మనోనేత్రంతో ఏడు ఖండాలూ చుట్టేశాడు


Sun,November 17, 2019 02:10 AM

కండ్లు, చెవులు కొద్దిసేపు మూసుకుంటేనే ఏం జరుగుతుందో... ఎటువెళ్తున్నామో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. శాశ్వతంగా కంటిచూపు లేని వారి పరిస్థితి ఏంటి? కండ్లున్న వారు ప్రదేశాలు, వస్తువుల రంగులు, అందాలు చూస్తారు. అంధులు మాత్రం వాటిని మనోనేత్రంతో ఆస్వాదిస్తారు. ఇంగ్లాండ్‌కు చెందిన టోనీ గైల్స్‌కు కండ్లు, చెవులూ పనిచేయక పోయినా ఊహలకు ప్రాణం పోసుకుంటూ ఏడు ఖండాలూ చుట్టొచ్చాడు.
Tony-giles

ఇంగ్లాండ్‌కు చెందిన 40 ఏండ్ల టోనీ గైల్స్‌కు కండ్లు, చెవులూ పనిచేయక పోయినా 127 దేశాలు పర్యటించాడు. కాళ్లు, చేతులతో ఈఫిల్ టవర్‌ను తడుముతూ పైకెక్కి ఆస్వాదించాడు. తన మనోదృష్టితో న్యూయార్క్‌లోని లిబర్టీ విగ్రహాన్ని వీక్షించాడు. ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రదేశాలను తడుముతూ వాటిని మనసులో ఊహించుకుని ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందుతున్నాడు. 20 ఏండ్లుగా అంటార్కిటికాతో సహా ప్రపంచంలోని ప్రతి ఖండాన్నీ సందర్శించాడు.

నమ్మకం కలిగితేనే: ఏటీఎం నుంచి నగదు తీసుకోవడం. వివిధ దేశాల కరెన్సీ నోట్లను లెక్కించడం ఆయనకు పెద్ద సవాలుగా మారేది. డబ్బులు లెక్కించడం కోసం ముందుగా ఎవరితోనైనా కాసేపు మాట్లాడి, వారి గురించి ఒక అంచనాకు వస్తాడు. వారు మోసం చేయరన్న నమ్మకం కలిగితేనే వారిని సాయం అడిగేవాడు. పర్యటనల్లో వేర్వేరు సంగీత వాయిద్యాలను వాయించుకుంటూ నడిచేవాడు. సంగీతం వాయించుకుంటూ అక్కడి అందాలను ఆస్వాదించేవాడు. ఎక్కడికి వెళ్లినా అక్కడ బాగా ప్రాచుర్యం పొందిన వంటకాలను తప్పనిసరిగా రుచి చూసేవాడు.

ఆలోచన మొదలయిందిలా: టోనీకు దృష్టి లోపం ఉన్నట్లు 9 ఏండ్ల వయసులో తెలిసింది. లోపం ఉన్నదని గ్రహించే లోపే చూపు పూర్తిగా పోయింది. చిన్నప్పటి నుంచే చెవులు సరిగా వినిపించేవి కావు. కొన్నాళ్లకు ఆ సమస్య మరింత ఎక్కువయింది. ప్రస్తుతం ఆయన అత్యంత శక్తివంతమైన డిజిటల్ వినికిడి పరికరాలను ఉపయోగిస్తున్నాడు. టోనీ తండ్రి వాణిజ్య నౌకాదళంలో పనిచేసేవాడు. దూర ప్రయాణాల గురించి ఆయన చెప్పిన విషయాలు అతనిలో విదేశాలు చుట్టేయ్యాలన్న కుతూహలాన్ని పెంచాయి. గైల్స్ చదువుకునే సమయంలోనే విదేశీ ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. స్కూల్ ట్రిప్‌లో భాగంగా 16 ఏండ్ల్ల వయసులో బోస్టన్ వెళ్లాడు. అప్పుడు ప్రపంచ దేశాలు పర్యటించాలన్న కోరిక మరింతగా బలపడింది.

తొలి ప్రయత్నం: 2000 మార్చిలో అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ పర్యటనతో ఆయన సుదీర్ఘ సాహసయాత్ర ప్రారంభమైంది. ఈ ప్రయాణంలోనే అమెరికాలోని అన్ని రాష్ర్టాలను చుట్టేసి వచ్చాడు.

తల్లి సాయపడేది: ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకుంటాడు. విమానం టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఆయన తల్లి సాయపడేది. టోనీ వెళ్లాలనుకుంటున్న ప్రదేశంలో తనలాంటి వారికి సాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకుంటాడు. కొన్ని వెబ్‌సైట్ల ద్వారా వారిని సంప్రదించేవాడు. ఎప్పుడంటే అప్పుడు ఏదొక ప్రదేశానికి వెళ్లలేడు. వెళ్లే ప్రదేశం గురించి ముందే బాగా తెలుసుకోవాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న విషయాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడు వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అని ప్రణాళిక వేసుకునేవాడు. తాను గతంలో ఎప్పుడూ వెళ్లని కొత్త నగరాలలో దారులను వెతుక్కోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఫీలవుతాడు. కొన్నిసార్లు, ఎవరిని కలవబోతున్నాడో, ఏం జరగబోతుందో అతనికి కూడా తెలియదు. అలా వెళ్లి కొత్త వారిని పరిచయం చేసుకోవడంలో ఆనందాన్ని వెతుక్కునేవాడు.

స్పర్శతో అనుభూతి: పర్యటనకు సంబంధించిన విశేషాలను పంచుకునేందుకు ప్రత్యేకంగా టోనీ ఓ వెబ్‌సైట్‌ను నడుపుతున్నాడు. అందులో తాను తీసుకున్న ఫొటోలు, వీడియోలు పెడుతుంటాడు. సీయింగ్ ద వరల్డ్ మై వే , సీయింగ్ ద అమెరికాస్ మై వే పేరుతో తన పర్యటనలపై రెండు ఇ- బుక్స్ రాశాడు.

496
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles