శాంతిస్తున్న గోదావరి


Wed,August 14, 2019 01:44 AM

As floodwater recedes in Godavari loss estimation begins

-పేరూరు, ధవళేశ్వరం వద్ద తగ్గిన ఉధృతి
-కడెం, ఎల్లంపల్లికి స్వల్పఇన్‌ఫ్లో
-ఇప్పటికి 1260 టీఎంసీలు సముద్రంపాలు

హైదరాబాద్/ కరీంనగర్ ప్రధాన ప్రతినిధి/ జయశంకర్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గోదావరి శాంతిస్తున్నది. మొన్నటిదాకా పది లక్షల క్యూసెక్కులకుపైగా ఉన్న ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. మంగళవారం లక్ష్మి(మేడిగడ్డ) ప్రాజెక్టు దిగువన పేరూరు వద్ద ప్ర వాహం 6.35 లక్షల క్యూసెక్కులుగా నమోదయింది. దిగువన ధవళేశ్వరం దగ్గర కూడా దాదాపు అదేస్థాయిలో ఇన్‌ఫ్లో తగ్గింది. దీంతో అధికారులు 6.57 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నీటిసంవత్సరంలో ఇప్పటివరకు 1,260 టీఎంసీల జలాలు సముద్రంలో కలిశాయి. కాగా ఎగువన పలు ప్రాజెక్టులకు స్వల్ప ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. శ్రీరాంసాగర్‌కు 5,920 క్యూసెక్కుల వరద వస్తుండగా.. జలాశయం లో నీటినిల్వ 90.31 టీఎంసీలకుగాను 16.79 టీఎంసీలుగానే ఉన్నది. వాస్తవంగా ప్రాణహిత మొదలు ఇంద్రావతి, దిగువన లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే.. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఎస్సారెస్పీలోకి వచ్చి న వరద పరిమాణం 11 టీఎంసీల లోపు మాత్రమే ఉండటం ఎగువన ప్రధాన గోదావరి పరిస్థితికి అద్దం పడుతున్నది.

కడెం జలాశయానికి 1,378 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఎల్లంపల్లికి 13 వేల క్యూసెక్కుల పైచిలుకు ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతి (అన్నారం) బరాజ్‌కు 15 రోజుల నుంచి వరద చేరటంతో నిండుకుండలా మారింది. బరాజ్‌కు 11,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మూడు గేట్లను ఎత్తి 13,593 క్యూసెక్కులను వదులుతున్నారు. బరాజ్‌లో 7.48 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ యాదగిరి తెలిపారు. కాళేశ్వరం వద్ద మంగళవారం ఉదయం గోదావరి ప్రవాహం 1.39లక్షల క్యూసెక్కులు ఉండగా, సాయంత్రానికి 56వేల క్యూసెక్కులుగా పారుతున్నట్టు అధికారులు తెలిపారు. లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ)లో ప్రవాహం తగ్గుతున్నది. మూడురోజులుగా 65 గేట్లను తెరిచి దిగువకు నీటి ప్రవాహాన్ని వదిలిన అధికారులు.. మం గళవారం ఉదయం 34 గేట్లద్వారానే నీటిని వదిలారు. సాయంత్రానికి ప్రవాహం మరింత తగ్గడంతో 13 గేట్లతోనే నీటిని విడుదలచేస్తున్నట్టు తెలిపారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 56వేల క్యూసెక్కులుగా ఉన్నదని, బరాజ్‌లో 5.172 టీఎంసీ నిల్వ ఉందని వెల్లడించారు.

గాయత్రి పంప్‌హౌస్‌లో రెండు మోటర్ల వెట్ ట్రయల్ రన్

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని కాళేశ్వరం 8వ ప్యాకేజీ గాయత్రి పంప్‌హౌస్‌లో మంగళవారం రాత్రి ఒకేసారి నాలుగు, ఐదు మోటర్లకు వెట్ ట్రయల్న్ చేశారు. ముందుగా రాత్రి 8.30 గంటలకు ఐదో మోటర్‌ను అరగంటపాటు నడుపగా, రాత్రి 9.17 గంటలకు నాలుగో మోటర్‌ను ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో కలిసి లిఫ్ట్ అడ్వయిజర్ పెంటారెడ్డి ఆన్‌చేశారు. అది నడుస్తుండగానే 10.02 గంటలకు ఐదో మోటర్‌ను మరోసారి ప్రారంభించారు. దీంతో డెలివరీ సిస్టర్న్‌ల నుంచి జలాలు ఉప్పొంగాయి.

నంది పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోత

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆరో ప్యాకేజీ నందిమేడారంలోని నంది పంప్‌హౌస్ నుంచి ఏడో ప్యాకేజీలోని నంది రిజర్వాయర్‌లోకి రెండు మోటర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. నంది రిజర్వాయర్ నుంచి గాయత్రి పంప్‌హౌస్ (లక్ష్మీపూర్)కు నీటిని తరలిస్తున్నందున, ఇక్కడి రిజర్వాయర్‌లో నీటిమట్టం పడిపోకుండా నంది పంప్‌హౌస్ నుంచి నీటిని విడుదలచేస్తున్నారు. ఈ నెల 11న మూడో మోటర్‌ను నడిపించిన అధికారులు, మంగళవారం ఉదయం 9.30 నుంచి 4 గంటల దాకా మరోసారి నడిపించి, 0.791 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.

సాయంత్రం 5 గంటలకు ఒకటో మోటర్‌ను ఆన్‌చేసి 3,300 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు ఆరో ప్యాకేజీ ఏఈఈ ఉపేందర్ తెలిపారు. క్రమంగా వస్తున్న నీటితో నంది రిజర్వాయర్ కళకళలాడుతున్నది. మంగళవారం సాయంత్రం వరకు నంది జలాశయంలో 227.2 మీటర్లకు నీటిమట్టం చేరుకున్నట్లు ఏడో ప్యాకేజీ ఏఈఈ బుర్ర పరుశురాంగౌడ్ తెలిపారు. ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి (లక్ష్మీపూర్) పంప్‌హౌస్‌లో మోటర్ల వెట్ ట్రయల్న్ చేస్తున్నందున నీటిని విడుదలకు రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేస్తున్నట్లు వివరించారు.

609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles