పల్లెలకు కొత్త సొబగులు

Mon,September 23, 2019 02:28 AM

-పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట
-రాష్ట్రంలో 7,595 డంపింగ్‌యార్డులు మంజూరు
-ఇప్పటివరకు 2,706 పూర్తి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో 30రోజుల పల్లె ప్రణాళిక విజయవంతంగా సాగుతున్నది. ఈనెల 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామీణప్రాంతాల్లో వెలుగులు నింపుతున్నది. ఇందులో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీటవేయగా పారిశుద్ధ్య సమస్యలు తొలగి గ్రామాలు కొత్త సొబగులను అద్దుకుంటున్నాయి. హరితహారంలో భాగంగా భారీగా మొక్కలునాటడంతోపాటు వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో గ్రామాల్లో ఏ వీధి చూసినా పచ్చని మొక్కలతో దర్శనమిస్తున్నది. ప్రగతి ప్రణాళిక 17వ రోజైన ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం కొనసాగింది. సెలవు రోజైనప్పటికీ అధికారులు గ్రామాలకు తరిలారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రామాలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించడంతో సోమవారం నుంచి వారు జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Palle-Pragathi

తొలగిన డంపింగ్‌యార్డుల సమస్య

పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ అతి ముఖ్యమైనదనీ, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే గ్రామస్థులు ఆరోగ్యంగా ఉంటారని భావించిన ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిచ్చింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో ప్రతి పంచాయతీలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా 7,595 డంపింగ్ యార్డుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.114 కోట్లను మంజూరు చేసింది. ప్రభుత్వ భూమి అందుబాటులోలేని గ్రామాల్లో దాతల నుంచి భూమిని సేకరిస్తున్నారు. అలా కూడా వీలుకాకుంటే పంచాయతీ నిధుల నుంచి స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 7,595 పంచాయతీల్లో డంపింగ్‌యార్డు పనులు మొదలుపెట్టగా ఇప్పటివరకు 2706 గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. మరో 1,549 పంచాయతీల్లో పనులు తుదిదశకు చేరాయి. 3,340 పంచాయతీల్లో పనులను మొదలుపెడుతున్నారు. ఇప్పటి వరకు రూ. 34 కోట్లను డంపింగ్ యార్డుల కోసం ఖర్చు పెట్టారు. ఇంటింటికి చెత్తబుట్టలను పంపిణీ చేస్తూ పారిశుద్ధ్యంపై కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో మార్పును తెస్తున్నాయి. ఇదివరకు మాదిరిగా చెత్తను రోడ్లమీద వేయకుండా చెత్తబుట్టల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

కొనసాగిన శ్రమదానాలు

పల్లె ప్రణాళికలో భాగంగా ఆదివారం పలు జిల్లాల్లో కలెక్టర్లు, జిల్లా అధికారులు పర్యటించారు. పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి, శ్రమదాన కార్యక్రమాలు చేపట్టారు. చాలా గ్రామాల్లో పిచ్చిమొక్కలను తొలగించారు.

ఊరిని కన్నతల్లిలా భావించాలి..

ఉన్న ఊరినే కన్న తల్లిగా భావిస్తూ సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. నా స్వగ్రామానికి ఏదైనా చేయాలనుకున్న సమయంలో శ్మశానవాటిక సమస్య తెలిసింది. వైకుంఠధామం నిర్మాణానికి సర్పంచ్ సత్యప్రసన్న విరాళాలు సేకరిస్తుండటంతో నా స్నేహితుల సహకారంతో ఇప్పటివరకు రూ.65 వేలు అందించా. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తా.
- కర్ర అశోక్‌రెడ్డి, ప్రైవేటు ఉద్యోగి, గోపాల్‌రావుపేట, రామడుగు
Palle-Pragathi1

పల్లె ప్రజల్లో స్ఫూర్తిని రగిలించింది

30 రోజుల ప్రణాళిక కార్యక్రమం పలెప్రజల్లో అభివృద్ధి స్ఫూర్తిని రగిలించింది. ఏండ్లుగా మరుగునపడ్డ అనేక సమస్యలు ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన పరిష్కారమవుతున్నాయి. ప్రతి ఒక్కరు తమ గ్రామాభివృద్ధి కోసం ముందుకొస్తున్నారు. అభివృద్ధిలో ముందుండాలన్న ఆలోచనతో ప్రజల సహకారంతో మేం పని చేస్తున్నాం. గ్రామాల అభ్యున్నతికి ఇంత మంచి ఆలోచన చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్‌లో కొనసాగిస్తే గ్రామాల్లో సమస్యలనేవే ఉండవు.
-మూగల పర్శరాములు, సర్పంచ్, మడిపల్లి, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా

మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ

ప్రత్యేక ప్రణాళికలో భాగంగా మా గ్రామంలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. ప్రభుత్వం ఐదు విడుతలుగా చేపట్టిన హరితహారం కింద గ్రామంలో చాలా మొక్కలు నాటాం. అయితే సరైన రక్షణ లేక ఎండిపోవడంతోపాటు పశువులు మేసేవి. మొక్కలను ఎలాగైనా సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ట్రీగార్డులు ఏర్పాటు చేయడానికి నా వంతుగా రూ.10 వేలు సాయాన్ని పంచాయతీకి అందజేశాను. నర్సరీలను సమర్థంగా నిర్వహించడానికి ప్రతిరోజు పాలకవర్గం, కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.
- గొట్టుముక్కుల రవీందర్‌రావు, గ్రామ కో-ఆప్షన్ సభ్యుడు, బేతిగల్, వీణవంక, కరీంనగర్ జిల్లా

910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles