జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ల పరిశోధనలు

Sat,November 9, 2019 01:51 AM

-రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ వెల్లడి
-ఐకేపీ నాలెడ్జ్‌పార్కులో ఏఐటీసీ ప్రారంభం

శామీర్‌పేట: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలోని జీనోమ్ వ్యాలీ 20 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఐకేపీ నాలెడ్జ్‌పార్కులో శుక్రవారం అగ్రి ఇన్నోవేషన్ ట్రాన్స్‌లేషన్ సెంటర్ (ఏఐటీసీ)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ.. కొత్త వ్యాక్సిన్ల తయారీకి జీనోమ్ వ్యాలీలో 18 దేశాలకు చెందిన కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయని, ఇది ఎంతో శుభపరిణామమని రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. గత 20 ఏండ్లలో జీనోమ్ వ్యాలీ అద్భుత ప్రగతి సాధించిందని, 47 కొత్త ఆవిష్కరణలతో పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం ఇక్కడున్న 200 కంపెనీల్లో దాదాపు 10 వేలమంది ఉద్యోగులు శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని వివరించారు. ఏఐటీసీని రూ.50 కోట్లతో తీర్చిది, వివిధ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ అండ్ ఐకేపీ నాలెడ్జ్‌పార్కు మాజీ చైర్మన్ వగూల్, బీఐఆర్‌ఏసీ చైర్మన్ డాక్టర్ రెనూస్వరూప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆవిష్కరణలకు ప్రోత్సాహం

రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నదని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. శుక్రవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో టీహబ్, ఐఐటీహెచ్, ఐఐఐటీహెచ్ సంయుక్తంగా నిర్వహించిన యాక్షన్ ఫర్ ఇండియా(ఏఎఫ్‌ఐ) ఎనిమిదో వార్షిక సమావేశంలో జయేశ్‌రంజన్ పాల్గొన్నారు. ఆయన సమక్షంలో ఐఐటీహెచ్, ఐఐఐటీహెచ్, ఏఎఫ్‌ఐ, టీహబ్.. నాలుగు ఒప్పందాలు చేసుకోగా, ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జయేశ్‌రంజన్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో 5,000 స్టార్టప్‌ల ఏర్పాటుకు వ్యూహాత్మక తోడ్పాటునందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఈ సమావేశంలో టీహబ్ సీఈవో రవి నారాయణ్, ఏఎఫ్‌ఐ సీఈవో సంజయ్ కడవేరు, ఐఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పీజే నారాయణన్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పాల్గొన్నారు.

205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles