12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళిక సిద్ధం

Sun,September 22, 2019 02:03 AM

-30 రోజుల ప్రణాళిక స్ఫూర్తితో గ్రామసభల్లో తీర్మానం
-వారంలో ఒకరోజు శ్రమదానానికి నిర్ణయం
-పల్లెల్లో కొనసాగుతున్న ప్రణాళిక పనులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన 30 రోజుల పల్లెప్రగతి ప్రణాళిక స్ఫూర్తిగా గ్రామాలు 365 రోజుల ప్రణాళిక రూపొందించుకుంటున్నాయి. గ్రామసభలో ప్రజలందరి సమక్షంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులతో కలిసి పంచాయతీ పాలకవర్గాలు తీర్మానం చేసుకుని ఏడాదిపాటు అభివృద్ధి పనులు కొనసాగించాలని నిర్ణయించాయి. వార్షిక ప్రణాళికలో భాగంగా వారంలో ఒకరోజు గ్రామస్థులంతా కలిసి శ్రమదానం చేయాలని సంకల్పించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామపంచాయతీలు ఉండగా 12,250 పంచాయతీల్లో వార్షికప్రణాళికలు, 12,221 గ్రామాల్లో హరిత ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు వెల్లడించారు.

గంగదేవిపల్లి స్ఫూర్తిగా..

దేశానికే స్ఫూర్తిగా నిలిచిన వరంగల్ రూరల్ జిల్లా గంగదేవిపల్లిలా తమ గ్రామాలనూ మార్చుకోవాలన్న లక్ష్యంతో పంచాయతీ పాలకవర్గాలు పనులు మొదలుపెడుతున్నాయి. 30 రోజుల పల్లెప్రణాళిక కార్యాచరణలో భాగంగా గ్రామస్థుల సహకారంతో చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావడంతో వార్షికప్రణాళికను అదే స్ఫూర్తితో అమలుచేసేందుకు అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం 70 శాతానికి పైగా గ్రామాలకు చదువుకున్న యువత ప్రజాప్రతినిధులుగా ఉండటంతోపాటు నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏర్పాటైన స్టాండింగ్ కమిటీల్లో విద్యావంతులు, స్వచ్ఛందసంస్థలు, మహిళాసంఘాలను భాగస్వాములను చేయడంతో గ్రామాలు అభివృద్ధికి పోటీపడుతున్నాయి. 30 రోజుల ప్రణాళికతోనే ఈ స్థాయిలో గ్రామాలు పరిశుభ్రంగా మారుతుంటే.. వార్షికప్రణాళికతో తమ గ్రామాన్ని రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి.
Palle-Pragathi

మాయమవుతున్న బురదరోడ్లు

30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. చినుకు పడితే చిత్తడయ్యే రోడ్లు ఇప్పుడు అందంగా మారిపోతున్నాయి. పల్లెప్రగతి ప్రణాళిక సందర్భంగా గ్రామస్థులు, పంచాయతీల పాలకవర్గాలు ఊరిని శుభ్రం చేసుకొనే పనుల్లోనే ఉంటున్నారు. గుంతల రోడ్లను చదునుచేయడం, మురుగుకాల్వల శుభ్రం, రోడ్లపై గుంతలను పూడ్చివేయడంతో వర్షంనీరు నిల్వడం లేదు. దీంతో గతంలో కనిపించిన బురద రోడ్లు క్రమంగా మాయమవుతున్నాయి.

12,221 గ్రామాల్లో హరిత ప్రణాళిక

మరోవైపు రాష్ట్రంలోని పంచాయతీల్లో హరితప్రణాళిక (గ్రీన్ ప్లాన్) తయారైంది. మొత్తం 12,221 పంచాయతీల్లో ప్రణాళిక రూపొందించుకున్నట్టు ఆయా పంచాయతీల నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇందులో భాగంగా ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకొనేలా నిబంధనలు పెట్టుకొన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని జరిమానాలతోపాటు హరితప్రణాళిక అమలుకోసం ఆయా పంచాయతీలు గ్రామసభల తీర్మానంతో అదనపు జరిమానాలను సైతం ప్రవేశపెట్టుకున్నాయి. నర్సరీల్లో మొక్కలు పెంచడం, వాటిని నాటడం, ఇంటి యజమానులకు ఇవ్వడం, నాటించడం, వాటిని సంరక్షించడం గురించి వివరిస్తూనే.. ఇచ్చిన మొక్కను సంరక్షించకుంటే తీసుకునే చర్యలను సైతం వివరించేలా నిర్ణయాలు ఉంటున్నాయి.

646
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles