సీఎం కేసీఆర్ నిర్ణయాలు అద్భుతం

Tue,September 17, 2019 03:07 AM

-అసెంబ్లీలో పద్దులపై చర్చలో ఎమ్మెల్యేల ప్రశంస
-మక్కామసీదుకు రిపేర్లు చేయిస్తున్న సీఎంకు ధన్యవాదాలు: ఎమ్మెల్యే పాషాఖాద్రి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ ఏ పనిచేసినా అద్భుతమేనని, రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని టీఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు కొనియాడారు. సోమవారం అసెంబ్లీలో గృహ నిర్మాణం, మైనార్టీ, బీసీ, మహిళా, గిరిజన సంక్షేమంపై ఆయాశాఖల మంత్రులు పద్దులను ప్రవేశపెట్టారు. ఉద్యమ సమయంలో చెప్పినట్టుగా సీఎం కేసీఆర్ డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే బాల్కసుమన్ చెప్పారు. దళితులకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషను కల్పించారని, 25 మంది దళితులను మార్కెట్ కమిటీ చైర్మన్లుగా నియమించారని కొనియాడారు. గిరిజన సంక్షేమానికి భారీగా బడ్జెట్ కేటాయించిన సీఎంకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ట్రైబల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని కోరారు. సీఎం కేసీఆర్ వల్లే తండాల్లో ఆరోగ్యమైన జీవితం గడుపుతున్నామని, మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షితమైన మంచినీరు అందిస్తున్నారని ఎమ్మెల్యే రేగాకాంతారావు తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ మాట్లాడుతూ షాదీముబారక్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్‌కు అడిగినన్ని నిధులను సీఎం కేసీఆర్ మనస్ఫూర్తిగా మంజూరుచేశారని చెప్పారు. మక్కామసీదుకు నిధులు విడుదలచేసి మరమ్మత్తులు చేయిస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు.

పన్నులభారం మోపకుండా సంపద సృష్టి

బీసీ సంక్షేమానికి గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా బడ్జెట్ పెట్టిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరిచారని, గొర్రెలు పంపిణీ చేశారని, చేప పిల్లలను చెరువులలో ఉచితంగా వదులడంతో గ్రామీణ ఆదాయం పెరుగుతున్నదని చెప్పారు. ప్రజలపై పన్నులభారం మోపకుండా ఉత్పత్తి పెంచడం ద్వారా సీఎం కేసీఆర్ సంపదను సృష్టించి పేదలకు పంచుతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశంసించారు. సీఎం కేసీఆర్ 2014 నుంచి చేపట్టిన కార్యక్రమాలన్నీ అందరూ గర్వపడేలా ఉన్నాయని ఎమ్మెల్యే గొంగిడి సునీత చెప్పారు. గర్భిణులు, బాలింతలకు కేసీఆర్ కిట్‌తో, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా అడపిల్లలకు భరోసా కల్పించారని తెలిపారు. మైనార్టీల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ తెలిపారు. మైనార్టీ గురుకులాలకు అద్భుతమైన స్పందన వస్తున్నదని చెప్పారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ ఇస్తామని ఇవ్వలేదని, దీని కోసం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. పద్దులపై చర్చ పూర్తయిన తర్వాత సభను మంగళవారానికి వాయిదావేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

v-prashanth-reddy

మార్చి కల్లా 2 లక్షల డబుల్ ఇండ్లు

గృహనిర్మాణ, ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రెండు లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని గృహనిర్మాణ, ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ పద్దులపై సోమవారం అసెంబ్లీలో సభ్యులు మాట్లాడిన అనంతరం మంత్రులు సమాధానమిచ్చారు. గృహనిర్మాణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా, శిశు, మైనార్టీ సంక్షేమశాఖల పద్దులకు అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. గృహనిర్మాణ పద్దుపై ఆ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.82 లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లకు మంజూరు ఇచ్చామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అత్యంత పారదర్శక విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ.1,365 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని, మరో రూ.2,500 కోట్లు హడ్కో నుంచి రుణంగా తీసుకుంటామని, మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరించారు.

1338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles