ఐదెకరాలు అదృశ్యం


Wed,April 24, 2019 02:09 AM

5 acres land Removal from the passbook

-భూమిలేదంటూ పాస్‌పుస్తకం నుంచి తొలగింపు
-ఆధీనంలోని భూమికి హక్కుల కల్పనకు ససేమిరా
-కాళ్లరిగేటట్లు తిరుగుతున్న గోపిడి మహిపాల్‌రెడ్డి

ఓ తల్లీ, కొడుకు తమ పేరిట ఐదెకరాల భూమికొనుగోలుచేశారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వారి పేరిట పాత పాస్‌పుస్తకాలు కూడా ఉన్నాయి. తాము కొనుగోలుచేసిన భూమిలో వ్యవసాయం కూడా చేస్తున్నారు. అయితే, భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో.. సదరు సర్వే నంబర్‌లో వాస్తవంగా ఉండాల్సిన మొత్తం భూమికి, ఆ సర్వే నంబరులోని పట్టాదారులందరికీ కలిపి ఉన్న మొత్తం భూమికి మధ్య ఐదెకరాలు తేడా రావడంతో ఆ మేరకు తల్లీ, కొడుకుల ఖాతాలో కోతపెట్టేశారు. వారి పాస్‌పుస్తకాల నుంచి ఆ ఐదెకరాలు తొలగించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. అదంతే.. అంటున్నారు రెవెన్యూ అధికారులు.

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగాణ: గోపిడి విజయ, గోపిడి అర్జున్‌రెడ్డి.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వట్టూరు రెవెన్యూ పరిధిలో ఐదెకరాల భూమి కొనుగోలుచేసి, వ్యవసాయంచేస్తున్నారు. ఆ భూమికి సంబంధించిన పాత పాస్‌పుస్తకాలు ఉన్నాయి. అయితే, భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులు ఆ ఐదెకరాలను పాస్‌పుస్తకం నుంచి తొలగించారు. అదేమంటే.. ఆ సర్వే నంబర్‌లో అంత భూమి లేదంటూ సెలవిస్తున్నారు. ఆ భూమిలో మేము వ్యవసాయం చేస్తు న్నాం కదా అని పట్టాదారులు ప్రశ్నిస్తుంటే.. అదంతే! ఏం చేయలేం అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు రెవెన్యూ అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వట్టూరు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 47ఈ2, 45/అ, 45/ఆ, 44/ఆ, 44/అ, 36/అ2, 36/అ1, 47ఈ3/1, 35/అ1 లో 5.13 ఎకరాల భూమి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లిలోని గంగస్థాన్‌కు చెందిన గోపిడి విజయ పేరిట ఉన్నది.

అదే గ్రామంలో 47ఈ4, 47ఈ3/1, 44/ఇ, 36/అ3, 35/అ3లో 4.39 ఎకరాల భూమి గోపిడి అర్జున్‌రెడ్డి పేరిట ఉన్నది. ఈ మేరకు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా అర్జున్‌రెడ్డి పేరిట ఉన్న భూములకు లేఖ నంబరు బీ/173/ 2015, విజయ పేరిట ఉన్న భూములకు లేఖ నంబరు బీ/174/2015 ద్వారా ప్రొసీడింగ్స్ జారీచేశారు. పాస్‌పుస్తకాలు కూడా ఇచ్చారు. అయితే, ఇటీవల రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులు సర్వే నంబరు 47లో భూమిలేదంటూ ఐదెకరాలను ఏకపక్షంగా తొలగించారు. దీంతో అప్పటినుంచి పట్టాదారుల తరపున అర్జున్‌రెడ్డి తండ్రి గోపిడి మహిపాల్‌రెడ్డి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.

భూమిలేదని కోత

వట్టూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 47లో ఉన్న మొత్తం విస్తీర్ణం 13 ఎకరాలు. అయితే, గోపిడి అర్జున్‌రెడ్డి, విజయతోపాటు ఇతర పట్టాదారులకు కలిపి 18 ఎకరాలుగా రికార్డుల్లో నమోదయ్యింది. వాస్తవిక విస్తీర్ణానికి, రికార్డులకు మధ్య ఐదెకరాల భూమి తేడాఉన్నది. దీంతో రికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ అధికారులు ఈ ఐదెకరాల భూమి ని గోపిడి విజయ, అర్జున్‌రెడ్డి పాస్‌పుస్తకాల నుంచి ఏకపక్షంగా తొలగించారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ఈ ప్రక్రియను పూర్తిచేశారు. ఐదెకరాల భూమిని రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించడంతో రైతుబంధు సాయం అందలేదు. పైగా భవిష్యత్తులో అనుభవిస్తున్న విస్తీర్ణానికి, రికార్డుల్లోని విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం తలెత్తితే సమస్యలు ఉత్పన్నమవుతాయని పట్టాదారుల తరపున విజయ భర్త, అర్జున్‌రెడ్డి తండ్రి మహిపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భూమి లేనప్పుడు దశాబ్దాలుగా పట్టాలను, పాస్‌పుస్తకాల్లో ఎలా కొనసాగించారు? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ తమ దగ్గర స్టాంపుడ్యూటీ కట్టించుకొని రిజిస్ట్రేషన్ ఎలా చేసింది? అని అధికారులను ప్రశ్నిస్తున్నారు.


గోపిడి మహిపాల్‌రెడ్డి

ఏకపక్షంగా తొలగించారు

నా భార్య విజయ, కొడుకు అర్జున్‌రెడ్డి పేరిట కొనుగోలుచేసిన భూమికి పాత పాస్‌పుస్తకాలు ఉన్నాయి. రికార్డుల ప్రక్షాళనలో సర్వే నంబరు 47లో భూమిలేదంటూ మా పేరిట ఉన్న ఐదెకరాలను ఏకపక్షంగా తొలగించడం అన్యాయం. మేం కొనుగోలు చేయకముందే రికార్డుల్లో నుంచి ఎందుకు తొలగించలేదు. మేము కొనుగోలుచేసిన భూమిలో వ్యవసాయం చేస్తున్నాం. అందుకే ఏకపక్షంగా తయారుచేసిన కొత్త పాస్‌పుస్తకాలను స్వీకరించలేదు. ఒకసారి స్వీకరిస్తే రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పును ఒప్పుకున్నట్లు అవుతుంది. మా పేరిట ఉన్న భూమిని పూర్తిగా ఎంట్రీచేసి, పాస్‌పుస్తకాలు ఇవ్వాలి. ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడంలేదు.
-గోపిడి మహిపాల్‌రెడ్డి, దూలపల్లి, కుత్బుల్లాపూర్ మండలం, మేడ్చల్ జిల్లా నివాసి

2093
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles