73.13% తిరిగిన బస్సులు

Sat,November 9, 2019 02:01 AM

-పక్కా ఏర్పాట్లతో ప్రజారవాణా మెరుగు
-అన్ని బస్సుల్లో టికెట్ల జారీ ప్రక్రియ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్: ఆర్టీసీ యాజమాన్యం చేపట్టిన పక్కా ఏర్పాట్ల తో ప్రజా రవాణా సాఫీగా సాగుతున్నది. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటూ పట్టణాలు, పల్లెలకు మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను పెద్ద సంఖ్యలో నడిపిస్తున్నారు. బస్సుల నిర్వహణ, మరమ్మతుల కోసం మెకానిక్‌లు, ఇతర సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకుంటున్నారు. దీంతోపాటు బస్సుల్లో విధిగా టికె ట్లు జారీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 73.13శాతం బస్సులు తిరిగాయి. 4,596 ఆర్టీసీ, 1,948 అద్దె బస్సులు మొత్తం 6,544 సర్వీసులు రోడ్డెక్కినట్టు ఆర్టీసీ ప్రకటించింది. కేవలం 293 బస్సుల్లో మాత్రమే ముద్రించిన టికెట్లు ఇచ్చారనీ, మిగతా బస్సుల్లో టిమ్స్ ద్వారా టికెట్లు జారీ చేశారని తెలిపింది. మొత్తం 11వేలకుపైగా తాత్కాలిక ఉద్యోగులు విధులు నిర్వర్తించినట్టు తెలిపింది.

-కరీంనగర్ రీజియన్‌లోని నాలుగు జిల్లాల్లో శుక్రవారం 671 బస్సులు నడిచాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 495 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల పరిధిలో శుక్రవారం 719 బస్సులు నడిచాయి. మెదక్ రీజియన్‌లో 535 బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించాయి. ఖమ్మం జిల్లాలోని మూడు డిపోల పరిధిలో 285 బస్సులు, నిర్మల్ జిల్లాలో 251 బస్సులు తిరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల పరిధిలో 227 బస్సు సర్వీసులు ప్రయాణికులకు సేవలందించాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 95 బస్సులు, వనపర్తి జిల్లాలో 93 బస్సులు, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో 225 బస్సులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 96 బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేశాయి. నల్లగొండ జిల్లాలోని నాలుగు డిపోల్లో 295 బస్సులు, సూర్యాపేటజిల్లాలోని రెండు డిపోల పరిధిలో 174 బస్సులు నడిచాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 140 బస్సులు, వికారాబాద్ జిల్లా పరిగి, వికారాబాద్, తాండూరు డిపోల నుంచి 196 బస్సులను నడిపించారు.

చలో ట్యాంక్‌బండ్ కొనసాగుతుంది

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం కొనసాగుతుందని, కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హయత్‌నగర్‌లో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.

ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి లేదు

-హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: ఆర్టీసీ జేఏసీ శనివారం నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఆర్టీసీ జేఏసీకి వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపా యి. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్ వైపు ఎవరూ రావొద్దని.. ఆంక్షలు ఉంటాయని సీపీ పేర్కొన్నారు. ఈ మేరకు కొందరు నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్టు ఆయన చెప్పారు.

నేడు ట్యాంక్‌బండ్ మూసివేత..

చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి అనుమతి లేదని ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ముందస్తు చర్యలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నామని, ప్రత్యామ్నాయ రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామన్నారు. సామాన్య వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ ఆంక్షలను విధిస్తున్నామని వెల్లడించారు.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా..

- సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వచ్చే వాహనదారులు కార్బల మైదాన్ వద్ద కవాడిగూడ ఎక్స్‌రోడ్స్, సీజీవో టవర్స్ ముషీరాబాద్ ఎక్స్‌రోడ్స్ మీదుగా వెళ్లాలి.
-ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్ నుంచి ఇందిరా పార్కు వైపు వచ్చే వాహనాలు, అశోక్‌నగర్ ఎక్స్‌రోడ్స్ మీదుగా వెళ్లాలి.
- తెలుగుతల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి వైపు, ఇతర ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది.
- ఇక్బాల్ మినార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు నెక్లెస్ రోటరీ, నెక్లెస్ రోడ్డు మీదుగా వెళ్లాలి.
-లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలు జంక్షన్ వద్ద నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
-ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనాలు బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వెళ్లాలి.
-ఎస్‌బీహెచ్ గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే వాహనదారులు కేఎల్‌కే బిల్డింగ్ రూట్ వైపు వెళ్లాలి.
-ఖైరతాబాద్ ైఫ్లెఓవర్ మీదుగా వచ్చే వాహనాలు నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కంపౌండ్ లేన్‌లో వెళ్లాల్సి ఉంటుంది.

918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles