ఈ వెతలు ఇంకెన్నాళ్లు?


Wed,April 24, 2019 02:06 AM

4 thousand bribe for one acre to get passbook

రాష్ట్రంలో ఏ ఊరిని చూసినా ఏదో విధమైన భూ సమస్యలే.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. రికార్డులను ఎంతగా ప్రక్షాళన చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అవినీతి వటవృక్షంలా వేళ్లూనుకొనిపోయింది. దాని ఫలితం రైతులు భూమి ఉన్నా లేనోళ్లుగా మారిపోతున్నారు. వ్యవసాయం చేసుకుంటున్నా.. రికార్డుల్లో మాత్రం ఆ భూమి వాళ్లది కాకుండా పోతున్నది. పాత పుస్తకాల్లో ఉన్న భూమి.. కొత్త పుస్తకాల్లో కనిపించదు. వారసత్వంగా వచ్చే భూమిని విరాసత్ చేయరు. పట్టా కోసం కాళ్లరిగేలా తిరిగినా పనికాదు. పైసలిచ్చినా కనికరించే నాథుడు ఉండడు. దశాబ్దాల తరబడి తాము సాగుచేసుకుంటున్న భూమి రికార్డుల్లోకొచ్చేసరికి మరొకరిపేరు మీదకు మారుతుంది. సర్వే నంబర్లు మారుతాయి. వీఆర్వో దొరకడు. సర్వేయర్ రాడు. అధికారులు వినిపించుకోరు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలేవీ
వీళ్ల చర్యల వల్ల అర్హులైన రైతుల దరి చేరటం లేదు.


పేరు మార్పిడికి ఏండ్లుగా తిరుగుతున్నా

నాకు బొప్పారం గ్రామంలో వారసత్వంగా వచ్చిన 119/ఈలో 2 గుంటలు, 205/ఆలో ఒక ఎకరం 17 గుంటలు, 206లో రెండెకరాల 38 గుంటల భూమి ఉంది. మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ భూమిని సాగుచేస్తూ వస్తున్నా. భూ ప్రక్షాళనలో దరఖాస్తు చేసుకున్నా. రికార్డుల్లో మా సర్వేనంబర్‌లో భూమి సరిగానే ఉంది. మా నాన్న పేరు భద్రయ్య అయితే రికార్డుల్లో మా చిన్నాన్న లక్ష్మీనర్సయ్య పేరు ఎక్కించారు. మా చిన్నాన్న కొడుకు పేరు కూడా చినసత్తయ్య కావడంతో చిన సత్తయ్య తండ్రి రామనర్సయ్య పేరుతో భూమి చూపిస్తున్నారు. మా భూమి మా చిన్నాన్న పేరుపై ఎక్కించడం ఎలా జరిగిందని రెవెన్యూ అధికారి, ఆర్‌ఐ రామారావును అడిగాం. ఆర్‌ఐ రామారావు గ్రామానికి వచ్చి పంచనామా నిర్వహించి చినసత్తయ్య తండ్రి లక్ష్మీనర్సయ్య పేర భూమిలేదని, ఈ భూమి నీకు సంబంధించిందేనని గ్రామస్థుల సమక్షంలో పంచనామా రాసి ఇచ్చారు.

కానీ, నాటి నుంచి నేటి వరకు మా తండ్రి పేరు రికార్డుల్లో ఎక్కించలేదు. సంవత్సరకాలంగా కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. గ్రామంలో డబ్బులిచ్చిన వారికి మాత్రమే పట్టా పాస్‌పుస్తకాలు ఇస్తున్నారు. నా వద్ద డబ్బులు లేవని చెప్పాను. అందుకే నన్ను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. రికార్డుల్లో నా తండ్రి పేరును సవరించి నాకు పాస్‌పుస్తకాలు అందజేసేలా పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
- దేశోజు చినసత్తయ్య, బొప్పారం గ్రామం, ఆత్మకూర్-ఎస్ మండలం, సూర్యాపేట జిల్లా
గుండ్ల రాజయ్య

నాకు న్యాయం జరిగేదెన్నడు?

-ఏడెకరాల 20 గుంటలకు రెండెకరాలకే పట్టా..
-ఎకరానికి 4 వేలు లంచం ఇమ్మంటున్నారు: గుండ్ల రాజయ్య

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడేనికి చెందిన గుండ్ల రాజయ్యకు గ్రామంలో సర్వే నంబర్ 483, 474, 488లో ఏడెకరాల 20 గుంటల భూమి ఉంది. 2016లో తాసిల్దార్ కార్యాలయంలో సాదాబైనామాకు దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరుగగా రెండెకరాల భూమిని భార్య గుండ్ల లలిత పేరున పట్టాచేశారు. మిగిలిన ఐదెకరాల పట్టాకోసం జూలై 7, 2018న సూర్యాపేటలో జాయింట్ కలెక్టర్‌ను కలిశారు. ఆ మరుసటి రోజున జేసీ సంజీవరెడ్డి వీఆర్వో లతీఫ్‌ను కార్యాలయానికి పిలిపించి వెంటనే భూమిని రికార్డు చేయాలని చెప్పారు. కానీ వీఆర్వో పట్టించుకోలేదు. తిరిగి అక్టోబర్ 11, 2018న జేసీని మళ్లీ కలిశారు. స్పందించిన జేసీ తాసిల్దార్‌కు సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.

అయినా ఎవరూ పట్టించుకోలేదు. మూడోసారి నవంబర్ 18న జేసీని కలిసినా ఫలితం లేకుండా పోయింది. ఇదేమిటని వీఆర్వోను ప్రశ్నించగా ఏమిటయ్యా పిచ్చోడివా.. డబ్బులివ్వనిది పనులు జరుగవు. ఎకరానికి 4 వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పినట్టు బాధితుడు తెలిపారు. డబ్బులు ఇవ్వకపోవడంతో నాటి నుంచి నేటి వరకు పూర్తిస్థాయిలో పట్టాకాక టైటిల్ డీడ్ లేక రైతుబంధుకు నోచుకోలేదు. ఇటీవల రాజయ్య సర్వే నంబర్లలో మూడెకరాలు మాత్రమే ఉన్నట్లు వీఆర్వో తెలుపుతున్నారు. మిగిలిన రెండు ఎకరాల 20 గుంటల భూమి ఎక్కడికి వెళ్లిందని రాజయ్య ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయంచేయాలని కోరుతున్నారు. దీనికితోడు మార్చి 7, 2019న తనకు న్యాయంచేయాలని ముఖ్యమంత్రి పేషీకి కూడా ఆయన లేఖరాశారు.
చింతల సారయ్య

మా భూమి.. మరొకరికి పట్టా!

గీసుగొండ: వరంగల్‌రూరల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట గ్రామానికి చెందిన రైతు చింతల సారయ్య మూడేండ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పని కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాయంపేట శివారులోని 856 సర్వే నంబర్‌లో 21 గుంటల భూమి ఉందని, తాతల కాలం నుంచి సాగుచేసుకుంటూ జీవనం గడుపుతున్నట్లు తెలిపారు. మూడేండ్ల కిందట తన భూమిని పక్క రైతు రెవెన్యూ అధికారులకు లంచం ఇచ్చి అతని పేరుపై పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నానని వాపోయారు. సాదాబైనామాలతో భూములను పట్టా చేస్తున్నారని తెలిసి దరఖాస్తు చేసకున్నా రెవెన్యూ అధికారులు తన పేరుపై పట్టా చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. భూ రికార్డుల ప్రక్షాళనలో అప్పటి తాసిల్దార్ శ్రీనివాస్‌కు దరఖాస్తు చేసుకున్నా లాభం లేదని తెలిపారు.

తమ భూమి ఎక్కడుందో తెలియటం లేదని, సర్వే చేయించుకోవాలని వీఆర్వో సూచించడంతో సర్వేయర్‌కు చలానాకట్టి 6 నెలలైనా రావడంలేదని చెప్పారు. సర్వేయర్ గోపీకృష్ణను కలిస్తే, లంచం ఇస్తే సర్వేచేసి రికార్డులో ఎక్కిస్తామని చెప్పి రూ.20వేలు తీసుకున్నా భూమి తన పేరుపై నమోదు కాలేదని చెప్పారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రైతుబంధును కూడా కోల్పోయానని తెలిపారు. గ్రామానికి చెందిన ఇద్దరు రూ.4 లక్షలు ఇస్తే భూమి తన పేరుపై పట్టాచేయిస్తామని, రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇవ్వాలని చెప్తున్నారని వివరించారు. రోజూ వీఆర్వోను కలుస్తున్నా ఫలితం లేదని చెప్పారు. శాయంపేట రెవెన్యూ అధికారులు గ్రామానికి చెందిన కొందరు మధ్యవర్తులను పెట్టుకొని, డబ్బులు వసూలుచేసి పట్టాలు ఇస్తున్నట్టు ఆయన ఆరోపించారు.
యాదగిరి

ప్రొసీడింగ్‌కి 18 ఏండ్లు!

-రికార్డులో లేదు.. పహాణీలో రాదు..
-పలుమార్లు పైసలిచ్చినా పనికాలేదు

గజ్వేల్, నమస్తే తెలంగాణ: మ్యుటేషన్ కోసం ప్రొసీడింగ్ జారీచేసి 18 ఏండ్లు అయింది. రికార్డుల్లో మాత్రం నమోదు కాలేదు. ఏండ్ల తరబడి తిరుగుతూనే ఉన్నాం. రేపుమాపు అంటూ కాలం గడుపుతున్నారని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చాంద్‌ఖాన్ మక్త గ్రామానికి చెందిన రైతు నీల యాదగిరి అవేదన వ్యక్తంచేశారు. ప్రొసీడింగ్ కాపీలు అడిగితే పదిసార్లు ఇచ్చాం.. మార్చుతామంటారు. పట్టించుకోక 18 ఏండ్లు గడిచిపోయిందని తెలిపారు. తమ తండ్రితోపాటు ఆయన సోదరులు నీల నర్సయ్య, లింగయ్య, ముత్యాలు గ్రామానికి చెందిన 217 సర్వే నంబర్‌లో 1 ఎకరం 29 గుంటలు కొనుగోలు చేసి, 10-6-1997లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన చెప్పారు. 30-11-2001లో మ్యుటేషన్ చేస్తూ ప్రొసీడింగ్ సర్టిఫికెట్‌ను అప్పటి ఎమ్మార్వోకు ఇచ్చారని, అందులో నీల ముత్యాలు పేరు మార్పిడి కాగా, నర్సయ్య, లింగయ్య పేర్లు రికార్డులో మార్చలేదని తెలిపారు.

రికార్డుల్లో నమోదుచేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వీఆర్వో, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. పలుమార్లు పైసలిచ్చినా పనిమాత్రం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ప్రొసీడింగ్ సర్టిఫికెట్లు ఉన్నా పహాణీ, ఆన్‌లైన్‌లోకి ఎక్కించకుండా, కొత్త పాస్‌పుస్తకాల్లో కూడా చేర్చలేదని వాపోయారు. ఎన్నిసార్లు తిరిగినా అధికారులకు కనికరం లేదని, ఇప్పటికైనా రికార్డుల్లో నమోదుచేసి, పహాణీలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాములు

పేరు మార్చరు.. కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వరు

-దరఖాస్తుచేసి రెండేండ్లుగా తిరుగుతున్నాం
-రైతుబంధు, రైతుభీమాకు దూరమయ్యాం
-రైతులు రాములు, నరేందర్ ఆవేదన

కోహీర్: తండ్రి చనిపోయి రెండు సంవత్సరాలు గడిచినా వారసత్వ భూమిని తమ పేరుపై బదలాయించడం లేదని రైతులు రాములు, నరేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. చింతల్‌ఘాట్ గ్రామ శివారులోని సర్వే నం.68లో తండ్రి బిచ్చయ్య పేరున 29 గుంటలు ఉంది. తండ్రి చనిపోయిన వెంటనే వారసత్వంగా ఇద్దరు కొడుకుల పేరుపై ఫౌతి చేయాలి. దరఖాస్తు చేసుకొని రెండు సంవత్సరాలు గడిచినా బదలాయించడం లేదు. ఎన్నిసార్లు కలిసినా తండ్రి పేరు, సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించడంలేదని, తామేమి చేయలేమని రెండేండ్లుగా రెవెన్యూ అధికారులు చెప్తున్నారని మండిపడ్డారు. భూమిని తమ పేరున మారిస్తే కొత్త పట్టా పాస్‌పుస్తకాలు వచ్చేవని, రైతుబంధు, రైతుబీమా వర్తించేవని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా న్యాయం చేయాలని రైతులు రాములు, నరేందర్ కోరారు.
కందకట్ల మహారాణి

వన్‌బీ వచ్చినా.. పాస్‌పుస్తకం రాలేదు

-అమ్మినవారి ఖాతాలోనే రైతుబంధు సాయం జమ
-కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న
-నీరుకుళ్ల నివాసి కందకట్ల మహారాణి ఆవేదన

ఆత్మకూరు: నాపేరు కందకట్ల మహారాణి, మాది వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం. గ్రామశివారులోని సర్వే నంబర్ 638లో 3-01ఎకరాల వ్యవసాయం భూమి ఉంది. గతేడాది సండ్రే విజయ, భర్త సదానందం వద్ద కొనుగోలు చేసి రిజిష్టర్ చేయించుకున్నాం. రైతుబంధు పథకం మొదటివిడుత సాయం మాకు అమ్మినవారి బ్యాంక్ ఖాతాలో జమైంది. విజయ నుంచి మాపేరుపై రిజిష్టర్ చేయించుకున్నా పేరు మార్చేందుకు అధికారులు ధరిణి వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని తెలిపారు. అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది పనులు చేయరన్నారు. అప్పటికి ఆరు నెలలు కార్యాలయ చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణ చేయించారు. చివరికి ఫిబ్రవరి నెలలో ధరణి వెబ్‌సైట్ నుంచి తమ పేరున వన్‌బీ, పహాణీ వచ్చింది. పాస్‌పుస్తకం రాలేదు. రెండోవిడుత రైతుబంధు చెక్కు మొత్తం కూడా అమ్మినవారి ఖాతాలోనే జమయ్యాయి. మేం ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని కోల్పోతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టాపాస్‌పుస్తకం ఇప్పించాలి.
పూసం సుద్ధు

నేను పోయేలోపైనా పట్టా వత్తదో లేదో..

కుమ్రంభీం ఆసీఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆసిఫాబాద్ తాసిల్దార్ కార్యాలయం ముందు దీనంగా కూర్చొని తన భూమి కాగితాలు చూపిస్తున్న ఈ 80 ఏండ్ల వృద్ధుడి పేరు పూసం సుద్ధు. ఈయనది ఆసిఫాబాద్ మండలం మేడిగూడ గ్రామం. ఊరి శివారులోని సర్వేనంబర్ 13/26లో సుద్ధు అన్న మారు పేరిట ఏడెకరాల భూమి ఉన్నది. తాతముత్తాతల నుంచి వారత్వంగా వచ్చిన ఈ భూమిని తన అన్నతో కలిసి సాగుచేసుకునేవాడు. 20 ఏండ్ల క్రితం అన్న చనిపోవడంతో ఆ భూమిని తన పేరు మీద మార్చాలని తాసిల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఏడాది క్రితం భూరికార్డుల ప్రక్షాళన చేపట్టిన అధికారులు.. సదురు భూమిని తన పేరు మీద మారుస్తామని చెప్పడంతో సంబురపడ్డాడు. కానీ, ఫలితంలేదు. పట్టా కోసం తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. పట్టా లేకపోవడంతో రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించడంలేదు. తనకు ఇద్దరు బిడ్డలనీ, వయసు మీద పడటంతో తిరుగలేక అవస్థలు పడుతున్నాననీ, తాను పోయే లోపైనా పట్టా చేస్తారో.. లేదోనని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.

1349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles