సోషల్ మీడియాపై నిఘా


Sat,March 23, 2019 03:58 AM

CEO Rajat Kumar in Namaste Telangana Interview

- ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి
-నియోజకవర్గాలకు చేరిన ఈవీఎంలు, వీవీప్యాట్లు
-ఎన్నికల నిర్వహణకు 2.75 లక్షల సిబ్బంది
-పోలింగ్ ప్రక్రియ అంతా రికార్డ్ చేస్తాం
-ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు పరిశీలకులు
-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో సీఈవో రజత్‌కుమార్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ మీడియాపై నిఘా పెడుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి సోషల్‌మీడియాపై 75 ఫిర్యాదులు వచ్చాయని, ఇవి కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వస్తాయా? పెయిడ్‌న్యూస్ కిందకు వస్తాయా? అనేది గుర్తించి నివేదించాలని డీఈవో లను ఆదేశించినట్టు చెప్పారు. పెయిడ్‌న్యూస్ విషయంలోనూ దృష్టిసారించామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. 25న సప్లిమెంటరీ ఓటర్ల జాబి తా ప్రచురిస్తామని నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రజత్‌కుమార్ వివరించారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 34,603 పోలింగ్ కేంద్రాలతోపాటు 2030 అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్లన్నీ రిటర్నింగ్ అధికారుల కస్టడీకి వెళ్లాయని, వాటికి మొదటి లెవల్ ర్యాండమ్ చెక్‌పూర్తయిందని, జిల్లాలవారీగా డీఈవో ర్యాండమ్ చెక్ అవుతున్నదని చెప్పారు.
ఎన్నికల నిర్వహణకు 2.75 లక్షల సిబ్బందిని కేటాయించామని తెలిపారు. ఇందులో 1.85 లక్షలమంది సివిల్ సిబ్బంది ఉన్నారన్నారు. 90 వేలమంది సాయుధ సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. మాజీ సైనికుల సేవల వినియోగానికి సీఈసీ అనుమతించిందని చెప్పారు.

కెమెరా కనుసన్నల్లో పోలింగ్

ప్రతిపోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియ ను కెమెరాల్లో రికార్డుచేస్తామని రజత్‌కుమార్ చెప్పా రు. పోలింగ్ సరళిని వెబ్‌క్యాస్టింగ్ ద్వారా సచివాలయంలోని ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇద్దరు పరిశీలకులను ఎన్నికల సంఘం నియమిస్తుందని తెలిపారు. పది నియోజకవర్గాలను సమస్యాత్మకంగా ఈసీఐ గుర్తించిందన్నారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత, ధనప్రభావం ఉన్న, రాజకీయంగా సమస్యాత్మక.. ఇలా మూడురకాల సమస్యాత్మక నియోజకవర్గాలున్నట్టు ఎన్నికల సంఘం వర్గీకరించింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ ఉంటుందని రజత్‌కుమార్ చెప్పారు. ధనప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలు పది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ ప్రాంతాల్లో నిఘా పటిష్ఠంచేసినట్లు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తికాకముందే రూ.14.7 కోట్లు సీజ్‌చేశామని వెల్లడించారు.

ఓటింగ్‌లో పాల్గొనేలా చర్యలు

ఓటు నమోదుతోపాటు ఓటేసేలా అవగాహన కలిగించేందుకు అన్ని అవకాశాలను వినియోగించామని రజత్‌కుమార్ తెలిపారు. నా ఓటు యాప్, ఎస్‌ఎంఎస్ అలర్ట్స్‌తోపాటు స్వచ్ఛంద సంస్థలు, ఐటీ కంపెనీల సహకారంతో ఓటు ఆవశ్యకత వివరించామన్నారు. కోటిమంది ఓటర్లకు లేఖలు రాశామని, సంకల్పం పేరుతో విద్యార్థుల ద్వారా 25 లక్షల మంది తల్లిదండ్రులను ఓట్లువేసేందుకు ఒప్పించామన్నారు.

దివ్యాంగుల ఓట్లు 5.06 లక్షలు

రాష్ట్రంలో దివ్యాంగులైన ఓటర్లు 5.06 లక్షలు ఉన్నారని రజత్‌కుమార్ తెలిపారు. 25న అదనపు ఓటర్ల జాబితా విడుదల తర్వాత కచ్చితమైన లెక్క వస్తుందన్నారు. దేశంలో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వెబ్‌సైట్‌కే ఎక్కువ మంది సందర్శకులు ఉన్నారని రజత్‌కుమార్ తెలిపారు. జనాభాలో 25 శాతం.. అంటే కోటి జనాభా సీఈవో సందర్శకులుగా ఉన్నారని చెప్పారు. ఇందులో 1,98,757 లైక్‌లు ఉన్నాయన్నారు. మన తర్వాత తమిళనాడు ఉన్నదని చెప్పారు.

1213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles