నాడు. అతను ఆ ఏనుగు దంతపు టై పిన్నులని థాయ్‌లాండ్‌లో ప్రత్యేకంగా చేయించి తెప్పించి గ్యాంగ్ సభ్యులందరికీ తలోటి ఇచ్చాడు. సెన్సాఫ్ హ్యూమర్‌గల మాంక్ ఆ టై పిన్నులని శవపేటిక ఆకారంలో చేయించాడు. కాబట్టి, తన గ్యాంగ్‌లోని ఒకడు తనకి ద్రోహం చేస్తున్నాడని ఇట్టే గ్రహించి కోపంతో మండిపడ్డాడు. అతను ఎవరు అని ఆమెని అడగదలచుకోలేదు. అసలా టై పిన్ దొరికినట్లే ఆమెతో చెప్పలేదు. అతన్ని ఎలా కనిపెట్టాలి?అతను ఎవరో ఆ టై పిన్‌నిబట్టి తెలుసుకోలేక పోయాడా? బెట్టీ అడిగింది.

లేదు. తేడా లేకుండా అన్నీ ఒకేలా ఉన్నాయి.ఆ గ్యాంగ్‌లోని ఎవరి దగ్గర టై పిన్ లేకపోతే వాడు అపరాధి అని తెలుసుకున్నాడా? మిల్లీ అడిగింది.ఇంకా తెలివైన పనిచేసాడు. తన గ్యాంగ్ సభ్యులు అందరికీ ఒకే సమాచారం గల టెలిగ్రాంలని పంపాడు. మాంక్ అక్క ఇంటికి డెట్రాయిట్ వెళ్ళాడు. జీవన్మరణ సమస్య. వెంటనే అపార్ట్‌మెంట్‌కి రా. ఆలిస్ పేరుతో అందరికీ వాటిని పంపాడు. అతనికి ఆలిస్‌తో పరిచయం ఉందని, ఆమెకోసం అపార్ట్‌మెంట్ తీసుకున్నాడని మాకు ఎవరికీ తెలీదు.ఆ ఎరకి చేప చిక్కుకుందా? అపార్ట్‌మెంట్ బయట రివాల్వర్‌తో అతనికోసం ఎదురు చూసాడా? చార్లీ ఆసక్తిగా అడిగాడు.ఆలిస్‌ని పనిమీద బయటకి పంపి తను ఆ ద్రోహికోసం వేచి ఉన్నాడు.ఎవరు వచ్చారు?నేను వెళ్ళాను. నేనా అపార్ట్‌మెంట్ తలుపు తెరచుకుని లోపలకి వెళ్ళగానే పాయింట్ 38 రివాల్వర్‌తో మాంక్ నాకు కనిపించాడు గస్ దీర్ఘంగా నిట్టూర్చి చెప్పాడు.అతను నిన్ను ఎందుకు చంపలేదు? నేను వెంటనే అడిగాను.

అతన్ని చూడగానే ఇక నేను జీవించేది ఐదు క్షణాలే అనుకున్నాను. తను నన్ను ఎందుకు చంపదలచుకున్నాడో చెప్పడానికి ఆగాడు. ఆ విరామం నా ప్రాణాలని కాపాడింది. అతను నాతో నా నమ్మకద్రోహం గురించి చెప్తుండగా మా గ్యాంగ్‌లోని మరో సభ్యుడు లోపలకి వచ్చాడు. నిమిషంలో మిగిలిన ముగ్గురు కూడా!అంతానా? మిల్లీ ఆశ్చర్యంగా అడిగింది.ఒకరిని పట్టుకోవాలని మాంక్ విసిరిన వలలో ఐదుగురం చిక్కుకున్నాం.బాస్‌తోసహా ఆరుగురు ప్రియుళ్ళు! ఆలిస్ చాలా సెక్సీ. తర్వాత..? మిల్లీ మళ్ళీ ఉత్సాహంగా అడిగింది.ముందసలు అందరికీ అయోమయంగా ఉంది. క్రమంగా నిజాన్ని గ్రహించాక ప్రతీ వారికి మిగిలిన వాళ్ళమీద కోపం ముంచుకు వచ్చింది. మొదటగా ఎవరు షూటింగ్‌ని ఆరంభిస్తారా అన్నది ప్రశ్న అయింది. నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పి మా అందరినీ ఆమె మూర్ఖుల్ని చేసింది.

మగాళ్ళ బుద్ధి ఇలాగే వక్రిస్తుంది బెట్టీ అందరినీ నిందిస్తున్నట్లుగా కఠినంగా చెప్పింది.నిజానికి అది మా అందరినీ కలిపిందని చెప్పాలి. మేం స్వీట్ ఆలిస్ గురించి మనసు విప్పి మాట్లాడుకున్నాం. తప్పు మాది కాదని, ఆమెదని అంతా అంగీకరించాం. మా కోపం అకస్మాత్తుగా ఆమె ప్రియుళ్ళమీద నుంచి ఆమెమీదకి మళ్ళింది. ఆమెని చంపాలని నిర్ణయించాం. మరి కాసేపు మాట్లాడుకున్నాక మాలో ఎవరం చూస్తూ చూస్తూ ఆ పని చేయలేమని తెలిసింది. ఆమె అందమే మనల్నీ పరిస్థితికి తెచ్చింది. ఆమెని అందవిహీనంగా చేద్దాం. అందుకు ఆమె ఓ చెవిని కోస్తే ఆ శిక్ష జీవితాంతం అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఆమెకి గుర్తుంటుంది. మాంక్ సూచించాడు. అది అందరికీ నచ్చింది.గస్! నీకు ఇంత చరిత్ర ఉందనుకోలేదు. తర్వాత..? ఛార్లీ నవ్వుతూ అడిగాడు.అందంగా ఉండే, ప్రేమ, దోమలు గిట్టని బ్రహ్మచారైన డెన్వర్ ఎడ్డీకి ఆ పనిని అప్పగించాం. అతను బాంబు తయారీలో నిపుణుడని చెప్పాగా. స్వీట్ ఆలిస్ చెవిని కోసే పనిని అతనికి అప్పగించాం. మా పగ అతనికి తలో వంద డాలర్లని ఇప్పించింది.గస్ ఎంతో బాధగా చెప్పేది అంతా ఆసక్తిగా వింటున్నాం.

స్వీట్ ఆలిస్ కుడిచెవికి గులాబీని పచ్చబొట్టు పొడిపించుకుంది. మాంక్ ఆమెకి అది బహుమతిగా కోరితే ఇచ్చాడు. కాబట్టి, ఎడ్డీ తెచ్చేది ఆమె చెవో, కాదో మాకు తెలిసిపోతుంది.ఆలిస్ గడుగ్గాయి కాబట్టి అతన్ని బోల్తా కొట్టించి ఉంటుంది. ఐతే ఎలా? మిల్లీ నవ్వుతూ అడిగింది.అతను ఆలిస్ దగ్గరకి వెళ్ళే సమయానికి మాంక్ ఓ కేస్ విస్కీని ఆర్డర్ చేసాడు. మేము జరిగే బీభత్సం గురించి ఆలోచించకుండా ఉండటానికి తాగసాగాం. ఎడ్డీ ఎప్పుడూ దగ్గర ఉంచుకునే పదునైన స్ప్రింగ్ కత్తితో, ఓ బాంబుతో ఆలిస్ అపార్ట్‌మెంట్‌కి వెళ్ళి బెల్ నొక్కాడు.గస్! మీరంతా రాక్షసులు. ఓ ఆడదాని చెవిని, అందులో మీరు సెక్స్‌లో పాల్గొన్న ఆమె చెవిని...! సర్లే. చెప్పు బెట్టీ అరిచింది.మా పథకం తెలీని ఆలిస్ తలుపు తెరచింది. ఇద్దరూ కొన్ని క్షణాలు ఒకరి వంక మరొకరు చూసుకున్నారు. అంతే. ఎడ్డీకి ఏమైందో తెలీదు. అతనికి ఆమె అందాన్ని చెడగొట్టాలని అనిపించలేదు. అతన్ని చూసిన ఆలిస్‌కూడా అతనితో ప్రేమలో పడింది. లోపలకి పిలిచి టీ కలిపి ఇచ్చింది. కళ్ళవెంట నీళ్ళు కారుతుంటే ఎడ్డీ కత్తిని చూపించి తను ఎందుకు వచ్చాడో చెప్పాడు.

ఇంతకీ ఆమె చెవిని కోసి తీసుకెళ్ళాడా? లేదా? కాంట్రాక్ట్ కాంట్రాక్టే కదా? ఫ్రాంకీ ఉత్కంఠగా అడిగాడు.ఎడ్డీని ఒక్కసారి చూడగానే ఆలిస్ జీవితంలో తొలిసారి అతనితో ప్రేమలో పడింది. అది ఇరుపక్షాల ప్రేమ.చార్లీ సైగని చూసి వెయిటర్ వచ్చి మళ్ళీ మా అందరి ఖాళీ గ్లాస్‌లని మూడోసారి నింపి వెళ్ళాడు.ఎంత కష్టమైన పరిస్థితి. ఓ పక్క ప్రేమ. మరో పక్క ప్రాణాలు చెప్పాను.వాళ్ళిద్దరూ పక్కపక్కన సోఫాలో కూర్చుని ఆ విషయం మాట్లాడుకున్నారు. ఎడ్డీ ఆలిస్ చెవిని కోయకపోతే అతను ఎక్కడ దాక్కున్నా వెదికి చంపి తీరుతాం. పైగా మరొకర్ని ఆలిస్ చెవిని కోయడానికి నియమించి తీరుతాం కూడా. అదే సమయంలో ఆలిస్ అతను చావడానికి ఇష్టపడలేదు.ఆహా? ఎంత చక్కటి ప్రేమకథ! మిల్లీ చెప్పింది.ఆలిస్ చెవి కోయనని, ఏదైనా ఆలోచిస్తానని ఎడ్డీ చెప్పాడు. రెండు గంటల తర్వాత అతనికో అద్భుతమైన ఆలోచన వచ్చింది. అది దాదాపు పిచ్చి ఆలోచన. అతని చెవులు ఆడపిల్లల చెవుల్లా చిన్నవి.

తన కుడి చెవికి గులాబీ పువ్వుని పచ్చబొట్టు పొడిపించుకుని దాన్ని తెచ్చి మాంక్‌కి ఇస్తే ఇక సమస్య ఉండదని ఆలిస్‌కి చెప్పాడు.అతను ఆమెని ఎంతగా ప్రేమించాడో అర్థమైంది! ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. తర్వాత?ఇద్దరూ టాటూ పార్లర్‌కి వెళ్ళారు. ఆలిస్ చెవికి పచ్చబొట్టు పొడిచిన అతనే ఎడ్డీ చెవిమీద కూడా సరిగ్గా అలాంటి పచ్చబొట్టునే గంటన్నరలో పొడిచాడు.కిరాయి హంతకులకి కూడా మనసుంటుందన్న మాట! బెట్టీ ఆరాధనగా చెప్పింది.తర్వాత ఇద్దరూ ట్యాక్సీలో ఆమె అపార్ట్‌మెంట్‌కి వెళ్ళారు. అతను పడకగదిలోకి వెళ్ళాడు. ఆలిస్‌కి తెలుసు, అతను ఎందుకు వెళ్ళాడో. ఎడ్డీమీద ప్రేమతో ఆలిస్ వెంటనే బాత్‌రూంలోకి పరిగెత్తి రేజర్ తీసి తన కుడిచెవిని కోసుకుని లివింగ్ రూంలోకి పరిగెత్తుకు వచ్చి అరిచింది. ఎడ్డీ! రా. వచ్చి చూడు. కానీ, అప్పటికే తన చెవినికూడా కోసుకున్న ఎడ్డీ కూడా రక్తం కారే చెంపతో బయటకి వచ్చాడు. ఎడ్డీని చూడగానే ఆలిస్ స్పృహ తప్పిపడిపోయింది.

ఆహా! వారిది ఎంతటి మధురమైన ప్రేమ! మిల్లీ చెప్పింది.ఇద్దరూ ఒకర్నొకరు కౌగిలించుకుని కదలకుండా అక్కడే కూర్చుండిపోయారు గస్ చెప్పాడు.ఎడ్డీ వాటిలో మీకు ఏ చెవిని తెచ్చిచ్చాడు? అడిగాను.విస్కీ కేస్ మొత్తం పూర్తయ్యేలోగా మేం ఆలిస్ చెవిని కోయడం తప్పని, ఆమె అందం నాశనం కాకూడదని, మాది వివేకమైన నిర్ణయం కాదని భావించి, తాగిన మేమంతా వేగంగా ఎడ్డీని ఆపడానికి, ఆలిస్ అపార్ట్‌మెంట్‌లోకి తాళం తెరచుకుని జొరపడ్డాం. మేం కొన్ని నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాం.మాలో ఎవరం మాట్లాడలేదు. తర్వాత అని అడగలేదు. అప్పటికే మా హృదయాలు బరువెక్కడంతో మేమంతా నిశ్శబ్దంగా ఉండిపోయాం.స్పృహలో లేని ఆ ఇద్దరిమీద చల్లటి నీళ్ళు పోసి మెలకువ తెప్పించాం. వారి రక్తం కారడం ఆపడానికి టవల్స్‌ని ఉపయోగించాం.

ఎడ్డీకి స్పృహ రాగానే మేం అతని మోసానికి అతన్ని చంపడానికి వచ్చామని భయపడి పడక గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. ఆలిస్ ఎడ్డీ చెవిని తీసుకుని అపార్ట్‌మెంట్లోంచి బయటకి పరిగెత్తింది. నేను ఆమె వెంట పడ్డాను. లేదా నేనూ వాళ్ళలా పోయేవాడిని. కొన్ని క్షణాల తర్వాత ఆమె అపార్ట్‌మెంట్లోంచి పెద్ద పేలుడు వినిపించింది. నేను నిమిషం క్రితం నించున్న చోట గోడకి మూడు అడుగులమేర పెద్ద రంధ్రం పడింది.ఎడ్డీ వాళ్ళమీదకి విసిరిన బాంబా అది? జార్జ్ అడిగాడు.అవును. మా వాళ్ళు ఆ బెడ్‌రూం డోర్‌ని పగలకొట్టగానే వాళ్ళ మీదకి బాంబ్‌ని విసిరి అందర్నీ చంపేసాడు. పోలీస్ డాక్టర్‌కు వారందరి శరీర భాగాలన్నీ ఎవరిది వారికి కూర్చడానికి మూడు గంటలు పట్టిందని తర్వాత తెలిసింది. ఎడ్డీ ఫైర్ ఎస్కేప్ మెట్లమీద నించి కిందకి దిగి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులకి అతను ఎప్పటికీ దొరకలేదు.స్వీట్ ఆలిస్ మాటేమిటి? మిల్లీ అడిగింది.

నేను ఆమెను డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాను. ఆయన ఆమెకి లోకల్ ఎనస్థీషియా ఇచ్చి మళ్ళీ ఆమె చెవిని కలిపి కుట్టేసాడు. ఆ ఆపరేషన్ జరిగేప్పుడు ఆమె ఎడ్డీ చెవిని పట్టుకునే ఏడుస్తూ కూర్చుంది. తర్వాత ఆమెని హోటల్ గదికి తీసుకెళ్ళి ఎడ్డీ ఏం చేసాడో చెప్పాను. అతను ఎక్కడ ఉన్నా సరే, తప్పక కనుక్కుంటానని చెప్పింది. డాక్టర్ నిద్ర మాత్రలు రాసిచ్చాడు. నేను అవి కొనడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి హోటల్ గదినుంచి మాయమైంది. మళ్ళీ నాకు స్వీట్ ఆలిస్ కనపడలేదు.మా అందరి గుండెలు బరువెక్కాయి. నేను నా గ్లాస్‌ని బల్లమీద ఉంచాను. నా జేబులోని సన్నటి ప్లాటినం భరిణని ఓ అందమైన ప్రేమికురాలు తన ప్రియుడి శవపేటికలో ఉంచమని అడిగిందని అర్థమయ్యాక, అది అమ్మితే వచ్చే రెండు వేల డాలర్లు పెన్నీ కన్నా తక్కువ విలువైనవిగా తోచాయి.నేను లేచి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్తే శవపేటిక ఇంకా తెరిచే ఉంది. అతను చూడకుండా నేనా భరిణని ఆ శవం వీపుకింద దాచాను. తిరిగి వచ్చాక నేనా సంగతి వాళ్ళతో చెప్పాను. సెంటిమెంటల్ ఫూల్ అంటారని ఎదురుచూసాను. ఆ రాత్రి రియో నగరంలో నేనొక్కడ్నే సెంటిమెంటల్ ఫూల్‌ని కాదని వాళ్ళు నన్ను మెచ్చుకున్నాక గుర్తించాను. నా వంక చూసిన మా క్లబ్ సభ్యుల్లోని ఒక్కరి కళ్ళూ పొడిగా లేవు.
(జోనాథన్ క్రెయిగ్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

429
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles