మేడారానికి మెరుగైన రవాణా

Fri,November 8, 2019 02:32 AM

-రహదారుల మరమ్మతులు పూర్తవ్వాలి
-డిసెంబర్‌లోగా అందుబాటులోకి తేవాలి
-అధికారులకు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి ఆదేశాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే మేడారం జాతరకు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లుచేస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందిలేకుండా డిసెంబర్‌లోగా రోడ్లను అభివృద్ధి చేయాలని, మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల విభాగం ఆధ్వర్యంలో వరంగల్ డివిజన్ పరిధిలోని పనులపై హైదరాబాద్‌లో గురువారం మంత్రులు సమీక్ష నిర్వహించారు. వరుస వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ మార్గంలో ఆలేరు, వంగపల్లి, వరంగల్ నగరం బైపాస్ రహదారుల పనులను వేగంగా పూర్తిచేయాలని, ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, కరీంనగర్ మార్గాల్లో మరమ్మతు చేయాలని సూచించారు.

వరంగల్- ఖమ్మం రహదారి చాలా దెబ్బతిన్నదని, శాశ్వత మరమ్మతులతోపాటు తక్షణం తాత్కలికంగా పనులు చేయాలని ఆదేశించారు. మేడారం జాతరకు అనుసంధానమయ్యే అన్ని రహదారులు డిసెంబర్‌లోపు పూర్తిచేయాలని, వరంగల్ నగరంలోని కాజీపేట పెద్దమ్మగడ్డ, పోలీసు హెడ్‌క్వార్టర్స్, కేయూ క్రాస్‌రోడ్డు, కాజీపేట రైల్వే బ్రిడ్జి పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, మొండ్రాయి (గిర్ని తండ) జంక్షన్ అభివృద్ధి పనులను చేపట్టాలని, జనగామ పట్టణంలో ప్రధాన రహదారి మరమ్మతు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. వరంగల్ నేషనల్ హైవే డివిజన్‌కు సంబంధించి ప్రతిపాదనదశలో ఉన్న ఐదు రహదారులకు జాతీయరహదారి హోదా వచ్చేలా ఢిల్లీస్థాయిలో సంప్రదింపులు జరుపాలని ఎంపీలను మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి కోరారు.

మరమ్మతులు వెంటనే చేపట్టాలి

వరంగల్ ఎన్‌హెచ్ డివిజన్ పరిధిలో జాతీయరహదారి హోదా పెండింగ్‌లో ఉన్న ఐదురోడ్లకు త్వరగా ఆమోదం వచ్చేందుకు ఇతర ఎంపీలతో కలిసి కృషిచేస్తానని మహబూబాబాద్ ఎంపీ కవిత చెప్పారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ దారులు దెబ్బతినడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, మరమ్మతు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కోరారు. వరంగల్- హైదరాబాద్ ర హదారి మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య కోరారు. వరంగల్ నుంచి మేడారం మార్గం లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతుచేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించా రు. జనగామ దగ్గర బైపాస్ రోడ్డు నిర్మా ణం పూర్తిచేయాలని, జనగామ నుంచి సూర్యాపేటకు వెళ్లే రోడ్డుపై బ్రిడ్జి పనులను పూర్తిచేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సమీక్షలో రోడ్లు భవనాల శాఖ ఇంజినీరింగ్ చీఫ్ గణపతిరెడ్డి, ఎస్‌ఈ వసంత, ఈఈ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles