ప్రయాణికులకు సరిపడా బస్సులు

Fri,November 15, 2019 04:11 AM

-రోడ్డెక్కిన 6,198 సర్వీసులు
-విధులు నిర్వర్తించిన 11,248 మంది తాత్కాలిక సిబ్బంది
-అందుబాటులోకి అంతర్రాష్ట్ర వాహనాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రజారవాణాకు ఆటంకం కలుగకుండా తీసుకుంటున్న చర్యలపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమైన రూట్లతోపాటు గ్రామీణ ప్రాంతాలకు సైతం బస్సులను నడుపుతున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులు అందుబాటులోకి రావడంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 6,198 బస్సులు నడిచినట్టు ఆర్టీసీ ప్రకటించింది. ఇందులో 4,322 ఆర్టీసీ బస్సులు, 1,876 అద్దె బస్సులు ఉన్నాయి. 6,926 తాత్కాలిక కండక్టర్లు, 4,322 తాత్కాలిక డ్రైవర్లు విధులు నిర్వర్తించారు. 5,482 బస్సుల్లో టిమ్స్ ద్వారా, 194బస్సుల్లో సాధారణ పద్ధతిలో టికెట్లు జారీచేశారు.

కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో 651 బస్సులు నడపాల్సి ఉండగా 457 ఆర్టీసీ, 200 అద్దె బస్సుల చొప్పున 657 (100.92 శాతం) నడిపినట్లు ఆర్‌ఎం పీ జీవన్ ప్రసాద్ తెలిపారు. వరంగల్ రీజియన్ పరిధిలో 423 బస్సులు ప్రయాణికులకు సేవలందించినట్టు రీజినల్ మేనేజర్ శ్రీధర్ చెప్పారు. మెదక్ రీజియన్ పరిధిలోని మూడు జిల్లాల్లో 542 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. 387 ఆర్టీసీ, 155 ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని డిపోల్లో కలిపి 573 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 374 బస్సులు తిరిగినట్టు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో గురువారం 201 బస్సులు వివిధ ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 585 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.

మూడు బస్సులపై రాళ్లు రువ్విన దుండగులు

సుజాతనగర్: మణుగూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న మూడు బస్సులపై గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. మణుగూరు నుంచి మూడు బస్సులు హైదరాబాద్‌కు బయలుదేరగా మార్గమధ్యంలో సుజాతనగర్ మండల మంగపేట వద్ద కొందరు దుండగులు ఆర్టీసీ బస్సును అడ్డగించి అద్దాలపై రాళ్లు రువ్వి పరారయ్యారు. వెంట వెంటనే అదే మార్గంలో వెళ్తున్న మరో రెండు బస్సులపైనా రాళ్లు విసిరారు. ఘటనలో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
RTC-Buses1

బస్సుల అద్దాలు పగులగొట్టిన ముగ్గురు డ్రైవర్ల అరెస్ట్

వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టిన ముగ్గురు సమ్మెలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లపై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ నెల 12న (మంగళవారం) రాత్రి యాలాల మండలం పగిడిపల్లికి చెందిన దేవేందర్‌గౌడ్, ఉద్దండపూర్‌కు చెందిన అంజయ్యగౌడ్, చంద్రకల్ చెందిన కుమ్మరి చంద్రకాంత్ మద్యం మత్తులో బైక్‌పై వెళ్తూ ఎదురుగా వచ్చిన బస్సు అద్దాలు పగులగొట్టారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుమేరకు సీఐ జలంధర్‌రెడ్డి విచారణ చేపట్టి ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

చికిత్సపొందుతూ ఆర్టీసీ కార్మికుడి మృతి

అస్వస్థతకు గురై గాంధీ దవాఖానలో చేరిన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపో కండక్టర్ పలుగు నాగేశ్వర్ ప్రాణాలు కోల్పోయాడు. సమ్మె నేపథ్యం లో నాగేశ్వర్ తీవ్ర అనారోగ్యం తో బాధపడుతూ.. మతి స్థిమి తం కోల్పోయాడు. ఈ నెల 11న గాంధీ దవాఖానలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. గురువారం ఉద యం మృతదేహాన్ని నాగేశ్వర్ అత్తగారి ఊరైన జోగిపేటకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు జోగిపేటలో ఆందోళన చేపట్టారు. మృతు డి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్‌బెడ్రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తానని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ హామీ ఇవ్వడంతో కార్మికులు అందోళనను విరమించారు.

మెకానిక్ ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న మండలంలోని సోమారం గ్రామానికి చెందిన మేకల అశోక్ గురువారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి అతడిని తొర్రూరులోని ప్రైవేట్ దవాఖానకు తరలించి ప్రాథమికచికిత్స నందించి.. మెరుగైన వైద్యం కోసం హైదరబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అశోక్ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు.

డ్రైవర్‌కు గుండెపోటు

భువనగిరి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గౌండ్ల గూడానికి చెందిన చెర్క రమేశ్‌గౌడ్ (45) బుధవారం రాత్రి గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లో టీవీ లో వార్తలు చూస్తుండగా గుండెపోటు తో ఒక్కసారిగా కుప్పకూలాడు. కు టుంబ సభ్యులు హుటాహుటిన మిర్యాలగూడలోని ప్రైవేటు దవాఖానకు తరలించి.. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌లోని మెడికేర్ దవాఖానకు తీసుకెళ్లారు.

1240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles