21.22 లక్షల ఖాతాల్లోకి 2,233 కోట్లు జమ


Wed,June 12, 2019 03:05 AM

2 233 crore deposited into account of 21 22 lakh farmers

-ఆర్బీఐ ఈ కుబేర్ ద్వారా కొనసాగుతున్న ప్రక్రియ
-ఖాతా నంబర్ మార్చుకునే రైతులు వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలి
-ధాన్యం కొనుగోలు బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం
-మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్ మొదలైన నేపథ్యంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం త్వరితగతిన జమ చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 21.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో పంటపెట్టుబడి సాయం జమచేసినట్టు వెల్లడించారు. పంట పెట్టుబడిసాయం, ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపులపై మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ కారణంగా జరిగిన జాప్యంతో రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్బీఐ ఈ కుబేర్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు విడుతలుగా మొత్తం 21.22 లక్షల మంది ఖాతాల్లో రూ.2,233.16 కోట్లు జమ అయ్యాయని తెలిపారు. రైతుబంధు అకౌంట్ నంబర్ మార్చుకోవాలనుకునేవారు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు బకాయిలు త్వరలో చెల్లింపు

సహకార సంఘాలు, మహిళాసంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 3,85, 217 మంది రైతులకు రూ.4,837 కోట్లు చెల్లించామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రూ.1,080 కోట్లు బకాయిలు ఉన్నాయని.. వాటిలో మంగళవారం రూ.501 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. మిగిలిన బకాయిలను కూడాత్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. మరికొద్దిరోజులలో రాష్ట్రానికి రుతుపవనాలు రానున్న నేపథ్యంలో రైతుబంధు డబ్బులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

11828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles