ప్రశాంత్‌ను రప్పించే యత్నం

Wed,November 20, 2019 02:30 AM

- ముమ్మరంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
- విదేశీవ్యవహారాలశాఖకు సమాచారమిచ్చిన పోలీసులు
- గత రెండేండ్లు ప్రశాంత్‌ ఎక్కడ ఉన్నాడన్నదానిపై అంతుచిక్కని ప్రశ్నలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించారన్న ఆరోపణలపై పాక్‌ పోలీసులు అరెస్టుచేసిన ఇద్దరు భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. వీరిలో తెలుగు యువకుడైన ప్రశాంత్‌ను స్వస్థలానికి రప్పించేందుకు తెలంగాణ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు తమవద్ద ఉన్న పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) కార్యాలయానికి పంపినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రశాంత్‌ అదృశ్యమైనట్టు 2017 ఏప్రిల్‌ 29న మాదాపూర్‌లో కేసు నమోదైన తర్వాత అతడికి సంబంధించిన ఏ ఆధారాలూ తమ దర్యాప్తులో లభించలేదని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రశాంత్‌ పాకిస్థాన్‌లో ఉన్నట్టు సోమవారం ఓ వీడియో విడుదల కావడం, అందులో ప్రశాంత్‌ తెలుగులో మాట్లాడుతూ.. తాను క్షేమంగానే ఉన్నట్టు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
prashanth1
ఏపీలోని వైజాగ్‌కు చెందిన ప్రశాంత్‌ మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్‌ అనే మరో యువకుడితో కలిసి పాకిస్థాన్‌కు ఎప్పుడు వెళ్లారు? ఎందుకు వెళ్లారు? అక్కడ ఎన్నాళ్లనుంచి ఉంటున్నారన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. సాధారణంగా ఒక దేశానికి చెందిన వ్యక్తి ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా మరో దేశంలో పట్టుబడితే అతడిని స్వదేశానికి అప్పగించేందుకు నిర్దిష్ట విధానం ఉంటుంది. నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించి ఆ వ్యక్తిని స్వదేశానికి రప్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులకు పంపడంతోపాటు ప్రత్యేకంగా వారితో టచ్‌లో ఉండి అవసరమైన అన్ని వివరాలు ఇస్తున్నట్టు పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ప్రేమించిన యువతి దూరమైందని..

వైజాగ్‌లోని మిథులాపురి హుడా కాలనీకి చెందిన ప్రశాంత్‌ తన కుటుంబసభ్యులతో కలిసి కొన్నేండ్లపాటు హైదరాబాద్‌ కూకట్‌పల్లి ఫేజ్‌-1లోని భగత్‌సింగ్‌నగర్‌లో ఉన్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన తన కుమారుడు తొలుత బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేశాడని, అప్పుడే సహోద్యోగి అయిన స్వప్నిక పాండే (మధ్యప్రదేశ్‌ యువతి)తో పరిచయం ఏర్పడిందని ప్రశాంత్‌ తండ్రి బాబూరావు మంగళవారం మీడియాకు తెలిపారు. 2017లో ప్రశాంత్‌ హైదరాబాద్‌లోని షోర్‌ టెక్నాలజీ సంస్థలో చేరాడని, ఆ ఏడాది ఏప్రిల్‌ 11న ఉదయం 9 గంటలకు ఇంటినుంచి వెళ్లిన ప్రశాంత్‌ మళ్లీ తిరిగిరాలేదని, 18 రోజులపాటు అనేక ప్రాంతాల్లో గాలించినా అతని ఆచూకీ లభించకపోవడంతో ఏప్రిల్‌ 29న మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టామని చెప్పారు. ప్రశాంత్‌ గతంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడలేదని, అతను పాకిస్థాన్‌కు వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదన్నారు. స్వప్నిక స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోవడంతో ప్రశాంత్‌ మానసికంగా కుంగిపోయాడని, ఆమెను వెతుక్కుంటూనే ఇంటినుంచి వెళ్లిపోయినట్టు అనుమానిస్తున్నామని బాబూరావు వివరించారు.

మిస్సింగ్‌ కేసు నమోదయిన తర్వాత ప్రశాంత్‌ కోసం సైబరాబాద్‌ పోలీసులు గాలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. సెల్‌ఫోన్‌సైతం వాడకపోవడంతో అతడి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సాధ్యంకాలేదు. ఇంటినుంచి వెళ్లిన రెండేండ్ల ఏడునెలల తర్వాత అకస్మాత్తుగా ప్రశాంత్‌ వీడియో బయటికి రావడంతో అతడి ఆచూకీ తెలిసింది. ఇంతకాలం ప్రశాంత్‌ ఎక్కడ ఉన్నాడు? ప్రియురాలి కోసం మధ్యప్రదేశ్‌కు వెళ్లినప్పుడే దరీలాల్‌తో పరిచయం ఏర్పడిందా? దరీలాల్‌కు ప్రశాంత్‌ ప్రేమించిన యువతికి మధ్య ఏమైనా బంధుత్వం ఉన్నదా? ప్రశాంత్‌, దరీలాల్‌ కలిసి పాకిస్థాన్‌వైపు ఎందుకెళ్లారు? పాక్‌ భూభాగంలోకి ఎప్పుడు అడుగుపెట్టారు? అక్కడ వారు ఎలా పట్టుబడ్డారు? అన్న ప్రశ్నలకు జవాబులు తెలియాల్సి ఉన్నది. అసలు ఏమి జరిగిందన్నది ప్రశాంత్‌ తిరిగొచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంటుందని చెప్తున్న అధికారులు.. ప్రశాంత్‌ గతంలో పనిచేసిన కంపెనీల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది.
prashanth4

నా కుమారుడిని క్షేమంగా తీసుకురండి

ప్రశాంత్‌ వ్యవహారంపై మంగళవారం అతని తం డ్రి బాబురావు, సోదరు డు శ్రీకాంత్‌ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ను కలిశారు. తన కుమారుడిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని బాబూరావు కోరారు. దీనిపై సజ్జనార్‌ స్పందిస్తూ.. ప్రశాంత్‌ వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలియజేశామని, వారిద్వారా పాక్‌ ఎంబసీకి సమాచారమిచ్చి అతడిని తీసుకొస్తామని వివరించారు. ప్రశాంత్‌ వ్యవహారంలో వదంతులు సృష్టించి ప్రచారంచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు.
prashanth2

మంత్రి కేటీఆర్‌ భరోసా

ప్రశాంత్‌ విషయం గురించి తెలియగానే స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రావులు మంగళవారం బాబురావును కలిశారు. భయపడొద్దని ఆయనకు ధైర్యం చెప్పి ఫోన్‌ద్వారా మంత్రి కేటీఆర్‌తో మాట్లాడించారు. ప్రశాంత్‌కు హాని జరుగదని, క్షేమంగా తిరిగొస్తాడని మంత్రి కేటీఆర్‌ అభయమివ్వడంతో బాబూరావు కుదుటపడ్డాడని ఎమ్మెల్యే వివరించారు.
prashanth3

ఇటీవలే పాక్‌లోకి ప్రశాంత్‌!

పాకిస్థాన్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. బహవల్‌పూర్‌లోని ఎడారిలో ఇద్దరు వ్యక్తులు దాక్కొన్నట్టు ఈ నెల 14వ తేదీ రాత్రి దాదాపు 8 గంటల సమయంలో ఆ ప్రాంత గూఢచారి చోళిస్థాన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రశాంత్‌, దరీలాల్‌ను అదుపులోకి తీసుకొన్నారు. వారివద్ద ధ్రువీకరణ పత్రాలేమీ లేకపోవడంతో పాకిస్థాన్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఎంట్రీ యాక్ట్‌ కింద కేసు నమోదుచేసి జైలుకు తరలించారు. దీన్నిబట్టి చూస్తే ప్రశాంత్‌ ఇటీవలే పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి ఉంటాడని తెలుస్తున్నది.

1691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles