భూమి పెరుగును!


Wed,June 12, 2019 03:13 AM

A large number of sale deeds on single land

-అవును.. 64 ఎకరాలను 291 ఎకరాలుగా అమ్మేశారు
-చనిపోయినవాళ్లు సంతకాలు చేసినట్టు రికార్డులు
-ఒకే భూమిపై పెద్ద సంఖ్యలో సేల్‌డీడ్లు
-అసలు పట్టాదారుల కన్నుగప్పి దందా
-రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, పోలీసు అధికారుల కుమ్మక్కు.. యథేచ్ఛగా అమ్మకాలు
-పీవోబీలో ఉన్నప్పటికీ భూముల రిజిస్ట్రేషన్
-రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో రెవెన్యూ లీలలు

ఆ ఊళ్లో ఓ ఐదు సర్వే నంబర్లలో ఉన్న భూమి 64 ఎకరాలు. కానీ.. అరవైకిపైగా సాగిన సేల్‌డీడ్ల లెక్క చూస్తే.. 291 ఎకరాలు. అంటే.. దాదాపు నాలుగున్నర రెట్లు! తరగని.. పెరగని భూమి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో మాత్రం పెరుగుతూ పోయింది. అలా కాగితాలపై భూమిని పుట్టించి.. ఒకే భూమిని అనేకమందికి అమ్మేశారు! అసలు పట్టాదారులకు తెలియకుండా యథేచ్ఛగా విక్రయాలు సాగిపోయాయి. చనిపోయినవారి సంతకాలతో సేల్‌డీడ్లు అయ్యాయి! హక్కుదారులకు బదులు.. వేరొకరి నుంచి భూములు కొనుగోలు చేసినట్లు రికార్డులు పుట్టుకొచ్చాయి! భూమి కొన్నవారికి సేల్‌డీడ్లు ఉన్నా.. పహాణీల్లో నమోదుకాలేదు. క్షేత్రస్థాయిలో భూమిలేదు. నిజానికి తాము కొనుగోలు చేసిన భూమి ఎక్కడున్నదో కూడా వారికి తెలియదు. అలా కొన్నవారు సైతం మోసపోయారు. సదరు 64 ఎకరాల అసలు పట్టాదారులు.. ఇది తమ భూమి అంటూ 1995 నుంచి పోరాడుతున్నా.. పట్టించుకున్న అధికారి లేడు. పైగా.. వారిపైనే ఉల్టా కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలకు తోడు.. పోలీసు అధికారులు కుమ్మక్కయి సాగించిన ఈ దందాలో బాధితులు ధర్మగంటను ఆశ్రయించారు.

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా యాచారం మండ లం నందివనపర్తి (ఆవాస గ్రామం నీలిపోచమ్మ తండా)లో సర్వేనంబరు 356, 358, 360, 361, 369లలో ఖాస్రా పహాణీ ప్రకారం విస్తీర్ణం కంటే నాలుగున్నర రెట్ల భూమిని విక్రయించినట్లు సేల్‌డీడ్లు, పహాణీలు చెప్తున్నాయి. కనీసం రైతు టైటిల్‌డీడ్, పాస్‌పుస్తకాలు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధనను రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు ఉల్లంఘించారు. ఒకరు కొనుగోలుచేసిన భూమిని మళ్లీ రెవెన్యూ రికార్డులో మ్యుటేషన్ చేసి పాస్‌పుస్తకాలు విడుదల చేసేవరకు ఆగితే ఈ అక్రమాలు ఆగి ఉండేవేమో! కానీ.. ఒకదాని వెనుక మరొకటిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నడిపారు. 1995 నుంచి ఇటీవల సాగిన సేల్‌డీడ్లను లెక్కిస్తే ఖాస్రా పహాణీలోని విస్తీర్ణానికి నాలుగున్నర రెట్లుగా తేలుతున్నది. ఇప్పటివరకు పెద్దసంఖ్యలో సేల్‌డీడ్స్ పుట్టుకొచ్చాయి. వీటిలో 10, 20 గుంటల వంతున విక్రయించిన డాక్యుమెంట్లు అధికంగానే ఉన్నా యి. వాటినే మళ్లీ మొత్తం విస్తీర్ణంతో మరొకరికి విక్రయించారు. ఈ తతంగం సర్వే నంబరు 360, 361 లలో చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. 66 సేల్‌డీడ్స్‌కు పైగానే ఉన్నట్లు ఎన్‌కంబర్స్‌మెంట్ సర్టిఫికెట్లలో దర్శనమిస్తున్నాయి. లావాదేవీల సంఖ్య 140 వరకు ఉన్నది.

నకిలీ వారసులతో దందా

సర్వేనంబరు 360లో 13.32 ఎకరాలు, 361 లో 15.39 ఎకరాలుగా రికార్డులో ఉన్నది. ఖాస్రా పహాణీ ప్రకారం ఇక్రంఅలీ పట్టాదారుగా ఉన్నారు. ఆ తర్వాత వసూల్ బాకీ, సేత్వార్‌లో వారసులైన మహబూబ్‌అలీ, మహ్మద్ ఉమర్‌కు హక్కులు దక్కాయి. ఫ్యామిలీ సెటిల్‌మెంట్, ఖజాయిత్ ప్రకారం మహ్మద్ జహుర్ సర్వేనంబర్ 360లోని 13.32 ఎకరాలకు హక్కులు పొందారు. ఆర్వోఆర్, 1బీ, పాస్‌బుక్కులు తీసుకున్నారు. అయితే.. ఆయన వారసులైన తమకు హక్కులు కల్పించకుండా 1995 నుంచి ఇబ్బంది పెడుతున్నట్లు జహుర్ మనుమడు బషీరుద్దీన్ ఆవేదన వ్యక్తంచేశారు. పైగా హక్కుదారులకు బదులుగా మరొకరి నుంచి భూములు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించుకొని విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడో చనిపోయిన వ్యక్తులు కూడా బతికొచ్చినట్లుగా సేల్‌డీడ్స్ తయారుచేశారని ఆధారాలతో సహా రెవెన్యూ అధికారులకు చెప్పినా, చూపించినా ఇన్నేండ్లుగా పట్టించుకోవడం లేదని వాపోయారు.

పీవోబీలో ఉన్నా రిజిస్ట్రేషన్లు

సదరు సర్వేనంబర్లలోని భూములపై కేసులున్నాయి. అందుకే ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్ (పీవోబీ)లో 22ఏ కింద నమోదుచేశారు. ఈ భూ ములపై రిజిస్ట్రేషన్లు చేయకూడదని ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ జారీచేసిన ధ్రువీకరణ పత్రాలున్నాయి. సర్వేనంబర్లు 360, 361లోని 1111 గుంటల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను నిషేధించారు. సర్వేనంబర్ 356, 358, 360, 361లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 155/2010 ఉన్నట్టు, కోర్టు స్టే కారణాలతో నిలిపివేసినట్టు వెబ్‌సైట్‌లోనూ పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కూడా సేల్‌డీడ్స్ చేయడం విశేషం. సర్వేనంబరు 369లో భూమిని చూపించడం లేదు. ఇదేమని రిజిస్ట్రేషన్‌శాఖ సిబ్బందిని ప్రశ్నిస్తే.. వాళ్లకు పాస్‌పుస్తకాలు ఇచ్చినందున రిజిస్ట్రేషన్ చేశామంటూ గద్దించినట్లు తెలిసింది.

md-bashiruddin

తప్పిదాలు జరిగినట్లు వీఆర్వో ధ్రువీకరణ

సర్వేనంబరు 360, 361 అసలు యజమానుల విజ్ఞప్తిమేరకు 2010 జనవరి 30న అప్పట్లో పనిచేసిన, ఈ వ్యవహారానికి సాక్షిగా నిలిచిన వీఆర్వో పీ రాధాకిషన్‌రావు లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. సర్వేనంబర్ 360, 361లో అనేక తప్పిదాలు సాగాయని, అసలు పట్టాదారులకు బదులుగా ఇతరుల పేర్లు నమోదయ్యాయని, అనేక డాక్యుమెంట్లల్లో పొరపాట్లు దొర్లాయని ధ్రువీకరించారు. ఈ మేరకు వీఆర్వో రాసిచ్చిన పత్రాన్ని తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు సమర్పించినప్పటికీ లావాదేవీల ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నట్లు బాధితుడు ఎండీ బషీరుద్దీన్ నమస్తే తెలంగాణకు వివరించారు. ఒక కేసు దర్యాప్తు సందర్భంగా 2014 జూలై 18న అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకున్న ఓ పోలీసు అధికారి ఇప్పటికీ వాటిని తిరిగి ఇవ్వలేదు.

పైగా కేసులో చార్జ్‌షీటు కూడా తయారుచేయకుండా పత్రాలను నాశనంచేసినట్లు బాధితుడు ఆరోపించారు. మహ్మద్ జహుర్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి అతని వారసులకు విరాసత్ చేయాలని, రికార్డుల్లో నమోదు చేయాలని కోరుతూ 1995 నుంచి తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు బషీరుద్దీన్ అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ నకిలీ పట్టాదారులకు రైతుబంధు కింద ప్రభుత్వ సాయం అందుతుండటం విశేషం.

land

పట్టాదారులెవరు? అమ్మిందెవరు?

