బీఆర్కే భవన్‌లో సచివాలయం


Wed,August 14, 2019 01:49 AM

BRK Bhavan Turns To Telangana Secretariat

-మొదలైన కార్యకలాపాలు మరోవారంలో పూర్తిస్థాయిలో
-తన చాంబర్‌లో విధులు నిర్వర్తించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి
-వేగంగా పూర్తవుతున్న మరమ్మతులు
-పార్కింగ్, ట్రాఫిక్‌ను పరిశీలించిన పోలీసులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రస్తుత సచివాలయం ప్రాంతంలో నూతన భవనాల నిర్మాణం నేపథ్యంలో బూర్గుల రామకృష్ణారావు భవన్ (బీఆర్కే భవన్) నుంచి సచివాలయ కార్యకలాపాలు మొదలయ్యాయి. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బీఆర్కేభవన్‌కు వచ్చి విధులు నిర్వర్తించారు. తన కార్యాలయాన్ని పరిశీలించి అక్కడి నుంచి కుందన్‌బాగ్‌లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా బీఆర్కేభవన్‌లో తనకు కేటాయించిన చాంబర్ నుంచే విధులు నిర్వర్తించారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు సైతం బీఆర్కేభవన్ నుంచే విధులు నిర్వహించారు. ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ మంగళవారం బీర్కే భవన్‌లో తన చాంబర్‌లో పూజలు నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన జపాన్‌కు చెందిన డెన్సో ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఎండీ ప్యూమిటాకా టాకి నేతృత్వంలోని బృందంతో తన చాంబర్‌లోనే చర్చలు జరిపారు. పేషీలు, సెక్షన్లు ఇంకా పూర్తిస్థాయిలో తరలింపు కాకపోవడంతో కొంతమంది ఉద్యోగులు పాత సచివాలయం నుంచే పనిచేస్తున్నారు. తరలింపు ప్రక్రియ వేగంగా చేపడుతున్నారు. మరోవైపు బీఆర్కే భవన్‌లో మరమ్మతులు వేగంగా పూర్తిచేస్తున్నారు.

వీడియోకాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు

వివిధశాఖల అధిపతులు వీడియోకాన్ఫరెన్స్‌లు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు త్వరలోనే పూర్తికానున్నాయి. ఇప్పటికే సాధారణ ఇంటర్‌నెట్ వచ్చేలా ఐటీ అధికారులు ఏర్పాట్లుచేశారు. హైస్పీడ్ ఇంటర్నెట్ ఏర్పాటుకు కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. అన్ని పనులు పూర్తిచేసుకొని వారంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరుగనున్నాయి. బీఆర్కేభవన్‌వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు. పార్కింగ్, భద్రత తదితరాలను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.


బడ్జెట్ నివేదికలను సమర్పించండి

-అధికారులకు మంత్రి అల్లోల ఆదేశం
వార్షిక బడ్జెట్ అంచనాల నివేదికలను వెంటనే ఆర్థికశాఖకు సమర్పించాలని అటవీ, పర్యావరణ, న్యాయ పరిపాలన, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అరణ్యభవన్‌లో అధికారులతో బడ్జెట్ అంచనాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కంపా కింద రాష్ట్రానికి రావాల్సిన వాటాపై వార్షిక కార్యాచరణను వెంటనే కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. సమీక్షలో పీసీసీఎఫ్ ఆర్ శోభ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బొగ్గులకుంటకు అల్లోల పేషీ

సచివాలయం తరలింపులో భాగంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయం నుంచి విధుల నిర్వహణ ప్రారంభించారు. తొలుత తన చాంబర్‌లో అడుగుపెట్టిన ఇందకరణ్‌రెడ్డి.. పూజలు చేసి.. అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించారు.

1132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles