-విద్యార్థుల కోసం ప్రత్యేక సర్వీసులు
-గ్రామాలకు నైట్‌హాల్ట్ బస్సులు
-90 శాతానికిపైగా తిరుగుతున్న వాహనాలు
-ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఇబ్బందులు దూరం
-పలుచోట్ల తాత్కాలిక సిబ్బందిపై దాడులు
నమస్తేతెలంగాణ నెట్వర్క్: ఆర్టీసీ ప్రగతిచక్రం ఆగకుండా పరుగులు తీస్తున్నది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ప్రజారవాణా ఆటంకం లేకుండా సాగుతున్నది. సమ్మె ప్రభావమే కనబడకుండా బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. పట్టణాలతోపాటు మారుమూల పల్లెలకు సర్వీసులు నడుస్తుండటంతోపాటు విద్యార్థుల సౌకర్యార్థం నైట్‌హాల్ట్ బస్సులు గ్రామాలకు వెళ్తున్నాయి. 90 శాతానికిపైగా బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. జనగామ జిల్లాలో బస్సును ఆపివేసేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులపై ప్రయాణికులు ఆగ్ర హం వ్యక్తంచేశారు. పలుచోట్ల ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లపై దాడులకు దిగడం ఉద్రిక్తంగా మారింది.
-కరీంనగర్ రీజియన్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో 84.45 శాతం బస్సులు నడిచాయి. రీజియన్‌లో 656 బస్సులు నడవాల్సి ఉండగా 366 ఆర్టీసీ, 188 అద్దె బస్సులు కలిపి మొత్తం 554 బస్సులు తిరిగాయి. 469 బస్సుల్లో టిమ్స్, 85 బస్సుల్లో టికెట్ల ద్వారా చార్జీలు వసూలు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 394 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. 313 ఆర్టీసీ బస్సు లు, 81 అద్దె బస్సులు తిరిగాయి. వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల పరిధిలో 866 బస్సులుండగా, మంగళవారం 611 బస్సులు నడిచాయి.

-జనగామ జిల్లాలో మంగళవారం వంద శాతం బస్సులు ప్రయాణికులను చేరవేశాయి. 37 రూట్లలో 109 బస్సులు నడిచాయి. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి జనగామ బస్టాండ్‌లో తనిఖీ చేశారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోల్లో బస్సులు యథావిధిగా నడిచాయి. ఖమ్మం డిపోలో 17 ఆర్టీసీ, 58 అద్దె బస్సులు, మధిర డిపోలో 11ఆర్టీసీ, 11 అద్దె బస్సులు, సత్తుపల్లి డిపోలో 67 ఆర్టీసీ, 34 అద్దె బస్సులు వివిధ రూట్లలో తిరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పట్టణాలతోపాటు మారుమూల పల్లెలకు బస్సులు తిరిగాయి. కొత్తగూడెం డిపోలో 45 ఆర్టీసీ, 22 అద్దె బస్సులు, భద్రాచలంలో 46 ఆర్టీసీ, 23 అద్దె బస్సులు, మణుగూరు డిపోలో 44 ఆర్టీసీ, 21 అద్దె బస్సు సర్వీసులు నడిచాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 69 ఆర్టీసీ, 31 అద్దె బస్సులు దాదాపు 18 వేల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేర్చాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 74 ఆర్టీసీ, 20 అద్దె బస్సులు, నారాయణపేట జిల్లాలో 35 ఆర్టీసీ, 21 అద్దె బస్సులు, వనపర్తి డిపో పరిధిలో 77 ఆర్టీసీ బస్సులు, 23 అద్దె బస్సులను ఆయా రూట్లలో నడిపించారు. నల్లగొండ జిల్లాలోని బస్టాండులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. అన్ని రూట్లలో బస్సులు తిరుగుతున్నాయి. 166 బస్సులు ప్రజలను గమ్యస్థానాలకు చేర్చాయి. సూర్యాపేట డిపోలో 40 ఆర్టీసీ బస్సులు, 10 అద్దె బస్సులు వివిధ రూట్లలో నడిచాయి. కోదాడ డిపో పరిధిలో 45 బస్సులు, యాదగిరిగుట్ట డిపో పరిధిలో 66 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. వికారాబాద్, తాండూరు, పరిగి డిపోల నుంచి మంగళవారం 166 బస్సులు వివిధ ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేశాయి.
వికారాబాద్ డిపోలో 82 బస్సులు ఉండగా 29 బస్సులు, తాండూరు డిపోలో 93 బస్సులుండగా 72 బస్సులు, పరిగి డిపోలో 87 బస్సులుండగా 65 బస్సులు వివిధ ప్రాంతాలకు నడిచాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు దిగువన ఆర్టీసీ బస్సులను కలెక్టర్ శరత్ తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. టిక్కెట్ చార్జీలు ఎక్కువ వసూలు చేస్తున్నారా? టికెట్లను ఇస్తున్నారా? అని ఆరా తీశారు. కార్మికులు సమ్మె వీడి విధుల్లో చేరాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

జనగామలో కార్మికులకు చేదు అనుభవం
ఆర్టీసీ కార్మికులకు జనగామ బస్టాండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. బస్టాండ్‌లో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతోపాటు ప్రయాణికులకు గులాబీ పువ్వులు ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలతో సమ్మె చేస్తున్నారని.. పండుగ పూటనే చేయాలా అంటూ మండిపడ్డారు. ఇరువర్గాల మధ్య వాదనలు వేడెక్కడంతో పోలీసులు అక్కడి నుంచి కార్మికులను పంపించారు.
ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లపై దాడులు
జగిత్యాల డిపోలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్న వెల్గటూర్ మండలం రాజరాంపల్లెకు చెందిన వెంకటేశ్‌పై ఆర్టీసీ కార్మికులు దాడికి దిగారు. డిపో నుంచి బస్‌ను బయటకు తీసుకువస్తుండగా కార్మికులు బస్సునుఆపి తాత్కాలిక డ్రైవర్, కండక్టర్‌తో వాదనకుదిగి ఆర్టీసీ కండక్టర్ కడారి అంజిరెడ్డి తాత్కాలిక డ్రైవర్ వెంకటేశ్‌పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు టౌన్ సీఐ జ యేశ్రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఏపీ 29 జెడ్ 0121 నంబర్ బస్సును ఆపి తాత్కాలిక డ్రైవర్‌పై దాడికి యత్నించారు. బస్సు అద్దాన్ని ధ్వంసం చేశారు.