సర్వేనంబరు 360లో 13.32 ఎకరాలు, సర్వేనంబరు 361లో 15.39 ఎకరాలకు అసలు పట్టాదారులెవరు? ఖాస్రా పహాణీ, చెస్లా పహాణీ, సేత్వార్, తక్తా, చౌపస్లా రికార్డుల్లో ఉన్న పట్టాదారులు ఎప్పుడు చనిపోయారు? వారు విక్రయించినట్లుగా చెప్తున్న లేదా సృష్టించిన రికార్డుల్లో సంతకాలు పెట్టిందెదరు? రిజిస్ట్రేషన్లు ఎప్పుడు పూర్తయ్యాయి? చనిపోయినవారు ఎట్లా వచ్చి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో సంతకాలు చేశారు? వారి అసలు వారసులెవరు? మొదటి రికార్డుల్లో పేర్లకు, సేల్‌డీడ్లలో విక్రయించిన వారి పేర్లకు మధ్య వ్యత్యాసం ఎందుకు? ఇలాంటి ప్రశ్నల పరంపరకు సమాధానాలు దొరికితే అసలుకంటే నాలుగున్నర రెట్ల భూమికి రిజిస్ట్రేషన్లు చేసి, అసలు భూ యజమానులను, ప్రభుత్వాన్ని దగా చేసినవారి ఆచూకీ బయటికొస్తుంది. లేని భూమిని కొనుగోలుచేసిన అమాయకుల్లో పలు వృత్తులకు సంబంధించిన నిపుణులతోపాటు.. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో పనిచేసి రిటైరైనవారు కూడా ఉన్నారని తెలుస్తున్నది.

ఎన్నో ఏండ్లుగా తిరుగుతున్నాం

నందివనపర్తిలో మాకు సర్వేనంబర్ 360, 361లో భూమి ఉన్నది. మా నాన్న, తాతలు విక్రయించారంటూ కొందరు డాక్యుమెంట్లు సృష్టించారు. మా తాత ఎప్పుడో చనిపోయారు. ఆయన అమ్మినట్లుగా సేల్‌డీడ్ తయారుచేశారు. డెత్ సర్టిఫికెట్ చూపించాం. కానీ పట్టించుకోవడం లేదు. పైగా మా భూమిలోకి మేం వెళ్తే కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా మేం పెట్టిన దరఖాస్తులను పట్టించుకోవడం లేదు. ఆఖరికి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా దిక్కులేదు. కానీ అవతలి వ్యక్తులు ఫిర్యాదుచేయగానే మాపై కేసు నమోదుచేస్తున్నారు.

మా ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా ఓ పోలీసు అధికారి తీసుకెళ్లాడు. మళ్లీ మేం సర్టిఫైడ్ కాపీలు తీసుకున్నాం. కానీ పోలీసులు తిరిగి ఇవ్వలేదు. భూమిని నాలుగున్నర రెట్లు పెంచేసి అనేక మందికి సేల్‌డీడ్స్ చేశారు. ఇకనైనా సమగ్ర దర్యాప్తు చేయకపోతే అనేకమంది మోసపోయే అవకాశం ఉన్నది. మా భూమికి సంబంధించిన రికార్డులను ఖాస్రా నుంచి పరిశీలిస్తే ఎవరికి హక్కులు ఉన్నాయో తేలుతుంది. ఆ పనిచేయకుండా ఈ మధ్యకాలంలో పాస్‌పుస్తకాలు అక్రమ మార్గంలో పొందినవారికే అధికారులు మద్దతు పలుకుతున్నారు. మాకు ఇకనైనా న్యాయం చేయండి.
- ఎండీ బషీరుద్దీన్, పట్టాదారుడి వారసుడు

ఎప్పుడో జరిగింది

నా హయాంలో జరుగలేదు. ఇప్పుడేమో నన్ను అడుగుతున్నారు. నాకేమీ తెలియదు. ఇప్పుడు నన్ను చేయమంటే నేనేం చేస్తా? అంతా పాతవాళ్లు చేశారు. కొన్నింటిపైన కేసులున్నాయని తెలుసు. మిగతాది ఎలా జరిగిందో తెలియదు.
- జగదీశ్, వీఆర్వో, నందివనపర్తి

కొనేటప్పుడే చూసుకోవాలి

ఈమధ్యే విషయం నా దృష్టికి వచ్చింది. వీటిపై కేసులున్నాయి. పీవోబీలోనూ ఉ న్నాయి. రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయో తెలియదు. మ్యుటేషన్‌కు వస్తేనే తెలుస్తుంది. కొనుగోలు చేసేటప్పుడే విషయాలు చూసుకోవాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ జరిగితే దాన్ని రద్దుచేసే అధికారం మాకు లేదు. కోర్టుకు వెళ్లాల్సిందే. ఐదు సర్వేనంబర్లలో లెక్కకు మించిన సేల్‌డీడ్స్ ఎలా అయ్యా యో పరిశీలిస్తాం. అంతకంటే ఇప్పుడేం చేయలేం.
- పుష్పలత, తాసిల్దార్, యాచారం

5573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles